August 28, 2013

తెలుగుదేశం లేఖ ఆధారంగానే తెలంగాణ ఇచ్చామని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ చెబితే, తదుపరి ఏమి చేయాలో కూడా తాము చెబుతామని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. కాంగ్రెస్,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లు కలిసి నాటకం ఆడుతున్నాయని, సమ న్యాయం అంటే ఏమిటో విజయమ్మ చెప్పాలని ఆయన అన్నారు. జగన్ బెయిల్ కోసమే ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

సోనియాకు ముద్దుకృష్ణమ షరతు

ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఓ మైనపు బొమ్మని, సోనియాగాంధీ చేతిలో కీలు బొమ్మని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలతో దివంగత మాజీ సీఎం వైఎస్ ఆడుకుంటే, కేంద్రం రాష్ట్రంతో ఆడుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. అసలు రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో తీర్మానం పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలా? లేక కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా? అనేది తెలియడం లేదని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజనపై కేంద్రం ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంది. మరి ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలగా ఎందుకు విభజించలేదని మోదుగుల ప్రశ్నించారు. మొదటి నుంచి ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీయే పోరాటం చేస్తోందని, అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో మోదుగులతోపాటు ఎంపీలు సీఎం రమేష్, నిమ్మల కిష్టప్ప పాల్గొన్నారు.

ప్రధాని మన్మోహన్ ఓ మైనపు బొమ్మ : మోదుగుల

సీమాంధ్రలో ఇంత పెడ్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని టీడీపీ సీనిరయర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. సీమాంధ్ర కు న్యాయం జరగాలని కోరుతూ టీడీపీ ఎంపీలు చేపట్టిన దీక్షను ఒక్కరోజులోనే భగ్నం చేశారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జైల్లో జగన్మోహన్‌రెడ్డి దీక్ష చేస్తుంటే హెల్త్ బులెటిన్‌లు విడుదల చేస్తున్నారని, చంచల్‌గూడ జైలు వైసీపీ ఆఫీసులా మారిందని ఆయన దుయ్యబట్టారు.

పొత్తుల కోసం కాంగ్రెస్ వెంపర్లాడుతోందని, జైలు నిబంధనలు సడలించి వైసీపీకి రెండు గదులు కేటాయించిందని సోమిరెడ్డి ఆరోపించారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు, జగన్ తల్లి విజయమ్మకు ప్రధాని, రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇస్తే ఇక జగన్‌పై విచారణ నిష్పాక్షికంగా ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన నిర్ణయంలో ఏ-1 దివంగత వైఎస్ అయితే, ఏ-2 కాంగ్రెస్ అని సోమిరెడ్డి పేర్కొన్నారు. తెలుగు జాతిని నాశనం చేయడమే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆఖరి కోరికలా కనిపిస్తోందని సోమిరెడ్డి అన్నారు. జైళ్ల చట్టం అందరికీ ఒకేలా ఉండాలని, జగన్‌కు వేరాలా ఉండకూడాదని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, వైసీపీలను కలుపుకునేందుకు సోనియా ఆరాటపడుతున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు.

చంచల్‌గూడ జైలు వైసీపీ ఆఫీస్‌లా మారింది : సోమిరెడ్డి

ఆహార భద్రత బిల్లు తన తండ్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు మానస పుత్రిక అని మాజీ రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి హరికృష్ణ మంగళవారం అన్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో ఆహార భద్రత బిల్లు గురించి ప్రస్తావించారన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి పేదల ఆకలి తీర్చిన ఘనత ఎన్టీఆరేనని అన్నారు. తాను తెలుగుదేశం పార్టీని వీడుతానని కొందరు మొరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చిల్లర మాటలకు తాను స్పందించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని హరికృష్ణ అన్నారు

ఆహార భద్రత ఎన్టీఆర్ మానస పుత్రిక: హరికృష్ణ

తెలంగాణకు మద్దతుగా చంద్ర బాబు ఇచ్చిన లేఖ ఓ గడ్డిపరకతో సమానమని, ఆరుగురు ఎంపీలు కూడా లేని ఒక పార్టీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం విలువ ఇవ్వలేదని తెలుగు దేశం సీనియర్‌ నాయకులు కోడెల శివ ప్రసాద్‌, వర్లరామయ్య పేర్కొ న్నారు. సమైక్యాంధ్ర కోసం విజయమ్మ దీక్ష పేరుతో దొంగనాటకాలు ఆడారని, రాత్రి 9 గంటల వరకూ శిబిరంలోనూ, ఆ తర్వాత ఏసీ బస్సులోనూ దీక్ష చేశారని వారు విమర్శించారు. అటు తెలంగాణ లోనూ, ఇటు ఆంధ్రలోనూ బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికే సోనియా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో సాగుతున్న సమైక్య ఉద్యమానికి మద్దతు తెలపడానికి ఒంగోలు వచ్చిన సీనియర్‌ నాయకులు కోడెల శివ ప్రసాదరావు, వర్లరామయ్య, రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షులు కరణం బలరాంతో సహా జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ పార్టీతో సంబంధం లేకుండా సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం ఎగిసి పడిందన్నారు. విభజన పాపం ఖచ్చితంగా దివంగత వైఎస్‌ రాజశేఖ రరెడ్డిదేనన్నారు. తాను అధికారంలో లేని సమయంలో తెలంగాణకు అనుకూలంగా ఎమ్మెల్యేల సంతకాలు సేకరించారని, ఇపుడు కేంద్రం కూడా నాడు రాజశేఖరరెడ్డితో ప్రారంభించి, ఇపుడు సోనియాగాంధీ ముగించిందని పేర్కొన్నారని గుర్తు చేశారు. వారి నాయకుడు పాపాన్ని తమకు అం టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిం చారు. ఇక జైలులో దీక్ష చేస్తున్న జగన్‌ ఎందుకు చేస్తున్నాడో ప్రజలకు చెప్పాలన్నారు. ఆరోగ్యం బాగో లక అన్నం తినకుండా ఉన్నారేమో ఎవరికి తెలుసంటూ వారు విమర్శించారు. అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉన్న జగన్‌, ముందు రాష్ట్రం నుండి తాను దోచుకున్న సొమ్మెంతో చెప్పాలని వారు విమర్శించారు.

సొసైటీ ఎన్నికల్లోనూ, పంచాయతీ ఎన్నికల్లోనూ అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రలో తెలుగుదేశం మంచి ఫలితాలు సాధించడంతో కక్ష కట్టిన సోనియా గాంధీ రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విభజన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేసే విధంగా ఈ విభజన నిర్ణయం లేదన్నారు. ఇరు ప్రాంతాలకు సమానన్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే మేం డిమాండ్‌ చేస్తాం అన్నారు.

టీడీపీని దెబ్బతీసేందుకే!