August 23, 2013

 రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ సీమాంధ్రలో ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్న ఉద్దేశంతోనే ఎంపీల సస్పెన్షన్, సీమాంధ్ర ఉద్యోగులపై దాడులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెగబడుతున్నాయని టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ దుర్మార్గమైనదని, బాధాకరమైన విషయమన్నారు. సీమాంధ్రలో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డెక్కుతున్నారన్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగినులను కించపరిచేలా, దుర్భాషాలాడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలో హైదరాబాద్‌లో నిరసన తెలిపే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. కోదండరాం దీనికి ఏం సమాధానం చెబుతారని అన్నారు. కడుపులో పెట్టుకుంటామనే కేసీఆర్.. ఈ దాడులపై ఏం సమాధానాలు చెబుతారని ప్రశ్నించారు. సోనియా కళ్లు తెరిచి రాష్ట్ర విభజన ప్రకటన వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ బెయిల్ కోసం ఎంపీ రాజమోహనరెడ్డి కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు. సెప్టెంబర్, అక్టోబర్‌లలో జగన్‌ను బయటకు తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ లో కేసీఆర్‌ను, సీమాంధ్రలో వైఎస్ జగన్‌ను కలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.

సీమాంధ్రలో ఉద్యమ అణచివేతే లక్ష్యం అందుకే ఎంపీల సస్పెన్షన్, సీమాంధ్ర ఉద్యోగులపై దాడులు: దేవినేని ఉమా

సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యే రామకృష్ణ తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆస్పత్రికి తరలించడంతో ఆయన అక్కడే దీక్షను కొనసాగిస్తున్నారు. ఆస్పత్రిలో రామకృష్ణను టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పరామర్శించారు. ప్రజాదరణ అధికంగా వస్తుందనే ప్రభుత్వం దీక్షను భగ్నం చేసిందని సోమిరెడ్డి ఆరోపించారు.

ఎమ్మెల్యే రామకృష్ణను పరామర్శించిన సోమిరెడ్డి

సమైక్యాంధ్ర కోసం దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయనకు జాండీస్, బరువు తగ్గడం, చూపు మందగించడంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. దీక్ష విరమించాలని వైద్యుల సూచించినప్పటికీ రామానాయుడు నిరాకరిస్తూ దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయనను టీడీపీ నేతలు అయ్యన్యపాత్రుడు, వెలగపూడి, కళా వెంకట్రావు పరామర్శించారు.

మరింత క్షీణించిన రామానాయుడు ఆరోగ్యం

నా తండ్రి ఎన్టీఆర్ ఆశయసాధన కోసమే ఎంపీ పదవికి రాజీనామా చేశామని హరికృష్ణ పేర్కొన్నారు. తన రాజీనామా వెనుక ఎవరి హస్తం లేదని, ఆయన తెలిపారు. చైతన్యయాత్రపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ శకుని పాత్ర పోషిస్తోందని, హైదరాబాద్ నగరం అన్ని ప్రాంతాలవారి సమాహారం అని హరికృష్ణ తెలిపారు. అలనాడు మహాభారతంలో పాండవులు, కౌరవులు మధ్య శకుని పోషించిన పాత్రను ఈనాడు కాంగ్రెస్ పార్టీ పోషిస్తుందని చెప్పారు.
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు సోనియాగాంధీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని హరికృష్ణ ఆరోపించారు. రానున్న సాధారణ ఎన్నికల్లో రాహుల్ ను మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోందని హరికృష్ణ పేర్కొన్నారు. విభజనకు కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ హరికృష్ణ గురువారం తమ ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

తండ్రి ఆశయసాధనకే రాజీనామా : హరికృష్ణ

విశాఖలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

హెచ్‌పీసీఎల్ ప్రమాదంపై చంద్రబాబు విచారం

రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని డిమాండ్ చేస్తూ.. పుట్టపర్తి తెదేపా ఎమ్మెల్యే పల్లె రఘునాథ రెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పల్లె గత అయిదు రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. రఘునాథ రెడ్డి దీక్ష భగ్నంతో ఆగ్రహించిన కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే, సమైక్యాంధ్ర కోసం చేస్తున్న దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా ఆయన సతీమణి ఉమ దీక్షకు దిగారు. ఉమ దీక్షకు భారీ ఎత్తున తెదేపా కార్యకర్తలు, సమైక్యవాదులు మద్దతు పలికారు. కాగా, ఎమ్మెల్యే ఆరోగ్యం క్షీణిస్తుండటం వల్లే దీక్షను భగ్నం చేశామని పోలీసులు చెబుతున్నారు. రఘునాథ రెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నట్లు కూడా పోలీసులు పేర్కొన్నారు.

పల్లె రఘునాథ రెడ్ది దీక్ష భగ్నం... నిరసనగా ఆయన సతీమణి ఉమ దీక్ష!


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మహబూబ్ నగర్ లో ఇల్లు లేదు..లోక్ సభలో నోరు లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ ఆవేదనతోనే రాజీనామా చేశాడని, విభజన తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో కర్రీపాయింట్ పెట్టుకుంటే కేసీఆర్ కలెక్షన్ పాయింట్ పెట్టుకుంటారని, సీమాంధ్రలో సమైక్య ఉద్యమాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత కేసీఆర్ కు లేదా అని టీడీపీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

రాజకీయ ప్రయోజనం కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని, కేసీఆర్ రెచ్చగొట్టే వాఖ్యల మూలంగానే సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఎగిసి పడుతుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలను పార్లమెంటు నుండి మార్షల్స్ తో గెంటేయించారని, సస్పెన్షన్ చేసినా వారు సభ నుండి బయటకు వెళ్లలేదని, లోక్ సభలో తాము మాట్లాడే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు.

ఇక్కడ ఇల్లు లేదు.. అక్కడ నోరు లేదు : రేవంత్ రెడ్డి