February 12, 2013

2 వేల కి.మీ. పూర్తి చేరుకున్న బాబు పాదయాత్ర
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర మంగళవారం నాటికి 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరు ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, రెండువేల బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున నేతలు, అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజలు చూపిస్తున్న అభిమానం జీవితంలో మరువలేనిదని అన్నారు. మనకు రాజకీయ స్వాతంత్య్రం వచ్చిందిగానీ, ఆర్థిక స్వాతంత్య్రం రాలేదని అన్నారు. సమసమాజం కోసం ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించారని, కానీ కొందరు నేతలు దోచుకోడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హాయంలో రహదారులను అభివృద్ధి చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ దొంగలు ప్రజలను దోచుకుంటున్నారని, ప్రజా ధనం కాంగ్రెస్ నేతల జేబుల్లోకి పోతుందని ఆయన ధ్వజమెత్తారు.

నిత్యావసర వస్తువులు పేద, మధ్య తరగతి ప్రజలు కొనే పరిస్థితి లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి ప్రభుత్వం అసమర్థల వల్లే ధరలు పెరిగాయని ఆరోపించారు. గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారని, విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై 35వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం మోపిందని చంద్రబాబు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లు లేని పేదలకు లక్ష రూపాయలతో ఇల్లు నిర్మించి ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఇదివరకే చెప్పినట్టుగా రుణ మాపీ చేసి చూపిస్తామని బాబు పేర్కొన్నారు.

గత ఏడాది అక్టబర్ 2న 'వస్తున్నా...మీకోసం'' పాదయాత్రను చేపిట్టిన చంద్రబాబు నాయుడు 134 రోజులలో రెండువేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు 12 జిల్లాలు, 55 నియోజకవర్గాలు, 107 మండలాలు, 17 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు, 915 గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో వెయ్యి కిలోమీటర్లు, వరంగల్ జిల్లాలో 1500 కి.మీ. గుంటూరు జిల్లాతో 2000 కిలోమీటర్లు పూర్తి చేశారు.

మంగళవారం ఉదయం జిల్లాలోని డీఎస్‌నగర్ నుంచి బాబు పాదయాత్రను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి లక్ష విగ్రహాలు. ఆయన లక్ష కోట్ల రూపాయల దోపిడీకి స్పష్టమైన నిదర్శనమని చంద్రబాబు నాయుడు అన్నారు. వైయస్ తన హయాంలో ప్రజల సొమ్మను తన తనయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అక్రమార్కుల విగ్రహాలు పెద్ద ఎత్తున స్థాపిస్తున్నారని, అవి అక్రమ సంపాదనతో నిర్మించినవే అన్నారు. దోపిడీదారులకు విగ్రహాలు పెట్టడం మన దౌర్భాగ్యమని విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని అందుకే, తన పాదయాత్రలో ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వగలుగుతున్నానని చంద్రబాబు చెప్పారు. ప్రజల సొమ్మును దోచుకుంటున్న కాంగ్రెసు నేతలు రోడ్డు మీదకు వస్తే నిలదీస్తారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. రుణ మాఫీ సాధ్యం కాదని చెప్పిన ముఖ్యమంత్రి కేంద్రమంత్రి సచిన్ పైలట్ వ్యాఖ్యలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ అసాధ్యమంటే కేంద్ర నేతలు మాత్రం సై అంటున్నారన్నారు. సుపరిపాలన టిడిపితోనే సాధ్యమన్నారు.

కాగా చంద్రబాబు పాదయాత్రకు బ్రేక్ పడే అవకాశం కనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అడ్డం రానుంది. ఈనెల 19-21 వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో జిల్లాల్లో ఇతర నేతలు ఎవరూ ఉండకూడదని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు సమాచారం అందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీంతో బాబు యాత్రకు జిల్లాలో మూడు రోజుల పాటు విశ్రాంతి లభించే అవకాశాలున్నాయి.

