July 23, 2013

'వైసీపీ, టీఆర్ఎస్‌లకు వేసిన ఓటు కాంగ్రెస్‌కి వేసినట్లే లెక్క. రాష్ట్రాన్ని నా శనం చేసిన కాంగ్రెస్‌కు...దాని బినామీ పార్టీలకు ప్రజలు పంచాయితీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. రెండు, మూడు విడతల్లోనూ టీడీ పీ అభ్యర్థులకు ఘన విజయం చేకూర్చాలి' అని రాష్ట్ర ప్రజలకు టీడీపీ చీఫ్ చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత ఫలితాల సరళిని పరిశీలించిన అనంతరం మంగళవారం రాత్రి ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తొలి విడతలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులను గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గ్రామ సీమలపై చూపించిన పరమ నిర్లక్ష్యానికి నిరసనగానే గ్రామీణ ప్రజలు తిరగబడి అధికార కాంగ్రెస్‌ను రాష్ట్రవ్యాప్తంగా పరాజయంపాలు చేశారని చంద్రబాబు స్పష్టం చేశారు. 'తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో పాలనా వ్యవస్థ కుప్పకూలింది. ప్రజలను, వారి కష్టాలను పట్టించుకొనే నాథుడు లేడు. కరెంటు కోతలు, మంచినీటి కొరతలు, పారిశుద్ధ్య సమస్యలతో గ్రామీణ ప్రజలు అల్లాడుతున్నారు.

మూడేళ్లుగా పంచాయితీలకు ఎన్నికలు లేక అక్కడి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితి. ఈ నిర్లక్ష్యంపైనే ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారు' అని పేర్కొన్నారు. రూ. లక్ష కోట్ల ప్రజా ధనం దోచుకొని దాచుకొంది చాలక అధికారమే పరమావధిగా నానా విన్యాసాలు చేస్తూ తల్లి కాంగ్రెస్ పార్టీతో రహస్యంగా అంటకాగుతున్న వైసీపీని ప్రజలు తిరస్కరించి తమ విజ్ఞత చూపించారని ఆయన అన్నారు. వసూళ్లనే ఉద్యమంగా మార్చిన టీఆర్ఎస్‌ను కూడా ప్రజలు తిరస్కరించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 'గాడి తప్పిన పాలనను తిరిగి గాడిలో పెట్టడానికి, గ్రామ స్వరాజ్యాన్ని సాధించడానికి టీడీపీకి అవకాశం ఇవ్వండి. టీడీపీకి వేస్తేనే మీ ఓటుకు సార్థకత లభిస్తుంది.

గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలు. గ్రామీణ వ్యవస్థను బాగు చేసే శక్తి, చిత్తశుద్ధి ఉన్న పార్టీ మాది. మిగిలిన రెండు దశల్లోనూ మాకు మద్దతివ్వండి' అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పాలక పార్టీ అధికార దుర్వినియోగంతోపాటు ఇతర అన్ని పార్టీల ధన బలం, కండ బలాన్ని ఎదుర్కొని మొదటి విడతలో పెద్ద సంఖ్యలో టీడీపీ అభ్యర్థులను గెలిపించిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన రెండు విడతల్లో కూడా ఇదే విధంగా ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచే సి ఇంకా ఉత్తేజపూరిత ఫలితాలు సాధించాలని వారిని కోరారు.

వైసీపీ,టీఆర్ఎస్‌లకు ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టే!మిగిలిన విడతల్లోనూ టీడీపీని గెలిపించండి : బాబు

తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఒకింత మోదాన్ని మరొకింత ఖేదాన్ని మిగిల్చాయి. స్థానిక ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించినా అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి అనే చందాన ఫలితాలు వెల్లడిస్తున్నాయి..ఊహించినట్టుగా పార్టీకి తెలంగాణ జిల్లాల్లో వైఎస్‌ సానుభూతి పనిచేయలేదనే చెప్పాలి. సీమాంధ్రలోనూ మూడు జిల్లాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చినా కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి పోటీనిచ్చింది. కడప, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో మొదటి స్థానంలో నిలిచింది. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కాంగ్రెస్‌ ఉద్ధండుల కోటలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పాగా వేసింది. సీమాంధ్రలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు, విజయనగరం, గుంటూరు, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో ద్వితీయస్థానం సాధించింది. ఇక తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో అనూహ్యంగా 72కు పైగా స్థానాలు కైవసం చేసుకోగా మెదక్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఉనికీని కోల్పోయింది. కాగా రంగారెడ్డి, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వేళ్లపై లెక్కించిదగిన స్థానాల్లోనే విజయం సాధించింది. మొత్తంగా తెలంగాణ జిల్లాల్లో వైఎస్సార్‌ సిపికి సానుభూతి అనుకూలించలేదు. కోస్తాంధ్ర ప్రాంతంలో షర్మిల జరుపుతున్న పాదయాత్ర కానీ, ఆ పార్టీ విజయమ్మ మూడు ప్రాంతాల్లో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులుకానీ ఆ పార్టీకి అనుకున్న విజయాన్ని సాధించిపెట్టలేకపోయాయి. ప్రధానంగా కాంగ్రెస్‌ చీలిక ఓట్లే ఆ పార్టీకి శ్రీరామరక్షగా నిలిచాయి. కాంగ్రెస్‌ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగా లేకపోవటం, వైకాపా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిలను నియమించక పోవటం వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు అందివచ్చిన అవకాశంగా మారింది. మొత్తంమీద రాత్రి 9.30 గంటల వరకు వెలువడిన ఫలితాలను బట్టి ఆ పార్టీకి శ్రీకాకుళంలో 43, విజయనగరంలో 70, విశాఖపట్నంలో 40, తూర్పుగోదావరి జిల్లాలో 56, పశ్చిమ గోదావరిలో 36, కృష్ణా 27, గుంటూరు 59, ప్రకాశం 51, నెల్లూరు 71, చిత్తూరు 94, కడప 110, కర్నూలు 56, అనంతపురం 90, మెహబూబ్‌నగర్‌ 72, మెదక్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒక్క పంచాయతీని కూడా గెలుచుకోలేదు. కాగా రంగారెడ్డిలో 9, నల్లగొండలో 6, కరీంనగర్‌లో 2, వరంగల్‌లో 8, నిజామాబాద్‌లో ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఇవి పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలని, తమ అంచనాల ప్రకారం పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించిందని వైకాపా నేతలు స్పష్టం చేస్తున్నారు.

వైకాపా... వెలవెల!

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్ల పాలననే స్వర్ణయుగమని టీడీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి
రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అన్నా రు. సోమవారం ఆయన కోమాలోకి వె ళ్లిన ఇమామ్ హుస్సేన్ కుటుంబ స భ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వీరారెడ్డి హయాం నుండి ఇమామ్ హు స్సేన్‌కు పలువురితో స్నేహముందని, ఇమామ్ హుస్సేన్ అస్వస్థతకు గురికావడం బాధాకరమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా మద్ధతుదారులే అత్యధికస్థానాల్లో విజయం సాధిస్తారన్నారు.
ప్రస్తుతం కరెంటు కోతలతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, చం ద్రబాబు హయాంలో కరవు కాటకాల్లో కూడా 9 గంటలు విద్యుత్తును అందించారన్నారు. 2014 శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు అధికారం చేపట్టడం తధ్యమని జోస్యం పలికారు. బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ మద్ధతుదారులు ఎక్కువస్థానాలు కైవసం చేసుకుంటారన్నారు.

తెదేపా పాలనే స్వర్ణయుగం

ఎన్నికల కోడ్‌ అతిక్రమించినందుకు గాను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ విషయమై టిడిఎల్పీ ఉప నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు సోమవారం ఎన్నికల కమీషనర్‌ రమాకాంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. తొలివిడత పంచాయతీ ఎన్నికలు మంగళవారం జరుగుతున్న నేపథ్యంలో బొత్స మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఏకగ్రీవ ఎన్ని కల్లో తమ పార్టీదే పైచేయని చెప్పటం ఓటర్లను ప్రభావితం చేసేదిగా ఉందన్నారు. ఎన్నికల నియ మావళిని అనుసరించి ప్రభుత్వపరంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం తగదన్నారు. వరద బాధిత రైతాంగానికి ప్రభుత్వపరంగా ఆదు కుంటామని సబ్సిడీపై విత్తనాలు అందజేస్తామని హామీ ఇవ్వటం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన క్రిందకు వస్తుందన్నారు. ఏకగ్రీవ పంచాయతీలపై విశ్లేషణ జరుపుతూ ప్రభుత్వపరంగా వాగ్దానాలు చేసినందుకు బొత్సపై కోడ్‌అతిక్రమణ క్రింద చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈసీకి టీడీపీ ఫిర్యాదు

