July 12, 2013
రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆచితూచి వ్యవహరించాలని, వేచి చూసే ధోరణిని అవలంబించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతలకు సూచించారు. ఉభయ ప్రాంతాల నేతలకు ఈ మాట చెబుతూనే ప్రత్యేకించి సీమాంధ్ర నేతలకు మరి కొంత గట్టిగా చెప్పినట్లు సమాచారం. "ఏం జరుగుతుందో...కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చూద్దాం. తొందరపడి ప్రకటనలు ఇవ్వవద్దు. రెండు వైపులా కూడా సంయమనంతో ఉండండి'' అని వారికి సూచించారు. కొన్ని ఇబ్బందులు ఉన్నా ఓపిక పట్టాలని, కాంగ్రెస్ వలలో చిక్కుకుపోవద్దని చంద్రబాబు పార్టీ నేతలకు జాగ్రత్తలు చెప్పారు. కాగా వర్కింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం చెబుతామనడం కాంగ్రెస్ నాన్చుడు వైఖరికి నిదర్శనమని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు ధ్వజమెత్తారు.
కోర్ కమిటీలో ఏం నిర్ణయం తీసుకొన్నారో దానిని బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. అదే నిర్ణయాన్ని వర్కింగ్ కమిటీలో పెట్టి ఆమోదం తీసుకోవాలని సూచించారు. కాగా,ముఖ్యమంత్రి, పిీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రితో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకొన్న తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో మాట్లాడేదేముందని టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా నాన్చుడు వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన బాధ్యతను విస్మరించి రెండు వైపులా నిప్పు రాజేసి నాటకం ఆడుతోందని టీడీపీ సీమాంధ్ర నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లోనే ఐదు రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. విభజన చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు హెచ్చరించారు. గతంలో కంటే ఉద్యమాలు ఉగ్రరూపం దాలుస్తాయని ఆయన గుంటూరు జిల్లా నరసరావుపేటలో వ్యాఖ్యానించారు.


మౌన ముద్రలో టీఆర్ఎస్
కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ ముగిసిన తర్వాత దిగ్విజయ్ చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ నుంచి అధికారికంగా ఎటువంటి స్పందన రాలేదు. ప్రస్తుతానికి తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఉండటానికే పరిమితం కావాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరో నాలుగైదు రోజులు వేచి చూసే ధోరణితో ఉంటారని తెలుస్తోంది. కాగా, శుక్రవారం ఎడతెరిపి లేని వర్షం కారణంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన మనవడి జన్మదిన వేడుకల వేదికను మెదక్ జిల్లాలోని తన ఫామ్ హౌస్ నుంచి నగరంలోని ఒక హోటల్‌కు మార్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

ఎవరు మాట్లాడొద్దు..సంయమనంతో ఉండండి పార్టీనేతలకు చంద్రబాబు ఆదేశం

బాబు + మోడి = 25
ఉభయ పార్టీలలో అంచన
అంతర్గత సర్వేల ప్రభావం
ఆ దిశగా ప్రయత్నాలు?
థర్‌‌డ ఫ్రంట్‌లోకి వైకాపా చేరుతుందన్న భయం
ఎన్డీఏలోచేరితే గెలుపు తథ్యమన్న అంచనా?
25 ఎంపీ సీట్లు గెలువ వచ్చన్న వ్యూహం

