August 29, 2013

సమైక్యాంధ్రకు మద్దతుగా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో పది రోజులపాటు వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఒక ప్రణాళికను ప్రకటించారు. పార్టీ నిర్ణయాల కంటే, ప్రజల మనోభావాలు, వారి అభిప్రాయాలకు అనుగుణంగా సమైక్యాంధ్ర కోసం ఉద్యమించక తప్పదని ఆయన అంటున్నారు. శుక్రవారం నర్సీపట్నంలో సుమారు ఐదువేల మందితో సమైక్యాంధ్ర సాధన ర్యాలీ నిర్వహిస్తారు. శనివారం ఎడ్లబళ్లతో నర్సీపట్నంలో మహాప్రదర్శన నిర్వహిస్తారు. అయ్యన్న జన్మదినం సందర్భంగా సెప్టెంమర్ నాలుగో తేదీన వందలాది రక్తదానం చేస్తారు.
సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రతి రోజూ ఏదో రూపంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని, దీని కోసం శుక్రవారం సమావేశాన్ని నిర్వహిస్తున్నామని టీడీపీ నాయకుడు సన్యాసిపాత్రుడు తెలిపారు. కాగా నర్సీపట్నంతోపాటు మిగతా మండల కేంద్రాల్లో కూడా సమైక్యాంధ్ర సాధన కోసం ఆందోళనలు జరుగుతాయని చెప్పారు.

సమైక్యాంధ్ర కోసం టీడీపీ పది రోజుల ప్రణాళిక

గ్రామ పెద్దలకున్న తెలివి లేదా!


 "ఒక కుటుంబంలో వచ్చే తగాదాల విషయంలో గ్రామ పెద్దలు ప్రదర్శించేపాటి తెలివి కూడా కాంగ్రెస్ చూపలేకపోయింది. విభజన నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే వర్గాల వారిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నదీ జలాలు, ఉపాధి అవకాశాలు, విద్యావకాశాలు, హైదరాబాద్ తదితర అంశాలపై ప్రజల్లో ఆందోళన ఉంది. వాటిపై చర్చించండి. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం అన్వేషించండి'' అని కాంగ్రెస్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూచించారు.

గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకొన్న తీరు రాజకీయ కుట్రను సూచిస్తోందని ఆరోపించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. "పంచాయితీ ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా చడీచప్పుడు లేదు. కాంగ్రెస్ గెలవదని సర్వేలు రావడం, పంచాయితీ ఎన్నికల్లో పది జిల్లాల్లో టీడీపీ గెలవడంతో చిచ్చు రగిల్చారు. ఇక్కడ టీఆర్ఎస్‌ను, అక్కడ వైసీపీని కలుపుకొన్నారు. ఇక్కడ విలీనం ప్యాకేజీ. అక్కడ బెయిల్ ప్యాకేజీ. కేసీఆర్ ఇక్కడ రెచ్చగొడతారు. ఢిల్లీ వెళ్లి వాళ్లు చెప్పగానే అందరూ సంయమనం పాటించాలని పిలుపు ఇస్తారు.

కడప పౌరుషానికి, ఢిల్లీ పెత్తనానికి పోటీ అని పిలుపులు ఇచ్చిన వాళ్లు ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఢిల్లీ సౌజన్యంతో ఇంట్లో మాదిరిగా జైల్లో కూడా దీక్షలు జరుగుతున్నాయి. ఫోన్లలో చర్చలు, పార్టీ కార్యకలాపాలు జైల్లో కూడా సాగిపోతున్నాయి'' అని చంద్రబాబు ఆరోపించారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎందుకు వేగం తగ్గించిందని ప్రశ్నించారు. ఇవన్నీ ఈ కుట్రలో కోణాలని, విభజన వల్ల తమకు సీట్లు వస్తున్నాయని, రాజకీయ ప్రయోజనం కోసమే ఈ నిర్ణయం తీసుకొన్నామని దిగ్విజయ్ సింగ్ ఘనంగా బెంగుళూరులో చెప్పుకొన్నారని తెలిపారు.

"ప్రజల కోసం విభజన చేస్తే... వారిని ముందుగానే విశ్వాసంలోకి తీసుకొని అందరితో మాట్లాడి ఆమోదయోగ్య నిర్ణయం చేస్తే మేం తప్పుబట్టం. ఇవే విషయాలు ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వారికి వాస్తవాలు వివరిస్తాం'' అని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నుంచి తన యాత్ర మొదలవుతోందని ఆయన చెప్పారు. లగడపాటిని అడ్డుకున్నట్లుగా తన యాత్రను అడ్డుకుంటారనే ఆందోళన ఏదీ లేదన్నారు. రాష్ట్రం నాశనం చేసిన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ పరిస్ధితి ఎదురైందని చంద్రబాబు ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు.