మెజార్టీ పంచాయితీల్లో పాగ
వేసేందుకు ప్రయత్నాలు
ఏకగ్రీవాల స్ఫూర్తితో దూకుడు
టీడీపీ హయాంలో స్థానిక
సంస్థల బలోపేతం
సుపరిపాలన `దేశం'తోనే సాధ్యం
 
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం జరగనున్న తొలి విడత పంచా యితీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెల్చుకు నేందుకు తెలుగుదేశం పార్టీ పావులు కదుపు తోంది. పంచాయితీ ఎన్నికలను మొదటి నుండి ఆ పార్టీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. మూడు దశల్లో జరిగే పంచాయితీ ఎన్నికల్లో అందివచ్చే ఎటువంటి అవకాశాలను జారవిడుచుకోవద్దని టీడీపీ నాయ కత్వం భావిస్తోంది. పంచాయితీ ఎన్నికల్లో విజ యం ద్వారా పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపాలని అధినేత చంద్రబాబు యోచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక పంచాయితీల్లో పాగ వేసేందుకు అవలంభించాల్సిన వ్యూహంపై ఇప్పటికే ఆయన ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే సుపరిపాలన అందించే బాధ్యత తానే తీసుకుం టానని ఇప్పటికే చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడు తూ స్థానిక సంస్థల బలోపేతానికి టీడీపీ ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో సర్పంచ్‌లకు 64 అధికారాలు కట్టబెడితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వారి వద్ద నుండి 58 అధికారాలను లాగేసుకుందని విమర్శించారు. సర్పంచ్‌లకు నిధులు, విధులిచ్చి పల్లెసీమల అభివృద్ధి టీడీపీ అంకితభావంతో పని చేసిందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడం వల్లే పల్లెలిప్పుడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించక పోవడం వల్ల పల్లెసీమల అభివృద్ధిని పట్టించు కున్న నాథుడే లేరని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్న బాబు, వీధుల్లో విద్యుత్‌దీపాలు, పారిశుధ్య సమస్యలు సైతం తీవ్రరూపం దాల్చాయని మండిపడ్డారు.

ఈసారి పంచాయితీ ఎన్నికల్లో నిజాయితీప రులు, సమర్ధులైన అభ్యర్థులను గెలిపించాలని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు. సమర్థులను ఎన్నుకోవడం ద్వారానే గ్రామాభివృద్ధి సాధ్యమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పోలింగ్ జరగనున్న పంచాయితీల్లో సత్ఫలితాలు సాధించేందుకు టీడీపీ నాయకత్వం వ్యూహాత్మ కంగా అడుగులు వేస్తోంది. పోలింగ్ జరగనున్న గ్రామాల్లో ఆయా ప్రాంతాల ముఖ్యనేతలను ఇప్పటికే మొహరించారు. అభ్యర్థుల తరుపున అన్ని తామై అయి వ్యవహరించాలని ఆదేశించారు. పార్టీ ప్రకటించిన ఎస్సీ, బీసీ, రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల వంటి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఎన్నికలకు ముందే జరిగిన ఏకగ్రీవాల్లో అత్యధిక స్థానాలు గెల్చుకున్న టీడీపీ, మూడు దశల్లో జరగబోయే ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ఊవ్విళ్లూరు తోంది. ఏకగ్రీవాలపై ఎవరి వాదన ఎలా ఉన్నా అధికార కాంగ్రెస్ పార్టీకి, టీడీపీ ధీటైన జవాబిని చ్చిందనీ రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అధికారం అండతో కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాల్లో అత్యధిక స్థానాలు గెల్చుకోగలిగినా, టీడీపీ సైతం ధీటుగా 736 స్థానాలు గెల్చుకు న్నతీరును బట్టే మూడు దశల్లో జరగనున్న ఎన్నికల పరిస్థితిని విశదీకరిస్తోందని వ్యాఖ్యాని స్తున్నారు. పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నువ్వా, నేనా అన్నట్లు తలపడడం ఖాయమని వారు పేర్కొంటున్నారు. స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలు కావడంతో స్థానిక అంశాలు సైతం గెలుపుకు దోహదం చేస్తాయంటూనే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాలు గెలవగలితే ఆ పార్టీల మనోస్థైర్యం రెట్టింపుకావడం ఖాయమని పేర్కొంటున్నారు. రెండు దఫాలుగా అధికారానికి దూరమైన టీడీపీ నాయకత్వం పంచాయితీ ఎన్నికల పునాదులపైనే రానున్న సాధారణ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరగనున్న తొలి దశ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పరిశ్రమిస్తోంది.

`దేశం` నజర్