  రాజకీ యాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువు లు అంటూ ఉండరు...ఇప్పటికి అనేక సందర్భాలలో ఇది రుజువైంది. గతంలో భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టి, ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు చెట్టాపట్టాలు వేసుకు తిరిగిన తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత కమలనాథులకు కటీఫ్ చెప్పేసింది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవటం కోసం తెలుగుదేశం పార్టీ పంథా మారనున్నదా?. గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్రమోడీ ప్రచార సారథిగా సార్వత్రిక ఎన్నికల సమర శంఖారావం పూరించిన భారతీయ జనతా పార్టీతో మళ్ళీ దోస్తీకి చంద్రబాబు ప్రయత్నించి సఫలమవుతారా?...అదే జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్, వైకాపా భారీగా దెబ్బ తిని తద్వారా తెలుగుదేశం పార్టీలబ్ధి పొందనున్నదా? ఈ వ్యూహం ఫలిస్తే రెండుపార్టీలు కలిపి కనీసం 25 లోక్‌సభ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయా?... దేశ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలు జరిపిన సర్వేలు, ఇటు టీడీపీ, అటు బీజేపీ అంతర్గతంగా జరిపిన సర్వేలు ఈ దోస్తీపై సంకేతాలు ఇస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమి యూపీఏ కూటమి కన్న కాస్త ముందంజలో ఉంటుందని ఇప్పటికి అనేక సర్వేలలో తేలింది. అయితే ఈ తేడాను మరింత పెంచుకోవాలంటే దక్షిణాదిలో కీలకమైన రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో గట్టి పునాది పడాలన్న వ్యూహంతో బీజేపీ నాయకత్వం పని చేస్తున్నట్టు సమాచారం. అందుకోసం తెలుగుదేశం పార్టీ నాయకత్వం కనుక కలసి వస్తే అది ఉభయత్రా లాభసాటిగా ఉంటుందన్న ప్రతిపాదనలు రెండు పార్టీలలోనూ కాస్త వేగంగానే ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది.

ఉభయత్రా లాభమే
ఒకవేళ ఈ ప్రతిపాదన వాస్తవరూపం దాలిస్తే అటు తెలుగుదేశం పార్టీ, ఇటు బీజేపీ సైతం లాభపడే సూచనలున్నాయంటున్నారు. ఎన్నికలలో స్థానాలు సాధించేంత స్వంత బలం అంటూ లేకపోయినా అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం దాకా ప్రతి నియోజకవర్గంలోనూ భారతీయ జనతాపార్టీకి అంతో ఇంతో కార్యకర్తల బలం ఉంది. గత శాసనసభ ఎన్నికలలో పోటీ చేసిన అన్ని స్థానాలలో కనీసం మూడు నుంచి నాలుగు వేల వోట్ల వరకూ బీజేపీ చీల్చగలిగింది. తెలుగుదేశం పార్టీ అనేక స్థానాలలో అదే తేడాతో ఓటమిపాలయింది. ఒకవేళ రెండు పార్టీలూ కలసి సార్వత్రిక ఎన్నికల సమరంలోకి దిగితే ఎలాగ ైనా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరాలన్న చంద్రబా బు ఆకాంక్ష, కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వం లో ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకురావాలన్న బీజేపీ కోరికా నెరవేరుతాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

లెఫ్ట్‌తో లాభం లేదు
గత ఎన్నికలలో వామపక్షాలు, టీఆర్ఎస్‌తో కలిపి మహాకూటమిగా బరిలోకి దిగినప్పటికీ తెలుగుదేశం పార్టీకి కాలం కలసి రాలేదు. ఈ అనుభవం ఆధారంగా వామపక్షాలతో కలసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తే ఫలితం ఉంటుందన్న విశ్వాసం తెలుగుదేశం పార్టీలో చాలామందికి కలగటం లేదంటున్నారు. రాష్ట్రం మొత్తంలో వామపక్షాల బలం కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం కావటం, తమకు బలం ఉన్న చోట ఆ పార్టీ నేతలే పోటీ చేయటం, మిగిలిన చోట్ల వామపక్షాల నుంచి అందాల్సిన సహకారం అందకపోవటం వంటి అనుభవాలు టీడీపీ నాయకత్వానికి గతంలో ఎదురయ్యాయి. అలాంటప్పుడు వామపక్షాలతో దోస్తీ చేసి కొన్ని స్థానాలు పోగొట్టుకోవటం ఎందుకన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో కలుగుతున్నట్టు తెలుస్తోంది.

