September 3, 2013

మొన్న 'వస్తున్నా, మీకోసం' పాదయాత్ర చేసినప్పుడు మీరంతా కష్టాల్లో ఉన్నారు. అప్పుడు నేను విక్టరీ గుర్తు చూపించలేదు. ఈ రోజు మీరు రోడ్డెక్కి పోరాడుతా ఉన్నారు. ఈ రోజు విక్టరీ సింబల్ చూపిస్తున్నా. అంతిమంగా తెలుగుజాతిదే విజయమేనని చంద్రబాబు సీమాంధ్ర ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు.


మంగళవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామం నుంచి చంద్రబాబు మూడో రోజు ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించి పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు, అచ్చంపేట తదితర గ్రామాల్లో ప్రసంగించారు. మిమ్మల్ని ఇంత ఇబ్బందికి గురి చేసిన సోనియాగాంధీ కనిపిస్తే మీరు వదిలి పెట్టేలా లేరు. ఇది కసిగా, కక్షగా మారి ముందుకుపోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మొద్దబ్బాయి రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు మీ పొట్టలు కొడుతోంది. ఇటలి నుంచి వచ్చి తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బ తీస్తోంది. సోనియా అదృష్టం కొద్ది గాంధీ కుటుంబంలో చేరారు. అంతా ఆమెకు కలిసొచ్చింది. రాజీవ్‌గాంధీ చనిపోవడంతో దొడ్డిదారిన అధికారం చెలాయిస్తోంది తప్పా తెలివితేటలతో కాదని స్పష్టం చేశారు.

సీఎం, బొత్స ఉత్తరకుమారులు

ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స ఉత్తరకుమారుల్లా వ్యవహరిస్తున్నారు. కిరణ్ రాజకీయ కోమాలో ఉన్నారు. ఆయన ఢిల్లీలో ఒక మాట, ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తోన్న సీమాంధ్రులపై వైజాగ్‌లో తన అనుచరులతో దాడి చేయించారు. ఈ చర్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. బొత్స కబడ్దార్ జాగ్రత్తగా ఉండు. నిన్ను వదిలిపెట్టమని నిప్పులు చెరిగారు.

ప్రధాని తోలుబొమ్మ

ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ తోలుబొమ్మలా సోనియా ఎలా ఆడితే అలా ఆడుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైఎస్ బతికుంటే ఆయన ఐదేళ్ల సీఎం కొనసాగించిన దోపిడీలో ప్రధాన ముద్దాయి అవుతారని ఒకపక్క సీబీఐ చెబుతోంది. మరోవైపు వైఎస్ బతికుంటే మాకు ఈ కష్టాలు వచ్చేవి కావని ప్రధాని అంటుండటం సిగ్గు చేటన్నారు. పద్ధతి లేని రాజకీయాలు చేస్తూ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే అన్ని నిత్యవసర సరుకుల ధరలను వెయ్యి శాతం పెంచేశారు.

ఇదే కాంగ్రెస్ కొనసాగితే సంచి నిండా డబ్బులు తీసుకెళ్లినా కనీసం జేబు నిండా సరుకులు తెచ్చుకొనే పరిస్థితి ఉండదన్నారు. సీమాంధ్ర ఎంపీలపై చంద్రబాబు తన ఆరోపణల పరంపరను కొనసాగించారు. వాళ్లు చేతకాని దద్దమ్మలు. మంత్రి పదవుల కోసం ఆశపడి సోనియా విసరిన ఎముకలను కొరుకుతూ కూర్చున్నారని మండిపడ్డారు. వీళ్లకు వ్యక్తిత్వం లేదు. ఉంటే సోనియాపై పోరాడండని డిమాండ్ చేశారు. అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తే ప్రజలు రెచ్చిపోతారు. మీకు చేతకాకపోతే దిగిపోండి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సమస్య పరిష్కారం చేసి చూపిస్తానని చంద్రబాబు సవాలు విసిరారు.

