March 2, 2013


 అవినీతిపరుల నుంచి రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడేందుకు వయస్సును సైతం లెక్కచేయక పాదయాత్ర చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టేందుకు ప్రతి కార్యకర్త ఉత్సాహంగా కదలి రావాలని గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. చంద్రబాబు 'వస్తున్నా..మీకోసం' మలివిడత పాదయాత్ర ఈనెల 5న గుడివాడ చేరుకుంటున్న సందర్భంగా జయప్రదం చేసేందుకు నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం శనివారం నిర్వహించారు. రావి మాట్లాడుతూ చంద్రబాబు పాదయాత్రను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త శ్రమించాలని పిలుపునిచ్చారు.

నందివాడ, గుడివాడరూరల్, గుడ్లవల్లేరు, పట్టణంలోని నేత లు, కార్యకర్తలు చంద్రబాబు పాదయాత్ర సమాచారాన్ని ఇంటింటికి చెరవేసి వేలాది మంది ప్రజల్ని నెహ్రూచౌక్‌లో జరిగే బహిరంగ సభకు తీసుకువచ్చి టీడీపీ సత్తా చాటాలని ఉద్బోధించారు.

వాడవాడలా పసుపు జెండా రెపరెపలాడేలా చేయాల న్నారు. 5వ తేదీ మధ్యాహ్నాం 2గంటలకు రూరల్ మండలం గాం«ధీ ఆశ్రమానికి ప్రతి నేత, కార్యకర్త చేరుకుని అధినేతకు ఘనస్వాగతం పలకాల న్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లంకదాసరి ప్రసాదరావు మాట్లాడుతూ ఎమ్మె ల్యే అంబటి బ్రహ్మణయ్యకు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ అవనిగడ్డలో కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికి టీడీపీ సత్తా చాటారన్నారు. అదే ఉత్సాహంతో పార్టీ నేత లు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాలన్నారు. చంద్రబాబు పాదయాత్ర విజయంతానికి అం దరూ సమిష్టిగా కృషి చేయాలని పలువురు నేతలు సూచించారు.

ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలి


పార్టీని గెలిపించే బాధ్యత మీది...మీ బాధ్యత నాది...అదిచేసి నా నిజాయితీని నిరూపించుకుంటునానని అధినేత చంద్రబాబు అన్నారు. పాదయాత్రలో భాగంగా కూచిపూడిలో శనివారం ఉదయం అవనిగడ్డ, తిరువూరు నియోజకవర్గాల కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపిక విషయంలో రాగద్వేషాలకు తావులేదనీ, ఎన్నికల్లో గెలుపే ప్రధానంగా అర్హత ఉన్నవారినే ఎంపికచేసేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. పదవులు కావాలంటే ప్రజల్లో పలుకుబడి ఉండాలనీ, ఆ నాయకుడిపై కార్యకర్తల్లో నమ్మకముండాలన్నారు. టీడీపీకి ఉన్న పెద్దబలం కార్యకర్తలేననీ, ఏపార్టీకి లేని ఈ బలాన్ని 30 ఏళ్ళుగా నిర్మాణం చేసుకుంటూ వచ్చినట్లు చెప్పారు.

క్యాడర్‌ను సద్వినియోగం చేసుకోవటంలో ఇన్‌చార్జీలు విఫలమవుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో కఠినంగా ఉంటాననీ, అలా ఉంటేనే నేతలు బాగుపడతారనీ, పనిచేయకుంటే తొలగించట ఖాయమని చంద్రబాబు తేల్చిచెప్పారు. వ్యక్తిగత విభేదాలు, ఇగోలతో పార్టీని దెబ్బతీయటం మంచిదికాదనీ, అది మనకే నష్టమన్నారు. ప్రతి జిల్లాల్లో సమన్వయ కమిటీ సమావేశాలు, మండలాల వారీ సమావేశాలు నిర్వహించి పార్టీ గెలుపు ఓటములపై సమీక్షించాలన్నారు.

బీసీ డిక్లరేషన్, ముస్లిం పాలసీ, వర్గీకరణ, రుణమాఫీ అంశాలు ప్రజల్లోకి ఎలా వెళ్ళాయో చూడాలనీ, అందుకు గ్రామాల్లో ప్రచారం చేపట్టాలన్నారు. నాయకులు ఇంకొంచె హుషారుగా ఉండాలని సూచించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కార్యకర్తలు ఏమంటున్నారంటే..

* ఘంటసాల మండలానికి చెందిన పరిశె చలపతిరావు మాట్లాడుతూ టికెట్టు ఇచ్చేముందు ఆ అభ్యర్థి సంవత్సరం నియోజకవర్గంలో పనిచేయాలన్నారు. ఎవరినో తీసుకువచ్చి నిలబెట్టడం మేము గెలిపించటం వల్ల కార్యకర్తలకు బలం చేకూరడంలేదన్నారు.