విభజన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఇదేదో సొంత పార్టీ వ్యవహారంలా చూస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఏపీఎన్జీవోలను ఆంటోనీ కమిటీ వద్దకు వెళ్లాలని ప్రధాని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. 30 రోజుల నుంచి ప్రజలు రోడ్లపై ఉంటే ఎలా చేతులు దులుపుకొంటారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా రాష్ట్రాల విభజనపై ఆర్టికల్ 3 కింద నిర్ణయం తీసుకోవడానికి పూర్తి అధికారాలు ఉన్నాయని వైసీపీ లేఖ రాసిచ్చిందని... ఏ కత్తితో పొడవవచ్చో కూడా రాసిచ్చిన పార్టీకి తమను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. తమ పార్టీ 2008లో చేసిన తీర్మానంలోనే సమన్యాయం గురించి ప్రస్తావించిందని ఆయన చెప్పారు. మూడేళ్లుగా తెలంగాణను అస్థిరత్వంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీమాంధ్రలో కూడా అదే పరిస్థితి సృష్టిస్తోందన్నారు. తమ పాలనలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులున్నాయా అని ప్రశ్నించారు.

కూర్చోబెట్టి మాట్లాడితే సమస్యలకు పరిష్కారం కుట్ర కోణంలోనే విభజనపై నిర్ణయం

తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేంద్రంలోని సీమాంధ్ర మంత్రులపై విరుచుకుపడుతున్నారు.సమైక్యాంధ్ర కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమం చేస్తుంఏట సీమాంధ్ర కేంద్ర మంత్రులు మాత్రం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇంట్లో పాలేర్లులా ఊడిగం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.వారు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు.

సోనియా ఇంట్లో పాలేర్లు వారు : పయ్యావుల

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నడూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వమని చెప్పలేదని, 2004లో తెలుగుదేశం పార్టీ సమైక్య నినాదంతో పోటీ చేసినప్పుడు ప్రజలు ఓడించారని, దీంతో 2009 ఎన్నికల్లో తప్పని పరిస్థితులలో తాము తెలంగాణకు అడ్డంకాదని మాత్రమే చంద్రబాబు అన్నారని, తాము లేఖల ద్వారా కేంద్రాన్ని కోరింది రెండు ప్రాంతాలకు సమన్యాయం అని, ఇప్పుడు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇద్దరూ చంద్రబాబు లేఖ మూలంగానే రాష్ట్రం ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు.

చంద్రబాబు ఇయ్యమనలే : ముద్దుకృష్ణమ

తెలుగుదేశం పార్టీ మళ్లీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వద్దకు వెళ్లి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ ఆస్తులను జప్తు చేయాలని కోరింది.వైఎస్ జగన్ చట్టాలను ఉల్లంఘించి అక్రమాల కు, ప్రజాధనం లూటీకి పాల్పడినప్పటికీ ఇంతవరకు ఆయనపై తగు చర్య తీసుకోలేదని ఆ పార్టీ ఎంపీలు ఇడికి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీబీఐ ఇప్పటివరకూ తీవ్ర అభియోగాలతో ఐదు చార్జిషీట్లను దాఖలు చేసిందని, దాదాపు 43 వేల కోట్ల మేరకు అవినీతి జరిగిందని నిర్ధారిస్తే ఈడీ ఇంతవరకు కేవలం రూ.229 కోట్లమేరకే ఆస్తులను జప్తు చేసిందని వారు చెప్పారు.రాజకీయ జోక్యం వల్ల ఇడి దర్యాప్తు ఆగిపోయినట్లుందని వారు ఆరోపించారు. నామా నాగేశ్వరరావు. దేవేందర్ గౌడ్, వైఎస్ చౌదరి, కె.నారాయణ రావు, సీఎం రమేశ్‌లు లు ఇడిని కలిసినవారిలో ఉన్నారు.

జగన్ ఆస్తులు జప్తు చేయండి-టిడిపి

ఈడీ డైరెక్టర్‌తో టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావు, కొనకళ్ల నారాయణ గురువారం సమావేశమయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసును వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ఈడీ కి నేతలు వినతి చేశారు.

ఈడీ డైరెక్టర్‌తో టీడీపీ నేతల భేటీ

సమైక్యాంధ్రకు మద్దతుగా టీడీపీ ఆధ్వర్యంలో జిల్లాలోని పశువుల ఆస్పత్రి వద్ద గురువారం మానవహారం నిర్వహించారు. టీడీపీ నేతలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, గద్దె రామ్మోహన్, దేవినేని ఉమా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో మానవహారం

సమైక్యాంధ్రకు మద్దతుగా రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభాహైమావతి చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు గురువారం భగ్నం చేశారు. దీక్షా స్థలిని నుంచి ఆమెను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. కాగా దీక్ష శిబిరానికి మళ్లీ వెళ్లేందుకు శోభాహైమావతి యత్నిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం గత నాలుగు రోజులుగా శోభా హైమావతి ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించిడంతో పోలీసులు దీక్ష భగ్నం చేశారు.