కేక్ కట్ చేసి, 2వేల బెలూన్లు ఎగురవేసిన చంద్రబాబు

'టీడీపీ ఢీ' సీసీబీ
ఖమ్మం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి,
అనంత, చిత్తూరు, ప్రకాశంలలో పోటీ

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్నికల్లో ఎనిమిది జిల్లాల్లో పోటీ పెట్టాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అధికార పార్టీతో పోలిస్తే తమకు ఆధిక్యం ఉండడం లేదా అధికార పార్టీకి పూర్తి మెజారిటీ లేకపోవడం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లాలను ఎంపిక చేసింది. ఇటీవలి సహకార ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పోలిస్తే ఖమ్మం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ ఆధిక్యం సాధించింది. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అధికార పార్టీకి బాగా చేరువలో ఉంది. తూర్పు గోదావరి, అనంతపురంలలో ఆ పార్టీకి ఫర్వాలేదన్నట్లుగా సొసైటీలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో అక్కడ కూడా టీడీపీ పోటీకి దిగుతోంది. ఖమ్మం డీసీసీబీ పీఠాన్ని పెద్ద ఇబ్బంది లేకుండా టీడీపీ గెలుచుకొనే పరిస్థితి ఉంది. అయినా, కాంగ్రెస్ నేతలు తమ వంతు ప్రయత్నాల్లో భాగంగా జిల్లా సీపీఎం, వైసీపీ, ఎంఎల్ పార్టీల నేతలతో సంప్రదింపులు మొదలు పెట్టారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలను కలుపుకొని వెళ్లాలనే యోచనలో టీడీపీ ఉంది. జిల్లాలో బ్యాంకు అధ్యక్ష పదవికి తుళ్లూరు బ్రహ్మయ్య, మువ్వా విజయ్‌బాబు, బోడేపూడి రమేష్ బాబు పోటీలో ఉన్నారు.

ఎక్కువ సొసైటీలు గెలిచిన సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన విజయ్‌బాబుకు అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటవీరయ్య గట్టిగా పట్టుబడుతుండటంతో అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీ కూడా బరిలో ఉన్నా లేదా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉన్నా మూడు లేక నాలుగు డీసీసీబీలను కైవసం చేసుకోగలమన్న అభిప్రాయంలో టీడీపీ నేతలున్నారు. "కృష్ణా జిల్లాలో మొదటి స్థానంలో మేమే ఉన్నాం. వైసీపీ మద్దతు ఇస్తే తప్ప ఈ జిల్లా బ్యాంకు కాంగ్రెస్‌కు దక్కడం అసాధ్యం. తాజాగా వైసీపీ పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్‌కు అనధికారికంగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు మాకు సమాచారం అందుతోంది.

అయినా, మా ఆశలు మాకున్నాయి.'' అని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకొన్నా కోస్తాలో కనీసం రెండు జిల్లాల్లో తాము గెలుపొందగలమన్న ఆశాభావంలో టీడీపీ వర్గాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా, కృష్ణా జిల్లాలో ముదినేపల్లి మండలానికి చెందిన వెంకట సుబ్బయ్య, గుంటూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, ప్రకాశం జిల్లాలో దామచర్ల పూర్ణచంద్రరావులను డీసీసీబీ అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు సమాచారం.

8 చోట్ల బరిలోకి!

ఇంద్రవెల్లి: టీడీపీ అధికారంలోకి వస్తే వచ్చే నాగోబా జాతరకు చంద్ర బాబును ముఖ్యమంత్రి స్థాయిలో రప్పించేటట్లు ప్రయత్నిస్తానని ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. సోమవారం కేస్లాపూర్‌లోని నాగోబా జాతరను సం దర్శించి నాగోబా దర్శనం తీసుకున్నా రు. అనంతరం నాగోబా ఆవరణలో మెస్రం పూజారులు ఎంపీని శాలువతో ఘనంగా సన్మానించారు. గుడి ఆవరణలో ఎంపీ విలేకరులతో మాట్లాడు తూ ఎంపీ ల్యాండ్ నిధులచే నాగోబా ఆవరణలో మెస్రం వంశీయులు కోరిన అభివృద్ధి పనులను చేయుటకు సిద్దం గా ఉన్నానన్నారు.

గతంలో జరిగిన జాతరకు స్వీర్గీయ మాజీ ముఖ్యమం త్రి ఎన్టీఆర్ వచ్చారని, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి వచ్చేలా ప్రయత్నిస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ.1.50 లక్షలతో ఇండ్లు నిర్మిస్తామ ని, గిరిజన ఆడల పిల్లల పెళ్లిలకు రూ. 50 వేలు, 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఆదివాసులకు రూ. 5 వందల చొప్పున ఫింఛన్ ఇస్తామన్నారు. నాగో బా దేవతకు పూజ చేసే పూజారికి రూ. 5 వేలు ఇచ్చేటట్లు కృషి చేస్తామన్నారు.

ఏజెన్సీలో వివిధ రోగాలతో మరణించిన వారి కుటుంబాలకు ఆరు వందల ఫింఛన్ ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీఎంపీపీ కనక తుకారాం, ఎండి మసూద్, దీలిప్ మోరె, భరత్ బామ్నె, రోహిదాస్, ఇం దుబాయి తదితరులు ఉన్నారు.