* మోపిదేవి మండలానికి చెందిన నారగం పరంజ్యోతి మాట్లాడుతూ ఉద్యోగులను దగ్గరకు తీసుకోవాలనీ, వారికున్న అపోహలను తొలగించి ఆకట్టుకోవాలని కోరారు.

పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ విభేదాల గురించి ప్రస్తావించగా, వ్యక్తిగత విబేధాలను సరిచేసుకోవాలన్నారు. పార్టీకి నష్టపరిచే చర్యలను సహించబోనన్నారు. పాదయాత్రకు వెళ్ళాల్సి ఉన్నందున వ్యక్తిగతంగా ఏమైనా చెప్పాలంటే జిల్లాలో ఆరు రోజులు ఉంటా.. విని తగు చర్యలు తీసుకుంటానని చంద్రబాబు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

సమావేశంలో మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, పార్టీనేతలు నలగట్ల స్వామిదాసు, కేశినేని నాని, వల్లభనేని వంశీమోహన్, కాగిత వెంకట్రావు, బచ్చుల అర్జునుడు, వర్ల రామయ్య, కంఠంనేని రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

పార్టీని గెలిపించే బాధ్యత మీది..మీ బాధ్యత నాది

ఆ పేదల దేవాలయాలు తెరుచుకోవు. తాళం తప్ప మరేదీ పలకరించదు. పూజారి కనికరిస్తే దేవుడు అలుగుతాడు. దేవుడు వరమిస్తే పూజారి మొండిచెయ్యి చూపుతాడు. ఇవీ మన ధర్మాసుపత్రులు. పేదోడి దరిన ఉండాల్సిన ఈ వైద్యశాలలు దానాధర్మం అన్నట్టు తయారయ్యాయి. వాటిని నమ్ముకుంటే అంతే సంగతులు.. నెలలో ఒకట్రెండు సార్లే వైద్యుడి దర్శనం అవుతుంది. మిగతా కాలమంతా కాంపౌండర్లదే రాజ్యం. విలువైన ప్రజల ప్రాణాలు వానాకాలం వైద్యంతో చెలామణి అయిపోయే వీళ్ల చేతుల్లోనా?..పెడసనగల్లులో ఇద్దరు మహిళల ఆసరాతో ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు.

చాలాకాలంగా మంచంలోనే ఉన్నాడట. నేను వచ్చానని తెలిసి.. చూడాలని కోరితే అతికష్టం మీద తీసుకువచ్చారట. స్థానిక ఆస్పత్రి గురించి ఆరా తీశాను. అందులో చేర్చి నయం చేయించవచ్చు కదా అని సూచించాను. ఆరోగ్య శ్రీ ఉంటే వైద్యం కూడా ఉచితంగానే చేస్తారు కదా అని పరామర్శించాను. గుడిలో ఉత్సవ విగ్రహంలాగే.. ఊళ్లో ధర్మాసుపత్రి ఉన్నదని ఆ మహిళలు చెప్పుకొచ్చారు. ఆ దేవుడైనా పదిసార్లకు ఒకసారైనా మొర ఆలకిస్తాడేమో గానీ.. ఈ ఊరి డాక్టర్ వంద సార్లకూ ఉలకడట. ఈ వ్యక్తిలాగే జీవచ్ఛవాల్లా పడి ఉన్న వారందరి కోసం ప్రాణం కొట్టుకుంటోంది. పెదపూడిలో దళిత వాడలకు వెళ్లాను. అవన్నీ మురికివాడల్లా కనిపించాయి.

చింపిరి జుట్టు పిల్లలు ఆ మురుగ్గుంటల పక్కనే ఆటాడుకుంటున్నారు. పీలగా ఉన్న ఆ చిన్నారుల కళ్లు పీక్కుపోయాయి. అపరిశుభ్ర వాతావరణంలో తిరగడంతో పాటు.. వేళకు సరైన తిండీ లేకపోవడంతో వారంతా చిక్కిపోయారు. వాళ్ల అమ్మానాన్నకు ఉంటే కదా వీళ్లకు పెట్టడానికి? ఎముకల గూళ్లలా ఉన్నారు. వీళ్లేనా మన భావి భారత పౌరులు!

.. వీళ్లా మన భావి పౌరులు!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఏడాదంతా జనంలోనే ఉండబోతున్నారు. దీని కోసం ఆయన ఒక బృహత్ ప్రణాళిక రూపొందించుకొన్నారు. ఈ ప్రణాళిక అమలుపై ఆయన ఇప్పటికే పార్టీ సీనియర్లతో సమాలోచనలు సాగిస్తున్నారు. గత నూటా ఏభై రోజులుగా అవిశ్రాంతంగా కొనసాగిస్తున్న ప్రస్తుత తన పాదయాత్రను మే ఒకటో తేదీతో ముగించాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. ముందు అనుకొన్నట్లుగా మే ఒకటో తేదీ నాటికి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగించనున్నారు.