తెలుగుజాతికి ఎప్పుడూ విక్టరీనే సీఎం, బొత్స ఉత్తరకుమారులు ప్రధాని తోలుబొమ్మ : బాబు

చంద్రబాబు గుంటూరు జిల్లాలో కొనసాగిస్తోన్న ఆత్మగౌరవయాత్రకు జనం విశేషంగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో బస్సుయాత్ర కొనసాగగా మంగళవారం నుంచి పెదకూరపాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ నియోజకవర్గంలోకి క్రోసూరు, అచ్చంపేట, పెదకూరపాడు గ్రామాల్లో జరిగిన బహిరంగ సభలకు వేలాది మంది ప్రజలు హాజరై చంద్రబాబుకు నీరాజనాలు పట్టారు. తమ్ముళ్లూ... అంటూ ఆయన హావభావాలతో చేసిన ప్రసంగాలకు ప్రజలు విక్టరీ సింబల్ చూపిస్తూ హర్షధ్వానాలు చేశారు.

ముఖ్యంగా తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం యుగపురుషుడు ఎన్‌టీఆర్ టీడీపీని స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని అన్నప్పుడు కేరింతలు కొట్టారు. అలానే వైఎస్, జగన్, సోనియా, ప్రధానిమంత్రిపై విమర్శలు చేసినప్పుడు మరింతగా కేరింతలు కొట్టారు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన రెంటపాళ్ల గ్రామానికి చెందిన నేలవల్లి నేతాజీ బొమ్మను వైసీపీ నేతలు తమ ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేసి సానుభూతి పొందే ప్రయత్నం చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఆత్మగౌరవ యాత్రలో చంద్రబాబు వెంట టీడీపీ సీనియర్ నేతలు గరికపాటి మోహన్‌రావు, ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, నన్నపనేని రాజకుమారి ఉన్నారు.

ఆత్మగౌరవ యాత్రలో బాబుకు నీరాజనం


జగన్ సోదరి షర్మిల 'సమైక్య శంఖారావం' పేరుతో తలపెట్టిన బస్సు యాత్ర.. కాంగ్రెస్‌లో విలీన ఆర్తనాదమని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. జగన్‌ను బయటకు తీసుకు రావాలన్న లక్ష్యంతోనే సోదరి షర్మిల బస్సు యాత్ర చేపట్టారని విమర్శించారు. జగన్ బెయిల్ కోసం ఆడుతున్న నాటకంలో భాగంగా ఢిల్లీకి తెలియచెప్పాలన్న ఉద్దేశ్యంతోనే షర్మిల తన తండ్రి సమకాలీనుకుడైన చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని ఏకవచన ప్రయోగంతో బస్సు యాత్రలో విమర్శలు చేస్తోందన్నారు. 13 జిల్లాల సీమాంధ్ర ప్రజలకు చేస్తున్న పనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కేవలం ఆరు రోజుల దీక్షకే నిమ్స్‌లో జగన్‌కు అన్ని రోజులు ట్రీట్‌మెంట్ ఎలా ఇస్తారని, అక్కడి వైద్యులు మరింత రెస్ట్ కావాలని చెబుతున్నారని, ఎంతకి అమ్ముడు పోయారని నిమ్స్ డాక్టర్లను ప్రశ్నించారు. కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జూలై 31 న దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభిస్తే.. సోనియా గాంధీ దానిని పూర్తి చేశారని చెప్పారన్నారు. వైఎస్ హయాంలో తెలంగాణా తీర్మానానికి 41 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని, అందులో తాను కూడా ఉన్నానని కొండా సురేఖ చెబుతున్న విషయం వాస్తవం కాదా అని షర్మిలను ప్రశ్నించారు. జగన్‌కు అధికార దాహం ఎక్కువని, నమ్మినవాళ్ళను కూడా నట్టేట ముంచుతారని, మరో నాయకుడిని ఎదగనివ్వరని, మాట తప్పటం.. మడమ తిప్పటం జగన్ నైజం అని సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

'మీ నాన్న వైఎస్ 2.75 లక్షల ఎకరాల భూములను పేదల దగ్గర నుంచి లాక్కున్నారు. 3 కోట్ల టన్నుల ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేశారు. లక్ష కోట్టు దోచుకున్నారు. మై డియర్.. సిస్టర్ ! ఏ మొహం పెట్టుకుని యాత్రకు వస్తున్నారు' అని ప్రశ్నించారు. ఆగస్టు 29, 2011లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలిచి కేంద్రంలోని కాం గ్రెస్‌కు మద్దతు తెలిపి వ్యవసాయ, రైల్వేశాఖ పదవులను తీసుకుంటామని జగన్ స్వయంగా చెప్పిన విషయం షర్మిలకు గుర్తుకు రాలేదా ? అని ప్రశ్నించారు.