వచ్చే జాతరకు చంద్రబాబును రప్పిస్తాం- రాథోడ్ రమేష్

'వస్త్తున్నా మీ కోసం యాత్రను ప్రజా ఉద్యమంగా మారుద్దాం, ఇందుకు ఇంటికి ఒక్కరు చొప్పున రోడ్లపైకి వచ్చి పాదయాత్రలో నాతో కలవండి'' అని తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. వస్తున్నా మీ కోసం యాత్రలో భాగంగా గుంటూరు నగరంలోని చుట్టుగుంట సెంటర్‌లో భారీగా హాజరైన జనాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అవినీతిపై పోరాడేందుకు ఇంటికి ఒక్కరు చొప్పున రోడ్లపైకి వచ్చి తనతో కదం కలపాలని పిలుపునిచ్చారు.

అవినీతి కాంగ్రెస్ గుండెల్లో దడ పుట్టించాలని అన్నారు. కాంగ్రెస్‌కు స్వతహాగా ఆలోచించే శక్తి లేదని, అన్న నందమూరి తారకరామారావు నేషనల్ ఫ్రంట్‌లో భాగస్వామిగా ఉన్నప్పుడు రుణ మాఫీ అమలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి దాన్ని అమలు చేశారన్నారు. దాన్ని వై ఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసి గొప్పలు చెప్పుకున్నారని అన్నారు. అదే విధంగా పేదలకు లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో తెలుగు దేశం నగదు బదిలీ పథకం అమలు చేస్తామని చెబితే నేడు కాంగ్రెస్ నకిలీ బదిలీ పథకం పేరుతో పేదల నడ్డి విరుస్తుందన్నారు.

ప్రజలు తెలుగు దేశానికి మద్దతు ఇచ్చి రాష్ట్రంలో 40 ఎంపి స్థానాలు గెలిపిస్తే దేశంలోనూ మనకు నచ్చిన ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూడవచ్చన్నారు. మనకు నచ్చిన ప్రభుత్వం ఏర్పడితే అనేక పథకాలు అమలు చేయించుకునే వీలు కలుగుతుందన్నారు. తొలి సంతకం రుణమాఫీ మీద చేయడంతో పాటు, గ్యాస్, రేషన్ సరుకుల సబ్సిడీని యధావిధిగా అమలు చేస్తానన్నారు.

నిరంతరాయంగా విద్యుత్ అందించేలా చర్యలు తీసుకుంటానన్నారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తుందన్నారు. మన రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి 'కబంధుడు' అనే రాక్షసుడిలా అందిన కాడికి దోచుకుని, కొడుకు కట్టబెట్టాడన్నారు. నేడు ఆ డబ్బుతో ఆయన కుమారుడు జైలు పార్టీని స్థాపించి ప్రజలను మరోసారి నిలువునా ముంచేందుకు చూస్తున్నాడన్నారు. కాంగ్రెస్, జైలు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. తెలుగు దేశం అధికారంలోకి వస్తే ఎన్టీ ఆర్ సుజల ధార పథకం కింద అందరికీ తాగునీరు అందిస్తామన్నారు.

ఇంటికొరకు కదలండి

సీనియర్ ఇంటర్ విద్యార్థినులు... మీరు బాగా ఉత్సాహంతో ఉన్నారు. మగవాళ్ల కంటే మీకే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ల కంటే చదువులో బాగా రాణిస్తారు. అయితే మీ అమ్మా, నాన్న ఇంట్లో మీపై వివక్ష చూపిస్తుంటారు. మగపిల్లలు ఏదో ఉద్ధరిస్తాని చివరికి టీచర్లు కూడా అదే పని చేస్తుంటారు. ఆడపిల్లలేమో ప్రభుత్వ స్కూళ్లలో, మగపిల్లలేమో ్రపైవేటు స్కూళ్లలో చదివిస్తుంటారు.

ఈ వివక్ష పారద్రోలేందుకు ఒక అన్నగా మీకు అండగా నిలబడి మీ జీవితాలు ఉన్నతస్థాయికి తీసుకెళతానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. సోమవారం ఉదయం చైతన్య కళాశాల విద్యార్థినులతో చంద్రబాబు జిల్లా కేంద్రంలోని రింగురోడ్డులో చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌టీఆర్ ఆస్తిలో సమానహక్కు కల్పించారని, దానిని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ హయాంలో ఆడపిల్లలపై వివక్షను దూరం చేయాలనే ఆలోచనతో ఆడపిల్లల సంరక్షణ కార్యక్రమాన్ని అమలు చేశామన్నారు. పేద విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశామని, డ్వాక్రా గ్రూపులు పెట్టి ఆర్థికంగా నిలబడేలా చేశామన్నారు.