'పరిస్థితులను బట్టి ఒకటి రెండు రోజులు అటూఇటూ కావచ్చు. ఇది తాత్కాలిక ముహూర్తం' అని ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. పాదయాత్ర పూర్తి కాగానే మే నెలాఖరులో హైదరాబాద్‌లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహణకు నడుం కట్టనున్నారు. ప్రతిసారీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే మహానాడు సందర్భంగా రాష్ట్ర స్ధాయిలో భారీ సభను నిర్వహించడం తెలుగుదేశం పార్టీలో అనవాయితీగా వస్తోంది. మే 28వ తేదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు పుట్టిన రోజు. ఆ తేదీనే ఈ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనితోపాటు మరో రెండు రోజులపాటు మహానాడు ప్రతినిధుల సమావేశాలు కూడా నిర్వహించాలా లేదా అన్నది ఇంకా ఖరారు కాలేదు.

సభ ముగిసిన వెంటనే జూన్ నుంచి రెండో విడత పాదయాత్రకు చంద్రబాబు మరోసారి ప్రజల్లోకి వెళ్ళాలని అనుకొంటున్నారు. మొదటి విడత పాదయాత్రలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలను సందర్శించలేకపోయారు. మలి విడతలో ఈ జిల్లాల్లో పాదయాత్ర చేయాలన్న సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు. ఆరోగ్యం సహకరించినంతవరకూ పాదయాత్రతోనే వెళ్తానని, కుదరకపోతే అప్పుడు ఆలోచిస్తానని ఆయన పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. రెండు విడతల్లో కలిపి చంద్రబాబు సుమారు వంద నియోజకవర్గాలు సందర్శిస్తారని అంచనా.

ఇంకా సుమారు 194 దాకా మిగిలిపోయి ఉంటాయి. వీటినీ, మండలాలవారీగా కలుపుకుపోయేలా బస్సు యాత్ర చేపట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 'ఎన్నికలు కొంత ముందు రావచ్చునని అందరూ అనుకొంటున్నారు. ఈలోపే రాష్ట్రంలో ప్రతి మండలం సందర్శించి ప్రజల్లోకి వెళ్ళడం, పార్టీ శ్రేణులను ఉత్తేజపర్చడం, పార్టీ వాణిని వినిపించడం ఆయన లక్ష్యాలు. ఈ లెక్కన ఈ ఏడాదంతా ఆయన జనంలోనే ఉండేలా కనిపిస్తోంది' అని ఒక సీనియర్ నేత పేర్కొన్నారు.

ఈ ఏడాదంతా జనంలోనే బాబు

నేను నిద్రపోను. మిమ్మల్ని నిద్రపోనివ్వను'... ముఖ్యమంత్రిగా చంద్రబాబు ట్రేడ్ మార్క్ డైలాగ్ ఇది. అదే చంద్రబాబు... 'ఎంత సేపు నిద్రపోతారో నిద్రపోండి!' అని అంటే!? నమ్మశక్యంగా లేదు కదూ! నిజంగానే అన్నారు. తెలుగు తమ్ముళ్లతో సరదా సరదాగా మాట్లాడారు. చలోక్తులు విసురుతూ, కర్తవ్య బోధ చేస్తూ, భరోసా ఇస్తూ మాట్లాడారు.

శనివారం కృష్ణా జిల్లా కూచిపూడిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 'రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన పాలనతో ప్రజలను కష్టాల పాలు చేస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రభుత్వాన్ని గద్దె దించవచ్చు కదా!' ఓ కార్యకర్త ఆవేశంగా ప్రశ్నించడంతో... 'అవసరమైతే అవిశ్వాసం పెడదాం తమ్ముడూ. దీనివల్ల నీకొచ్చే లాభమేంటో' అని చంద్రబాబు నవ్వుతూ ప్రశ్నించారు.

అవిశ్వాసం పిల్ల కాంగ్రెస్ బేరసారాలకు పనికొస్తుందని, కాంగ్రెస్ వాళ్లకు సూట్‌కేసులు అందుతాయని అన్నారు. 'దేనికైనా తగిన సమయం రావాలి. మనం ఆత్రుత ప్రదర్శిస్తున్నామని ప్రజలు భావించకూడదు తమ్ముడూ' అని సర్దిచెప్పారు. గతంలో తాను సీఎంగా చేసిన సమయంలో నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వననే స్థాయిలో పని చేస్తే... కార్యకర్తలు దీనిపై వ్యతిరేక ప్రచారం చేశారని, దీనివల్ల ఉద్యోగులకు వ్యతిరేకమయ్యామని బాబు అన్నారు. 'ఈసారి మీరు ఎంతసేపు పడుకుంటారో పడుకోండి! ఆ తర్వాత అంతా కలిసి పనిచేద్దాం!' అనే కొత్త నినాదంతో ముందుకువెళదామని చెణుకులు విసిరారు.

