August 6, 2013

సమైక్యాంధ్ర కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో మాగంటి బాబు, అంబికా కృష్ణ, బడేటి బుజ్జిలు నగరంలో ర్యాలీ నిర్వహించి ఫైర్‌స్టేషన్ వద్ద కార్యకర్తలతో బైఠాయించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు మాట్లాడుతూ కాంగ్రెస్, వైసీపీ నాయకులు టీడీపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ర్రాష్టాన్ని విభజించడానికి ఆ రెండు పార్టీలు కారణమైతే తెలుగుదేశమే కారణమని నిందలు వేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ముందుగానే విభజన గురించి తెలిసి ఏమీ జరగటం లేదని ప్రజలను మోసపుచ్చారన్నారు. మాగంటి బాబు కార్యకర్తలను ఉత్సాపరుస్తూ నృత్యాలు చేయడంతో సమైక్యవాదులు ఆకర్షించారు.
ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ అంబికా కృష్ణ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం శాంతియుతంగా చేస్తుంటే కేంద్రప్రభుత్వం పారా మిలటరీ దళాలను దించడం ఎంత వరకు సమంజసమన్నారు. చైనా సరిహద్దుదాటి మన దేశంలోకి చొచ్చుకువస్తుంటే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ఇక్కడ శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే తమపై ఏకె 47లు గురిపెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడేటి బుజ్జి మాట్లాడుతూ ర్రాష్టాన్ని సమైక్యాంగానే ఉంచాలని లేని పక్షం లో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలని, అప్పటి వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. టీడీపీ కార్యకర్తలు, టిఎన్‌టియుసి నాయకులు కరుణకుమార్ ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో వంటావార్పును నిర్వహించి అక్కడే భోజనాలు చేసి నిరసనను వ్యక్తం చేశారు.

టీడీపీ ర్యాలీ, ధర్నా

తెలంగాణ అంశం మంగళవారంనాడు రాజ్యసభను కుదిపేసింది. తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడంతో సభ ఉపాధ్యక్షుడు పీజే కురియన్ ఒక దశలో దేశం ఎంపీ సీఎం రమేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు సోమవారంనాడు కూడా రాజ్యసభలో ఇలాగే నినాదాలు చేయడంతో సభాకార్యక్రమాలు సరిగా జరగలేదు. వరుసగా రెండవ రోజు కూడా ఇలాగే జరగడంతో సభ ఉపాధ్యక్షుడు పీజే కురియన్ అసహనం వ్యక్తం చేశారు.
మీమీద చర్య తీసుకునేవరకూ తెచ్చుకోకండి అని
రాష్ట్ర విభజన అంశం సభలో ప్రస్తావనకు వచ్చినప్పుడు మీరు మీ అభిప్రాయాలను వెల్లడించవచ్చునని సభ ఉపాధ్యక్షుడు తెలుగుదేశం సభ్యులకు నచ్చజెప్పడానికి యత్నించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆంధ్ర ప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ తెలుగుదేశం సభ్యులు సభ మధ్యకు వెళ్లి నినాదాలు కూడా చేశారు. సభ ఉపాధ్యక్షుడు ఇది పద్ధతి కాదని పదేపదే చెప్పి చూశారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదు.
కూడా ఒక దశలో కురియన్ హెచ్చరించారు. అయితే సీఎం రమేశ్, చౌదరి వినిపించుకోలేదు. ఆంధ్ర ప్రదేశ్‌కు న్యాయం జరగాలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడండి అంటూ వారు నినాదాలు చేశారు.

ఆంధ్రకు న్యాయం కావాలంటూ తెలుగు దేశం సభ్యుల నినాదాలు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర రావుపై హత్యా యత్నానికి కొందరు కుట్ర పన్నారని టీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు, ఈటెల చేసిన ఆరోపణలను తెలుగుదేశం నాయకుడు
సోమిరెడ్డి ఆక్షేపించారు. కేసీఆర్‌ను హతమార్చవలసిన అవసరం ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ తమ ఎజెండా మావోయిస్టుల ఎజెండాయేనని అనడాన్ని ఆయన తప్పుపట్టారు. కేసీఆర్ తెలంగాణాలో ఇంటింటికీ లైసెన్సు లేని తుపాకులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర విభ జనపై కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనతో రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంటే ముఖ్యమంత్రి ఇంట్లో ఫిడేలు వాయిస్తూ కూర్చుంటారా అని ఆయన ఎద్దేవా చేశారు. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది అని ఆయన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాలనూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏం మాట్లాడుతారో ఎందుకు మాట్లాడుతారో, ఎప్పుడు ఎక్కడ మాట మార్చుకుంటారో అర్థం కాదని ఆయన మండిపడ్డారు. ఒకరు ఇక్కడేమో పదవులు త్యజిస్తామంటారు, ఢిల్లీ పోగానే మాట మార్చేస్తారు, బొత్స రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటంటారు, తిరుపతి వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని దేవుణ్ణి మొక్కుకున్నానంటారు, మళ్లీ ఆయనే ఢిల్లీ వెళ్లి మీరు ఎలా చెబితే అలా అంటారు ఇదేం పద్ధతి అని సోమిరెడ్డి విరుచుకుపడ్డారు.

