August 10, 2013

ప్రభావిత వర్గాలతో చర్చించండి
ప్రకటనలో టీఆర్ఎస్ ప్రస్తావన దారుణం
హైదరాబాదే పెద్ద సమస్య
ప్రధాని మన్మోహన్‌కు చంద్రబాబు లేఖ
అపోహలు, భయ సందేహాలేమిటో తెలుసుకోండి
ముందు చర్చించనందు వల్లనే 'విభజన' సెగ
రాజకీయ లబ్ధే కాంగ్రెస్ లక్ష్యం
ఆంటోనీ కమిటీ కూడా అందులో భాగమే
రాజధాని ఉన్న ప్రాంతాన్ని విభజించడమా?
కాంగ్రెస్ సృష్టించిన అనిశ్చితితో రాష్ట్రం నాశనం


ఆంధ్రప్రదేశ్ లో సంక్లిష్ట పరిస్థితులను పరిష్కరించడానికి ప్రధాని మన్మోహన్ తక్షణం జోక్యం చేసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 'ఆర్థికంగా, సామాజికంగా, భావోద్వేగాల పరంగా రాష్ట్రం నాశనం అవుతున్న తీరు చూస్తుంటే బాధ కలుగుతోంది. దేశ ప్రధానిగా మీ భుజస్కంధాలపై నైతిక, రాజ్యాంగపరమైన గురుతర బాధ్యత ఉంది. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి విభజన నిర్ణయంవల్ల తలెత్తిన సమస్యల పరిష్కారానికి మీపైగల బాధ్యతను శిరసావహించండి. ప్రజల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలు, భయసందేహాలను తీర్చి, సంక్లిష్ట సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి దిగండి. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ హ్రస్వదృష్టితో తీసుకున్న నిర్ణయంవల్ల తెలుగువారి మధ్య విద్వేషాలు పెరగకుండా చూడండి. ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తున్న అంశాలేమిటో తెలుసుకొని వాటిపై చర్చించండి. వారి ప్రయోజనాలు కాపాడండి. వారికి న్యాయం చేయండి'' అని శుక్రవారం ప్రధానికి పంపిన లేఖలో విజ్ఞప్తిచేశారు.

అధికశాతం పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపినా అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ దీనిపై నిర్ణయం తీసుకొనేముందు సీమాంధ్ర భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వకపోవడం.. ఆ ప్రాంతాన్ని దిగ్భ్రాంతికి, నిర్వేదానికి, అనూహ్యస్థాయిలో ఉద్యమానికి నెట్టివేశాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, మహిళలు..ఇలా అనేక వర్గాలవారు రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని, రోజురోజుకూ ఉధృతం అవుతున్న ఈ ఆందోళనలపై సకాలంలో స్పందించకపోతే పరిస్థితి చేయిజారే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంవల్ల ప్రభావితమయ్యే వర్గాలతో తొలుత తగినంతగా చర్చలు జరిపి వారి మనోగతం తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం ప్రకటించడమే ఈ సమస్యను సృష్టించిందని పేర్కొన్నారు.