ఎంత సేపు నిద్రపోతారో నిద్రపోండి!

ఆయన నిర్వాకంతో తెలంగాణ ఎడారి
18 లక్షల ఎకరాలు బీడే
అయినా.. నష్టం లేదనడం ఘోరం
కృష్ణాజిల్లా పాదయాత్రలో చంద్రబాబు ధ్వజం


బాబ్లీ ప్రాజెక్టు పాపం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వానిదేనని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. కిరణ్ నిర్వాకం వల్ల తెలంగాణ ప్రాంతంలో 18 లక్షల ఎకరాలు ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదపూడి వద్ద శనివారం పాదయాత్రను ఆయన ప్రారంభించారు. పెడసనగల్లు, వడ్డపెనుమర్రు, ఐనంపూడి, ముళ్లపూడి, హనుమంతాపురం మీదగా 12.4 కిలోమీటర్లు నడిచారు.

ఈ సందర్భంగా పెడసనగల్లు-భట్లపెనుమర్రు గ్రామాల్లో జరిగిన బహిరంగసభల్లో.. బాబ్లీపై కిరణ్, వైఎస్ ప్రభుత్వాలను తూర్పారబట్టారు. సుప్రీం తీర్పు వల్ల రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరగలేదని ప్రభుత్వం సమర్థించుకోవటం ఘోరమని దుయ్యబట్టారు. బాబ్లీపై పోరాటం చేసింది ఒక్క టీడీపీయేనని, తాను మూడు రోజులు జైలులో ఉన్నానని, తమ నాయకులపై లాఠీ దెబ్బలు పడ్డాయని గుర్తుచేశారు.

పరిపాలనే చేతగాని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ తనను రుణమాఫీ ఎలా సాధ్యమని ప్రశ్నించడం విడ్డూరమన్నారు. మూడేళ్లుగా డెల్టా ఆధునికీకరణ పేరుతో నిధులు దోచుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ ప్రభుత్వం జలయజ్ఞం పేరిట 80 వేల కోట్లు ఖర్చుపెట్టి 8వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్, వైసీపీలు తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తికాకపోవడం వల్లే రైతులకు సాగునీటి సమస్య తలెత్తిందని చెప్పారు. ఈ విషయంలో వైఎస్‌తోపాటు రోశయ్య, కిరణ్‌కుమార్ కూడా విఫలమయ్యారని విమర్శించారు.

కత్తితో వృద్ధుడి హల్‌చల్
చంద్రబాబు శిబిరంలో ఓ వృద్ధుడు కత్తితో సంచరించి కొద్దిసేపు హల్‌చల్ సృష్టించారు. అతడిని నల్గొండ జిల్లాకు చెందిన వృద్ధుడు కోయ రాజుగా పోలీసులు గుర్తించారు. బాబు బస చేసిన ప్రాంతంలో రాజు బ్యాగ్ చేతపట్టుకుని అటూఇటూ తిరుగుతుండటం భద్రతాసిబ్బంది కంటపడింది. ఆరా తీయగా ' చంద్రబాబును చూసేందుకు వచ్చాను'' అని చెప్పాడు. అనుమానం వచ్చి తనిఖీ చేయగా బ్యాగులో చిన్న గొడ్డలి, చాకు కనిపించాయి.

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. ఆయనను అదుపులోకి తీసుకొని కూచిపూడి పోలీసులకు అప్పగించారు. పోలీసులు మరింత నిశితంగా బ్యాగును సోదా చేయగా..మూలికావైద్యానికి సంబంధించిన పొడులు, వైద్యానికి సంబంధించిన పుస్తకాలు, చిన్నత్రాసు ఉన్నాయి. దాంతో పోలీసులూ, టీడీపీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశామని, నల్గొండ తరలిస్తున్నామని చల్లపల్లి సీఐ బాలరాజు తెలిపారు.

బాబ్లీ పాపం కిరణ్‌దే!

కుమారుడి గుండె శస్త్ర చికిత్సకోసం నగరానికి వచ్చి దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో కుటుంబం మొత్తం ఆస్పత్రి పాలైన వైనంపై ఏబీఎన్‌లో వచ్చిన కథనాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ స్పందిచింది. హార్ట్ పేషెంట్ చిన్నారి అనిల్ మెడికల్ రిపోర్టులు పరిశీలించి ఉచిత వైద్యం అందించనున్నట్లు ఎన్టీఆర్‌ట్రస్ట్ తెలిపింది. వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచించారు.

