March 24, 2013

మండపేట: వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న చం ద్రబాబు పాదయాత్ర సోమవారం 175వ రోజుకు చేరుకోనుంది. ఆయన యాత్ర ప్రారంభించి 14జిల్లాల్లో పాద యా త్రను పూర్తి చేసుకొని 15వ జిల్లాలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో యాత్రను కొనసాగిస్తున్నారు. ఆయన సాగిస్తున్న పాదయాత్ర మండపేట నియోజకవర్గంలోని మండపేట పట్టణం చేరేసరికి 2,500 కి.మీ.లు పూర్తి కా నుంది. ఈ సందర్భంగా మండపేటలో భారీ పైలాన్‌ను ఏర్పాటు చేశా రు. బాబు చేపట్టిన పాదయాత్రలో 2,500 కి.మీ.,లు పాద యాత్ర పూర్తి చేసుకున్న అరుదైన అవకాశం మండపేటకు దక్కనుంది.

175వ రోజు 2,500 కి.మీ పూర్తికానున్న పాద యాత్ర

రాష్ట్ర కమిటీలో చోటు, గన్నవరం సీటుపై హామీ
మండపేటలో విజయవాడ నేతలతో భేటీ

విజయవాడ : లోక్‌సభ ఎన్నికలలో విజయవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రముఖ ట్రావెల్స్ అధినేత కేశినేని నానీకి ఆ పార్టీ అధినేత చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఆదివాసం బస చేసిన చంద్రబాబు.. విజయవాడ నాయకులను పిలిపించి మాట్లాడారు. అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్, కేశినేని నాని, నాగుల్ మీరా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్దా వెంకన్న ఈ సమావేశానికి వెళ్లారు. తొలుత వంశీమోహన్‌ను చంద్రబాబు..బస్సులోకి పిలిపించి అరగంటసేపు మాట్లాడారు. చర్చల సందర్భంగా అర్బన్ బా«ధ్యతలు వదిలేసి.. రాష్ట్ర కమిటీలోకి రావాలని వంశీని ఆయన కోరినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవి తన వర్గానికి ఉంటేనే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం తేలికవుతుందని కేశినేని నాని ఇప్పటికే చంద్రబాబును కోరడమే దీనికి కారణమని వివరిస్తున్నాయి. ఈ వర్గాల వాదన ప్రకారం.. చంద్రబాబు కృష్ణాజిల్లా పాదయాత్ర ప్రారంభానికి ముందే కేశినేని నాని విజయవాడ పార్లమెంట్ సీటుకు హామీ పొందారు. విజయవాడ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర ఖర్చంతా ఆయనే భరించారు. చంద్రబాబు యాత్రకు గుర్తుగా పరిటాల వద్ద కేశినేని నాని సుమారు రూ.70 లక్షల వ్యయంతో పైలాన్ నిర్మించారు. విజయవాడ సీటు తనకే ఖరారు అవడంతో.. అర్బన్ అధ్యక్ష పదవి కూడా కావాలని అడిగారు. అందుకు చంద్రబాబు అంగీకరించారు.

ఈ నేపథ్యంలో అర్బన్ అధ్యక్ష పదవి నుంచి వంశీని తప్పించడానికి రంగం సిద్ధం చేశారు. ఆయన స్థానంలో నాని సూచించిన నాగుల్ మీరాను నియమించనున్నట్టు అధినేత స్వయంగా సంకేతాలు ఇచ్చారు. అదేసమయంలో నాలుగేళ్లుగా నగర పార్టీ బాధ్యతలు మోస్తున్న వంశీకి నెమ్మదిగా నచ్చచెప్పి మార్పులు చేద్దామని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకే మండపేట రావాలని కబురు పెట్టారని ఈ వర్గాలు చెబుతున్నాయి. బస్సులోకి పిలిపించుకొని వంశీతో బాబు ప్రత్యేకంగా మాట్లాడారు.

ఎన్నికలలో వంశీ పోటీచేయడానికి కూడా అవకాశం కల్పిస్తానని చెప్పినట్టు సమాచారం. 2009 ఎన్నికలలో వంశీ గన్నవరం సీటుకోసం పట్టుపట్టారు. దాసరి జైరమేష్, బాలవర్ధనరావులను వదులుకోలేని చంద్రబాబు..అప్పట్లో వంశీకి నచ్చచెప్పారు. తనమాట విని ఈసారికి విజయవాడ నుంచి పోటీ చేయాలని, వచ్చేసారి (2014) గన్నవరంలో పోటీకి పెడతానని అప్పట్లోనే హామీ ఇచ్చారు. భేటీ సందర్భంగా ఈ హామీని వంశీ గుర్తుచేసినట్టు తెలుస్తోంది. 'గన్నవరం' వంశీకి ఇచ్చి.. సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావును మండలికి పంపడమో లేక విజయా డైరీ మిల్క్ సొసైటీ చైర్మన్‌ని చేయడమో చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యే దాసరి, జైరమేష్‌లతో బాబు మాట్లాడిన తరువాతగానీ దీనిపై స్పష్టత రాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే..వంశీకి గన్నవరం సీటు ఇచ్చేసినట్టు టీవీలలో స్క్రోలింగ్‌లు వచ్చాయి. దాంతో ఎమ్మెల్యే దాసరి తీవ్ర మనస్తాపం చెందినట్టు సమాచారం. పార్టీ పెద్దలకు ఫోన్ చేసి తాను రాజీనామా చేస్తానని చెప్పినట్టు తెలిసింది. గన్నవరంపై నిర్ణయం తీసుకోలేదని సీనియర్ నేతలు దాసరికి నచ్చజెప్పారు.