నిట్ పరీక్ష రద్దు


చేసేంతవరకు పోరాడతా


ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంసెట్‌కు సిద్ధం కావాలో, నిట్‌కు సన్నద్ధం కావాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అసలు ప్రభుత్వమే అయోమయ స్థితిలో ఉన్నది. ఏ విషయమైనా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు చెప్పాలి. మీరు చదివే సిలబస్ వేరు. పరీక్ష వేరు. ఈ నేపథ్యంలో ఎంసెట్ అయితేనే మీకు బావుంటుంది. ఈ విషయంలో నేను సీఎంకు లేఖ రాస్తాను. నిట్ పరీక్ష రద్దు చేసి ఎంసెట్‌లోనే ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించేంతవరకు పోరాటం చేస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు.

ప్రపంచాన్ని శాసించగలసత్తా మీకే ఉందిఅమెరికా, చైనాకు లేని యువత మనకు ఉన్నది. యువత లేని చోట ఉత్పత్తి ఉండదు. మీరు బాగా చదువుకొంటే ప్రపంచాన్ని శాసిస్తారు. రాబోయే 20 ఏళ్లలో అమెరికా, చైనా కంటే మనమే ముందుంటాం. దీనిని దృష్టిలో పెట్టుకొని బాగా చదివితే మీరు 70 ఏళ్లు సుఖంగా జీవించ వచ్చని చంద్రబాబు సూచించారు.

లేకుంటే కూలీ పనులకు పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పేద పిల్లలు ఎంతవరకు చదువుకొంటే అంతవరకు చదివించి ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగభృతి కల్పిస్తానన్నారు. గాంధీ, అంబేద్కర్, ఎన్‌టీఆర్ వంటి మహనీయులు చిన్న కుటుంబాల నుంచే వచ్చారని చెప్పారు. గతంలో మనల్ని మద్రాసీయులు అని గేలి చేసేవారని, ఎన్‌టీఆర్ తెలుగుజాతికి వన్నె తీసుకొచ్చారని పేర్కొన్నారు. నాడు ఐటీ రంగానికి ఉన్న డిమాండ్‌ను అంచనా వేసి హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, సైబరాబాద్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దాని వలన చదువుకొన్న ప్రతి ఒక్కరికీ ఐటీ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం సీఏ, లా, అకౌంటెన్సీ, టూరిజం రంగాలకు డిమాండ్ ఉన్నదని, కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఏ రంగంలో ఉపాధి ఉందో తెలియజేసి ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత తీసుకొంటానని చంద్రబాబు హామి ఇచ్చారు.

ఓ అన్నగా మీకు అండగా ఉంటా


చంద్రబాబు: తమ్ముడు నువ్వు అవినీతికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టావు?

విద్యార్థి: సార్ నేను అవినీతికి వ్యతిరేకంగా ప్రతి రోజూ 10 మందికి ఎస్ఎంఎస్‌లు పంపుతున్నాను. దానిని తలా పది మందికి పంపమని విజ్ఞప్తి చేస్తున్నాను.

మరో విద్యార్థితో చంద్రబాబు: నువ్వు ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తున్నాని చెబుతున్నావు? ఎలా చేస్తున్నావో వివరించు?

విద్యార్థి: సార్ సీఎం జైలు నుంచి రాడు... ప్రజల్లో నుంచి వస్తాడని మెసేజ్ పెట్టాను. దానిని చాలామంది చూసి స్పందించారు. 2004కు ముందు పాల ప్యాకేట్ రూ. 12 ఉండేది. నేడు రూ. 20 పెట్టి కొనాల్సి వస్తోంది. పెట్రోలు రూ. 34 నుంచి రూ. 74, అగ్గిపెట్టె రూ. 50 పైసల నుంచి రూ. 2 అయ్యాయి. తేడా గమనించమని ఫేస్‌బుక్‌లో విజ్ఞప్తి చేస్తున్నాను.

మూన్‌సేన సభ్యుడు: సార్ మేము అవినీతికి వ్యతిరేకంగా ఫ్లెక్సీల ఉద్యమం చేపట్టాము. అవినీతికి వ్యతిరేకంగా స్పందించని ప్రజలకు మెత్తగా చురకలు కూడా వేస్తున్నాము. చంచల్‌గూడ ప్యాకేజ్‌లపై వేసిన ఫ్లెక్సీకి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. అయితే వైసీపీ కార్యకర్తలు గొడవ చేయడంతో పోలీసులు ఫ్లెక్సీని తొలగించి మాపై కేసులు పెట్టారు.