ఏబీఎన్ కథనాలకు స్పందించిన ఎన్టీఆర్ ట్రస్ట్

వస్తున్నా..మీకోసం కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రలో ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ పాల్గొననున్నారు. రేపు, ఎల్లుండి కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో చంద్రబాబుతో కలిసి బాలకృష్ణ పాదయాత్ర చేయనున్నారు.

చంద్రబాబు పాదయాత్రలో పాల్గొననున్న బాలకృష్ణ

రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉందని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర జిల్లాలో నిర్వహిస్తున్న బాబు శనివారం కార్యకర్తలతో మాట్లాడుతూ అవిశ్వాసం పెట్టే విషయమై పొలిట్ి బ్యూరో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

టీడీపీ అవిశ్వాసం పెట్టాలని చూస్తే పిల్ల కాంగ్రెస్ బేరాలు కుదుర్చుకుంటోందని చంద్రబాబు ఆరోపించారు. గతంలో అవిశ్వాసం పెట్టామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సూట్ కేసులు అందాయని ఆయన అన్నారు. టీడీపీ అవిశ్వాసం పెట్టి అవినీతికి ఊతం ఇచ్చినట్టు అయ్యిందని చంద్రబాబు వివరించారు

అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంది : చంద్రబాబు


ఉదయం సమీక్షలు... సాయంత్రం పాదయాత్ర, బహిరంగ సభలతో చంద్రబాబు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు హుషారెక్కిస్తున్నారు. జిల్లాలో మలివిడత చేపట్టిన వ స్తున్నా..మీకోసం పాదయాత్ర విజయవంతంగా సాగుతుండటంతో పార్టీ నేతల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. బాబు బస చేసిన శిబిరానికి ఉదయాన్నే చేరుకుంటూ అక్కడి నేతలతో కలిసి ఉండటం, బాబును కలిసేందుకు వచ్చే ఇతర జిల్లాల నేతలతో మాట్లాడటం, కార్యకర్తలను పలుకరించటం వంటి కార్యక్రమాల్లో ముఖ్యనేతలు బిజీగా, హుషారుగా గడుపుతున్నారు...

చల్లపల్లి-ఘంటసాల: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ స్తున్నా..మీకోసం పాదయాత్ర జిల్లాలో విజయవంతంగా సాగుతుండటంతో పార్టీ నేతల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. బాబు బసచేసిన శిబిరానికి ఉదయాన్నే చేరుకుంటూ అక్కడి నేతలతో కలిసి ఉండటం, బాబును కలిసేందుకు వస్తున్న ఇతర జిల్లాల నేతలతో మాట్లాడటం, కార్యకర్తలను పలకరించటం తదితర కార్యక్రమాల్లో ముఖ్యనేతలు బిజీగా, హుషారుగా గడుపుతున్నారు. బాబు బసచేసిన ప్రాంతంలో శుక్రవారం పార్టీనేతలు హుషారుగా కనిపించారు. మరోవైపు సమీక్షలకోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, స్థానిక నేతలు, కార్యకర్తలు తమ అభిమాన నేతలతో ఫొటోలు దిగుతూ సందడి చేశారు.

అయ్యన్నపాత్రుడితో ముచ్చట్లు

చిట్టూర్పు శివారు ప్రాంతంలో శుక్రవారం చంద్రబాబు బసచేసిన ప్రాంతానికి మాజీమంత్రి, విశాఖజిల్లా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తన కుమారుడు విజయ్, విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణతో కలిసి వచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, ఎమ్మెల్పీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్, టీడీపీ రాష్ట్రనేత వర్ల రామయ్య, విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్, మాజీ ప్రభుత్వ విప్ కాగిత వెంకట్రావ్ తదితరులు అయ్యన్నపాత్రుడితో ముచ్చటించారు. .

అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువగా, నేతలంతా వారసుడు వచ్చాడా అంటూ తండ్రీ కొడుకులతో ముచ్చటించారు. పలువురు అభిమానులు వంశీమోహన్, కాగిత వెంకట్రావ్‌లతో ఫొటోలు దిగారు. సమీక్ష ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తూ కార్యకర్తలను బచ్చుల అర్జునుడు సమన్వయం చేయగా, చంద్రబాబు పాదయాత్ర, వసతి ఏర్పాట్లు పర్యవేక్షించే గరికపాటి మోహనరావు అటు బాబుతో, ఇటు సెక్యూరిటీ, ముఖ్యనేతలతో మాట్లాడుతూ బిజీగా గడిపారు. పలువురు వ్యాపారవేత్తలు, స్థానిక ప్రముఖులు టీడీపీ నేతలతో కలిసి తిరుగుతూ సందడి చేశారు.

