February 27, 2013

రెండు మనస్సులను, రెండు ప్రాంతాలను కలిపేది వారధి. కృష్ణా-గుంటూరు జిల్లాల సరిహద్దులోని గ్రామాలు.. అటోఇటో పోయి పనులు చేసుకునేవి. వరదో, మరో ప్రకృతి ఉపద్రవమో ముంచెత్తితే ఆ గ్రామాలన్నీ నీళ్లలో.. పనులు లేక జనమంతా కన్నీళ్లలో నానిపోవాల్సి వచ్చేది. అప్పట్లో నా దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చారు. ఈ ప్రాంతాల మధ్య 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పులిగడ్డ-పెనుమూడి వారధి విషయం చెప్పుకొచ్చారు.
 

వరదల నుంచి ఆ ఊళ్లను కాపాడటమే కాదు.. కూలీనాలీ చేసుకొని బతికే ఆ ప్రజలకు ఒక్క పూట కూడా పూటగడవని పరిస్థితి రాకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. నేనిప్పుడు ఆ వారధిపైనే నిలబడి ఉన్నాను. గుంటూరు జిల్లాలో యాత్ర ముగించుకొన్న నన్ను కృష్ణా జిల్లాలోకి తోడ్కొనిపోయింది ఈ వారధే. అప్పుడు (1999) ఆరు నెలల కాలంలోనే నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ వంతెనపై అడుగులు వేస్తుంటే కాస్తంత ఉద్వేగానికి గురయ్యాను. అభివృద్ధికి చిహ్నమైన ఈ వారధి ఇప్పుడు మార్పుకూ సంకేతమే!

రేపల్లె నుంచి చాలామంది వారధి దాటి పనుల కోసం అవనిగడ్డకు వచ్చారు. వాళ్లంతా తిరిగి వెళుతూ నాకు ఎదురయ్యారు. ఎవరిని పలకరించినా వారధి కట్టి తమకు చేసిన మేలును పదేపదే ప్రస్తావించారు. వాళ్ల కళ్లలో ఆ సమయంలో గొప్ప సంతృప్తిని చూశాను. కూలి పనులు చేసుకునే తమను డ్వాక్రా సంఘాల్లో చేర్చిన వైనాన్ని వారిలో కొందరు ఆడపడుచులు గుర్తుచేశారు. ఆ సంఘాలు ఇప్పుడేమి చేస్తున్నాయని ఉత్సాహంగా ఆరా తీశాను.

కానీ, ఆ ప్రశ్నకు వాళ్ల ముఖాలు వెలవెలబోయాయి. 'ఏముంది సార్.. అప్పుడు నువ్వు మా ఆకలి చూశావు. ఇప్పుడు వీళ్లు మా అంతం చూస్తున్నారు. చదువుకోలేదని మాలో చాలామందికి బ్యాంకులు అప్పులివ్వడం లేదు. ఇదేమి చోద్యం సార్.. ఈ వయస్సులో మమ్మల్నెక్కడ చదువుకోమంటారు?'' అని ఓ మహిళ అమాయకంగా ముఖం పెట్టింది. రౌతు మెత్తనైతే బ్యాంకులూ బారెడు పొడవున కాళ్లు అడ్డుపెడతాయి మరి!

అభివృద్ధికి అది 'వారధి'!

'ముందస్తు' రావొచ్చు!
తాపీగా కూర్చుంటామంటే కుదరదు
పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక

ముందస్తు ఎన్నికలు వచ్చినా రావొచ్చునని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులను టీడీపీ అధినేత చంద్రబాబు అప్రమత్తం చేశారు. గుంటూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్న ఆయన.. అన్ని జిల్లాల నేతలతోజరిపిన టెలి కాన్ఫరెన్స్‌లోనూ, నల్లగొండ జిల్లా నేతలతో నిర్వహించిన సమీక్షలోనూ 'ముందస్తు' హెచ్చరికలను చేశారు. "ముందస్తు ఎన్నికలు రావచ్చునని అంటున్నారు. దేనికైనా సిద్ధంగా ఉండాలి. మీరు ఇలాగే తాపీగా ఉంటానంటే కుదరదు. ఇకనైనా కదలండి'' అని పార్టీ నేతలకు నిర్దేశించారు.