నిమ్స్ డైరెక్టర్లు... ఎంతకు అమ్ముడు పోయారు ?
ఆరు రోజుల పాటు దీక్ష చేసిన జగన్‌ను నిమ్స్‌లో అన్ని రోజుల పాటు చికిత్స చేయాల్సిన అవసరం ఏమిటి అని ప్రశ్నించారు. హాస్పిటల్‌కు చలాకీగా నడుస్తూ వచ్చిన జగన్‌కు మరికొంత రెస్ట్ కావాలని నిమ్స్ డాక్టర్లు చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్‌లాగా వైవీ సుబ్బారెడ్డి తెల్లకోటు ,సెతస్కోప్, మూతికి గుడ్డ కట్టుకుని జగన్‌ను పరామర్శించటం నిజం కాదా అని ప్రశ్నించారు. నిమ్స్ డాక్టర్లు ఎంతకు అమ్ముడు పోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు వ్యాస్ తదితరులు పాల్గొన్నారు.

షర్మిల యాత్రపై మండిపడ్డ వర్ల రామయ్య

  'వైసీపీ నాయకురాలు షర్మిల తన తిరుపతి సభలో 36 నిమషాలపాటు చేసిన ప్రసంగంలో చంద్రబాబు పేరు 36 సార్లు ప్రస్తావించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురించి మాత్రం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. చంద్రబాబును ఇన్నిసార్లు దూషించిన మీరు అసలు దోషి సోనియా గాంధీని ఎందుకు అనలేకపోతున్నారు. మీకూ...కాంగ్రెస్‌కు మధ్య ఏమిటా బంధం' అని తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి ప్రశ్నించారు. మంగళవారం ఆమె ఇక్కడ షర్మిలకు ఒక బహిరంగ లేఖ రాశారు.

ఎన్నికల ముందుగాని...తర్వాతగాని మీ పార్టీ కాంగ్రెస్‌తో కలవబోదని...పొత్తు పెట్టుకోబోదని...సమర్ధించబోదని బైబిల్‌పై మీరు...మీ కుటుంబ సభ్యులు ప్రమాణం చేయగలరా అని ఆమె సవాల్ విసిరారు. సోనియాతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని జగన్ బెయిల్ కోసం పడరాని పాట్లు పడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఎన్ని అసత్యాలు చెప్పి భ్రమింపచేద్దామని అనుకొన్నా వైసీపీ ఏనాటికైనా కాంగ్రెస్‌లో కలిసిపోవడం ఖాయమని వారు అర్ధం చేసుకొన్నారని ఆమె అన్నారు.

చంద్రబాబు నామస్మరణ తప్ప సోనియా కనబడదా?: శోభా

తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖ కారణంగానే తెలంగాణ ఇచ్చామని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలపై టీడీపీ శాసనసభపక్ష ఉపనేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ అదేనిజమైతే ఆ పార్టీ అధినేత సోనియాగాంధీతో ఈ విషయాన్ని చెప్పించాలని ఆయన సవాలు చేశారు. సోనియాగాంధీ ఆ మాట చెబితే అప్పుడు మా నిర్ణయం ప్రకటిస్తామని ఆయన అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద వేసి లబ్ధి పొందాలని చూస్తుందని అన్నారు.

తెలంగాణను సోనియాగాంధీయే ఇచ్చిందని ప్రచారం చేసుకుంటున్న ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకులు, మేమే తెచ్చామని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన గుర్తుచేశారు. సీమాంధ్రలో మాత్రం చంద్రబాబు ఇచ్చిన లేఖ కారణంగానే కేంద్రం రాష్ట్రాన్ని విభజించిందని ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబెట్టారు. ఉద్యోగాలు, నీరు, విద్యుత్ వంటి సమస్యలు తేల్చకుండా రాష్ట్రాన్ని విభజించడం అన్యాయమని ఆయన అన్నారు. అధికారం కోసం మత కల్లోలాలు, ఘర్షణలు పెట్టడం కాంగ్రెస్‌కు అలవాటేనని ఆయన ఆరోపించారు. చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి సాధించిందన్నారు.