కూటమిలో వైకాపా చేరితే?...
అన్నిటికీ మించి వైకాపా జాతీయ రాజకీయాలలో ఎటువైపు మొగ్గు చూపుతుందన్నది టీడీపీ నాయకత్వం ముందున్న మరో అనుమానం....చిట్ట చివరి సమయంలో వైకాపా ఎటు తిరిగీ కాంగ్రెస్‌కే జై అంటుందన్న అభిప్రాయాలు, వ్యాఖ్యలు ఈ నిముషం వరకూ ఉన్నప్పటికీ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఏమాత్రం మెరుగు పడకపోతే, ఆ పరిస్థితిలో వైకాపా తృతీయ కూటమి లేదా ఫెడరల్ ఫ్రంట్ వైపు దృష్టి సారిస్తే ఇక తమ పరిస్థితి రెంటికీ చెడిన రేవడి అవుతుందన్న అభిప్రాయం, అనుమానాలు టీడీపీలో వ్యక్తమవుతున్నట్టు చెబుతున్నా రు. ఆకూటమిలో వైకాపా ఒకవేళ నిజంగా చేరితే ఎట్టి పరిస్థితిలోనూ టీడీపీ అటువైపు కన్నెత్తి చూసే ప్రసక్తే ఉండదు. అలాంటప్పుడు నరేంద్ర మోడీ ప్రచార సారథిగా ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి వైపు అడుగులు వేస్తే రాష్ట్రంలో అధికారంలోకి రావటంతో పాటు కనీసం 25 లోక్‌సభ స్థానాలు గెలుచుకునేందుకు అవకాశం ఉంటుందన్నది ఒక వ్యూహం అంటున్నారు.

గడచినదంతా గతం...
బీజేపీ మతతత్వ పార్టీ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనేక సందర్భాలలో విమర్శలు చేయటం, తెలంగాణ విషయం వచ్చేసరికి చంద్రబాబు అడ్డుకోవటం వల్లనే అప్పట్లో రాష్ట్రం ఇవ్వలేకపోయామని బీజేపీ నాయకత్వంఎదురుదాడికి దిగటం వంటివన్నీ చాలా కాలం నుంచీ సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు జరగటానికి ఇక ఎనిమిది, తొమ్మిది మాసాల గడువు ఉన్న స్థితిలో దేశ వ్యాప్తంగా రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వెళ్ళటం, మమతా బెనర్జీ చొరవ తీసుకుని ఫెడరల్ ఫ్రంట్ లేదా తృతీయ కూటమిఅంటూ కొత్త నినాదం లేవదీయటం, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ కొత్త మిత్రులను ఎంపిక చేసుకునే పనిలో పడటం వంటివి ఎప్పటికప్పుడు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఇదే పరిస్థితి రాష్ట్రంలోనూ సంభవించే అవకాశాలు ఉన్నాయా?....రాష్ట్ర విభజన అంశంపై రెండు రోజుల్లో కాంగ్రెస్ వైఖరి ఏమిటో బయటపడనుండటం, వైకాపా దోస్తీ ఎటువైపు అనేదానిపై చర్చలు సాగుతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అనుసరించనున్న వ్యూహం ఏమిటన్న దానిపై ఆసక్తికర చర్చకు తెర తీసినట్టయింది. అన్ని పరిస్థితులనూ జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ జట్టు కడితే రెండు పార్టీలకు లబ్ధి చేకూరుతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తంఅవుతున్నాయి.

లెఫ్‌‌టతో లాభం లేదన్న భావనలో టీడీపీ

తెలుగుదేశం పార్టీలో ఊహాగానాల జోరు
విభజన రాద్దాంతం నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ
వ్యూహరచనలో అంతర్గత విభాగం


 
రాష్ట్ర విభజన అనివార్యమని ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పోటీ చేయనున్న నియోజవకవర్గంపై ఉత్కంఠ నెలకొంది. ప్రత్యేకించి బాబుతో పాటు తనయుడు నారా లోకేష్ సాధారణ ఎన్నికలలో పోటీ చేస్తే విషయమై పార్టీలో సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రం సమైక్యంగా వున్న పక్షంలో చంద్రబాబు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నుంచే తిరిగి పోటీ చేసే అవకాశాలు వున్నాయని పార్టీ వర్గాల అంచనా.

రాష్ట్ర విభజన జరిగిన పక్షంలో రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే యోచనలో వున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. రాయల తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన పక్షంలో అనంతపురం జిల్లా హిందూపూర్ నియోజవర్గం నుంచి పోటీ చేయాలన్నది చంద్రబాబు యోచనగా భావిస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజవకవర్గం నుంచి చంద్రబాబు లేదా తనయుడు నారా లోకేష్ పోటీ చేసేందుకు దాదాపు రంగం సిద్దమైంది. ముందస్తు వ్యూహంతో వున్న టి.డి.పి. అధినేత ఎప్పడు ఎన్నికలు వచ్చినా మూడు నియోజకవర్గాలలోనూ పార్టీ బలీయంగా వుండేలా జాగ్రత్త పడుతున్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పార్టీకి గట్టి పునాది వుంది. ఫలితంగానే నారా కుటుంబం నుంచి ఒకరు పోటీ చే యడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు శేరిలింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని మదీనాగూడ ఫాంహౌస్ వద్ద చంద్రబాబు ఇంటిని నిర్మిస్తున్నట్టుగా సమాచారం. నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌లు పోటీ చేసే అవకాశాలున్నందువల్లనే కుప్పం, శేరిలింగంపల్లి, హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అంతర్గత చర్చలు జరుగుతున్నాయి.

తెలుగుదేశం పార్టీలోని ఐ.టి. విభాగం ఇందుకు సంబంధించి మూడు న ఇయోజకవర్గాల నుంచి నిరంతరం సమాచారం సేకరించే పనిలో నిమగ్నమై వుంది. ఆయా నియోజవర్గ నాయకులతో, పార్టీ శ్రేణులతో నిరంతరం టచ్‌లో వుంటున్న ఐ.టి. విభాగం టి.డి.పి.కి అనుకూల, ప్రతికూల అంశాలను బేరీజు వేస్తోంది. అవసరమైన పక్షంలో దిద్దుబాటు చర్యలకు దిగే పనిలో నిమగ్నమై వుంది. పార్టీ శ్రేణులతోనే కాకుండా రాజకీయాలతో సంబంధం లేని సగటు ఓటర్లతో సైతం చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు పోటీ చేస్తే పరిస్థితి ఎలా వుంటుందనే దిశగా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఐ.టి. విభాగం మూడు నియోజకవర్గాల కేడర్‌తో నిరంతరం సత్సంబంధాలు కొనసాగిస్తుండడం ఆ పార్టీలో నూతన ఉత్సాహం ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినా, సమైక్యంగా వున్నా శేరిలింగంపల్లి, కుప్పం నియోజకవర్గాలు నారా కుటుంబం ఖాతాలోకి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా రాయల తెలంగాణ ఏర్పడితే అనంతపురం జిల్లాలోని హిందూపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే యత్నాలకు ప్రత్యేక కారణాలు వున్నాయి. అక్కడ నుంచి విజయం సాధించిన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్థానికంగా హిందూపూర్‌లో పార్టీకి పటిష్టమైన పునాదితో పాటు విజయావకాశాలు సంపూర్ణంగా వుండటం బాబు పోటీ చేయాలనే యోచనకు దారి తీసిందని అంటున్నారు.

గత సాధారణ ఎన్నికలలో హిందూపూర్ లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు రెండింటినీ టి.డి.పి. గెలుచుకుంది. అదే విధంగా పార్టీ బలంగా వున్న నియోజకవర్గాలలో రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఒకటి. స్థానిక పార్టీ నాయకత్వం ఈ నియోజకవర్గం నుంచి నారా లోకేష్‌ను పోటీ చేయాల్సిం దిగా కోరడం జరిగింది.కాగా బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం ప్రజలతో నారా లోకేష్ మమేకమయ్యారు. నియోజకవర్గం సమస్యలపై దృష్టి సారించిన లోకేష్ స్థానికంగా మంచి పట్టు సంపాదించారు. ఇప్పటికే తెలుంగాణ, సీమాంధ్రప్రదేశ్, రాయల తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం జరగ నప్పటికీ ముందస్తు వ్యూహరచనలో తెలుగుదేశం పార్టీ ఐ.టి. విభాగం మాత్రం లక్ష్య సాధనలో భాగంగా తన ప్రక్రియను వేగవంతం చేసింది.

శేరిలింగం పల్లి బరిలో బాబు

చూస్తుంటే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుడి తిరిగిపోతున్నట్లే కనిపిస్తుంది. గతం కంటే కాస్త భిన్నంగా వ్యవహరిస్తూ.. అనవసర విషయాల జోలికి వెళ్లకుండా.. ప్రజాసమస్యలపై ఫోకస్ పెంచుతూ పరిస్థితికి తగ్గట్లు వాయువేగంతో స్పందిస్తూ.. ప్రజల గుండెల్లో సరికొత్త ఇమేజ్ ను ప్రింట్ చేసుకుంటున్నారు. ఇందులో మొదటిగా చెప్పాల్సి వస్తే.. ఉత్తరాఖండ్ ఎపిసోడ్. వరదల్లో చిక్కుకుపోయిన వారిని ఏ రాష్ట్రం వారు.. ఆ రాష్ట్రం వారు రక్షించుకొని పోవటం తప్పించి వేరే వాళ్లను పట్టించుకోలేని పరిస్థితి. ఇక.. తెలుగోళ్ల పరిస్థితి అయితే మహా ఘోరం. కిరణ్ సర్కారుకి ఉత్తరాఖండ్ బాధితులు అస్సలు పట్టలేదు. దీంతో అల్లాడిపోతున్న తెలుగువాళ్లకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ఆదుకొని.. వారి కష్టాలు విని.. సానుకూలంగా స్పందించి.… వారంతా ఇళ్లకు చేరటానికి వీలుగా ఫ్లెయిట్లు బుక్ చేసి మరీ క్షేమంగా ఇంటికి చేర్చారు. ఏదో ప్రచారం కోసం అన్నట్లు కాకుండా.. బాధితులను ఆదుకునేందుకు బాధ్యతతో వ్యవహరించటం... అధికారపక్షాన్ని సైతం ఆకట్టుకుంది. ప్రభుత్వం కూడా చేయలేని పనిని.. బాబు అధికారంలో లేకపోయినా నడిపించటమే కాకుండా.. తనకున్న పరిచయాలను పూర్తిగా ఇన్ వాల్వ్ చేసి.. తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

ఇక.. రీసెంట్ గా సికింద్రాబాద్ లోని సిటీలైట్ హోటల్ కుప్పకూలిపోతే..సీఎం స్థాయి వ్యక్తి వచ్చి నాలుగు నిమిషాలు ఉండేందుకు నొప్పులు పడిపోతుంటే.. అందుకు భిన్నంగా చంద్రబాబు వ్యవహరించి బాధితులకు గుండెధైర్యం చెప్పి.. వారిని ఆదుకునేందుకు కొంత సమయం ఖర్చు చేయటం,బాధితుల్లో కొండంత భరోసాను నిలపటం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఇక.. ఐఐటీల్లో రాష్ట్ర విద్యార్థులు చేరేందుకు కొత్త విధానం వేలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తును గండి కొడుతూ.. కేంద్రమంత్రి కపిల్ సిబల్ తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల తీవ్ర ప్రభావితం అయి దెబ్బ తినేది రాష్ట్ర విద్యార్థుల మీద. దీని గురించి కూడా బాబు స్పందించి.. ఇప్పుడు అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టటమే కాదు.. విద్యార్థుల కెరీర్ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అందరూ స్థానిక రాజకీయాల్లోనూ. తెలంగాణ గురించి నిత్యం తలలు బద్దలు కొట్టుకుంటూ ప్రజలను పట్టించుకోకుండా ఉంటే.. బాబు మాత్రం ప్రజల కష్టాలను తీర్చేందుకు పెద్ద పీట వేస్తూ ముందుకు దూసుకెళుతున్నారు.

జనం గుండెల్లోకి దూసుకుపోతున్న బాబు..

దోషూలుగా రుజువైన నాటి నుండే
ప్రజాప్రతినిధులను అనర్హులుగా చేయాలి
పేదరికానికి ప్రధాన అడ్డంకి అవినీతే
తెలంగాణపై చెప్పాల్సింది చెప్పాం
ఢిల్లీ అఖిలపక్షం, మహానాడు, పార్టీ ప్రాంతీయ సదస్సుల్లోనూ చెప్పాం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు


  నేర చరితులపై సుప్రీం కో ర్టు వెలువరించిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని టీడీ పీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దోషులుగా రుజువైన రోజు నాటినుండే ప్రజాప్రతినిధులను అనర్హులు గా చేయాలని ఆయన పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన వారికి రక్షణలు ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించడాన్ని అందరూ హర్షిస్తున్నారన్నారు. దోషులుగా రుజువైన రోజు నే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంతటి వారిపై అయినా సరే అనర్హత వేటు వేయాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. అవినీ తి రహిత సమాజం కోసం కోర్టులు కూడా తమ వంతుగా కృషి చేస్తున్నాయని చంద్రబాబు నాయుడు అభినందిం చారు. గురువారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసమర్ధ, అవినీతి పాలన వల్ల దేశం నిర్వీర్యమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశా రు. రాజకీయాల్లో దోచుకుని దాచుకునే వారు ఎక్కువ య్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి రహిత సమాజం కోసం పాటు పడాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలి స్తున్నారని చెప్పారు. అన్నా హజారే వంటి వారు అవినీతి వ్యతిరేక పోరాటం చేశారని, విలువలతో కూడిన సమాజం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయప డ్డారు. కొంతమంది స్వార్థపరుల వల్ల రాజకీయాలు కలుషి తమయ్యాయని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పేదరికానికి ప్రధాన ఆడ్డంకి అవినీతేనని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అవినీతి విచ్చల విడిగా పెరిగి పోయిందన్నారు. నేరస్తులు, దోపిడీ దొంగలు రాజకీయాల్లోకి రావడంతోనే విలువలు తగ్గిపోతున్నాయ న్నారు. కోర్టులు, కాగ్, సీవీసీ, సీబీఐ లాంటి వ్యవస్థలు క్రి యాశీలకంగా పని చేస్తున్నాయని చంద్రబాబు నాయుడు అభినందించారు. దురదృష్ణ వశాత్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వీటిని నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతోంద న్నారు. రూ. 500, వెయ్యి నోట్లను రద్దు చేయాలని తాము గతంలో చెప్పామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ల్యాండ్, శాండ్, లిక్కర్ ఇలా అన్నింటిలోనూ అవినీతి పెచ్చరిల్లుతోందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

రాజకీయ పార్టీలు క్రియాశీలకంగా ఉండాలన్నారు. మారిన పరిస్థితులకు ఆనుగుణంగా చట్టాలకు పదును పెట్టాలని, అప్పుడు భారత్ ప్రపంచ అగ్రదేశాల సరసన నిలబడుతుందని ఆయన పేర్కొన్నారు. నేర చరిత్రను గుర్తు చేసుకుంటే.. పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదే శం పార్టీకి కనీసం పోటీ చేసేందుకు కూడా ఎవ్వరూ ముం దుకు రాని పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితి ఎందుకువ చ్చిందంటే అక్కడ జరిగినన్ని హత్యలు, దోపిడీలు, నేరాలు నాకు తెలిసి రాష్ట్రంలో మరెక్కడా జరిగి ఉండక పోవచ్చన్నారు.

రాజకీయాలకు రిటైర్‌మెంట్ అవసరం లేదు
కాగా, రాజకీయాలకు రిటైర్‌మెంట్ వయస్సు అంటూ ఏదీ లేదన్నారు. అమెరికన్లు 75 సంవత్సరాలు వచ్చే వరకు రాజకీయాల్లో రాణిస్తునే ఉన్నారన్నారు. పని చేయడం ఒక కల్చర్‌గా మారితే వయస్సుతో పనేం ఉటుందన్నా రు. అయితే, యువతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

అభివృద్ధిలో బీహార్ కంటే వెనుకే..
అభివృద్ది విషయంలో బీహార్ కంటే ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడిపోయిందని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఎన్నో పనుల చేశామ న్నారు. పంచాయతీలకు నిధులు, విధులు, అధికారాలు ఇచ్చామని, ప్రజల వద్దకు పాలన తీసుకు వెళ్లామన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు.

తెలంగాణపై ఇప్పటికే చెప్పాల్సింది చెప్పాం

తెలంగాణ అంశంపై ఢిల్లీలో కోర్ కమిటీ భేటీ నేపథ్యం లో విలేకరులు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించా రు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ప్రాంతాల వారీగా మోహరిం చారు. మీరు ఏమైనా చెప్పదల్చుకున్నారా? అన్న ప్రశ్నకు బాబు సూటిగా సమాధానం చెబుతూ తాము చెప్సాల్సింది చాలా స్పష్టంగా ఢిల్లీ అఖిలపక్షంలో చెప్పాం, ఆ తర్వాత పా ర్టీ ప్రాంతీయ సదస్సులు, మహానాడులోనూ చెప్పాం. వా రు ఏంచేస్తారో చూడాలిని చంద్రబాబు అన్నారు.

నేర చరితులపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: బాబు

రానున్న సాధారణ ఎన్నికలలో అధికార సాధన దిశగా అడుగులు వేస్తున్న తెలుగుదేశం పార్టీ మూడు దశలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. సహకార ఎన్నికలలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలకు దిగిన పార్టీ నాయత్వం సాధారణ ఎన్నికలకు ముందే పటిష్టమైన పునాది వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలే ప్రాంతీయ సదస్సులను నిర్వహించిన బాబు పార్టీకి జవసత్వాలు కలిగించారు. మరో అడుగు ముందుకు వేసి శాసన సభ్యులకు, నియోజకవర్గాల ఇంచార్జిలకు లక్ష్యాలను నిర్దేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ సర్పంచ్ స్థానాలు దక్కేలా చొరవ తీసుకున్న వారికి టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు చేసిన ప్రకటన సత్ఫలితాలు రాబట్టేలా కనిపిస్తోంది.

పార్టీలో ఉత్సాహం కలిగించిన చంద్రబాబు ఇటీవలే తెలంగాణ ప్రాంతంలోని రంగారెడ్డి, వరంగల్ జిల్లాలలో ప్రాంతీయ సదస్సులను నిర్వహించారు. అదే విధంగా రాయలసీమ సదస్సును తిరుపతిలో, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సదస్సును విశాఖపట్నంలో, కోస్తాంధ్ర జిల్లాల సదస్సును విజయవాడలో నిర్వహించి పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. నాయకులు, కార్యకర్తలలో రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోరాదని, వచ్చే సా«ధారణ ఎన్నికలకు రెఫరెండంగా సర్పంచ్, ఎం.పి.టి.సి, జడ్.పి.టి.సి, జిల్లా పరిషత్, మునిసిపల్ ఎన్నికలను పరిగణించాలని పేర్కొన్నారు. కాగా ఇటీవలే ముగిసిన సహకార ఎన్నికలలలో పార్టీ పరంగా సీరియస్‌గా తీసుకోని ఫలితంగానే చేదు అనుభవం ఎదురైందని బాబు అంచనాకు వచ్చారు. ప్రతి నియోజకవర్గంలో అరవై శాతానికి తగ్గకుండా తెలుగు దేశం పార్టీ సర్పంచ్ పదవులు దక్కించుకోవడం చారిత్రక అవసరం అని నొక్కి చెబుతున్న చంద్రబాబునాయుడు ఆ దిశగా ఫలితాలు రాబ ట్టేందుకు కేడర్‌ను పురమా యించారు.

నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడంలో సఫలీకృతం కావడం తథ్యమని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత రానున్న సాధారణ ఎన్నికలలోనూ విజయబావుటా ఎగురవేయడం ద్వారా అధికారంలోకి రావడం ఖాయమనే ధీమాతో వున్నారు. జులై నాలుగు అనంతరం తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలోనూ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి అనుసరిస్తున్న విధానాలను బట్టి వ్యూహం మార్చే దిశగా చంద్రబాబు పయనిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి నిర్వహించిన సభ విజయవంతం కావడాన్ని స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమీక్షించారు. తాము కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదనే సంకేతాలను పార్టీ శ్రేణులకు ఇచ్చారు. అదే విధంగా ఈ సందేశాన్ని నిర్మాణాత్మకంగా ప్రజలలోకి, గామీణ ప్రాంతాలలోకి తీసుకువెళ్ళాల్సిందిగా హితబోధ చేశారు.

మెజారిటీ స్థానాలను గె లిస్తేనే సాధారణ ఎన్నికలకు మంచి పునాది ఏర్పడుతుందని చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో నిరంతరం వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో టి.ఆర్.ఎస్. విలీనం ప్రచారంపై, రెండు పార్టీలు దోబూచులాడుతున్న వైనంపై ప్రజలకు విడమరిచి చెప్పాలని బాబు సూచించారు. ఇదిలా వుండగా మెజారిటి స్ధానాలు సాధించాల్సిందిగా పార్టీ అధినేత నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు నియోజకవర్గాల ఇంచార్జిలు, శాసనసభ్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రాంతీయ సదస్సుల నేపథ్యంలో పార్టీ బాధ్యులంతా గ్రామాలలో మకాం వేశారు. పార్టీల కతీతంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, స్థానికంగా పరిస్థితి పలుచోట్ల ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు అన్ని విధాలా సహక రించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు.