విజయవాడ ఎంపీ సీటు కేశినేని నానీకి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్

విశాఖపట్నం: చంద్రబాబు పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో ముగియనుంది.ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఆయన.. నాతవరం మండలం గన్నవరంమెట్ట వద్ద వచ్చే నెల ఎనిమిదో తేదీన విశాఖ జిల్లాలో అడుగుపెడతారు. ఏప్రిల్ 27 వరకు ఆ జిల్లాలో పర్యటిస్తారు. అదే రోజు విశాఖ మధురవాడలో బహిరంగ సభలో పాల్గొని పాదయాత్ర ముగిస్తారు. కాగా, విశాఖ జిల్లాలో మొత్తం 19 రోజులపాటు 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 163 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.

జిల్లాలో చోడవరం, మాడుగుల, పాడేరు, అరకులోయ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను పార్టీ జిల్లా పరిశీలకుడు సుజనాచౌదరి ఆదివారం వెల్లడించారు. యాత్ర ముగించేనాటికి ఆయన 2750 నుంచి 2800 కిలోమీటర్ల దూరం నడుస్తారని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడూ ఇంత సుదీర్ఘకాలం, ఇంత ఎక్కువ దూరం పాదయాత్ర చేయలేదని గుర్తుచేశారు. పాదయాత్ర ముగింపునకు గుర్తుగా మధురవాడలో పైలాన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

పాదయాత్ర విశాఖతో ఆఖరు!

పాయకరావుపేట, కోటవురట్ల: పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు శనివారం సినీ హీరో బాలకృష్ణకు బ్రహ్మరథం పట్టారు. పాయకరావుపేట మండలం పాల్తేరు శివారు అంకంపేట, కందిపూడి, రాజగోపాలపురం, కుమారపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు. అనుకున్న సమయం కంటే గంట ఆలస్యంగా పర్యటన సాగినప్పటికీ గ్రామాల్లో యువకులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. తిమ్మాపురం బహిరంగ సభలో బాలకృష్ణ 'సింహా' సినిమాలోని డైలాగ్‌లు చెప్పి అభిమానులను, కార్యకర్తలను ఉర్రూతలూగించారు. ఎన్టీ రామారావు, చంద్రబాబునాయుడుల పాలనను కొనియాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు.

రాష్ట్రంలో కాంగ్రెస్్ పాలన అస్తవ్యస్తంగా ఉందని, ప్రజలు అన్ని విధాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుస్థిర, సుపరిపాలనను అందించేందుకు తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్ సమస్యను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ముఖ్యమంత్రుల నిర్వాకం వల్ల ఈరోజు వేలాది కోట్ల రూపాయల సర్‌ఛార్జీ భారాన్ని ప్రజలు మోయాల్సి వచ్చిందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కరెంట్ తీగలు పట్టుకుంటే షాక్ కొడుతుందో లేదో తెలియదు కానీ విద్యుత్ బిల్లు పట్టుకుంటే మాత్రం షాక్ కొట్టి తీరుతుందన్నారు. నీలం తుపానులో ర్రాష్టానికి కేవలం 417 కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల ఆయన ఆక్షేపణ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 30 మంది ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయిందని విరుచుకుపడ్డారు. పాయకరావుపేట మండలం అక్కంపేట, కందిపూడి, రాజభూపాలపురం, కుమారపురం గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తనను కలుసుకోవడానికి వచ్చిన వృద్ధులను అక్కున చేర్చుకున్నారు.

ప్రజలతో మమేకమయ్యేందుకు బాలకృష్ణ ప్రయత్నించారు. పర్యటన ఆద్యంతం భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాయి. మహిళలు, యువత, వృద్ధులు బాలకృష్ణను చూసేందుకు ఎగబడ్డారు. రూరల్ జిల్లాలో సాగిన బాలయ్య పర్యటన ప్రజలను ఆకట్టుకోవడంతో పార్టీ శ్రేణులు హుషారుగా వున్నాయి.


బాలయ్యకు బ్రహ్మరథం

వైఎస్ హయాంలో జరిగిన అక్రమాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలపై ధర్మ పోరాటానికి టీడీపీ కార్యకర్తలంతా కలసిరావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 'వస్తున్నా మీ కోసం' యాత్రలో భాగంగా శనివారం ఆయన కడియం, వీరవరంలలో మాట్లాడారు. అక్రమాలు జరుగుతున్నా మనకెందుకులే.. అని నిర్లక్ష్యం, నిర్లిప్తత కార్యకర్తలకు రాకూడదన్నారు. ప్రజల్లోకి వెళ్లి వైఎస్, జగన్, కాంగ్రెస్ అక్రమాలు, లక్షల కోట్లు దోచుకున్న వైనాలపై అవగాహన కల్పించాలన్నారు. వైఎస్ అవినీతికి భావితరాలు కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పోలవరం వంటి పలు ప్రాజెక్టుల్లో వేల కోట్లు దోచుకున్నారన్నారు. కాంగ్రెస్ అవినీతి వల్ల రాష్ట్రం అధోగతి పాలయిందని, ధరల పెరుగుదల, విద్యుత్ సర్‌ఛార్జీలు, పేదరికం వంటివన్నీ వైఎస్, కాంగ్రెస్ పాపాలేనని బాబు విమర్శించారు.