సోనియాతో చెప్పించండి : గాలి ముద్దుకృష్ణమ


బొబ్బిలి పులులై తిరగబడండి
వైకాపాది పూటకోమాట
ఆత్మగౌరవ యాత్రలో చంద్రబాబునాయుడు


 
మహారాష్ట్రలో విదర్భను, ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజిస్తామని కాంగ్రెస్‌ పార్టీ నేతలు గత ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ ఆ రాష్ట్రాలను ఏర్పాటు చేయకుండానే కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చడంలో ఆంత ర్యం ఏమిటో కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ప్రజలకు చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. ఆత్మగౌ రవ యాత్రలో భాగంగా మూడవ రోజున ఆయన గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటిం చారు. అచ్చంపేట, క్రోసూరులో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తూ తెలుగుజాతికి ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా సహించే ది లేదన్నారు.

ఇటీవల ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ వరదల్లో మృతిచెందిన, క్షతగాత్రులను ఆదుకునేందుకు రాష్ట్రంలో ప్రభు త్వమే లేనట్టుగా వ్యవహరించిందన్నారు. అక్కడ ఇబ్బందులో ఉన్న తెలుగు ప్రజలను రక్షించేందుకు తనతోపాటు పార్టీ శ్రేణులు అహర్నిశలు శ్రమించి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారి గమ్యస్థానాలకు చేర్చామన్నారు. తెలుగుజాతి కోసం తన ఊపిరి ఉన్నంత వరకు పోరాటం సాగిస్తానన్నారు. 34 రోజులుగా రాష్ట్ర విభజన అంశంపై సీమాంధ్ర ప్రాంతం అట్టుడికి పోతుంటే దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ మిన్నకుండటంతోపాటు హోంమంత్రి షిండే రాష్ట్ర విభజనకు సంబంధించి 20 రోజుల్లో క్యాబినేట్‌కు నోట్‌ఫైల్‌ సమర్పిస్తామని చెప్పడం దారుణమన్నారు. సీమాం ధ్రలో సమస్యను పరిష్కరించకుండా ఏకపక్షంగా రాష్ట్ర విభజనకు దిగుతున్నారంటే తెలుగుజాతి పొట్టకొట్టేందుకేనని చంద్రబాబు విమర్శించారు. దేశ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సోనియాగాంధీ చేతిలో కీలుబొమ్మగా మారి కేవలం రబ్బరు స్టాంప్‌గా తయారయ్యారన్నారు.సోనియాగాంధీ కుమారుడు రాహుల్‌ గాంధీ పనికిరాని వాడని ఆయన్ను ప్రధానిని చేసేందుకు రాజకీయ స్వార్థంతో సోనియా రాష్ట్రాన్ని విభజించేందుకు కుట్రపన్నార న్నారు. మరో వైపు తెలంగాణ ప్రాంతంలో టీఆర్‌ఎస్‌ పార్టీని విలీనం చేసుకునేందుకు, 2014 ఎన్నికల తరువాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని విలీనం చేసుకునేందుకు లోపాయికారి ఒప్పందం చేసుకుని రాష్ట్ర ప్రజల జీవితాలతో కాంగ్రెస్‌ పార్టీ చెలగాటమా డుతుందన్నారు. టీడీపీ తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో ఆవిర్భవించి ఇప్పటి వరకు తెలుగు జాతి ఔనత్యం కాపాడేందుకు నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. తెలుగుజాతితో పెట్టుకున్న వారెవరైనా చరిత్రహీనులవుతారన్నారు. దివంగత ముఖ్యమంత్రి టి.అంజయ్యను రాజీవ్‌ గాంధీ అవమానించారన్నారు. అందుకు ప్రతిగా ఎన్‌టిఆర్‌ టీడీపీ స్థాపించి అధికారంలోకి వచ్చారన్నారు. 1984లో అన్న ఎన్‌టీ రామారావును ఇందిరాగాంధీ అన్యా యంగా సీఎం పదవి నుంచి భర్తరఫ్‌ చేసిన విషయంలో ఇందిరా గాంధీ మెడలను తెలుగు ప్రజలు వంచారన్నారు.

