September 16, 2013
  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరుసగా మూడో ఏడాది తన కుటుంబ సభ్యులందరితో కలిపి ఆస్తులు ప్రకటించారు. సోమవారమిక్కడ తన నివాసంలో ఆయన ఆ వివరాలు వెల్లడించారు. అప్పులు పోను చంద్రబాబు కుటుంబ సభ్యులందరి నికర ఆస్తులు రూ. 41 కోట్లు. ఆయన, భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, వారి యాజమాన్యంలోని నిర్వాణ హోల్డింగ్స్ కంపెనీలకు కలిపి మొత్తం రూ. 83 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, రూ. 48 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. అప్పులు తీసివేస్తే నికర ఆస్తులు రూ. 41 కోట్లుగా లెక్క తేలుతున్నాయి.

చంద్రబాబు నివాసం వంటి స్థిరాస్తుల విలువను ప్రస్తుత మార్కెట్ ధరతో కాకుండా అది కొన్ననాటి విలువతో చూపించారు. ఆ నివాసాన్ని కూడా తనఖా పెట్టి వ్యాపార రుణం తీసుకొన్నారు. కోడలు బ్రాహ్మణికి తన తండ్రి బాలకృష్ణ ద్వారా వచ్చిన స్థిరాస్తులు మినహా చంద్రబాబు కుటుంబానికి చెందిన స్థిరాస్తులు బ్యాంకు తనఖాలోనే ఉన్నాయి. "నాకు సింగపూర్‌లో హోటల్స్ ఉన్నాయని కొందరు ప్రచారం చేస్తుంటారు. అలాగని నిరూపిస్తే వాటితోపాటు అదనంగా నా ఆస్తుల్లో కూడా కొంత రాసిస్తాను'' అని సవాల్ చేశారు. కుటుంబ యాజమాన్యంలో ఉన్న హెరిటేజ్ సంస్థ ఆస్తులు, అప్పులను కూడా చంద్రబాబు ప్రకటించారు.

" కంపెనీ ప్రస్తుత టర్నోవర్ రూ.16 వందల కోట్లు. పోయిన ఏడాది రూ. 49 కోట్లు నికర లాభం గడించింది. పరిశ్రమలు పెట్టేవారికి మామూలుగా ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు, రాయితీలు మినహా ఈ సంస్థ అడ్డదారిలో ప్రభుత్వం నుంచి ఏ ఒక్క ప్రయోజనం కూడా పొందలేద''ని పేర్కొన్నారు. ఆస్తుల్లో పోయిన ఏడాదితో పోలిస్తే పెద్దగా మార్పులు లేవని, జీతాలు, డివిడెండ్ల వల్ల తన భార్య, కొడుకు ఆదాయం స్వల్పంగా పెరిగిందని ఆయన తెలిపారు. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత దేశంలో ఆదాయం పెరిగిందని, అదే సమయంలో అవినీతి కూడా పెరిగిందని పేర్కొన్నారు.

"ఇష్టానుసారం దోచుకొని విదేశాలకు తరలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో, నల్లధనంపై పోరులో భాగంగా నేను ఏటా నా కుటుంబం సహా అందరి ఆస్తులు బహిరంగంగా ప్రకటిస్తున్నాను. ఇదే పని అందరూ చేస్తే అవినీతి తగ్గుతుంది. చట్టం తెస్తే అందరూ చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది'' అని తెలిపారు. మీ తర్వాత అధికారంలోకి వచ్చిన వారు వేల కోట్లు సంపాదించడం బాధ అనిపించలేదా అన్న ప్రశ్నకు.. "లేదు. డబ్బుపై వ్యామోహం లేదు. నా కుటుంబ సభ్యులకు కూడా అడ్డదారిలో సంపాదించాలన్న కోరిక లేదు. నేను ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతో మంది పారిశ్రామికవేత్తలను తయారు చేసి నిజాయితీగా ఎదిగే మార్గాలు చూపించాను. వైఎస్ వచ్చిన తర్వాత తేలిగ్గా డబ్బు ఎలా వస్తుందో చూపిస్తానంటూ చివరకు వారిని జైలుకు పంపారు'' అని మండిపడ్డారు.