ప్రవాసాంధ్రుడు: సార్ నేను సింగపూర్‌లో కొన్నాళ్లు ఉన్నాను. నెల క్రితమే ఇక్కడికి వచ్చాను. సింగపూర్‌లో టీ స్టాల్ వద్ద చాయ్ తాగుతుండగా అక్కడి తెలుగువాళ్లు మోస్ట్ డైనమిక్ సీఎం చంద్రబాబు అని, అత్యంత అవినీతిపరుడు జగన్ అని సంభాషించుకోవడం విన్నాను.

ఇలా జిల్లా కేంద్రంలోని బృందావన్‌గార్డెన్స్ సెంటర్‌లోని యువకులు, మహిళలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముఖాముఖీ సంభాషణ జరిపారు. సోమవారం తన పాదయాత్ర రింగురోడ్డు నుంచి బృందావన్‌గార్డెన్స్ చేరుకొన్న సమయంలో జరిగిన బహిరంగ సభ ముగింపులో చంద్రబాబు అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రయత్నించారు. తాను సింగపూర్ పర్యటనకు వెళ్లిన సమయంలో జరిగిన ఒక సంఘటనను ఈ సందర్భంగా ఉదహరించారు. నేను సింగపూర్ వెళ్లినప్పుడు కారు ్రడైవర్‌కు టిప్పు ఇవ్వబోయాను.

టిప్పు తీసుకొనేందుకు నిరాకరించాడు. అక్కడ అవినీతి ఉందా అని అడిగితే లేదని చెప్పా డు. అవినీతికి పాల్పడితే వాడు మరుసటి రోజు జైల్లో ఉంటాడని తెలిపాడు. మా అశోక్‌గజపతిరాజుకు సిగరెట్ తాగడం అలవాటు. అతను అక్కడ నిబంధనలు తెలుసుకొని పర్యటన ముగిసేంతవరకు సిగరెట్ తాగలేదు. ఇక్కడ మాత్రం విచ్ఛలవిడితనం. అవినీతికి పాల్పడి కూడా దానిని సమర్థించుకొనే పరిస్థితి ఉందని చంద్రబాబు ఆక్షేపించారు.

అవినీతి విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడి నిలబడితే రియల్ హీరో అవుతారని చెప్పారు. జగన్ ఎప్పటికీ రియల్ విలన్‌గానే మిగిలిపోతాడన్నారు. ఆడపిల్లలపై జరిగిన అత్యాచార కేసులను ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ పెడతామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ఢిల్లీ ఉదంతంలో నిందితులను ఉరికంభం ఎక్కిస్తే అంతా సంతోషించేవారని, అలాంటిది కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు.

గుంటూ రు జిల్లాలో కూడా ప్రసన్నలక్ష్మి, ఆయేషామీరా హత్యకు గురయ్యారని, ఆ కేసుల్లో అసలైన నిందితులకు శిక్షలు పడలేదన్నారు. ఆడపిల్లలకు రక్షణ అవసరమని, అందుకోసం ప్రత్యేక చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.

చంద్రబాబు పాదయాత్ర ఆరో రోజు జిల్లా కేంద్రంలో విశేష జన స్పందన లభించింది. సిద్ధార్థగార్డెన్స్ నుంచి పాదయాత్ర కొనసాగిన రింగురోడ్డు, బృందావన్‌గార్డెన్స్, లక్ష్మీపురం మెయిన్‌రోడ్డు, దేవాపురం, అశోక్‌నగర్, కోబాల్డ్‌పేట, బ్రాడీపేట నాల్గో లైను, 14వ అడ్డరోడ్డు, ఏటీ అగ్రహారం, శ్రీనివాసరావుతోట, ఆర్ అగ్రహారం, నల్లచెరువు, ఏటుకూరు రోడ్లు జనంతో కిక్కిరిశాయి. విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్లకు ఇరువైపులా చేరి చంద్రబాబు రాకకోసం గంటల తరబడి నిరీక్షించారు. మహిళలు హారతులిస్తూ, నుదుటిన తిలకం దిద్దుతూ స్వాగతం పలికారు.