తన హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల కాలంలో హైదరాబాద్‌తో సహా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారన్నారు. అనంతరం ప్రస్తుత నాలుగున్నర ఏళ్లలో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందన్నారు. రాష్ట్రం భ్రష్టుపట్టేందుకు కారకులైన కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల పనిపట్టేందుకు తెలుగు తమ్ముళ్లంతా బొబ్బిలి పులులై తిరగబడి ఆ పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్ష కోట్ల రూపాయల జాతి సంపదను వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దోచుకున్నాడని ధ్వజమెత్తారు. వైఎస్‌ హయాం లో రాష్ట్రంలో జరిగిన అవినీతిలో భాగస్వాములైన వారంతా ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో మగ్గుతున్నారన్నారు. వైఎస్‌ కుటుంబ ధనదాహానికి రాష్ట్ర మంత్రులు, పారిశ్రామి కవేత్తలు, ఐఏఎస్‌లు బలయ్యారన్నారు. జగన్‌ బెయిల్‌ , కేసుల మాఫీకై కాంగ్రెస్‌ పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర విభజనకు ఆ పార్టీ నాంది పలికిందన్నారు. మరో వైపు వైఎస్‌ విజయమ్మ, జగన్‌లు సమైక్య రాష్ట్రమంటూ దీక్షలు చేస్తూ పూటకో మాట మారుస్తూ రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారన్నారు. అలాగే తను పాదయాత్ర చేస్తే వైఎస్‌ఆర్‌ పార్టీ నాయకురాలు షర్మిల పాదయాత్ర అంటూ, బస్సుయాత్ర చేస్తే బస్సు యాత్ర అంటూ తన విధానాలను అనుసరిస్తున్నారని, ఆ పార్టీకి ప్రత్యేకంగా అజెండా అంటూ ఏమి లేదని విమర్శించారు.

పులిచింతల

తెదేపా పుణ్యమే


పులిచింతల ప్రాజెక్టుకు శంకు స్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది టీడీపీ పాలనలోనేనని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. వైఎస్‌ అధికా రంలోకి వచ్చి జలయజ్ఞం పేరుతో ఈ ప్రాజెక్టుకు అంచనాలు పెంచి వేల కోట్లు దుర్వినియోగం అయినట్లుగా కాంట్రాక్ట ర్లతో చేతులు కలిపారని ఆరోపించారు. వేల కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటి వరకు ఎకరా భూమికి నీరందలేదన్నారు. ఏడా దిన్నర కాలంలో పూర్తి చేస్తామన్న ఈ ప్రాజెక్టు తొమ్మిదేళ్లకు కూడా పూర్తి కాలేదన్నారు.

ఆంధ్రానే ఎందుకు చీల్చారు? విదర్భను ఎందుకు విస్మరించారు


రాష్ట్ర రాజధానిలో ఈ నెల 7వ తేదీన తలపెట్టిన ఏపీఎన్జీవోల సదస్సుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దారుణమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

గతంలో టీ కాంగ్రెస్ నేతలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం సీమాంధ్ర ఉద్యోగులకు అనుమతి ఇవ్వకపోవడం సరికాదన్నారు. సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటానని చెబుతున్న ముఖ్యమంత్రి కిరణ్ సభ అనుమతికి ఎందుకు అనుమతి ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 60శాతం ఉన్న సీమాంధ్ర ప్రజలకు దీనివల్ల అన్యాయం జరుగుతుందన్నారు.

హైదరాబాదులో సభ ఎందుకు పెట్టుకోనివ్వరు?: సోమిరెడ్డి


షిండే వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర నిరసన!
విదర్భ, యుపిపై లేని తొందర ఇక్కడే ఎందుకు?

రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో నెలరోజులుగా ప్రజాందోళనలు జరుగుతుంటే, ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు సంబంధించి 20 రోజుల్లో మంత్రివర్గం ముందు 'నోట్‌' ప్రవేశపెడతానని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చెప్పడంపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్ర జిల్లాల్లో ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతుంటే పట్టించుకోకుండా వ్యవహరించడం సరికాదన్నారు. చంద్రబాబు 'ఆత్మగౌరవ యాత్ర' మంగళవారం గుంటూరు జిల్లా క్రోసూరు, అచ్చంపేట, రెంటపాళ్ళ, పీసపాడు, వేల్పూరు గ్రామాల్లో సాగింది. ఆయా గ్రామాల్లో జరిగిన బహిరంగసభల్లో ఆయన ప్రసంగించారు. మహారాష్ట్రలో విదర్భ, యుపిలో మరో నాలుగు రాష్ట్రాలు చేస్తామని ఎన్నికలకు ముందు వాగ్ధానాలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ, వాటి గురించి పట్టించుకోకుండా ప్రత్యేక తెలంగాణా విషయంలో మాత్రమే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాజకీయ లభ్ధి కోసం రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చుపెట్టడం క్షమించరాని నేరమన్నారు. యుపిఎ ప్రభుత్వం 35 సార్లు పెట్రోల్‌, 25 సార్లు డీజిల్‌ ధరలను పెంచిందని, 50 సంవత్సరాల పూర్వం ఉన్న ధరలకంటే గత తొమ్మిదేళ్లలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రెట్టింపయ్యాయన్నారు. గుంభనంగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌లను భూస్థాపితం చేస్తేనే తెలుగువారి ఆత్మగౌరవం నిలబడుతుందని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ వెంటిలేటర్‌పై ఉందని, దానికి ఊపిరిపోయే రోజులు దగ్గర పడ్డాయనీ అన్నారు. మళ్లీ కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే బతుకులు చితికే పరిస్థితి ఉన్నందున వాస్తవాలను గుర్తెరిగి మసలుకోవాలని ప్రజలను కోరారు.

ప్రజాందోళనలు విస్మరించి 'నోట్‌' పెడతారా?


విదర్భ గురించి షిండే మాట్లాడ్డంలేదు
గతంలో నాపైనా దాడి చేయించారు
టీడీపీ వస్తే సమస్య పరిష్కరిస్తా : బాబు


ప్రత్యేక తెలంగాణపై 20 రోజుల్లో కేబినెట్ నోట్ పెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెబుతున్నారు, మరి సీమాంధ్ర ఆందోళనలు పట్టించుకోరా అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మూడో రోజైన మంగళవారం గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, రెంటపాలెంలో చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్ర ప్రారంభించారు. జిల్లాలోని రెంటపాళెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సంగం డెయిరీ పాలశీతలీకరణ కేంద్రంలో వీరయ్యచౌదరి విగ్రహాన్ని బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణపై మాట్లాడుతున్న సుశీల్ కుమార్ షిండే విదర్భ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నోట్ పెట్టే ముందు విభజన సమస్యల గురించి ఆలోచించరా అని ఆయన ప్రశ్నించారు. సాగు, తాగునీరు రావని, ఉద్యోగాలు దొరకవని సీమాంధ్ర ప్రజలు ఆందోళన చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.

తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ లక్ష కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి అవినీతిమయం చేశారని, ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ పెట్టిన ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని, తాము అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజనకు కారణం వైయస్ రాజశేఖర రెడ్డి అని ఆయన అన్నారు.
విజయనగరంలో గతంలో తనపై కూడా దాడి చేయించారని చంద్రబాబు ఆరోపించారు. విజయనగరంలో దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. బొత్స కుటుంబ సభ్యులందరికీ పదవులు ఉన్నాయని, యువత ఉద్యోగాలు రావని బాధపడుతున్నారని, ఈ బాధలు బొత్సకు పట్టవా అని చంద్రబాబు ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. తెలుగువారికి ఎప్పుడు కష్టం వచ్చినా తమ పార్టీ అండగా నిలిచిందని, ఎన్టీఆర్‌కు ఎన్టీఆరే పోటీ తప్ప మరెవరూ కారని ఆయన అన్నారు. తెలుగుజాతికి గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. ఇటలీలో పుట్టినందు వల్ల కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి చరిత్ర తెలియదని అన్నారు.
రాజకీయాల కోసం కాంగ్రెసు పార్టీ తెలుగువారి మధ్య చిచ్చు పెట్టిందని, తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలనుకుంటుందోని చంద్రబాబు మండిపడ్డారు. సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు సోనియాగాంధీ పెంపుడు కుక్కలని, తన మీద మొరుగుతారే కానీ, సోనియాని అడగలేరని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో విభజన సమస్యను పరిష్కరిస్తామని మరోసారి చంద్రబాబు తెలిపారు.

సీమాంధ్ర ఆందోళనలు పట్టించుకోరా?