చంద్రుడి జోష్


తెలుగు తమ్ముళ్ళకు పార్టీ అధినేత చంద్రబాబు గీతోపదేశం చేశారు. చిట్పూర్పు వద్ద తాను బసచేసిన ప్రదేశంలో శుక్రవారం విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలకు కర్తవ్యబోధనతోపాటు నాయకులకూ చురకలేశారు.

రాబోయే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో ప్రత్యర్థులను ఎదుర్కోనడానికి అ వసరమయ్యే ఉపాయాలు, మెళకువలను వివరిస్తూ వారిని మానసికంగా సంసిద్ధం చేసే ప్రయత్నం చేశారు. రెండు నియోజకవర్గాల నుంచీ పెద్దసంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశంలో కొందరు కార్యకర్తలు నిర్మొహమాటంగా పార్టీ గురించి, పడుతున్న బాధల గురించి అధినేత దృష్టికి తీసుకువెళ్లారు.

కార్యకర్తలందరిదీ ఒకే కుటుంబం..
టీడీపీ కార్యకర్తలందరూ ఒక కుటుంబంలోని సభ్యులుగానే మెలగాలన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తలా ఒక చెయ్యి వేయాలని, పరామర్శలు, పలుకరింపులతో పాటు సెంటిమెంట్లను కాపాడుతూ వారికి ధైర్యంచెప్పాలన్నారు. విజయవాడ 56వ డివిజన్ నేత నాగమణి తనకు శస్త్రచికిత్స జరిగితే ఇన్‌చార్జి కనీసం పలుకరించలేదన్నా దానిపై బాబు స్పందించారు.

నాయకుడు ఎలా ఉండాలంటే...

రాజకీయాల్లో నాయకుడు నడవడికే ముఖ్యమని చంద్రబాబు అన్నారు. క్యాడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలన్నారు. ప్రజల్లో తిరిగి వారి సమస్యలు తెలుసుకోవాలనీ, అందరి మన్ననలు పొందాలన్నారు. పనికిరాని రాయికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే దేవుడిగా మారుతుందనీ, ఆ తర్వాత రాయిలో దేవుడిచూస్తూ కొలుస్తామనీ, అలాగే నాయకుడు కాకముందు ఎవరైనా రాయి వంటివారేనన్నారు. సామాన్యుడిని ఒక్కసారి నాయకుడిగా ఎదుగుతాడు ఆ తర్వాత దానిని నిలబెట్టుకోవడానికి నిత్యం శ్రమించాలి.

సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవాలి

కార్యకర్తల సమావేశాలు, సమీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని చంద్రబాబు సూచించారు. ఎస్ఎంఎస్‌లు, నెట్ ద్వారా ఈ మెయిల్స్ పంపి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలసుకోవాలన్నారు.

పార్టీకి ఇబ్బందులు కలిగిస్తే కఠిన నిర్ణయాలే...

పార్టీకి ఇబ్బందులొస్తాయనుకుంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. భేదాభ్రియాలుంటే సరిచేసుకోవాలనీ, మీవల్ల కాకుంటే ఇంకొకరి వద్ద, మరొకరి దృష్టికి తీసుకువచ్చి సరిచేసుకోవాలన్నారు. గ్రామాల్లో గ్రూపులు ఉంటున్నాయని కార్యకర్తలు చెప్పడంతో బాబు ఈవిధంగా స్పందించారు. నేను ఒక్కడినే శ్రమిస్తే సక్సెస్ రాదనీ, కార్యకర్తలంతా కష్టపడాలని బాబు కోరారు. ప్రజల్లోకి వెళ్ళి పాజిటివ్ ధృక్ప«థంతో వెళ్లాలన్నారు.

తప్పులు చేస్తే జైలు కెళ్ళేవాళ్ళం...


30ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశా.. రెండోసారి ప్రతిపక్ష నేతగా ఉన్నా నేను ఏ తప్పూ చేయలేదని చంద్రబాబు అన్నారు. ఇసుక, బొగ్గు, మైనింగ్ కుంభకోణాల్లో మనమెన్నడూ లేమనీ, తప్పులు చేసుంటే జైళ్ళలో ఉండేవారమన్నారు. తల్లి, పిల్ల కాంగ్రెస్ కార్యకర్తలకు గౌరవం లేదు. టీడీపీ కార్యకర్తలంటే ఎంతో గౌరవం ఉందనీ, మిమ్ముల్ని చూస్తే గర్వంగా ఉందంటూ చంద్రబాబు అన్నారు.

రఘురాం

సేవలు ఉపయోగించుకుంటాం...