ఎక్కడికక్కడ చంద్రబాబుకు ఎదురెళ్లి తమ సమస్యలు చెప్పుకొంటూ మా ఓటు మీకేనంటూ భరోసా ఇచ్చి సాగనంపారు. చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ ఎస్ ఎం లాల్‌జాన్‌బాషా, ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, జే ఆర్ పుష్పరాజ్, డాక్టర్ శనక్కాయల అరుణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పశ్చిమ, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు యాగంటి దుర్గారావు, ఎస్ ఎం జియావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

అవినీతితో రాజీ పడొద్దు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న వస్తున్నా... మీ కోసం పాదయాత్రలో ఆ నలుగురు కీలకపాత్ర పోషిస్తున్నారు. పాదయాత్ర జరిగే ప్రాంతంలో ప్రజా సమస్యలు, పార్టీ నుంచి ప్రజలు ఆశిస్తున్న విషయాలు, పలు వర్గాల ఆకాంక్షలను అధినేతకు చేరవేస్తున్నారు. పాదయాత్ర ప్రారంభం నుంచి వీరంతా తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, నీలయపాలెం విజయకుమార్, ప్రకాశం జిల్లాకు చెందిన చాగంటి విజయభాస్కర్, కరిచేటి విజయ్‌భాస్కర్ బాబు వెన్నంటే ఉంటున్నారు.

పాదయాత్రలో జరిగిన సమగ్ర సంఘటనలు, కలిసిన వ్యక్తులు, సంస్థలు, సంఘాలు ఇలా ఏరోజుకారోజు పూర్తి వివరాలతో పార్టీకి అందించేందుకు ఏర్పాటైన డాక్యుమెంటేషన్ కమిటీలో ఈ నలుగురు ఉన్నారు. విజయకుమార్ ఎన్జీవో ఆర్గనైజేషన్‌లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. శ్రీశైలరెడ్డి, విజయభాస్కర్ వ్యాపార నిర్వహణలో ఉండగా, హరికిషోర్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ఏడాది క్రితం ఏర్పాటైన తెలుగుదేశం అగ్రికల్చరల్ కమిటీలో సభ్యులుగా ఉన్న వీరంతా డాక్యుమెంటేషన్ కమిటీగా ఏర్పడ్డారు.

నాలుగైదు నెలలుగా కుటుంబానికి దూరంగా ఉంటూ చంద్రబాబు పాదయాత్రలో పాల్గొంటున్నారు. అధినేత ఇస్తున్న హామీలు, వాటికి లభిస్తున్న ప్రజాస్పందన, పార్టీ పరంగా ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటారు. రోజువారీ నివేదికను రూపొందించి పార్టీ కార్యాలయానికి, మోనిటరింగ్ కమిటీకి అందజేస్తారు. పాదయాత్రలో చోటుచేసుకునే అన్ని అంశాలను చంద్రబాబుకు వెంటనే తెలియజేస్తారు.

చంద్రబాబు యాత్ర ప్రారంభమైన క్షణం నుంచి పూర్తయిన తర్వాత, అన్ని అంశాలను క్రోడీకరించి, విశ్లేషించి పూర్తిస్థాయి సమాచారాన్ని పార్టీ ప్రధా న కార్యాలయానికి ఈమెయిల్ చేస్తారు. 130 రోజులుగా ఈ కమిటీ సభ్యులు విజయ్‌కుమార్, శ్రీశైల్‌రెడ్డి, విజయ్‌భాస్కర్, హరికిశోర్, బెన్హర్‌కింగ్ అధినేత వెంట, ప్రజల్లో మమేకమై సమాచార సేకరణలో నిమగ్నమై ఉంటున్నారు. పార్టీపై ఉన్న అభిమానంతో, వ్యక్తిగత వ్యవహారాలను, కుటుంబ బాధ్యతలకు దూరంగా, ఆరోగ్య సమస్యలు సైతం లెక్కచేయకుండా యాత్రలో పాల్గొంటున్న వీరంతా పాదయాత్ర పూర్తయిన అనంతరం సేకరించిన సమాచారాన్ని పుస్తక రూపంలో ప్రజలకు అందించాలనే ఉద్ధేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి సంఘటనను నమోదుచేస్తున్న ఈ ప్రక్రియ పార్టీకి, జిల్లాల్లో పార్టీ భవిష్యత్తు కార్యకలాపాలకు ఓ మార్గదర్శకంగా ఉంటుందని పార్టీ భావిస్తోంది.