స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోడానికి మండల స్థాయిలో పార్టీ యంత్రాంగం సమాయత్తం కావాలని కోరారు. పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు వచ్చేనెల 1, 2 తేదీల్లో అన్ని జిల్లాల్లో జిల్లా సమన్వయ కమిటీల సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొనసాగింపుగా మార్చి 4, 5,6, 7 తేదీల్లో అన్ని మండలాల్లో విస్తృత సమావేశాలను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ చార్జీల పెంపుదల, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, విద్యార్థులకు ఉపకార వేతనాల విడుదలలో జాప్యం వంటి అంశాలపై పార్టీపరంగా ఉద్యమానికి సన్నద్ధం కావాలని ఉత్సాహపరిచారు.

"మనం కదలాల్సిన సమయం వచ్చింది. ఇంకా సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తే కుదరదు. మీరు ప్రజలకు దూరంగా ఉంటే ప్రజలు మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. వెనకబడిపోయిన వారి విషయంలో నేను కఠినంగా ఉండాల్సి వస్తుంది' అని హెచ్చరించారు. అంతకుముందు.. సహకార సంఘాల ఎన్నికల ఫలితాలపై నల్లగొండ జిల్లా నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సహకార ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

ప్రజల్లో వెనకబడితే సహించను

కాంగ్రెస్ అంటేనే కష్టాలు
అవగాహన లేని కిరణ్‌తో అధోగతే
సర్కారు తీరుతో డెల్టా రైతు ఆశలు ఉల్టా
జైల్లో జగన్‌కు దొంగ పూజలు: చంద్రబాబు ధ్వజం

కాంగ్రెస్ అంటేనే కష్టాలని, ప్రజాక్షేమం ఆ పార్టీకి ఏమాత్రం పట్టదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డ జగన్..దొంగ పూజలు అందుకుంటున్నారని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లాలో యాత్ర ముగించుకొని పులిగడ్డ- పెనుమూడి వారధి వద్ద ఆయన మలి విడత కృష్ణా జిల్లా యాత్రకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో వారధి మీదుగా ఆయన జిల్లాలో ప్రవేశించారు. వారధికి ఇరువైపులా మహిళలు బారులు తీరి ఉండటం కనిపించింది. ఆయనతో కరచాలనం చేసేందుకు విద్యార్థులు పోటీపడ్డారు. ఎస్సీ వర్గీకరణ వద్దని మాలమహానాడు నేత గుంటూరు నాంచారయ్య నేతృత్వంలో కొంతమంది ఆ ప్రాంతానికి రావడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని పంపించివేశారు.

అనంతరం అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో ఆయన తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనను తూర్పారబట్టారు. "అవినీతి, అసమర్థ, దోపిడీ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం నిదర్శనం. ఆ పార్టీ నేతలకు ప్రజా సంక్షేమం ఏ మాత్రం పట్టదు. కనీస అవగాహన లేని కిరికిరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. వైఎస్ సీఎం అయిన తరువాత రాష్ట్రం అవినీతి మయం కాగా, కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో అసమర్థత రాజ్యమేలుతోంది'' అని దుయ్యబట్టారు. 1994కి ముందు లోటు బడ్జెట్, కరెంటు కోత ఉండగా, 2004 నాటికి మిగులు కరెంటు, మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు అప్పగించామని గుర్తుచేశారు. తన హయాంలో 420 ఉన్న డీఏపీ బస్తా 1270కు పెరిగిందని చెప్పుకొచ్చారు.