ఆత్మగౌరవయాత్ర పేరుతో గురజాల నియోజకవర్గంలో తెదేపా అధినేత చంద్రబాబు నిర్వహించిన యాత్ర పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.చంద్రబాబు బస చేసిన ప్రదేశానికి సోమవారం తెదేపా నాయకులు, మాజీ మంత్రులు హాజరయ్యారు.మాజీ మంత్రి కోడెల శివప్రసాద్, యనమల రామకృష్ణుడు, చిక్కాల రామచంద్రరావు, కరణం బలరాం, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, నన్నపునేని రాజకుమారి, వర్ల రామయ్య, చంద్రబాబును ప్రత్యేక బస్సులో కలిసి ఆదివారం నాటి బస్సు యాత్ర విశేషాలను వివరించారు. ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు బస్సులో పార్టీ పెద్దలతో చంద్రబాబు సమీక్షా నిర్వహించారు. చంద్రబాబుతో ఫోటోలు దిగేందుకు పిడుగురాళ్ల తెలుగుతమ్ముళ్ల ఉత్సాహం చూసిన ఎమ్మెల్యే యరపతినేని చంద్రబాబుతో తెలుగుతమ్ముళ్ల ఫోటోలు దిగేందుకు అవకాశం కల్పించారు. చంద్రబాబు బస చేసిన ప్రాంగణం వద్ద ఎన్నారై జానపాడు వాసి చింతలపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నారాయూత్ పేరుతో చంద్రబాబు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, నారాలోకేష్ ఫోటోలతో పెద్దఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్స్‌బ్యానర్లను చంద్రబాబు ఆసక్తిగా గమనించారు.ఎమ్మెల్యేలు ధూళ్లిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి పుష్పరాజ్, మాజీ ఎమ్మెల్యేలు జియావుద్దీన్, అనంతవర్మరాజు, సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్ ముమ్మినేని వెంకటసుబ్బయ్య, వెన్నా సాంబశివారెడ్డి, కంచేటి శివప్రసాద్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ వడ్డవల్లి సర్వేశ్వరరావు, ఎల్ వి ఆర్, సయ్యద్ అమీర్అలీ, బాబావలి, పెండేల సుబ్రమణ్యం, వర్ల రత్నం, నల్లాటి సుబ్బారావు, చింతలపూడి సీతారామయ్య, బాబు, మేకల సాంబశివరావు, దియ్యా రామకృష్ణా, తురకా వీరస్వామి,అద్దంకి బాబు, వేముల సాంబయ్య, కోకాటి ప్రసాద్, గుదె లక్ష్మణ్‌బాబు, దాచినేని సాయి, తదితరులు పాల్గొన్నారు.

బాబును కలిసిన దేశం నేతలు


తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు కేంద్రం ఉత్తరప్రదేశ్ ను ఎందుకు విభజించడం లేదని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో ఆయన బస్ యాత్ర లో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి షిండే విదర్భ రాష్ట్రం ఏర్పాటు గురించి ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు. తెలుగురాష్ట్రాన్ని మాత్రం రెండు ముక్కలు చేయాలని అనుకుంటోందని ఆయన విమర్శించారు. సోనియా పెంపుడు కుక్కలు గా ఉన్న ఎమ్.పిలు తన మీద మొరుగుతారే కాని,సోనియాగాందీని అడగడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే ఎన్నికలు వస్తాయని, తాను అదికారంఓకి వస్తే ఆరు నెలల్లో సమస్య పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.

షిండే విదర్భ రాష్ట్రం ఏర్పాటు గురించి ఎందుకు మాట్లాడడం లేదు! యు.పిని ఎందుకు విభజించడం లేదు-బాబు

లోక్‌సభలో టీడీపీ ఎంపీలపై కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద టీడీపీ ఎంపీలు ధర్నాకు దిగారు. సందీక్ష దీక్షిత్‌ను సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ నిన్న (సోమవారం) సస్పెండ్ గురైన నలుగురు టీడీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.

పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద టీడీపీ ఎంపీల ధర్నా

ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలోని రెంటపాళెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే సంగం డెయిరీ పాలశీతలీకరణ కేంద్రంలో వీరయ్యచౌదరి విగ్రహాన్ని బాబు ఆవిష్కరించారు.

గుంటూరు : ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు