March 30, 2013


నిమ్స్‌కు వచ్చి 'దేశం' ఎమ్మెల్యేలకు
నిమ్మరసం ఇచ్చిన భువనేశ్వరి

హైదరాబాద్ : విద్యుత్ సమస్యలపై నిరవధిక దీక్ష చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం దీక్షలను విరమించారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి నిమ్స్ ఆస్పత్రికి చేరుకుని ఎమ్మెల్యేలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనారోగ్యం క్షీణించిన ఎమ్మెల్యేలకు నిమ్స్ వైద్యులు చికిత్స అందజేస్తున్నారు.

నిమ్స్ ఆస్పత్రి వద్ద ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ దీక్షల భగ్నంతో ఉద్యమాన్ని ఆపలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. మధ్యాహ్నం టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేయనున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు.

'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా తూ.గో జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్ ద్వారా దీక్ష విరమించిన ఎమ్మెల్యేలను పరామర్శించారు.

విద్యుత్ సమస్యలపై నాలుగు రోజులుగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న కారణంపై పోలీసులు దేశం ఎమ్మెల్యేల దీక్షను భగ్నం చేశారు. గత అర్ధరాత్రి దీక్ష శిబిరం వద్దకు చేరుకుని ఎమ్మెల్యేలను వివిధ ఆస్పత్రుల నుంచి తెప్పించిన అంబులెన్స్‌లలో నిమ్స్‌కు తరలించారు.

టీడీపీ ఎమ్మెల్యేల దీక్ష విరమణ

హైదరాబాద్ : టీడీపీ ఆవిర్భావ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఇటు పార్టీ కార్యాలయంలోను, ఎమ్మెల్యేలు దీక్ష చేస్తున్న పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా జరుపుకొన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు పార్టీ పతాకావిష్కరణ చేశారు. దేశంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజలను మొదట జయప్రకాష్ నారాయణ కూడగడితే ఆ తర్వాత ఆ పనిని ఎన్టీ రామారావు మాత్రమే చేయగలిగారని అశోక్ గజపతిరాజు ప్రశంసించారు.

టీడీపీ ప్రభుత్వం పేదవాడి కోసమే పనిచేసిందని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, వైసీపీలను తన్ని తరిమేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. "జగన్ పార్టీ నేతలు ఊరికే టీడీపీపై నోరు పారేసుకోవడం కాదు. జగన్ జైలులో ఎందుకు ఉన్నాడు? ఆయన ఏమైనా ప్రజల సమస్యలపై పోరాటం చేసి జైలుకు వెళ్లాడా? జైలులో పెట్టింది ప్రభుత్వ సొమ్ము దిగమింగినందుకు కాదా? ఆ పార్టీ నేతలు ముందు దీనికి సమాధానం చెప్పాలి'' అని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.

కాగా, జానపద కళాకారులు ఎన్టీఆర్‌పై పాటలు పాడినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఉత్సాహం ఆపుకోలేక నిరాహార దీక్షా శిబిరం వేదికపై నృత్యాలు చేశారు. మోత్కుపల్లి నర్సింహులు, జైపాల్ యాదవ్, పి. రాములు, కేఎస్ రత్నం వీరిలో ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు చప్పట్లతో వారిని ప్రోత్సహించారు.

మరోవైపు ఎన్టీఆర్ భవన్‌లోనూ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలలనుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు ప్రజలు ఉన్నంత కాలం టీడీపీ ఉంటుందని కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. పార్టీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సహకరించిన శ్రేణులకు మరో నేత పెద్దిరెడ్డికృతఙ్ఞతలు తెలిపారు.

ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

మాకు రుణమాఫీ
చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంఘం అధ్యక్షుడు ఏపీకే రెడ్డి

హైదరాబాద్ : విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ప్రభుత్వానికి భజన మండలిగా మారిపోయిందని చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంఘం అధ్యక్షుడు ఏపీకే రెడ్డి ధ్వజమెత్తారు. వినియోగదారుల అవసరాలను పట్టించుకోకుండా ట్రాన్స్‌కో, డిస్కంలు ఏది చెబితే దానికి తలూపుతోందని దుయ్యబట్టారు. "టీడీపీ హయాంలో మేం అసలు విద్యుత్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు. ఆనాడు విద్యుత్ నిర్వహణ చాలా బాగుండేది.

ఇప్పుడు పరిశ్రమలకు కేటాయించిన విద్యుత్తు లోడులో 65 శాతానికి మించి వాడుకొంటే ఐదు నుంచి పది రెట్లు జరిమా నా విధిస్తామని హెచ్చరిస్తున్నారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఖర్చు పెరిగిపోయి పొరుగు రాష్ట్రాల్లోని ఉత్పత్తిదారులతో పోటీ పడలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. " నష్టాల్లో కూరుకుపోయాం. రైతుల మాదిరిగా మాకూ రుణ మాఫీ పథకం ప్రకటించా లి. పరిశ్రమలకు ప్రత్యేక బడ్జెట్ పెట్టాలి'' అని విజ్ఞప్తి చేశారు.

టీడీపీ హయాంలో విద్యుత్తు నిర్వహణ భేష్


రాఘవులు సవాల్..తులసిరెడ్డి వ్యాఖ్యలకు స్పందన

హైదరాబాద్: 'ప్రజలు ఏభై పైసలు భారం భరించలేరా అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అంటున్నారు. ఆయన కరేపాకు వంటివారు. ఆయన ఏం మాట్లాడినా పట్టించుకొనేవాళ్లు లేరు. అదే మాటను చేతనైతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను అనమనండి చూద్దాం. అప్పుడు మా సమాధానమేమిటో చెబుతాం' అని సిీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీ రాఘవులు సవాల్ విసిరారు. పాత ఎ మ్మెల్యే క్వార్టర్లలోని టీడీపీ ఎమ్మెల్యేల దీక్షా శిబిరాన్ని శుక్రవారం సందర్శించిన ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులను కూర్చోబెట్టుకొని కసరత్తు చేస్తే ఉపయోగం లేదని, విద్యుత్ నిపుణులతో చర్చించి ప్రజలపై భారం తగ్గించే మార్గాలు అన్వేషించాలని కోరారు. ప్రభుత్వం రూ.3700 కోట్ల భారం మోయాలని విద్యుత్ నియంత్రణ మండలి సూచించిందని, దానిని ప్రభుత్వం పాటించాలని డిమాండ్ చేశారు. "వంద యూనిట్లు లోపు కరెంటు వాడేవారి బిల్లులో ఏభై శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్నారు. సంతోషం. ఆ పని చేయమనండి. కానీ ఆ ఖర్చు ఎస్సీ ఎస్టీ నిధుల నుంచి భరిస్తామనడం సరికాదు. ఈ రాయితీల కోసం వాటిని దారి మళ్లిస్తామంటే ఊరుకొనేది లేదు'' అని హెచ్చరించారు. విద్యుత్ చార్జీలు, కోతలకు నిరసనగా దీక్ష చే స్తున్న ఎమ్మెల్యేల ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వంలో కదలిక లేదని, కాంగ్రెస్ నాయకులు రాక్షసుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

టీడీపీ దీక్షకు నాగం సంఘీభావం: విద్యుత్ సమస్యపై టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాగం జనార్దనరెడ్డి సంఘీభావం ప్రకటించారు. శుక్రవారం రాత్రి ఆయన ఎమ్మెల్యేల దీక్షా శిబిరానికి వచ్చి వారిని పరామర్శించారు. 'టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నేనూ మంత్రినే. కరెంటు సమయాలను బట్టి రైతులు గడియారాలను సరిచేసుకునేంత కచ్చితంగా వేళలు పాటించాం. కాంగ్రెస్ వచ్చి ఈ వ్యవస్థను నాశనం చేసింది. టీడీపీ ఎమ్మెల్యేల దీక్ష కాంగ్రెస్ కళ్లు తెరిపిస్తుందని ఆశిస్తున్నా' అని అన్నారు.

ఆ మాట కిరణ్,బొత్స అనగలరా?

'దేశం' దీక్ష భగ్నం!

హైదరాబాద్ : తెలుగుదేశం ప్రజా ప్రతినిధులపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. కరెంటు చార్జీల పెంపు, కోతలను నిరసిస్తూ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలను అర్ధరాత్రి భగ్నం చేసింది. దీక్ష నాలుగో రోజుకు చేరడం, పలువురు ఎమ్మెల్యేల ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో ఇక 'భగ్నం' చేయడమే మేలని భావించింది. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత దీక్ష వేదిక వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు.

ఇది ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉండటంతో... నిబంధనల ప్రకారం అంతకుముందే స్పీకర్ అనుమతి తీసుకున్నారు. సుమారు 150 మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అటు... టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులను ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు. వీరిని పక్కకు తప్పించిన పోలీసులు... దీక్షలో ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే వివిధ ఆస్పత్రుల నుంచి తెప్పించిన అంబులెన్సుల్లో వారిని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ప్రభుత్వ తీరును ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నరసింహులు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యపై దీక్షకు దిగిన తమను అర్ధరాత్రి వేళ అమానుషంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. "కరెంటు సమస్యపై మేం అడిగిన ప్రశ్నలకు శాసనసభలో సరైన సమాధానమే లేదు. వ్యవసాయానికి రెండు మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వడంలేదు. సమస్యలు వస్తే ఫోన్ చేయండి అని సభలోనే చెప్పిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య తన ఫోన్లు ఆఫ్ చేసి పెట్టుకున్నారు.

ప్రజలపై వేలకోట్ల భారం మోపుతున్నారు'' అని విమర్శించారు. ఆస్పత్రిలో కూడా దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. శనివారం అన్ని మండల కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేస్తామన్నారు. స్పీకర్ నుంచి అనుమతి రావడంలో ఆలస్యమైనందునే అర్ధరాత్రి అరెస్టు చేయాల్సి వచ్చిందని ఎమ్మెల్యేలు తెలిపారు. ప్రజా ప్రతినిధుల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆందోళనకరంగా సత్యవతి, సీతక్క పరిస్థితి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యుడితో సహా మొత్తం 29 మంది ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. వీరిలో 25 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ సీఎం రమేశ్ నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్నారు. వీరిలో మహిళా ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, సీతక్కల పరిస్థితి శుక్రవారం ఆందోళనకరంగా మారింది. కూర్చునే ఓపిక కూడా లేక వీరిద్దరూ పూర్తిగా పడుకొనే ఉంటున్నారు. సత్యవతి పలుమార్లు వాంతులు చేసుకొన్నారు.

పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అపోలో ఆస్పత్రికి చెందిన వైద్యులను పిలిపించి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను పరీక్షించారు. వారిని ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సిఫార్సు చేశారు. కానీ, వారు శిబిరం వీడి వెళ్లడానికి నిరాకరించారు. పోలీసులు ముందు జాగ్రత్తగా ఒక అంబులెన్స్‌ను దీక్షా శిబిరం ఉన్న పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలో ఉంచారు. పురుష ఎమ్మెల్యేల్లో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని టీడీపీ వర్గాలు తెలిపాయి. వైద్య వర్గాలు ఉదయం, సాయంత్రం దీక్షలో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి నివేదిక తయారు చేస్తున్నారు.

ఎమ్మెల్యేలు పరీక్షలకు సహకరించడం లేదని రాయాలని కోరిన ఒక పోలీసు అధికారిపై టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి విరుచుకుపడ్డారు. అందరూ సహకరిస్తుంటే అలా ఎలా రాయాలని వైద్యులకు చెబుతారని ఆమె ఆ అధికారిని నిలదీశారు. మీడియా అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆ అధికారి కోరడంపెనా ఆమె వాగ్వివాదానికి దిగారు. శుక్రవారం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన కార్యకర్తలు శిబిరం వద్దకు తరలివచ్చారు.

నేడు మండల కేంద్రాల్లో దీక్షలు:టీడీపీ

రాయదుర్గంటౌన్: పేదల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని నందమూ రి తారకరామరావు స్థాపించారని టీ డీపీ నాయకులు పేర్కొన్నారు. టీడీపీ 32 వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవా రం పట్టణంలోని పార్టీ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కణేకల్లు రో డ్డు, లక్ష్మీబజార్, పాతబస్టాండ్, గాంధీ సర్కిల్, వినాయక సర్కిల్, బళ్లారిరోడ్డు మీదుగా శాంతినగర్‌లోని ఎన్టీఆర్ వి గ్రహం వరకు ద్విచక్రవాహనాల్లో ర్యా లీ నిర్వహించారు.

ప్రభుత్వాస్పత్రిలోని రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చే శారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు ఈ రామాంజినేయు లు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కో సమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాన్యుల సంక్షేమాన్ని విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించి చైతన్యవంతులను చేసి రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి తెచ్చేందుకు నాయకులు, కా ర్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చే యాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పసుపులేటి రాజు, పొరాళ్లు శ్రీనివాసులు, సంపత్ కు మా రి, వెంకటేశులు, పురుషోత్తమ్, వెంకటస్వామి నాయుడు పాల్గొన్నారు.

కణేకల్లులో : మండలంలో టీడీపీ 32 వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. హనకనహాళ్ గ్రా మంలో టీడీపీ నాయకుడు ఎస్‌కే మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ చి త్రపటానికి పూలమాలలు వేసి రాష్ట్ర ప్రజలకు టీడీపీ పార్టీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం 2500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ రోగ్యం బాగుండాలని మారెమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకు లు యోగీశ్వరరెడ్డి, హనుమంతరెడ్డి, శేషప్ప, నాగార్జున, ప్రసాద్, వెంకటేశులు, బసిరెడ్డి, ఆదెప్ప పాల్గొన్నారు.

డీ హీరేహాళ్‌లో : తెలుగుదేశం పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని డీ హీరేహాళ్‌లో శుక్రవారం ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వేలాది మంది టీడీపీ కార్యకర్తలు మండల కేంద్రానికి తరలి వచ్చారు. ముందుగా డీ హీరేహాళ్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు చంద్ర, న ర సింహులు, దేవా, కల్యం తిప్పేస్వా మి, ఓబుళాపురం తిప్పేస్వామి, భూషన్, అలివేలు ప్రహళ్లాద తదితరు లు మాట్లాడారు. పేదప్రజల రక్తం నుంచి, శ్రామికుల ఆవేశంనుంచి, అ ణగారిన ప్రజల గుండెల్లోనుంచి టీడీపీ పుట్టుకొచ్చిందని టీడీపీ కార్యకర్తలు ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

పేదల అభివృద్ధే ధ్యేయం

ఊసరవెల్లులు వాళ్లు!
'తూర్పు'లో చంద్రబాబు

కాకినాడ : "మా వాళ్ల జోలికి వస్తే ఊరుకోను''అని ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. కొంతమంది చొక్కా మార్చినంత సులువుగా పార్టీలు మారుస్తున్నారంటూ ఇటీవల వైసీపీలోకి వెళ్లిన బొడ్డు భాస్కరరామారావును ఉద్దేశించి పరోక్షంగా మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండల కేంద్రంలో శుక్రవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. దోమాడ, కర్రకుదురు, అచ్యుతాపుర త్రయం వరకు నడక సాగించారు. అంతకుముందు.. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెదపూడిలో జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ జెండాను ఎగరవేసి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

"ఎన్టీఆర్ ఒక చరిత్ర. తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన కీర్తి దేదీప్యమానం. అణగారిన వర్గాలను పైకి తీసుకురావడం కోసమే ఆయన పార్టీ పెట్టారు. సమాజమే దేవాలయం...పేదలే దేవుళ్లు.. అన్న నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీకి మళ్లీ మంచిరోజులు వస్తున్నాయి. నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తల బలమే టీడీపీకి కొండంత అండ. 2014 ఎన్నికలలో మళ్లీ మనం చరిత్ర సృష్టించబోతున్నాం..'' అని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. 32వ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరుపుతామని లాల్‌జాన్ బాషా తెలిపారు. కాగా, దారిలో కలిసిన మహిళలు, యువకులను పలకరిస్తూ చంద్రబాబు ముందుకు సాగారు.

ఈ సందర్భంగా జరిగిన సభల్లో జంప్‌జిలానీ నేతలను తూర్పారబట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత బీసీల సంక్షేమానికి ఏటా రూ వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.ఐదు వేల కోట్లు వెచ్చిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగ్గంపేట, రామచంద్రపురం నియోజకవర్గాలకు చెందిన పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఇదిలాఉండగా, ఆరునెలల కాల వ్యవధిలో 2,500 కిలోమీటర్లకు పైగా నడిచిన చంద్రబాబు..బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్‌లోకి ఎక్కారు. 'రికార్డ్సు' ప్రతినిధులు శుక్రవారం ఆయనకు 'ఏకవీర' బిరుదు ఇచ్చి సత్కరించారు.

పర్చూరు ఇన్‌చార్జి సాంబశివరావు : టీడీపీ హైదరాబాద్: ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఏలూరి సాంబశివరావని తెలుగుదేశం పార్టీ మీడియా విభాగం ఇన్‌చార్జి ఎల్‌వీఎస్ఆర్‌కె ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బాగా పనిచేస్తున్నారంటూ పర్చూరు ఇన్‌ఛార్జిగా గోపాలకృష్ణ అనే పేరు ఆయన చెప్పారని మీడియాలో పొరపాటుగా వచ్చిందని, ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి సాంబశివరావని ప్రసాద్ వివరణలో పేర్కొన్నారు.

కాంగ్రెస్,వైసీపీ దొంగల్ని తరిమికొట్టండి...