పప్పుబెల్లాలు ప్రజలకు.. లక్ష కోట్లు కొడుక్కి వైఎస్ హయాంలో ప్రజలకు పప్పుబెల్లాలు పంచి.. కొడుకు జగన్‌కి మాత్రం లక్ష కోట్లు దోచిపెట్టారన్నారు. ఆ సొమ్ము పేదలకు పంచితే రాష్ట్రంలో పేదరికం ఉండదన్నారు. ప్రజల సొమ్ము దోచుకున్న జగన్ జైలులో గడుపుతున్నాడని, అక్రమాలకు పాల్పడిన వారికి ఇదే గతిపడుతుందన్నారు. వైఎస్ ఆత్మ కేవీపీ సీబీఐ విచారణలో వెల్లడి చేసే విషయాలతో మరిన్ని అక్రమాలు బయటపడతాయని చంద్రబాబు తెలిపారు.

చంద్రన్నా! నీవే దిక్కు!

ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేయకుండా ప్రజలకు నరకయాతన చూపిస్తుందని, కెజి బేసిన్‌లో సహజవాయువును ఇతర రాష్ట్రాలకు అమ్మేసుకుంటూ మన ప్రాంతంలో ఇళ్లకుగానీ, ఫ్యాక్టరీలకు గానీ గ్యాస్ ఇవ్వడంలేదని, ఇక మన గ్యాస్ మనకేనని, దీనికోసం తనతోపాటు అందరూ పోరాటానికి సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. వస్తున్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా శనివారం కడియంలో జరిగిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. ఇక్కడి గ్యాస్ ఇక్కడ ఉపయోగించకపోవడం అన్యాయమన్నారు. ఇక్కడి గ్యాస్‌తో ఇంటింటీకి పైపులైన్ల ద్వారా వంటగ్యాస్‌ను సరఫరా చేయాలని ఆలోచించి ఏర్పాట్లు చేశానన్నారు.

తాను సిీఎంగా ఉండగా 35లక్షల గ్యాస్ సిలెండర్లు ఇచ్చానని, ఇవాళ ఆరుసిలెండర్లు కూడా సరిగ్గా ఇవ్వడంలేదని తెలిపారు.పైగా ఆధార్‌తో అనుసంధానం అంటూ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలని చెప్పి, సరైన విధానం కూడా పాటించడంలేదని ఆయన అన్నారు.దీని కోసం పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు. కసి పెరగాలని, సమస్యలు పరిష్కరించుకోవాలని, తాము జీవితంగా ఎదగాలనే పట్టుదల పెరగాలన్నారు. ఇక్కడ తనకు మీరంతా ఎన్నో సమస్యలు చెబుతున్నారని, పిల్లకాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ అవినీతికి సంబంధించిన అనేక విషయాలు చెబుతున్నారని, ఎక్కడ ఏమి జరుగుతుందో, ఎవరో ఏంటో అర్ధంచేసుకుంటున్నారని, కానీ పోరాడకుంటే ఉంటే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ఆయన తెలిపారు.32మంది ఎంపిలు ఉన్నారని, జిల్లాలో ఒక కేంద్రమంత్రి కూడా ఉన్నారని అయినా ఒక్క సమస్య కూడా పట్టించుకోని దద్దమ్మలన్నారు..

ప్రజల హక్కులను కూడా కాపాడలేకపోతున్నారని, ఈప్రాంతంలోని గ్యాస్‌తో ఈప్రాంత అవసరాలు తీరాలి కదా అని ఆయన ప్రశ్నించారు. నిత్యాసర సరుకులు పెరిగిపోయాయని, కుటుంబాలలో కనీస అవసరాలు కూడా తీరడంలేదని,దీనికి తోడు మద్యం, నాటు సారా ఏరులైపారడం వల్ల అనేకమంది మందుకు బానిసలైపోతున్నారన్నారు. దీనితో అనేక కుటుంబాలు అల్లకల్లోమైపోతున్నాయన్నారు. అవినీతి , అసమర్ధ ప్రభుత్వం మీద, వైఎస్ కుటుంబ దోపీడిని ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు.తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వవైభం వస్తుందని, ప్రజలకష్టాలు తీరుస్తానని ప్రకటించారు. ఎస్‌సిలకు వైఎస్ ఒరగబెట్టింది ఏమీ లేదని, సామాజిక న్యాయం కోసం ఎస్‌సి వర్గీకరణ తెచ్చామని, అలాగని మాలలకు అన్యాయం చేసేది లేదని,మాలలలో కూలీలేఅధికమన్నారు. అటువంటి వారికి అన్నివిధాల న్యాయం చేసి పైకి తీసుకొస్తానని చెప్పారు.

జనాభాలో బీసీలు 50శాతం ఉన్నారని,శెట్టిబలిజలు అంతా పార్టీకి అండగా ఉండేవారి,ఇటీవల కొంతమంది దూరమయినా మళ్లీ పార్టీకిదగ్గ ర చేసుకుంటానన్నారు. ఇంకా యాదవులు, చేనేత కార్మికులు, కుమ్మర, వడ్డి, నాయ్రీబాహ్మణ, విశ్రబ్రాహ్మణ,శాలివాహన, రజక వంటి అనేక కులాలకు ప్రభుత్వం అన్యాయం చేసిందని అందుకే బీసీ డిక్లరేషన్ చేశామన్నారు. కాపులలో కూడా అధికంగా పేదలు ఉన్నారని,భూములు లేవని, చిన్నచిన్న పనులు చేస్తూ బతుకుతున్నారని,కుటుంబాన్ని మగవాళ్లే పోషించాలని, అందువల్ల అనేకమంది పేదలు ఇబ్బందులు పడుతున్న విషయం తనకు తెలుసన్నారు.అంతేకాక అగ్రకులాలలోని పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి, ఆర్ధికంగా, రాజకీయంగా ,సామాజికంగా వారిని ఆదుకోవడానికి త్వరలో ఒక నిర్ణయం తీసుకోనున్నామన్నారు.నీలం తుఫాన్ నష్టం కూడా ఇంకా ఇవ్వలేదన్నారు.అందువల్ల అందరూ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు.

మన గ్యాస్ మనకే.. పోరాటానికి సిద్ధంకండి

ఆలమూరు: నియోజకవర్గానికోవృద్ధాశ్రమాన్ని ఏర్పాటుచేసి వృద్ధులకు టీడీపీ అండగా నిలుస్తుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెప్పారు. వృద్ధాప్య పింఛన్ రూ.వెయ్యికు పెంపుదల చేస్తామన్నారు. చంద్రబాబు పాదయాత్రలో భాగంగా శనివారం రాత్రి కొత్తపేట నియోజక వర్గం మడికి శివారు మల్లవానితోటలో చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో దొంగల రాజ్యం నడుస్తోందని, పేదలకు అందాల్సిన పథకాలను వారు దోచుకుంటూ పేదలకు బతుకు భారంగా చేశారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెంపుదల చేసి పేదప్రజలకు పెనుభారంగా మార్చిన ఘనత వారికే దక్కిందన్నారు.

పేదల కష్టాలను తీరాలంటే టీడీపీ ప్రభుత్వం మళ్లీ రావాలని చెప్పారు. పేదల కష్టాలను తీర్చేందుకే వస్తున్నా పాదయాత్ర చేస్తున్న ట్లు ఆయన వివరించారు. పేదలకు సొంత ఇల్లు నిర్మించడానికి రూ.1,5లక్షల కేటాయించి ఇల్లు నిర్మించనున్నామని ఆయన ప్రజల ఉద్దేశించి ప్ర సంగించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం రైతుల రుణాలమాఫీ చేస్తానని చెప్పారు. బంగారం రుణాలను కూడా ఈ మాఫీలోకి తీసుకొచ్చి మీ బంగారాన్ని మీకు అందించే బాధ్యత నాదని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఘనస్వాగతం: కడియం నుంచి ప్రారంభమైన చంద్రబాబు నాయుడు పాదయాత్ర కొత్తపేట నియోజక వర్గం మడికి శివారు మల్లవానితోటలోనికి ప్రవేశించినప్పుడు పూలపై చంద్రబాబును నడిపించి ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, పలువురు నాయకులు పాల్గొన్నారు.

నియోజకవర్గానికో వృద్ధాశ్రమం- చంద్రబాబు

రాజమండ్రి: దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అసమర్ధుడని,అతని వల్లదేశానికి ఏమీ ఒరగదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాయ చంద్రబాబునాయుడు అన్నారు. సోనియా బొమ్మ పెట్టుకుని కూడా ప్రత్యక్ష ఎన్నికలలో గెలవలేని నాయకుడు ప్రధాని కావడం ఏంటన్నారు. సూట్,బూట్ వేసుకుని తిరడమే కానీ, సామాన్య ప్రజల గురించి ఆయనకేమీ తెలియదని, ఏనాడూ ఒక సామాన్య మానవుడి భుజాన చెయ్యి వేసిన సందర్భం ఎవరైనా చూశారా అని ఆయన ప్రశ్నించారు.

బాబును కలసిన దేవేందర్‌గౌడ్; బాబూమోహన్

వస్తున్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.,,చంద్రబాబునాయుడును ఎంపి టి.దేవేందర్‌గౌడ్, మాజీ మంత్రి, ప్రముఖ సినీనటుడు బాబూ మోహన్ కలిశారు. బాబు బసచేసిన బస్సులోకి వెళ్లి,ఆయనతో కాసేపు మాట్లాడి వెళ్లారు.

ప్రధానిగా మన్మోహన్ అసమర్దుడు: బాబు

తుని: తాను ఎన్నికల్లో పోటీ చేయడంపై తుది నిర్ణయం అధిష్ఠానందేనని సినీ నటుడు బాలకృష్ణ స్పష్టం చేశారు. శనివారం ఆయన తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అల్లుడు లోకేష్,కుమార్తె బ్రహ్మిణిలతో పాటు చంద్రబాబు దంపతుల పేరిట గోత్ర నామాలతో పూజాధికాలు జరిపించారు. విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గం ద్వారా లోవ విచ్చేసిన బాలయ్యకు తుని వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల కృష్ణుడు,పోల్నాటి శేషగిరిరావు, సుర్లలోవరాజు, యినుగంటి సత్యనారాయణ, మేకా రామ్మూర్తి(చిన్నా), పప్పు సత్యనారాయణ, నడిగట్ల సూరిబాబు తదితరులతో పాటు అభిమాన సంఘాల నాయకులు బొబ్బిలి వెంకటరమణ, తిరుమలనీడి రాజు, నడిగట్ల రాజు, రామకుర్తి బాబ్జీ తదితరులు పూలమాలలతో ఎదురేగి ఘన స్వాగతం పలికారు.

అమ్మవారి దర్శనానంతరం విలేకరులతో కాసేపు మాట్లాడారు. తాను ఎంపీగా పోటీ చేయబోనని, ఎమ్మెల్యేగా మాత్రమే పోటీచేస్తానన్నారు. ఎక్కణ్నుంచి పోటీ చేసేది అధిష్ఠానమే నిర్ణయిస్తుందన్నారు. కొంత సమయం విశ్రాంతి తీసుకుని తుని పట్టణంలోని తన మిత్రుడు చల్లకొండ రమేష్ ఇంటికి చేరుకుని భోజనంచేసి విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం విశాఖ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. ఆయన వెంట బండారు జగన్, దిబ్బా శ్రీను, దియ్యా శ్రీను, గర్లంక నానాజీ, పలివెల శివమణి తదితరులు వెళ్లారు. అడుగడుగునా అభిమానులు హర్షాతిరేకాలతో బాలయ్య పర్యటన సాగింది

ఎన్నికల్లో పోటీపై తుది నిర్ణయం అ«ధిష్టానానిదే - బాలకృష్ణ


రాజమండ్రి: అవినీతిపరులను పార్టీ చేర్చుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత జగన్ గురించి తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కడియం శనివారం ఒక పిట్టకథ చెప్పారు.అనగనగా ఒక ఊళ్లో ఒక యజమానివద్ద ఒక గుర్రం ఉండేది.యజమానికి నమ్మకంగా ఉండడం దాని పని.కానీ ఒక రోజు ఒక దొంగ వచ్చాడు.ఇంట్లో ఉన్న సొత్తంతా దోచేస్తున్న సమయంలో గుర్రం ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయింది.అంతేకాక దొంగ వద్దకు వచ్చి, తాను కూడా సహకరిస్తానని, తనను నీకూడా తీసుకుని వెళ్లాలని కోరింది.

అదేంటి, ఎందుకు అలా చేస్తున్నామని దొంగ అడిగాడు. కానీ యజమాని మంచివాడు కాదని,క్రమశిక్షణంగా ఉండాలని చెప్పి ఇబ్బంది పెడుతున్నాడని చెప్పింది. దానితో దొంగ స్పందిస్తూ ఇంతకాలం నిను నమ్మిన యజమానికే మోసం చేశావంటే,తర్వాత నాపని కూడా అంతేకదా అని, గుర్రాని వదిలేసి వెళ్లిపోయాడు.కానీ జగన్‌కు ఈదొంగకు ఉన్న బుద్ధికూడా లేదని చంద్రబాబు అన్నారు. పెంచి పోషించిన పార్టీలను వదిలి వస్తున్న వాళ్లకు తిరిగి డబ్బులు ఇచ్చి,పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు.

బాబు చెప్పిన పిట్లకథ

గర్మిళ్ల: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పొగాకు యాదగిరి అనారోగ్య కారణాలతో శనివారం మృతి చెందడంతో జిల్లాలో విషాదం నెలకొంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పొగాకు యాదగిరి శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఓ ఆ స్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మంచిర్యాలకు చెందిన యాదగిరి బీఎస్సీ వరకు మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించిన అనంతరం ఎల్ఎల్‌బీ పట్టాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొందా రు. లక్షెట్టిపేటలో కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన ఆయన తొలిసారిగా 1983లో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి జిల్లా అధ్యక్ష పదవిని అలంకరించారు.

1984లో క్రమశిక్షణ సంఘం సభ్యుడిగా, పే అండ్ అకౌంట్స్ విభా గం సభ్యుడిగా, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా తదితర ఐదు పదవులను ఏకకాలంలో నిర్వహించారు. గతంలో ఒక పర్యాయం ఎమ్మెల్సీగా ఉన్న యాదగిరి మంచిర్యాల మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆరు సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో రిసెప్షన్ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్న సమయంలో మంచిర్యాల టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి కృషి చేశారు.

యాదగిరి మృతితో టీడీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గోనె హన్మంతరావు , సీనియర్ నాయకులు ముకేష్‌గౌడ్, కొండేటి సత్యం, వినయ్ ప్రకాష్‌రావు, రైసా బాను, డాక్టర్ రఘునందన్, నల్మాస్ కాంతయ్య, బెల్లంకొం డ మురళి, గాదె సత్యం, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, కార్యదర్శి రంగు మల్లేష్, ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి తదితరులు ఆయన మృతిపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. యాదగిరి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. కడసారి చూపు కోసం వారంతా హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. యాదగిరికి భార్య సునీతతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

ఎమ్మెల్యే యాదగిరి మృతితో జిల్లాలో విషాదం

హైదరాబాద్ : విశాఖపట్నంలో చంద్రబాబు పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 8 నుంచి 27 వరకు చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు. 11 నియోజవర్గాల్లో 163 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నట్లు ఎంపీ సుజనాచౌదరి తెలిపారు.

విశాఖలో బాబు పాదయాత్ర షెడ్యూల్ ఖరారు

తూ.గో : వస్తున్నా..మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో విజయవాడ జిల్లా నేతలు సమావేశమయ్యారు. వల్లభనేని వంశీ, కేశినేని నాని, నాగుల్‌మీరా, బుద్దా వెంక న్న చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.

చంద్రబాబుతో విజయవాడ నేతల భేటీ

విద్యుత్ సౌధ ముట్టడి.. లాంతర్లతో నిరసన

హైదరాబాద్: విద్యుత్ కోతలకు తోడు సర్‌చార్జీల పేరుతో సామాన్య ప్రజలను దోచుకుతింటున్నారని తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ వద్ద లాంతర్లతో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించింది. పార్టీ నగర శాఖ అధ్యక్షుడు తలసాని శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమాజిగూడలోని విద్యుత్ సౌధను ముట్టడించారు. లాంతర్లను చేతబట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నిరసనతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. పోలీసులు పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కోత, మోతపై టీడీపీ ఆగ్రహం

హైదరాబాద్ : విద్యుత్ సమస్యపై శాసనసభలో చర్చించాలని ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు వినూత్న పద్ధతిలో నిరసనలు తెలిపారు. అసెంబ్లీలో బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అక్కడనుంచి లేపి ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో వదిలిపెట్టిన విషయం తెలిసిందే. తమ నిరసనను కొనసాగించాలని నిర్ణయించుకొన్న ఎమ్మెల్యేలు అక్కడి పచ్చికపైనే ఆరుబయట పడుకొన్నారు. మహిళా ఎమ్మెల్యేలు కాసేపటికి లోనికి వెళ్లి గదుల్లో పడుకొన్నా.. పురుష ఎమ్మెల్యేల్లో అత్యధికులు బయటే గడ్డిలో కింద పడుకొన్నారు.

కనీసం దిండు కూడా లేకుండా పడుకోవడంతో కొందరికి పొద్దున్న లేచేసరికి మెడ, వెన్ను పట్టేశాయి. మండవ వెంకటేశ్వరరావు, రామునాయుడు లాంటివారు ఎదురుగా ఉన్న కేబీఆర్ పార్కుకు ఉదయం నడకకు వెళ్లారు. పల్లె రఘునాధరెడ్డి, ధూళిపాళ నరేంద్ర తదితరులు ఎన్టీఆర్ భవన్ ఆవరణలోనే కాసేపు యోగాసనాలు వేశారు. అక్కడ బయటే దంత ధావనం చేసుకొన్న ఎమ్మెల్యేలు స్నానపానాదులు కూడా అక్కడే పూర్తి చేశారు.

తర్వాత అక్కడ నుంచి బయలుదేరి ఎన్టీఆర్ ఘాట్‌కు చేరారు. అక్కడనుంచి పాదయాత్రగా అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి అనంతరం అసెంబ్లీకి వెళ్లారు. 'విద్యుత్‌పై చర్చను తక్షణం చేపట్టాలి, పారిపోతున్న ప్రభుత్వం డౌన్‌డౌన్, కరెంటు కోతలు నివారించాలి, రైతులు, పరిశ్రమలకు తగినంత కరెంటు ఇవ్వాలి, పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలి' అని వారు నినాదాలు చేశారు.

ఆరుబయట నిద్ర.. పాదయాత్ర

ఏ మొహం పెట్టుకుని నిరసన?

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రస్తుత కరెంటు కోతలు.. చార్జీలకు వైఎస్ రాజశేఖరరెడ్డి దిక్కుమాలిన విధానాలే కారణమని, ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలు ఏ మొహం పెట్టుకొని పోడియం వద్దకు వచ్చి గొడవ చేస్తున్నారని టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. తమపార్టీ ఎమ్మెల్యేలు ముద్దుకృష్ణమ నాయుడు, పల్లె రఘునాధరెడ్డి, మల్లెల లింగారెడ్డి, ఎల్.రమణతో కలిసి ఆయన శనివారం టీడీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ అంశంపై చర్చను టీడీపీ తరఫున పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో మొదలు పెట్టబోతుండగా టీఆర్ఎస్, వైసీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేయడంతో ఉపసభాపతి సభను వాయిదావేశారు.

"విద్యుత్‌పై చర్చించకుండా ప్రభుత్వం పారిపోతుందేమోనని మేం సీఎం చాంబర్ వద్ద అడ్డంగా కూర్చొని మరీ చర్చకు ఒప్పించాం. తీరా చర్చ మొదలైన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు దాన్ని అడ్డుకొన్నారు. ప్రైవేటు కంపెనీలకు పెద్దపీట వేసి వైఎస్ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇంకా ఏ మొహం పెట్టుకొని పోడియం వద్దకు వచ్చారు? అవినీతితో ఇప్పటికే మీ మొహాలు నల్లగా మారిపోయాయి. మళ్ళీ మీకు నల్లచొక్కాలా? మీరే కాంగ్రెస్...కాంగ్రెసే మీరు. ఇక కాంగ్రెస్‌ను ఏమని తిడతారు? తల్లి కాంగ్రెస్.. పిల్ల కాంగ్రెస్ బాగోతం బయటపడుతోంది. ఈ రెండు కాంగ్రెస్‌ల సంగతి మేం తేలుస్తాం'' అని ఆయన హెచ్చరించారు.

టీడీపీ హయాంలో రాష్ట్ర బడ్జెట్ రూ. 45 వేల కోట్లు ఉంటే అందులో విద్యుత్ కోసం రూ. 8 వేల కోట్లు కేటాయించారని, కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం మొత్తం బడ్జెట్ రూ. 1. 61 లక్షల కోట్లు ఉంటే అందులో విద్యుత్‌కు కేవలం రూ. 3.5 వేల కోట్లు మాత్రం కేటాయించిందని ముద్దు కృష్ణమ పేర్కొన్నారు. 'చంద్రబాబు రూ. 500 కోట్ల మేర చార్జీలు పెంచితే వైఎస్ పెద్ద గొడవ చేశారు.

ఇప్పుడు పెంచింది రూ. 31 వేల కోట్లు. అప్పట్లో చంద్రబాబు యూనిట్ కరెంటును ప్రైవేటు వారి నుంచి రూ. 1.80కి కొనాలని ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5.50కి కొంటోంది. చంద్రబాబు తను అధికారంలో ఉండగా ఐదున్నర వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి పెంచితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో కేవలం 1700 మెగావాట్లు పెంచింది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను నాశనం చేశారు' అని ఆయన విమర్శించారు.

వైసీపీ ఎమ్మెల్యేలపై మోత్కుపల్లి మండిపాటు

విశాఖపట్నం: 'బతుకు, బతికించు.. పది మందిని బతికించుకోవడానికి అవసరమైతే త్యాగాలకు సిద్ధం కావాల'న్నది తమ సిద్ధాంతమైతే, 'దోచుకో, దాచుకో...అవసరమైతే పది మందిని చంపించు' అన్నది నేటి కాంగ్రెస్‌పాలకుల నీతి అని సినీహీరో, టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. శనివారం విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని అంకంపేట, కందిపూడి, రాజగోపాలపురం, కుమారపురం గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు.పేద ప్రజలను ఆదుకోవడానికి టీడీపీ పుట్టిందన్నారు. అలాంటి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు, నేతలు శ్రమించాలని పిలుపునిచ్చారు. జాబ్ రావాలన్నా, బతుకు బాగుండాలన్నా బాబు గెలవాలని అన్నారు.

పోటీపై నిర్ణయం అధిష్ఠానానిదే

తుని: తాను ఎన్నికల్లో ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని, ఈ విషయంలో తుది నిర్ణయం అధిష్ఠానానిదేనని బాలకృష్ణ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని రూరల్ మండలంలోని లోవ తలుపులమ్మ అమ్మవారిని ఆయన శనివారం దర్శించుకున్నారు.

జాబ్ కావాలంటే బాబు రావాలి : బాలకృష్ణ

'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర కు ఆదివారం చంద్రబాబు విరామం ఇవ్వనున్నారు. భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్ తూర్పుగోదావరి జిల్లా వచ్చి చంద్రబాబును కలిశారు. ఆదివారం మండపేట మండలం ఏడి ద గ్రామంలో ఏర్పాటుచేసిన క్యాంప్‌లో వారి బస చేయనున్నారు. కుటుంబ సభ్యులతో గడిపి సోమవారం నుంచి చంద్ర'ాబు య'దావి'దిగా పాదయాత్ర చేపడతారు. శనివారంతో చంద్ర'ాబు పాదయాత్ర 173 రోజులు పూర్తయింది. ఇప్పటి వరకు 2,490 కిలోమీటర్ల దూరం నడిచారు.

చంద్రబాబు యాత్రకు నేడు విరామం

కడియం.. రాష్ట్రానికి వర'మాల'! ఈ ఊరు గుర్తొస్తే.. ముందుగా గుప్పున పూల గుభాళింపు ముక్కుపుటాలను తాకుతుంది. ఆపై నేలంతా పరుచుకొన్ని పూలవనాలు పలకరిస్తాయి. ఇప్పుడు నేను అలాంటి ఒక పూలనర్సరీ మీదగానే నడుస్తున్నాను. కానీ ఏదీ ఆ వైభవం? నర్సరీల్లో పూలూ, పెంపకందార్లూ ఒకేలా కనిపించారు. వాడిపోయిన కొన్ని పూలతోటలను చూసినపుడు మనస్సు చివుక్కుమంది.

నర్సరీ యజమానులు చెప్పిన మాటలు విన్నప్పుడు గుండెలు మెలిపడ్డాయి. కడియం పూలకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. నా హయాంలో ఇక్కడే 2002లో అంతర్జాతీయ పూల ప్రదర్శన జరిగింది. వందలాది దేశాల నుంచి ప్రతినిధులు ఈ ఊరికి వచ్చారు. మన పూల సంపదకు ముచ్చటపడ్డారు. వీలైనన్ని రకాలను వెంట తీసుకెళ్లారు. మరి ఇప్పుడు? " గతంలో ఉన్న రైతు గుర్తింపు ఇప్పుడు లేదు సార్! మమ్మల్నీ వ్యాపారులుగానే పరిగణిస్తారట. రైతు కోటాలో అంతోఇంతో అందుతున్న ప్రోత్సాహకాలనూ ఆపివేశారు. ఇక ఏం పెట్టి పూలను పెంచాలి?'' అంటూ నర్సరీ పెంపకం దార్లు వాపోతుంటే.. నాకూ దిగులేసింది.