శోభాహైమావతి దీక్ష భగ్నం

  దేశానికి మేలు చేయవలసిన విధానాలను చిత్తశుధ్ధితో అమలు చేయవలసిన సమయంలో దేశాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తమైన విధానాలతో దేశాన్ని సర్వ నాశనం చేసిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. ప్రధాని కీలుబొమ్మగా మారారని ఆక్షేపిస్తూ సోనియా చేతిలో అధికారం రిమోట్‌లా మారిపోయిందని ఆయన విమర్శించారు. సోనియా దేశాన్ని భ్రష్టు పట్టించారని ఆయన ఘాటుగా విమర్శించారు.
రోజురోజుకీ పతనమవుతున్న రూపాయి విలువను చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు ఆర్థిక సంస్కరణలను సవ్యంగా అమలు చేయడంలో మన్మోహన్ ప్రభుత్వం నిస్సత్తువ ప్రదర్శించిందని ఆయన నిప్పులు చెరిగారు. గురువారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలకు ముందు నాటి పరిస్థితులు ఉత్పన్నం కావని చెప్పడం ద్వారా ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ 1991 నాటి ముందు పరిస్థితులు వస్తాయని పరోక్షంగానే చెబుతున్నారని విమర్శించారు. పరిస్థితులను చక్కదిద్దలేకపోతే ఆ పదవిలో ఉండడానికి అనర్హులని ఆయన ప్రధానిని ఉద్దేశించి నిష్కర్షగా వ్యాఖ్యానించారు.
అవినీతి ధనాన్ని హవాలా రూపంలో విదేశాలకు తరలించారని ఆయన నిప్పులు చెరుగుతూ మన దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచంలో నమ్మకం పోయిందని, ఈ పరిస్థితులలో పెద్ద ఎత్తున పెట్టుబడుల
ను ఎలా తీసుకువస్తారని, దేశం అస్తవ్యస్తంగా మారిపోతే ఎవరైనా ఎందుకు పెట్టుబడులు పెడతారని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకత్వం లేదని తీవ్రంగా విమర్శిస్తూ భవిష్యత్తులో ఉద్యోగాలు సృష్టించే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కుంభకోణాలు చోటుచేసుకుంటుంటే ఒక్క కేసు విషయంలోనైనా చర్యలు తీసుకున్నారా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోపభూయిష్టమైన విధానాలవల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని. ఈ పరిస్థితులు ఎప్పటికి చక్కబడాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

సోనియా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బ తింది: బాబు

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ నాయకురాలి చేతిలో పావుగా మారారని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించడం లేదని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తర్వాత కేంద్రం పూర్తి బాధ్యతారహితంగా , నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అంతేకాక కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని , ఈ సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి జోక్యం చేసుకుని రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్ది అందరికి న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్.ఆర్.కాంగ్రెస్,టిఆర్ఎస్ లతో కలిసి డ్రామా ఆడుతున్నట్లుగా ఉందంటూ ఆరోపణలు చేశారు.

సోనియా చేతిలో పావు ప్రధాని-చంద్రబాబు

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడిని పలువురు అభినందిస్తున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పలుమార్లు తలాతోకలేని ప్రకటనలు చేయడం.. మళ్లీ వెనక్కు తగ్గడం వంటివి చేస్తుందని ఆ పార్టీకి చెందిన నేతలే అంగీకరిస్తున్నారు. అయితే, చంద్రబాబు అలా కాదని.. విభజన విషయంలో బాబు ఒక స్టాండ్ పై నిల్చున్నారని నేతలు అంటున్నారు. బాబుకు గల స్పష్టతను ఇటు తెలంగాణ నేతలతో పాటుగా, సీమాంధ్ర నేతలు కూడా అభినందిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజాప్రయోజనాలే ముఖ్యమని బాబు పేర్కొనడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విభజన జరిగితే పార్టీకి నష్టం వాటిలుతోందని.. తెలంగాణపై స్టాండ్ మార్చుకోవాలని కొందమంది సూచించినప్పటికినీ.. బాబు తిరస్కరించారని తెలుస్తోంది.

తెలంగాణపై పార్టీ ఓ నిర్ణయం తీసుకుందని ఇక వెనక్కు వెళ్లే పరిస్థితి లేదని బాబు స్పష్టం చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత గుత్తాసుఖేందర్ రెడ్డి అభినందించారు. ప్రత్యేక తెలంగాణపై ప్రకటన చేసిన కాంగ్రెస్ అధిష్టానం మాటనే కాంగ్రెస్ నేతలు వినే పరిస్థితి లేదు.. అంతేకాకుండా కేంద్రం తాను చేసిన ప్రకటనను అమలు చేయడానికే ధైర్యం చేయలేకపోతుంది. ఇలాంటి క్లిష్టమైన సమస్యపై ఓ స్టాండ్ తీసుకోవడమే కాకుండా… ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ స్టాండ్ కట్టుబడి వుంటామని బాబు ప్రకటించడం నిజంగా అభినందించాల్సిన విషయమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బాబు బేష్..!