డెల్టా ఆధునికీకరణ పనుల పేరుతో రెండో పంటకు నీళ్లివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురుపోసుకుంటుందని ధ్వజమెత్తారు. కమీషన్ల కోసం జలయజ్ఞం పథకాన్ని ధనయజ్ఞంగా మార్చిన ఘనత కాంగ్రెస్ నాయకులకే దక్కిందన్నారు. స్వార్థం కోసం కాదు.. ప్రజా సంక్షేమమే ఏకైక లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నానని చెప్పుకొచ్చారు. " తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేశాను. రెండు పర్యాయాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. నా రికార్డు బ్రేక్ చేయాలంటే మరో ఇరవై ఏళ్లయినా పడుతుంది'' అని వివరించారు.

ప్రపంచంలో ఏ దేశంలో లేని యువత మన దేశంలో ఉందని, పాలన సరిగా ఉంటే చైనాను అధిగమించే శక్తి మనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా, తీవ్రవాదులూ, మత కలహాలురేపేవారూ, రౌడీలూ సరిహద్దులు దాటిపోయారని పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, అసమర్థ మంత్రుల వైఖరే దీనికి కారణమని దుయ్యబట్టారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే, మచిలీపట్నం - రేపల్లె నడుమ కేరిడార్ ఏర్పాటు చేసి పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని చెప్పారు.

వైఎస్ పాలనంతా అవినీతే

జిల్లా రాజకీయ చరిత్రలో ఇదో సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గ రోజు. రాష్ట్ర రాజకీయాల్లో దిగ్గజమైన నాయకుడు 22 రోజుల పాటు అలుపెరగకుండా ప్రజాసమస్యలు తెలుసుకొనేందుకు జరిగిన సుదీర్ఘ పాదయాత్ర ముగియనున్న రోజు ఇది. ఇంతకుముందెన్నడూ మరే నాయకుడు నడకతోనే ఇన్ని రోజులు 201 కిలోమీటర్లకు పైగా దూరాన్ని జిల్లాలో చుట్టేసిన దాఖలాలు లేవు. మరుపురాని ఘట్టం ముగింపు గడియలకు చేరుకొన్న నేపథ్యంలో జిల్లా ప్రజానీకం ఆయనకు ఘనంగా వీడ్కోలు చెప్పేందుకు సంసిద్ధమైంది. నేడు జిల్లాలోని రేపల్లె వద్ద పెనుమూడి వారధి మీదగా కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టనున్న ఆ అలుపెరగని పాదచారే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.

చంద్రబాబు కొనసాగిస్తోన్న 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర జిల్లా ప్రస్థానం బుధవారంతో ముగియనుంది.

ఈ నెల ఆరో తేదీన ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీతానగరం వద్ద జిల్లాలో అడుగుపెట్టిన ఆయన మండుటెండల్లో పాదయాత్ర కొనసాగించారు. తొలి రోజున ఏకబికిన విజయవాడ బస్టాండ్ సెంటర్ నుంచి చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల వరకు ఇంచుమించు 16.5 కిలోమీటర్లు నడిచి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ రోజున అర్ధరాత్రి ఒంటి గంట వరకు పాదయాత్ర కొనసాగింది. అదే సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో రాత్రి 10 గంటల సమయానికి పాదయాత్ర ముగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో చంద్రబాబు వాటిని తూచ తప్పకుండా పాటిస్తూ వచ్చారు. పాదయాత్రలో ప్రధానంగా ప్రజల వద్దకు వెళ్లి వారిని 'ఏవమ్మా... బాగున్నారా... తమ్ముళ్లు మీరు హుషారుగా ఉన్నారంటూ' అప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకొన్నారు.