జగ్గయ్యపేట నియోజకవర్గంలో రఘురాం సేవలు పార్టీకి ఉపయోగించుకుంటామని చంద్రబాబు అన్నారు. పాతతరం నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలనీ, గెలుపు కష్టమైన సమయంలో అందరితో చర్చించి కొత్తవారికైనా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందనీ, అందుకు జగ్గయ్యపేట ఉదాహరణ అన్నారు. రఘురాంకు తగిన గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు.

సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, ఎమ్మెల్సీ వె.ౖవి.బి.రాజేంద్రప్రసాద్, బొండా ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీమోహన్, కేశినేని నాని, కాగిత వెంకట్రావు, బచ్చుల అర్జునుడు, పంచుమర్తి అనూరాధ పాల్గొన్నారు.

చంద్రోపదేశం


చల్లపల్లి-ఘంటసాల : సమీక్షలో పలువురు పార్టీ కార్యకర్తలు నిర్మొహమాటంగా అభిప్రాయాలను అధినేతకు తెలిపారు.

విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులనే నిలబెట్టాలి : గొట్టుముక్కల రవి

మిత్రపక్షాల వల్ల సీట్లు కోల్పోతున్నాం. తొమ్మిదేళ్లగా ప్రజలు నరకం చూస్తున్నారు : శ్రీనివాసగుప్తా

కాల్వగట్ల వాసులు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. వారి సమస్యల పరిష్కారానికి పార్టీ తరుపున పోరాడాలి : సుభద్ర

ఒకటో డివిజన్‌లో సమర్థవంతమైన నాయకుడిని నిలబెటితే విజయం తధ్యం : మురళీదేవి

టీడీపీలోమహిళలను ఆదరించాలి. వాంబే కాలనీలో ఇళ్ళపై తీసుకున్న అప్పులను మాఫీచేయాలి : దేవమణి

టీడీపీ శ్రేణులే ఎమ్మెల్సీని ఓడించారు. స్మార్ట్‌కార్డు వ్యవస్థను రద్దుచేయాలి : జిల్లేపల్లి సుధీర్‌బాబు, జగ్గయ్యపేట

గ్రామంలో నాలుగైదు గ్రూపులు ఏర్పడ్డాయి. దాంతో పార్టీ బలహీన పడుతుంది : తాళ్ళూరి వెంకటేశ్వర్లు

రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి పార్టీ అండగా నిలవాలి : శ్రీనివాస్

సీనియర్ కార్యకర్తలను గుర్తించాలి. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, పార్టీనేతలు తిరగాలి : శ్రీనివాసరావు(వాసు)

గ్రామస్థాయిలో నేతలు తిరుగుతూ కష్టపడాలి: నాగమల్లేశ్వరరావు

తన భర్త చనిపోయి ఇబ్బందుల్లో ఉంటే పార్టీనేతలు ఆర్థికంగా ఆదుకున్నారు. పదో తరగతి చదివే తన కుమారుడిని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివించాలి: మండాది కరుణకుమారి

పార్టీలో విబేధాలు క్యాన్సర్‌కంటే ప్రమాదం. పార్టీకి నష్టంచేసే పరిస్థితి వస్తే సహించేది లేదంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. కార్యకర్తల సలహాలను, సూచనలను ఓపికగా విన్న చంద్రబాబు వాటిని నోట్ చేసుకున్నారు.

నిర్మోహమాటంగా....


 అసాధ్యాన్ని సుసాధ్యం చేయటమే నా చరిత్ర.. రుణమాఫీ అమలుచేసి తల్లి, పిల్ల కాంగ్రెస్‌ల నోటికి తాళం వేస్తానని టీడీపీ అధినేన చంద్రబాబు నాయుడు అన్నారు. పాదయాత్ర శుక్రవారం సాయంత్రం కొడాలి చేరుకుంది. ఈ సందర్భంగా కొడాలి సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మీ కష్టాలే.. నాకష్టాలు.. ఈ కష్టం మీ కోసమేనన్నారు. నాకు ఎలాంటి స్వార్థం లేదు.. ఆశ లేదు అన్నారు. సామాజిక న్యాయం తనతోనే సాధ్యమన్నారు.

అప్పుల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు కష్టసాధ్యమైనా రుణమాఫీ చేసేందుకు కంకణం కట్టుకున్నానన్నారు. అందరూ కష్టాలు పడుతున్నారనీ, మహిళలైతే మిషన్‌ల మాదిరి పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారంలోకి వస్తే అందరి కష్టాలనూ గట్టెక్కిస్తానని హామీ ఇచ్చారు. నేను అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధి చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాశనం చేస్తోందన్నారు. అందుకు ఉదాహరణ విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్ట డమేనన్నారు. పట్టణాలు, పల్లెలు తేడాలేకుండా కరెంటుకోత విధిస్తున్నారనీ, వ్యవసాయానికి ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితికి తీసుకువచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వ పనితీరు కారణంగా విద్యార్ధులు మంచి చదువుచదివి ఇక్కడే పరిశ్రమలు స్థాపించారనీ, లేకుంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారన్నారు.