"ఆంధ్రప్రదేశ్ విభజనను మిగిలిన రాష్ట్రాలతో పోల్చలేం. అవి ప్రధాన రాష్ట్రంనుంచి విడివడి ప్రత్యేకంగా ఏర్పడ్డాయి. కాని ఇక్కడ మెజారిటీ ప్రాంత ప్రజలు విధిలేని పరిస్థితుల్లో తాము కొత్త రాష్ట్రంగా ఏర్పడి రాజధానిసహా అన్నీ కొత్తగా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిణామం సీమాంధ్ర ప్రజల మనసుల్లో అనేక భయాలను రేకెత్తించింది. తమ పిల్లల విద్య, ఉద్యోగ అవకాశాలు, హైదరాబాద్‌లో రక్షణ-భవిష్యత్తు అవకాశాలు, నదీజలాల పంపిణీ, కొత్త రాష్ట్రం రూపు దిద్దుకోవడానికి అవసరమైన వనరులు, ప్రస్తుత కార్యక్రమాలకు అవసరమైన నిధులు వంటి వాటిపై వారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వో ద్యోగులు కూడా తమ భవిష్యత్తుపై దిగులుతో ఉన్నారు. ఐదు దశాబ్దాలుగా హైదరాబాద్‌తో తాము పెంచుకొన్న అనుబంధం తెగిపోతుందన్న భావన కూడా సీమాంధ్ర ప్రజల్లో తీవ్ర అశాంతిని రేకెత్తించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారి సమష్టి కృషితో హైదరాబాద్ పురోగమి స్తూ వస్తోంది. తెలుగుదేశం పాలనలో ఇది ఒక ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగింది. పెట్టుబడులు, ఉద్యోగాలు సహా అన్ని అవకాశాలకు కేంద్రంగా మారడంవల్లే దీనిపై ఇప్పుడింత చర్చ జరుగుతోంది.

సాధారణంగా ఒక కుటుంబంలో సమస్య వస్తే.. కుటుంబ పెద్దలు, గ్రామ పెద్దలు ఆ కుటుంబంలో అందరితో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన శాంతియుత పరిష్కారాన్ని కనుగొంటారు. కానీ ఎనిమిదిన్నర కోట్ల మంది ప్రజలున్న రాష్ట్రానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకొనేటప్పుడు సంబంధిత వర్గాలన్నింటితో చర్చించాలన్న తెలివిడి కాంగ్రెస్‌కు కొరవడటమే ప్రస్తుత చిచ్చుకు కారణమైంది' అని విమర్శించారు. ప్రజా కోణంలో కాకుండా రాజకీయ ప్రయోజనాల దృష్టితోనే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసినట్లు కనిపిస్తోందని చంద్రబాబు తన లేఖలో తప్పుబట్టారు. "రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం ప్రకటించే సమయంలోనే.. టీఆర్ఎస్ విలీనం అంశాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రస్తావించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకొన్నదనడానికి ఇదే నిదర్శనం. హైదరాబాద్ ప్రతిపత్తికి సంబంధించి దిగ్విజయ్ సింగ్ రకరకాలుగా చేసిన ప్రకటనలు కూడా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆందోళనలకు కారణమయ్యాయి. 2009లో కాంగ్రెస్ రకరకాలుగా తీసుకొన్న నిర్ణయాలు రాష్ట్రాన్ని అగ్ని గుండంలోకి నెట్టి ఒక ప్రాంతంలో భారీగా యువకులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమయ్యాయి. ఇటీవలి నిర్ణయం మళ్లీ ఆందోళనలు, మరో ప్రాంతంలో ఆత్మహత్యలకు కారణమైంది. శ్రీకృష్ణకమిటీ సహా తనకు అందుబాటులో ఉన్న అనేక రకాల నివేదికలను కేంద్రం అధ్యయనం చేసి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారంతో ముందుకు వస్తే ఈ సంక్షోభం తప్పేది.

ఇంత సున్నితమైన అంశాల్లో గతానుభవాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ పాఠాలూ నేర్చుకోలేదు. కాంగ్రెస్ సరైన రీతిలో వ్యవహరించకపోవడం నాలుగు సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని అనిశ్చితిలో పడవేసి పరిశ్రమలు, పెట్టుబడులు తరలిపోవడానికి, ఉద్యోగావకాశాలు దెబ్బతినిపోవడానికి కారణమైంది. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే' అని ఆయన తేల్చి చెప్పారు. సమస్య తీవ్రతను గ్రహించకుండా కాంగ్రెస్ పార్టీ యదాలాపంగా నిర్లక్ష్య ధోరణితో నిర్ణయాలను ప్రకటించడం..తెలుగు వారి మధ్య ఘర్షణలకు, ద్వేష భావాలకు దారితీసి మొత్తం తెలుగు జాతి పురోగమనాన్నే దెబ్బ తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారంగా కాంగ్రెస్ పార్టీ నియమించిన ఆంటోనీ కమిటీ కూడా ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడానికి ఉద్దేశించినట్లే కనిపిస్తోందని, అందులో సభ్యులంతా ఆ పార్టీవారే కావడం దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకన్నా తన రాజకీయ ప్రయోజనాలే ఆ పార్టీకి మిన్నగా మారాయని, రాష్ట్ర విభజన వ్యవహారాన్ని ఆ పార్టీ తన అంతర్గత వ్యవహారంగా చూస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడం ప్రజా సంక్షేమానికి మంచిది కాదని...ఈ పరిస్థితుల్లో ప్రధాని జోక్యం తప్పనిసరిగా భావించి తాను ఈ లేఖ రాస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు

ప్రధాని గారూ..! చక్కదిద్దండి..తక్షణం రంగంలోకి దిగండి


హైదరాబాద్‌ : తెలంగాణలో టీడీపీకి గట్టి పట్టు ఉందని ఆ పార్టీ నేత, మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తెలిపారు. టీడీపీ పట్ల తెలంగాణ ప్రజల్లో ఆత్మీయతా, అభిమానం ఉందన్నారు. కాంగ్రెస్‌పై సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బలమేమిటో తేలిపోయిందని ఆయన తెలిపారు. సీమాంధ్రలో టీడీపీ గెలుస్తుందన్న భయంతో కాంగ్రెస్‌ ఉందన్నారు. భవిష్యత్‌లో వైకాపా ఉండదన్నారు. కాంగ్రెస్‌లో కలువడం ఖాయమని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ గెలువదు కనుక సీమాంధ్రలో వైకాపాను అడ్డు పెట్టుకొని లబ్ధి పొందాలని కాంగ్రెస్‌ చూస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ, సీమాంధ్రలో రెండు చోట్ల టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

తెలంగాణ, సీమాంధ్రలో రెండు చోట్ల టీడీపీ అధికారంలోకి : యనమల


రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో తలెత్తే సమస్యలను పరిష్కరించాలని ప్రధానికి చంద్రబాబు లేఖ రాశారని, దాని ద్వారా కేసీఆర్ వచ్చే ఇబ్బందేంటని టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి, మోత్కుపల్లి ప్రశ్నించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన కేసీఆర్‌కు ఇష్టం లేదని ఆరోపించారు.

రాష్ట్ర విభజన సమస్యను సాగదీసి వసూళ్ల దుకాణం నడుపుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీయం చేయలేదు కాబట్టే విభజన ప్రక్రియ ఆలస్యమవుతోందని, తెలంగాణ ఏర్పాటు జాప్యానికి ప్రధాన కారకుడు కేసీఆరే అని వారు అన్నారు. అన్నదమ్ముల్లా విడిపోవటమే తమ కోరిక అని ఎర్రబెల్లి, మోత్కుపల్లి పేర్కొన్నారు.

లేఖ ద్వారా కేసీఆర్ వచ్చే ఇబ్బందేంటి? : ఎర్రబెల్లి, మోత్కుపల్లి

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాలని రాష్ట్రపతి, ప్రధానిని బాబు కోరనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత బస్సు యాత్ర ఖరారు కానుంది.

త్వరలో ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు

హైదరాబాద్: మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్టు సమాచారం. ఈమేరకు ఆయన త్వరలో ‘తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన పార్టీ సీనియర్ నేతలతో ఈ విషయమై చర్చించారు.

త్వరలో ‘తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర’!

