July 26, 2013

కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరగనున్న ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థి అంబటి హరిప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నికయేందుకు సహకరించాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు విపక్షనేత చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. సాధారణంగా సిట్టింగ్‌ శాసనసభ్యులు ఆకస్మికంగా మృతి చెందిన సందర్భాల్లో మృతుని కుటుంబ సభ్యులను ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అన్ని రాజకీయ పక్షాలు సహకరించే ఆనవాయితీ రాష్ట్రంలో ఉందన్న విషయం గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తమ దివంగత ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య కుమారుడైన హరిప్రసాద్‌ను తమ పార్టీ తరపున అభ్యర్థిగా నిలుపుతున్న క్రమంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకరించాలని చంద్రబాబు కోరారు. ఆయన పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మీ, సీపీఎం కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ కార్యదర్శి కె. నారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్‌ రెడ్డి, లోక్‌సత్తా అధ్యక్షులు కటారి శ్రీనివాస రావుకు వేర్వేరుగా లేఖలు రాశారు.

అవనిగడ్డ ఏకగ్రీవానికి సహకరించండి...రాష్ట్రపార్టీలకు చంద్రబాబు లేఖ

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ అంశంపై నోరుమెదపవద్దని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణుల్ని ఆదేశించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ ఆడుతున్న నాటకంలో టిడిపి పాత్రధారి కాకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణాపై నిర్ణయం అంటూ ఢిల్లీలో కాంగ్రెస్‌ చేస్తున్న హడావిడిని పట్టించుకోకుండా ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని సాధారణ ఎన్నికలకు సమాయత్తం చేయడంపైనే దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటోంది. తెలంగాణా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చి తద్వారా టిడిపిని ఇరకాటంలో పెట్టాలనే కాంగ్రెస్‌ కుటిల వ్యూహాన్ని చంద్రబాబు ఇప్పటికే అన్ని వేదికలపైనా ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలపై నుంచి టిడిపి దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్‌ ఈ తరహా హడావిడి చేస్తుందనే విషయాన్ని గమనించిన చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని, జరుగుతున్న పరిణామాల్ని గమనించాలే తప్ప మీడియాకు ఎక్కవద్దని చెప్పినట్లు తెలిసింది. మరోవైపు తెలంగాణా అంశంపై మహానాడులో తీర్మానం చేసినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో సీమాంధ్రలో కూడా మెరుగైన ఫలితాలు రావడాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. దానిలో భాగంగానే అన్ని ప్రాంతాల ప్రజలు టిడిపి మనోభీష్టాన్ని అర్ధం చేసుకున్నారని తొలివిడత ఎన్నికలు ముగియగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ హవా తగ్గడం, టిడిపి పుంజుకున్నప్పటికీ కాంగ్రెస్‌ కూడా భారీగానే లబ్దిపొందడాన్ని టిడిపి నేతలు రాజకీయకోణంలోనే విశ్లేషిస్తున్నారు. మరోవైపు సీమాంధ్రలో వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి టిడిపిపై వత్తిడి పెంచే కుట్రనూ పరికిస్తున్నారు. గతంలో తెలంగాణాలో కూడా ఇదే తరహా రాజకీయం నడిచిన విషయాన్ని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ హడావిడికి కంగారు పడాల్సిన అవసరం లేదని, ఆపార్టీ నిర్ణయం ప్రకటించాక ఏం చేయాలనేదానిపై ఆలోచన చేద్దామనే సంకేతాలు రెండు ప్రాంతాల నేతలకు వెళ్లినట్లు సమాచారం.

తెలంగాణా అంశంపై సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నా తెలుగుదేశం పార్టీ మాత్రం గుంభనంగానే ఉంటోంది. రెండు ప్రాంతాల నేతలు ప్రస్తుతం మౌనాన్ని ఆశ్రయించారు. ఇదే అంశాన్ని పార్టీలోని తెలంగాణా ప్రాంతానికి చెందిన ఓ సీనియర్‌ నేతను ప్రశ్నిస్తే 'కందకు లేని దురద కత్తిపీటకెందుకు' ముందు కాంగ్రెస్‌ నిర్ణయం తెలియనివ్వండి అని వ్యాఖ్యానించారు. తెలంగాణాపై పేటెంట్‌ హక్కులు ఉన్నట్లు హడావిడి చేసే టిఆర్‌ఎస్‌ కూడా ఈ అంశపై మౌనంగా ఉండటాన్ని టిడిపి నేతలు గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 'డిఫెన్స్‌'లో పడే పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడేందుకు టిడిపి అధినాయకత్వం వేచిచూసే ధోరణిని అవలంబిస్తోంది.