సభలో మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీ, కంఠంనేని రవిశంకర్, మండల నేతలు తుమ్మల చౌదరిబాబు, జి.వి.రామకృష్ణ,అత్తలూరి గోపీచంద్, సూరపనేని శివాజీ, వేమూరి సాయి వెంకట రమణ, బొందలపాటి గంగారత్నం, అందె జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే నా చరిత్ర

వారధి నిర్మాణం చేపట్టి జాతీయ రహదారిని ఏర్పాటు చేసిన విధంగానే మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ ఏర్పాటు టీడీపీ పాలనలోనే జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. జిల్లాలోకి మలివిడత వస్తున్నా..మీకోసం పాదయాత్ర చేపట్టిన ఆయన బుధవారం రాత్రి అవనిగడ్డ వంతెన సెంటర్‌లో జరిగిన

బహిరంగసభలో ప్రసంగించారు....

అవనిగడ్డ-మచిలీపట్నం ,ఫిబ్రవరి 28: వారధి నిర్మాణం చేపట్టి జాతీయ రహదారిని ఏర్పాటు చేసిన విధంగానే మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైన్ ఏర్పాటు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరుగుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. జిల్లాలో బుధవారం రాత్రి అవనిగడ్డ వంతెనసెంటర్‌లో జరిగిన బహిరంగసభలో ్ఘబాబు ప్రసంగించారు. బ్రిటిష్ కాలం నాటి క్యాంప్‌బెల్ ఆక్విడెక్ట్ నిర్మాణం తర్వాత పెద ్దనిర్మాణం తనహయాంలోనే చేపట్టాననీ, పులిగడ్డ ఆక్విడెక్టు ప్రత్యామ్నాయంగా పులిగడ్డ-పెనుమూడి వారధిని నిర్మించినట్లు తెలిపారు. కోస్తా హైవేని కలిపేందుకు వారధి ఉపయోగపడిందనీ, నరసాపురం నుంచి ఒంగోలు వరకూ 214ఏ జాతీయ రహదారిని చేస్తే దానిని అభివృద్ధి చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. తుపాను వస్తే దివిసీమ ఉలికిపాటుకు గురవుతుందనీ, 1999లో వచ్చిన ఉప్పెనకు రాత్రంతా తాను నిద్రపోకుండా అధికారయంత్రాంగాన్ని అప్రమత్తంచేసి సహాయక చర్యలు చేయించానన్నారు. అవనిగడ్డ ప్రాంత అభివృద్ధికి దోహదపడే మచిలీపట్నం-రేపల్లె కోస్తా రైలు లింకుమార్గం కాంగ్రెస్ వల్ల సాధ్యం కాదన్నారు. అసెంబ్లీలో బీసీలకు 100 సీట్లిస్తామని బీసీ డిక్లరేషన్ ప్రకటించిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. గతంలో డెల్టాకు ఒకపంటకు నీరే వచ్చేదనీ, ఎన్టీఆర్ వచ్చిన తర్వాత రెండు పంటలకూ నీరందిందనీ, నేడు ఆధునికీకరణ పేరుతో ఒకపంటకే నీరివ్వటం దారుణమన్నారు. మహిళల మెడలో బంగారం అవసరాలకోసం బ్యాంకుల్లో తాకట్టుపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బంగారం ధర పెరిగేందుకు వైఎస్ పెద్దకొడుకు గాలి జనార్ధనరెడ్డి కారణమనీ, దేశంలోని బంగారాన్నంతా కొని కూడబెట్టటంతో బంగారం ధర రూ.ఐదు వేల నుంచి రూ.30వేలకు పెరిగిందన్నారు. నిత్యావసర ధరలు పెరిగిపోవటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారనీ, సెల్‌ఫోన్‌లో ఎస్ఎంఎస్ చేస్తే మద్యం వస్తున్నా, ఫోన్‌చేసి అడిగినా నీరు రావడంలేదని విమర్శించారు. ఆటోల్లో వెళుతున్న మహిళలను పోలీసులు వేధింపులకు గురిచేయటం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన ప్రభుత్వమని దుయ్యబట్టారు. వైఎస్సార్ అవినీతికి గేట్లు తెరిచాడని విమర్శించారు. సీల్డ్ కవర్ ద్వారా సీఎం పదవి చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు అన్నీ తెలుసని ఫోజులు కొట్టటం మినహా ఏమీ తెలియదన్నారు. వైఎస్ చేసిన అవినీతి మనకు శాపంగా మారిందనీ, తండ్రీ, కొడుకులు లక్షలకోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నాడు వారధి కట్టా... నేడు రైల్వే లైను నిర్మిస్తా