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరో యాత్రకు సిద్ధపడుతున్నారు. ఆయన ఈసారి బస్సు యాత్ర చేబడుతున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణ యాత్ర అని ఈ యాత్రకు నామకరణం చేయనున్నట్టు తెలుస్తున్నది.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అంతిమ నిర్ణయాన్ని ప్రకటించిన అనంతరం సీమాంధ్రలో తలెత్తిన ఉద్యమాల నేపథ్యంలో ప్రజలు తమ ఆకాంక్షలను వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో ప్రజలలోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తున్నది. చంద్రబాబు నాయుడు రాష్ట్రం నలుమూలలా పర్యటించాలని ఆకాంఘిస్తున్నట్టు తెలుస్తున్నది.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలోని పరిస్థితి చిందరవందరగా మారిపోతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ పెత్తనంతో తెలుగు జాతి అవమానాలను ఎదుర్కొంటున్నదని, గతంలోనూ, ఇప్పుడూ ఇదే పరిస్థితి అని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీ నిర్ణయం వల్ల ఇటు తెలంగాణాలోనూ, అటు రాయలసీమ, కోస్తా ఆంద్ర ప్రాంతంలోనూ ఏం జరగబోతున్నదీ, ఈ నిర్ణయం వల్ల రెండు ప్రాంతాలలోనూ సంభవించబోయే నష్టాలను చంద్రబాబు నాయుడు ప్రజలకు వివరించబోతున్నారు.

చంద్రబాబు ఏ జిల్లాలో పర్యటనలో ఉంటే ఆ జిల్లాకు చెందిన దేశం నాయకులు ఈ బస్సు యాత్రలో పాల్గొంటారు. ఆయన ఇటీవల నిర్వహించిన పాదయాత్ర మంచి ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన బస్సు యాత్ర ద్వారా ఎక్కువ ప్రాంతంలో పర్యటించాలని భావిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రకారం రాష్ట్రాన్ని విభజించమంటే కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రంలో రావణ కాష్టాన్ని సృష్టించిందని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ అంశంపై కాంగ్రెస్ నిర్ణయం వెలువడడంతో నేరుగా ప్రజలలోకి వెళ్లాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. తెలంగాణాపై తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చింది కాబట్టి బస్సు యాత్ర లో కొన్ని చోట్ల కొన్ని గట్టి ప్రశ్నలు రావచ్చునని, అయినా దీని గురించి ఎక్కువగా దృష్టి పెట్టకుండా ప్రజల ఆకాంక్షల గురించే ఎక్కువ మాట్లాడాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయడానికి ముందు ప్రజలతో మాట్లాడి, వారిని కూడా భాగస్వాములను చేసి ఒక విధానాన్ని నిర్మాణాత్మకంగా ప్రకటించవలసి ఉందని చంద్రబాబు నాయుడు అబిప్రాయపడ్డారు. విభజనకు ఒక పద్ధతి ఉంటుందని, ఆ పద్ధతులు పాటించకుండా అంతా హడావుడిగా చేసేశారని ఆయన తీవ్రంగా అసంతృప్తి చెందుతున్నట్టు తెలుస్తున్నది.

రాష్ట్రంలో బస్సు యాత్ర ప్రారంభించడానికి ముందు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి డాక్టర్ మన్ మోహన్ సింగ్‌తోనూ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోనూ సమావేశమై రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించాలనుకుంటున్నారు. వెంటనే రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాలని కూడా ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.

తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణకు రాష్ట్రం నలుమూలలా చంద్ర బాబు బస్సు యాత్ర


రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ కమిటీ అవసరం లేదని, ఆంటోని కమిటీని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తున్నదని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు నర్తకి సెంటర్‌లో తెలుగుదేశం ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర సభలో ఆయన మాట్లాడారు. సరిహద్దుల్లో విఫలమైన ఆంటోని కమిటీ ఆంధ్రరాష్ట్రంలో కూడా విఫలమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కమిటీ అవసరం లేదని, ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కమిటీని వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఆంటోని కమిటీ అంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వర్తిస్తుందని, ఇతర పార్టీలు సమైక్యవాదుల మనోగతం తెలుసుకునే అవకాశం ఉండదని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 75 శాతం రెవెన్యూ తెలంగాణా నుంచి వస్తుందని కేసీఆర్ ఒప్పుకున్నాడని ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో 25 శాతం రెవెన్యూతో సీమాంధ్ర ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు.

ఆంటోని కమిటీ వద్దు: సోమిరెడ్డి