జిల్లాలో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సాగునీరు, ఎరువుల అధిక ధరలు, పత్తి, మిర్చి, మినుముకు గిట్టుబాటు లేకపోవడం తదితర సమస్యలను ఆయన అధ్యయనం చేశారు. అలానే కనీస సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్లు లేకపోవడాన్ని గుర్తించారు. డ్వాక్రా మహిళలకు పావలావడ్డీ అందకపోతుండటం, వంటగ్యాస్, బియ్యం, కందిపప్పు వంటి నిత్యవసర సరుకుల ధరలతో వేగలేకపోతుండటాన్ని నిశితంగా పరిశీలించారు. విద్యుత్ సర్‌చార్జీల భారాన్ని మోయలేకపోతుండటాన్ని గమనించిన ఆయన ప్రజలను పూర్తిస్థాయిలో చైతన్యపరిచే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అవినీతికి వ్యతిరేకంగా ప్రజలకు అర్థమయ్యేలా పొడుపుకథలు చెప్పి జగన్, వైఎస్, కాంగ్రెస్ నాయకులు దోపిడీలను ఎండగట్టారు.

మంగళగిరి, గుంటూరు పశ్చిమ, పెదకాకాని, తెనాలి, వేమూరు, కొల్లూరు, రేపల్లెలో చంద్రబాబు వెంట వేల సంఖ్యలో ప్రజలు పాదయాత్రలో నడవడం విశేషం. ఎనిమిది నియోజకవర్గాలు, ఒక కార్పొరేషన్, నాలుగు మునిసిపాలిటీలు, 126కు పైగా గ్రామాల్లో పాదయాత్ర సుదీర్ఘంగా జరిగింది. చంద్రబాబు జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత యాత్రలో కొన్ని మార్పులు చోటు చేసుకొన్నాయి. వైద్యుల సూచన మేరకు ప్రతి ఆదివారం సెలవు తీసుకోవాలని నిర్ణయించి తొలి వారం దానిని పాటించారు. అయితే మరుసటి వారంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కారణంగా 48 గంటల పాటు విశ్రాంతికి పరిమితం కావాల్సి వచ్చింది. దాంతో ఆయన గడిచిన రెండు ఆదివారాలు విశ్రాంతి తీసుకోలేదు. హైదరాబాద్ బాంబుపేలుళ్ల సంఘటనతో చలించిపోయిన ఆయన దిల్‌షుక్‌నగర్ వెళ్లి పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని సందర్శించి, క్షతగాత్రులను పరామర్శించి వచ్చి మళ్లీ అదేరోజున పాదయాత్రను కొనసాగించారు.

కొలకలూరులో చంద్రబాబు ప్రసంగిస్తున్న స్టేజ్ మెట్లు కూలిన సంఘటనలో ఆయన కుడికాలి మడమ ఒత్తిడికి గురికాగా కేవలం 15 గంటల విశ్రాంతి మాత్రమే తీసుకొని మరలా రోడ్డెక్కి ప్రజల వద్దకు వచ్చారు. వైద్యులు, పార్టీ సీనియర్ నేతలు పాదయాత్రను ముగించాలని చెప్పినా ఆయన ఆలకించలేదు. 'తాను చేస్తున్నది పవిత్రమైన పాదయాత్ర అని' చెబుతూ తాను శ్రీకాకుళం వరకు నడవాలని నిర్ణయం తీసుకొన్నానని, గమ్యం చేరేవరకు విరమించబోనని మొండిగా ముందుకెళుతున్నారు. చంద్రబాబు ప్రతి రోజు ఉదయం 11 గంటలకు పాదయాత్రను ప్రారంభించి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత భోజన విరామానికి ఆగి ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులతో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తిరిగి సాయంత్రం నాలుగు గంటలు కాగానే రోడ్డు మీదకు వచ్చేసి ఆ రోజున ఎక్కడైతే శిబిరం ఏర్పాటు చేస్తారో ఎంత సమయమైనా అక్కడి వరకు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. 22 రోజుల పాదయాత్రలో ఆయన ఏరోజూ రాత్రి 12 గంటల సమయం దాటనిదే శిబిరానికి చేరుకోలేదు.