చేనేత మగ్గాల లయబద్ధ చప్పుళ్ల మధ్య వీరవరం చేరుకున్నాను. ఇప్పటిదాకా ఎక్కడకు వెళ్లినా పూలదండల స్వాగతం లభించింది. కానీ, ఈ ఊరి నేతన్నలు మాత్రం నూలు దండలతో అభిమానం చాటుకున్నారు. పేరుకు రుణమాఫీ చేసినా..సొసైటీలకు అందిన దానిలో నూరోవంతు కూడా ఈ నేత కార్మికులకు దక్కలేదు. కానీ, ఈపేరుతో ఐదేళ్లుగా ప్రభుత్వం దగా చేస్తున్నదట! ఆత్మహత్యలు తప్ప దారి కనిపించడం లేదట! నూలుదారం తెగితేనే భరించలేని ఈ సున్నిత మనుషులపై ఇంత నిర్దయా?

వాడుతున్న పూల వనం!

'ఆత్మ'ను విచారిస్తే అక్రమాలన్నీ బయటకు..!
'తూర్పు' పాదయాత్రలో చంద్రబాబు..

కాకినాడ : "మహాభారతంలో ధృతరాష్ట్రుడిలా.. వైఎస్ ఈ రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతారు. ధృతరాష్ట్రుడు తన కొడుకు దుర్యోధనుడితో తప్పులు చేయించినట్లు వైఎస్ కూడా జగన్‌తో అనేక అక్రమాలు చేయించాడు. అధర్మంగా రాష్ట్రాన్ని దోచుకున్నారు. వారి దోపిడీకి రాష్ట్రంలో పేదలకు దక్కాల్సిన నిధులు ఆవిరైపోయాయి. కానీ మహాభారతంలో చివరికి ధర్మమే గెలిచింది. వైఎస్, కాంగ్రెస్ అక్రమాలపై ఇప్పుడు మా పార్టీ అలాంటి ధర్మపోరాటమే చేస్తోంది. ఈ పోరాటానికి మీరంతా సహకరించాలి. మనం తప్పకుండా గెలుస్తాం.'' అని టీడీపీ అధినేత చంద్ర బాబు అన్నారు.

వైఎస్ 'ఆత్మ' (కేవీపీ రామచంద్రరావు)ని విచారిస్తే అక్రమాలన్నీ బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద శనివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. వీరవరం, పొట్టిలంక, గుళ్ల మీదుగా నడిచారు. ఈ సందర్భంగా కడియంలో జరిగిన సభలో ప్రజలు ఉత్సాహంగా చంద్రబాబుకు తమ వినతులు చెప్పుకొచ్చారు. "మీరు రాగానే బ్రాందీ ఎత్తేయించండి సార్!'' అని ఓ మహిళ విజ్ఞప్తి చేయగా, "రాష్ట్రంలో వైఎస్ కుటుంబం ఒక్కటి తప్ప అందరం కష్టాల్లోనేఉన్నా''మని ఓయువకుడు ఆవేదక వ్యక్తం చేశారు. వారిని చంద్రబాబు అనునయించారు.

జగన్ అక్రమాస్తుల కేసులో ఎంపీ కేపీవీని సీబీఐ ప్రశ్నించిన ఉదంతాన్ని పాదయాత్రలో ప్రముఖంగా ప్రస్తావించారు. "వైఎస్ 'ఆత్మ' సీబీఐ ఎంక్వయిరీకి వెళ్లింది. పరలోకంలో ఉన్న 'ఆత్మ' చేసిన అక్రమాలు, ఆయన కొడుకు చేసిన అక్రమాలు ఈ విచారణలో బయటకు రావాలి'' అని పేర్కొన్నారు. రాజకీయాలకు వైఎస్ కుటుంబం కళంకం తెచ్చిందని మండిపడ్డారు. "మతం ముసుగులో వైఎస్ అల్లుడు అక్రమాలకు పాల్పడుతున్నారు. విజయలక్ష్మి తమ్ముడు ఎరువుల్లో మట్టి కల్తీచేసి అమ్ముతున్నాడు. రాజకీయాలలో ఇన్ని దారుణాలకు ఏ కుటుంబమూ పాల్పడలేద''ని విమర్శించారు.

పోలవరం పేరుతో సమాంతర కాల్వలు తవ్వి వేల కోట్ల రూపాయలు దోచుకున్న ఘనత వైఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలదేనని దుయ్యబట్టారు. టీడీపీ కార్యకర్తలూ, ప్రజలూ నిర్లక్ష్యం, నిర్లిప్తత విడనాడి కాంగ్రెస్ అక్రమాలతో జరుగుతున్న నష్టాలను అందరికీ వివరించాలని పిలుపునిచ్చారు. కాగా, పాదయాత్రకు ఆదివారం చంద్రబాబు విరామం ఇవ్వనున్నారు. భార్య భువనేశ్వరి, తనయుడు లోకేశ్ శనివారం పాదయాత్రలో ఉన్న చంద్రబాబును కలిశారు. ఆదివారం మండపేట మండలం ఏడి ద గ్రామంలోని క్యాంప్‌లో వారు బస చేయనున్నారు. రోజంతా ఆయన వారితోనే గడుపుతారు.

వైఎస్.. ఓ ధృతరాష్ట్రుడు.. ఆయన కొడుకు.. ఓ దుర్యోధనుడు