పాదయాత్రలో ఆ నలుగురు

 జిల్లాలో లెదర్‌పార్కు ఏర్పాటుకు ప్రాణం పోస్తానని చంద్రబాబు హామి ఇచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో సిద్ధార్థ గార్డెన్స్ వద్ద మాదిక డెవలప్‌మెంట్ సొసైటీ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 100 మంది చర్మకారులకు గొడుగుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో రిజర్వేషన్లు అమలులోకి వచ్చి 67 సంవత్సరాలు గడుస్తున్నా ఎస్‌సీలకు న్యాయం జరగలేదన్నారు. వాళ్లు పోరాడినా ఫలితం లేకపోయిందన్నారు. 2000 సంవత్సరంలో ఎస్‌సీ వర్గీకరణ చేపట్టి 24,500 మందికి ఉద్యోగాలు ఇచ్చానని, కాంగ్రెస్ పార్టీ 44ఏళ్ల హయాంలో 16వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందన్నారు.

2004లో ఎస్‌సీ వర్గీకరణను సుప్రీం కోర్టు కొట్టివేసిందని, దానికి కారణం సరైన న్యాయవాదిని కోర్టులో కేసు వాదించేందుకు అప్పటి సీఎం వైఎస్ నియమించకపోవడమేనన్నారు. దుర్గి మండలంలోని అడిగొప్పులలో లెదర్ పార్కు పెట్టామన్నారు. ఆ రోజున తాను మేజర్, మీడియం, మైనర్ లెదర్‌పార్కులు పెట్టేందుకు ప్రయత్నం చేశానని, కాంగ్రెస్ వచ్చి దానిని తుంగలోకి తొక్కిందన్నారు.

అదే లెదర్ పార్కులు ఏర్పాటై ఉంటే ఈ రోజున చెట్ల కింద కూర్చుని చెప్పులు కుట్టుకునే పరిస్థితి ఉండేది కాదని, ఎంచక్కా ఇళ్లల్లో కూర్చుని చెప్పులు తయారు చేసి షాపులకు విక్రయించే అవకాశం అందుబాటులోకి వచ్చి ఉండేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే లెదర్ పార్కులకు ప్రాణంపోసి ఏడు లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని హామి ఇచ్చారు.

లెదర్ పార్కుకు ప్రాణం పోస్తా

చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర ఆదివారం విరామం అనంతరం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సోమవారం ఉదయం శిబిరంలో విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు తదితరులు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బ్రహ్మకుమారీస్ సభ్యులు బాబును కలిసి ఆశీర్వచనాలు ఇచ్చారు.

సాయి సన్నిధానం అర్చకులు ఘంటసాల విజయస్వామి చంద్రబాబుకు పూర్ణకుంభ స్వాగతం పలికి ఆశీర్వచనం చేసి పట్టు వ్రస్తాలు బహుకరించారు. డాక్టర్ శనక్కాయాల అరుణ ఆధ్వర్యంలో మహిళా డాక్టర్లు పాదయాత్రకు రూ. 1.5లక్షలు చంద్రబాబుకు విరాళంగా ఇచ్చారు. కమ్మజన సేవాసమితి సభ్యులు గోరంట్ల పున్నయచౌదరి ఆధ్వర్యంలో చంద్రబాబును కలిశారు. నాయకుల సమీక్ష అనంతరం సిద్దార్థ గార్డెన్స్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. బాజాబజంత్రీలతో, జై చంద్రన్న నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగుతుండగా బాబు పాదయాత్రలో ముందుకు సాగారు.

అడుగడునా మహిళల నీరాజనాలను అందుకుంటూ దూరమైన, భారమైన బ్రతుకు 'మీకోసం' అంటూ చంద్రబాబు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రింగురోడ్డులో మాదిగ డెవలప్‌మెంట్ సొసైటీ, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో వందమంది చర్మకారులకు చంద్రబాబు గొడుగులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మాదిగల అభివృద్దికి టిడీపీ కృషి చేస్తుందని హామీ ఇచ్చి ముందుకు సాగారు. తెలుగు యువత ఆధ్వర్యంలో శ్రీ చైతన్య కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు చంద్రబాబును కలిసి నీట్ పరీక్షలను గురించి తమ గోడు చెప్పుకున్నారు.