2009 డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన సందర్భంగా కాంగ్రెస్‌తో పోటీ పడి టిడిపి కూడా ఆందోళనలు నిర్వహించింది. ఈ విషయంలో ఆనాడూ ఇరు ప్రాంతాలకు చెందిన నాయకులకు చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి భిన్నమైన వైఖరిని పార్టీ తీసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుంటే మానవ బాంబులమవుతామంటూ గతంలో కృష్ణా, అనంతపురం జిల్లాకు చెందిన యువ ఎమ్మెల్యేలు సంచనల వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వారు కూడా మౌనంగా ఉంటున్నారు. వస్తున్నా మీ కోసం చంద్రబాబు పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపిందని, అలాంటి పరిస్థితుల్లో విభజన, సమైక్య ఆందోళనలు చేయడం వల్ల నష్టంతోపాటు ఐక్యత కూడా చెడుతుందని టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడొకరు చెప్పారు. అయితే సీమాంధ్రలో వైఎస్‌ఆర్‌సిపి హడావిడిని కట్టడి చేయకపోతే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, క్షేత్రస్థాయిలో ఏదోఒక ఆందోళనలు చేపట్టడమే మంచిదనే అభిప్రాయాన్ని మాజీ మంత్రి గోరంట బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. దీనిపై మెజారిటీ పార్టీ నేతలు మాత్రం ఏకీభవించకపోవడం గమనార్హం.

దేశం గుంభనం టి అంశంపై బాబు ఆదేశం

పంచాయితీ ఎన్నికల తొలిదశ ఎన్నికల ఫలితాలను పరికిస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సైలెంట్ వేవ్ నడుస్తోందా అన్న అభిప్రాయం కలుగుతోంది. ప్రత్యర్ధి పార్టీల వారినే కాకుండా సాక్షాత్తూ ‘దేశం’ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ను సైతం ఈ ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయనటం అతిశయోక్తి కాదు. పల్లెల్లోని ప్రజలు తెలుగుదేశానికి ఓట్లు వేయరు అనే అభిప్రాయానికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలోని అత్యధిక పంచాయితీలు తెలుగుదేశం బలపరచిన అభ్యర్ధులనే సర్పంచ్ లుగా ఎన్నుకోవటం చూస్తుంటే గ్రామీణ ఓటర్లు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారన్న విషయం స్పష్టమవుతుంది. మూడు విడతల ఎకగ్రీవాలను కలుపుకుంటే తొలిదశలో అధికార కాంగ్రెస్ పార్టి తెలుగుదేశం కంటే కేవలం 4 స్థానాలను మాత్రమే అధికంగా గెలుచుకుంది. రాష్ట్రంలోని పది జిల్లాలలో తెలుగుదేశం జయకేతనం ఎగురవేయగా, కాంగ్రెస్ కేవలం 6 జిల్లాలకే పరిమితమయింది. కాగా అందరినీ దిగ్భ్రాంతి కి గురిచేస్తూ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు జిల్లాలకే తనను తాను పరిమితం చేసుకుంది.

మూడు విడతల ఏకగ్రీవాలను కలిపితే కాంగ్రెస్ పార్టీ 2,311 పంచాయితీలను, తెలుగుదేశం పార్టీ 2,307 పంచాయితీలను, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,599 పంచాయితీలను గెలుచుకున్నాయి. కాగా విచిత్రం ఏమిటంటే స్వీప్ చేస్తుందనుకున్న తెలంగాణా రాష్ట్ర సమితి కేవలం 532 పంచాయితీలను మాత్రమే గెలుచుకుని తెలంగాణా లో రెండు జిల్లాల్లో తన ప్రభావాన్ని చాటుకుంది, ఈ ఫలితాలను నిశితంగా పరిశిలిస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అతి తక్కువ కాలంలో పునర్ వైభవాన్ని పొందేందుకు మార్గం సుగమం చేసుకుందన్నది అర్ధమవుతుంది. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీ కి గ్రామీణ వోటర్లు లేరు. అయితే అన్ని అంచనాలను తల్లకిందులు చేస్తూ ఈ తొలిదశ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం కు పల్లెల్లో అనూహ్యంగా పెరిగిన ఆదరణకు నిలువెత్తు దర్పణంలా నిలిచాయి. ఈ సారి పల్లెలు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే నిలుస్తాయి అన్న అంచనాలను సైతం ఈ ఎన్నికలు పటాపంచలు చేసాయి. ఆ పార్టీ మూడవ స్థానంలో మిగిలిపోయింది.

ఇంత ఆకస్మికంగా పల్లెల్లో తెలుగుదేశం పార్టీ కి ఇంతటి గ్రామీణ జనాదరణ పెరగటానికి కారణాలను అన్వేషించేందుకు రాజకీయ పరిశీలకులు కుస్తీలు పడుతున్నారు. ఏడు నెలలపాటు అలుపెరగకుండా చంద్రబాబు చేసిన పాదయాత్ర ప్రభావం పల్లె ప్రజల మీద ఎక్కువగా ఉందన్నది రాజకీయ పండితుల భావన. అలాగే ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకోవటం లో ప్రభుత్వంకంటే వేగంగా చంద్రబాబు స్పందించి బాధితులకు సహాయం అందించిన తీరు కూడా ప్రజల మనస్సుల్లో బలంగా నాతుకుందని విశ్లేషకుల భావనగా తెలుస్తోంది. రెండవ దశ, మూడవ దశ ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇంతే బలంగా వుంటే రానున్న ఎంపిటిసి లు, జెడ్ పి టి సి లు, మునిసిపాలిటీ లలో సైతం సానుకూలంగా వుంటాయనటం లో సందేహం లేదు. ఏది ఏమైనా రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలతో బాటు తెలంగాణా లో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా వుండటం ప్రత్యర్ధి పార్టీలను గందరగోళానికి
గురి చేస్తోంది.

భవిష్యత్తు తెలుగుదేశానిదేనా !