పంచాయితీ పోరుపై దేశం దిశా నిర్దేశం

రాజమండ్రి: రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ ఎం. ఎస్.చక్రవర్తి తెలుగుదేశంపార్టీలో చేశా రు. హైదరాబాద్‌లో గురువారం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో చక్రవర్తి, నలుగురు మాజీ కార్పొరేటర్లు, మాజీ సర్పంచ్ ఒకరితోపాటు సుమారు 100మంది వివిధ స్థాయి నాయకులతో కలసి తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. చక్రవర్తి బేషరత్‌గా పార్టీలో చేరినట్టు చెబుతున్నప్పటికీ కోనసీమలోని ఏదైనా ఒక ఎస్‌సి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కానీ, విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పార్టీ అభ్యర్ధిగా నిలబడే అవకాశం ఉంది. నిజాయతీపరుడైన నాయకుడుగా పేరుగడించిన స్వర్గీయ బత్తిన సుబ్బారావు అల్లుడు అయిన చక్రవర్తి తెలుగుదేశం పార్టీలోచేరి, రాజమండ్రి మే యర్‌గా ఎన్నికైన సంగతి తెలిసిం దే. తర్వాత పరిణామాలలో ఆయన పిఆర్‌పిలో చేశారు.

ఆపార్టీ అట్టర్‌ప్లాప్ కావడంతో, కొంతకాలం క్రితం వైఎస్ఆర్ సిపిలో చేరారు. కానీ అక్కడ ఇమడలేకపోయిన చక్రవర్తి తిరిగి తెలుగుదేశంపార్టీలో చేరారు.దీని తో రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి అదనంగా కొంతబలం చేకూరినట్టు చెప్పవచ్చు. మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్వయంగా చంద్రబాబు వద్దకు తీసుకుని వెళ్లి, పార్టీ తీర్ధం ఇప్పించారు. ఆయన పార్టీలో చేరనున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సం గతి తెలిసిందే. పి.గన్నవరం లేదా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకచోట నుంచి ఆయనను పోటీ పెడతారనే ప్రచారం జరిగింది.కానీ కొ త్తగా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పేరు వినిపిస్తోంది. వాస్తవానికి చక్రవర్తిసొంత ఊరు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి, ఆయన రాజకీయ తదితర కారణాల వల్ల అత్తవారి ఊరైన రాజమండ్రిలో స్ధిరపడ్డారు. ఆయన తండ్రి విశాఖలో సిటిఓగా పనిచేశారు. ఆయన సోదరులు ప్రస్తుతం డాక్టర్లునూ, వివిధ రంగాలలోనూ విశాఖలో ఉన్నారు. ఆయన సోదరి విజయనగరంలో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.

వివిధ కారణాల వల్ల ఆయన పాయకరావు పేట నుంచి పోటీ చేసే అవకాశాలు అధికంగా ఉన్నట్టు సమాచారం. ఇంకా ఎన్నికలకు చాలా సమ యం ఉండడం వల్ల పరిణామాలు ఎలా మారతాయో ఇప్పుడే అంచనా వేయలేం. బేషరత్‌గానే చేరా: చక్రవర్తి తాను తెలుగుదేశం పార్టీలో బేషరత్‌గానే చేరానని, పార్టీ అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించినా పార్టీకి ఉపయోగపడేలా పనిచేస్తానని మాజీ మే యర్ ఎం.ఎస్.చక్రవర్తి తెలిపారు.గురువారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరిన ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ మేయర్ చక్రవర్తి

తెలంగాణపై ఢిల్లీలో జరుగుతున్న చర్చలు, పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై నిర్ణయం దిశగా జరుగుతున్న పరిణామాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని, దానిపై తాము స్పందించబోమని అన్నారు. ‘ఈ అంశంపై మా వైఖరిని ఇప్పటికే చెప్పాం. మహానాడులో కూడా తీర్మానం చేశాం. కేంద్రానికి లేఖలు ఇచ్చాం. అఖిలపక్ష సమావేశంలో కూడా పార్టీ వైఖరి తెలియజేశాం. మా స్టాండ్ స్పష్టం చేశాం. వాళ్లు ఏం చేస్తారో చేయనివ్వండి’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకున్నాక స్పందిస్తారా? అన్న ప్రశ్నకు నిర్ణయం రానివ్వండి అంటూ దాటవేశారు.

కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం : చంద్రబాబు