కేసీఆర్‌ను చంపవలసిన అవసరం ఎవరికీ లేదన్న సోమిరెడ్డి

తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు సి.ఎమ్.రమేష్, సుజనా చౌదరి లు రాజ్యసభలో ఆందోళనకు దిగడంతో రాజ్యసభ వాయిదా పడింది.జై ఆంధ్ర ప్రదేశ్ అంటూ , తమకు న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు.ఉత్తరాఖండ్ వరదల తర్వాత తెలంగాణ అంశంపై చర్చ తీసుకుంటామని రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ప్రకటించినా ,టిడిపి ఎమ్.పిలు శాంతించ లేదు.దాంతో రాజ్యసభ పదిహేను నిమిషాలపాటు వాయిదా పడింది. కాగా లోక్ సభలో స్పీకర్ విజ్ఞప్తి మేరకు సీమాంధ్ర ఎమ్.పిలు ఆందోళన విరమించారు.వారు. గులాం నబీ అజాద్, చిదంబరంలతో భేటీ అవుతున్నారు.

టిడిపి ఎమ్.పిల నినాదాలు-రాజ్యసభ వాయిదా

తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం ప్రకటించడంతో రాష్ట్ర విభజన ప్రక్రియ ఇక లాంఛనమేనంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదిస్తే విభజన దాదాపు ఖరారైనట్లుగానే భావించవచ్చు. రాజ్యాంగ పరంగా రాష్టప్రతి దానికి ఆమోద ముద్ర వేస్తే విభజన తంతు ముగిసినట్లే. అయితే నిజంగానే రాష్ట్రం అలా విభజన అంటూ జరిగితే తెలుగుదేశం పార్టీ తెలంగాణలోనూ, సీమాంధ్రలోనూ పార్టీ రాష్ట్ర సారధులను అనివార్యంగా నియమించుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అన్ని పార్టీల మాదిరే తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రానికి తన పార్టీ అధ్యక్షుడిగా ఆ ప్రాంత నేతలకే అవకాశం కల్పించాల్సి వస్తుంది. విభజన దాదాపు ఖాయమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి పార్టీ సారధ్య బాధ్యతలను స్వీకరించేందుకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు చాలా ఉత్సాహంతోనే ఉన్నారని సమాచారం.

తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర రావు అయితే మరో ముందడుగు వేసి తానే సీఎంను అవుతానని ప్రకటించేశారు కూడా. ఎర్రబెల్లి విషయం అలా ఉంచితే .. సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింలుతో పాటు పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావుతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ టీడీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వీరిలో ఒక్కో నేతది ఒక్కో విశిష్టత కల్గిన వారే. ఎర్రబెల్లి దయాకరరావునే తీసుకుంటే టీడీపీ తెలంగాణ ఫోరంకు కన్వీనర్‌గా ఉండడమే కాకుండా ఆ ప్రాంత ఎమ్మెల్యేలందరినీ ఒకే తాటిపై నడిపించారు. తెలంగాణ ఉద్యమంలోనూ కేసిఆర్‌ ఆపరేషన్‌ ఆకర్స్‌ వలకు పార్టీ నేతలు చిక్కుకోకుండా పార్టీని, ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ వచ్చారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డినే తీసుకుంటే పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న రేవూరికి తెలంగాణపై పూర్తి అవగాహన ఉంది.

ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణపై తొలి సారి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంకు తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా హాజరయ్యారంటే ఆయనకు పార్టీలో ఎంతటి ప్రాధాన్యత ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇక పోతే ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సాగునీటి రంగంపట్ల పూర్తి అవగాహన ఉంది. ఆయన గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పని చేసిన అనుభవం ఉండడంతో ఆయన్ను తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సారధిగా నియమించవచ్చంటున్నారు. రాష్టాన్ని విభజించడం ద్వారా తలెత్తే జల వివాదాలకు చక్కటి పరిష్కారం చూపించే నాయకుడు ఎవరైన ఉన్నారా? అంటే అది ఒక్క తుమ్మల మాత్రమేనని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక పోతే తెలంగాణ రాష్ట్ర విభజనలో కీలకమైన హైదరాబాద్‌ నుండి కూడా ఇద్దరు నేతలు రేసులో ముందున్నారంటున్నారు. వీరిలో ఒకరు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కాగా.. మరో నాయకుడు తీగల కృష్ణారెడ్డి అని తెలుస్తోంది. మొత్తం మీద అందరూ ఉద్దండులే కావడంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎవరి వైపు మొగ్గు చూపుతారో.. నని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

టీ టీడీపీ సారథి ఎవరు?