తనలా వైఎస్ కుటుంబం..ఆస్తులు బయటపెట్టగలదా అని ఆయన సవాల్ చేశారు. "2004 తర్వాత వారికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? సిబిఐ, ఈడీ కలిసి వేల కోట్ల అవినీతి జరిగిందని నిర్థారించాయి. కానీ వాటిని స్వాధీనం చేసుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదు. సత్యం రామలింగరాజు ఆస్తులు స్వాధీనం చేసుకొన్నారు. సత్యం కంపెనీని మహేంద్ర కంపెనీలో కలిపేశారు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఆస్తులు స్వాధీనం చేసుకొన్నారు. జగన్ ఆస్తుల విషయంలో ఆ పని ఎందుకు చేయలేకపోయారు? చట్టం మనిషిని బట్టి ఉంటుందా? ' అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

అవినీతి అంటే సమాజాన్ని రేప్ చేయడమేనని, నిర్భయ కేసులో మాదిరిగా జగన్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఎందుకు వేయడం లేదని ఆయన ప్రశ్నించారు. నిర్భయ అత్యాచార ఘటనలో నిందితులకు ఉరి శిక్ష పడేవరకూ మీడియా పోరాడిందని, అవినీతిపరుల విషయంలోనూ అటువంటి పోరాటం చేయకపోగా కొన్ని మీడియా సంస్థలు వారిని మోస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏసు ప్రభువు మళ్లీ పుట్టి వచ్చాడేమో అన్న స్థాయిలో ఆకాశానికి ఎత్తి ప్రచారం చేస్తున్న తీరు చూస్తే బాధ కలుగుతోంద న్నారు. 'నేను ఒక్కడినే పోరాడాలా? మీకు బాధ్యత లేదా? ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి. నా వరకు నేను పోరాడుతూనే ఉంటాను. వెనకడుగు వేసే సమస్య లేదు' అని ఆయన స్పష్టం చేశారు.

కాగా, రాష్ట్రంలో గత 45 రోజులుగా నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని కేంద్రాన్ని కోరే నిమిత్తం ఈ నెల 20, 21 తేదీల్లో ఢిల్లీ వెళ్తున్నానని, ప్రధాని, రాష్ట్రపతి, వివిధ పార్టీల అగ్ర నాయకత్వాలను కలవనున్నట్టు చంద్రబాబు చెప్పారు. 'బెయిళ్లు ఆపడానికి, నిర్ణయాలు ఆపడానికి ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. రాష్ట్రంలో అనిశ్చితి తొలగించాలన్నదే నా డిమాండ్. ఇరు పక్కలా ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడండి. జేఏసీలు, విద్యార్థులు, ప్రజా సంఘాలు అందరితో మాట్లాడండి. సమస్య పరిష్కరించండి. మీకు చేతగాకపోతే తప్పుకోండి. మేం వస్తే ఆరు నెలలు...ఏడాదిలో పరిష్కరించి చూపిస్తాం. విభజన అంశం పార్టీల చేతుల్లో లేదని, ప్రజల చేతుల్లోకి వెళ్లిందని దిగ్విజయ్ సింగ్, చిదంబరం గతంలో అనేకసార్లు చెప్పారు.

ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఎవరిని కలుపుకొంటే ఏం వస్తుందోనని లెక్కలు వేసుకొని దిగి మంటలు మండించారు. పంచాయితీల్లో మా పార్టీ గెలవగానే (విభజన) బయటకు తీశారు. మీకు ఒక్కళ్ళకే లాభం కావాలంటే సమస్యను మీరే పరిష్కరించండి. మాతో కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. పరిష్కారానికి ఏం చేయాలో అది చేయండి' అని సూచించనున్నట్టు చెప్పారు. రాష్ట్రం గురించి తప్ప తన లాభం గురించి తాను ఏనాడూ ఆలోచించలేదని, పవర్ (విద్యుత్)లో రాష్ట్రం బాగుండాలని తన పవర్‌ను పోగొట్టుకొన్నానని ఆయన చమత్కరించారు.

ఒక మీడియా సంస్ధకు చెందిన సిబ్బందిని అరెస్టు చేయడంలో డిజిపి పాత్రను తాను ఖండిస్తున్నానని చెప్పారు. హైకోర్టు చీవాట్లు పెట్టినా సమాచార కమిషనర్లను ముఖ్యమంత్రి ఇంతవరకూ తొలగించపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ఏమిటీ ప్రవర్తన? కోర్టులకు అతీతులమని అనుకొంటున్నారా? డిజిపిపై సుప్రీం కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆయనను ఆ పోస్టులో కొనసాగించడం తప్పు. ముఖ్యమంత్రి లీకుల వీరుడుగా వ్యవహరిస్తున్నారు'అని ఆయన విమర్శించారు.

 తెలుగువాడైన పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండగా సాహసంతో అమలు చేసిన ఆర్థిక సంస్కరణల వల్లే దేశం ఇప్పుడు కొంతైనా నిలబడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశానికి అంత సేవ చేసిన నేతను కాంగ్రెస్ పార్టీ కనీసం తలవకపోవడం దారుణమని విమర్శించారు. "ఆరు నెలలు ప్రధానిగా చేసిన వారికి కూడా ఢిల్లీలో స్మారక ఘాట్లు పెట్టి పివికి మాత్రం లేకుండా చేశారు. మేము వస్తే ఢిల్లీలో పీవీ ఘాట్ ఏర్పాటు చేయిస్తామ''ని హామీ ఇచ్చారు.

నాకు సింగపూర్‌లో హోటల్స్ ఉన్నాయని కొందరు ప్రచారం చేస్తుంటారు. అలాగని నిరూపిస్తే వాటితోపాటు అదనంగా నా ఆస్తుల్లో కూడా కొంత రాసిస్తాను''

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులు ఆస్తుల వివరాలను సోమవారం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. చంద్రబాబు ఆస్తుల విలువ రూ. 42.06 లక్షలు, భువేశ్వరీ (భార్య) ఆస్తుల విలువ రూ. 3305.02 లక్షలు, లోకేష్ నాయుడు (కుమారుడు) ఆస్తుల విలువ రూ. 492.53 లక్షలు, బ్రహ్మణి (కోడలు) ఆస్తుల విలువ రూ. 330.69 లక్షలు ఉన్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. 1992లో స్థాపించిన హెచిటేజ్ కంపెనీ పూర్తి పారదర్శకంగా ఉందనిఆయన తెలిపారు. గత 22 సంవత్సరాలుగా కంపెనీ ఓ పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. హెరిటేజ్ కంపెనీ ఈ ఏడాది 30 శాతం డివిడెండ్ చెల్లించినట్లు ఆయన తెలిపారు. తాను ప్రకటించినవి కాకుండా ఇంకా ఎలాంటి ఇతర ఆస్తులు ఉన్నట్లు ఎవరైనా నిరూపిస్తే అందులో వారికి ఆస్తుల్లో పెర్సంటేజ్ ఇస్తానని చంద్రబాబు సవాల్ చేశారు. సింగపూర్‌లో తనకు ఎలాంటి ఆస్తులు లేవని ఆయన స్పష్టం చేశారు.

ఇతర ఆస్తులు ఉన్నట్లు ఎవరైనా నిరూపిస్తే అందులో వారికి ఆస్తుల్లో పెర్సంటేజ్ ఇస్తా