టీడీపీ జిల్లా శ్రేణుల్లో సమరోత్సాహం

చంద్రబాబు జిల్లాలో అడుగు పెట్టకముందు పార్టీ శ్రేణులు స్తబ్ధతగా ఉన్నాయి. అధినేత రాక తో నాయకులంతా ఒక్కటయ్యారు. కార్యకర్తల్లో చైతన్యం నింపారు. జనస్పందన అనూహ్యంగా ఉందని, కీపిటప్ అంటూ నేతలను అధినేత భుజంతట్టి ప్రోత్సహించారు. నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు బుధవారం ఉదయం సమావేశమై పార్టీ పటిష్ఠతకు చేపట్టాల్సి చర్యలపై ప్రసంగిస్తారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాద్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, జే ఆర్ పుష్పరాజ్, డాక్టర్ శనక్కాయల అరుణ, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జీవీ ఆంజనేయులు, నక్కా ఆనంద్‌బాబు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు శ్రావణ్‌కుమార్, కే వీరయ్య, రాజనారాయణ, సత్యప్రసాద్, జియావుద్దీన్, యాగంటి దుర్గారావు, గోవర్ధన్‌రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, కోవెలమూడి రవీంద్ర, వైవీ ఆంజనేయులు, వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్, ముత్తినేని రాజేష్, వజీర్, మానుకొండ శివప్రసాద్, సుకవాసి శ్రీనివాసరావు, ములకా సత్యవాణి, పానకాల వెంకటమహాలక్ష్మి, రాణి తదితరులు పాదయాత్రలో ముందుండి ప్రజలను చైతన్యవంతులను చేశారు.

అలుపెరుగని పాదచారి

శ్రీకాకుళం వరకు వస్తున్నా... మీకోసం పాదయాత్రను కొనసాగించి తీరుతానని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం వరంగల్ జిల్లా పార్టీ నాయకులు గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తోన్న చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్, కడియం శ్రీహరి, వేం నరేందర్‌రెడ్డి తదితరులు మం డుతున్న ఎండలు, ఆరోగ్యం దృష్ట్యా పాదయాత్రను విరమించాలని కోరా రు. అందుకు చంద్రబాబు సున్నితం గా తిరస్కరిస్తూ తాను ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు కష్టమైనా పాదయాత్ర కొనసాగిస్తున్నానని చెప్పారు. శ్రీకాకుళం వరకు పాదయాత్ర కొనసాగించాలన్న నిర్ణయం తీసుకొన్నానని, ఎన్ని కష్టాలు ఎదురైనా మే ఒకటో తేదీ లోగా గమ్యస్థానానికి చేరుకొంటానని స్పష్టం చేశారు. అనంతరం వరంగల్ జిల్లాలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు వారితో సమీక్షించారు. ఇటీవల వెలువడిన సహకార ఎన్నికల ఫలితాలను సమీక్షించారు. సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్, వైసీపీ పని అయిపోయిందని, ఎక్కడా కనీస పోటీ ఇవ్వలేకపోయాయన్నారు. వైసీపీ నిలబడలేదని, అది తల్లి కాం గ్రెస్‌లో కలసిపోవడం ఖాయమన్నా రు. సమష్ఠిగా పని చేసి పార్టీని పటిష్ఠవంతం చేయాలని ఆదేశించారు. చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో వరంగల్ జిల్లా టీడీపీ నాయకులు రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, బసవారెడ్డి, సత్యవతి రాథోడ్, వెంకటేశ్వర్లు, ధర్మారెడ్డి, ఈగం మల్లేష్, అరవింద్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కేసు పెడితే బుద్ధి చెబుతాం

రైతుల కడుపుమంటపై తమ అధినేత చంద్రబాబు మాట్లాడితే కేసులు పెడతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరికలు చేస్తున్నారని, వారికి తగిన బుద్ధి చెబుతామని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. రైతులకు నీళ్లివ్వడం చేతకాని కాంగ్రెస్ నాయకులు తప్పుడు కేసులు పెట్టడంలో మాత్రం ముందుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీకాకుళం వరకు పాదయాత్ర కొనసాగిస్తా