దీనికి చంద్రబాబు స్పందించి నీట్ పరీక్షను రద్దు చేసి ఎమ్‌సెట్‌ను కొనసాగించాలని విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వానికి లేఖ రాస్తానని విద్యార్థులకు అభయం ఇచ్చారు. అటునుండి యాత్ర బృందావన్ గార్డెన్స్ వైపుకు సాగింది. దారిపొడవునా జనసందోహంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. బృందావన్‌గార్డెన్స్ కూడలిలో చేరేసరికి ఇసుకవేస్తే రాలనంత జనంతో మండుటెండలోమధ్యాహ్నం 12.20 నిమిషాలకు బాబు ప్రసంగం ప్రారంభించారు. అలా 55 నిమిషాలు ఆకట్టుకునే ప్రసంగం చేసి ప్రజల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. 1.15 నిమిషాలకు బృందావన్ గార్డెన్స్ నుంచి యాత్ర లక్ష్మీపురం వైపుకు సాగింది. రోడ్డుకిరువైపులా స్కూల్ విద్యార్థినీ, విద్యార్థుల అభివాదాలతో చిన్నారుల కేరింతలతో చంద్రబాబు ముందుకు సాగారు. లక్ష్మీపురం మెయిన్‌రోడ్డులోని ఎన్ ఆర్ ఐ అకాడమీ వద్దకు చేరుకోగానే వందలమంది విద్యార్థుల కేరింతలతో ఆ ప్రాంతం హోరెత్తింది.

ఆ దృశ్యం చూడగానే బాబు ఆనందంతో చిన్నారులను దగ్గరకు పిలిచి వారితో ఫొటోలు దిగారు. అనంతరం నాయర్ హోటల్ సెంటర్ మీదుగా యాత్ర అశోక్‌నగర్‌కు చేరింది. అశోక్ నగర్‌లో చంద్రబాబు యాత్రకు సంఘీభావం తెలుపుతూ మాజీ కార్పొరేటర్ పీవీ మహలక్ష్మి ఆధ్వర్యంలో 1980 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న చంద్రబాబుకు స్వాగతమంటూ భారతదేశపు మ్యాపును ముగ్గుతో అందంగా తీర్చిదిద్దారు. మధ్యాహ్నం 2.10 నిమిషాలకు భోజన విరామం ప్రకటించారు. భోజన విరామ సమయంలో నిజామాబాద్ జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు.

కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు, షిండే , అన్నపూర్ణమ్మ, ఎమ్మెల్సీ వి జి గౌడ్ పాల్గొన్నారు. 4.10 నిమిషాలకు తిరిగి యాత్ర ప్రారంభమైంది. ఆకట్టుకునే పులి వేషగాళ్ల నృత్యాలతో, ఎన్టీ ఆర్ పాటలతో యాత్ర ముందుకు సాగింది. కోబాల్డ్‌పేట, దేవాపురం, బ్రాడీపేట 4/18, బ్రాడీపేట 4/14 మీదుగా యాత్ర కొనసాగింది.

దూరమైనా,భారమైనా బతుకు 'మీ కోసం'

గుంటూరు నడిబొడ్డున ఉన్న మురికివాడ అది. ఆ పేటలో అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించి చుట్టూ పరికించాను. ఎటుచూసినా గుడిసెలే. ఏ వైపునకు మళ్లినా మురుగ్గుంటలే. చింపిరి జుట్టు చిన్నారులు, చిరిగిన బట్టలతో ఆ అక్కలు, అన్నలు నన్ను చుట్టేసి నా బాగోగులు విచారించారు. వాళ్లలాగే వాళ్ల ఆవాసాలూ ఉన్నాయి. గుండీలు లేక ఆ పిల్లాడి చొక్కా జారిపోతున్నట్టుగానే, అక్కడ ఏ ఇంటికీ సరైన కప్పే లేదు.

ఆ ప్రాంతమంతా భరించలేనంత దుర్గంధం వెదజల్లుతోంది. కోబాల్ట్ పేట తరహా వేలాది మురికివాడల్లో బతుకు ఈడ్చే నిరుపేదల జీవితాల్లో వెలుగు రావాలని బీఆర్ అంబేద్కర్ కలలు కన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం స్ఫూర్తి కూడా ఇదే.కానీ, పేదల వాడల్లోకి ఆయన విగ్రహాలు రావడం తప్ప బాబాసాహెబ్ ఆశించిన మార్పేదీ రాలేదు. 80 గదుల ఇళ్లు కట్టుకున్న మహానుభావులకు ఇలాంటి పేదలకు 80 గజాల స్థలం ఇవ్వడానికి మనసు రాదేం!

బృందావన్ గార్డెన్స్‌లో కలిసిన యువకులను చూస్తే ఒకింత గర్వమనిపించింది. అదే సమయంలో ఇప్పటి యువతకు ఆ అదృష్టం లేకపోయిందేనని మరింతగా బాధపడ్డాను. ఆ యువకులు తమ వివరాలు చెప్పారు. మీ హయాంలో ఐటీలో రాణించి సింగపూర్‌లో ఉద్యోగాలు సాధించామని చెప్పుకొచ్చారు. 'సార్.. ఇదంతా మీ దయే. విద్యారంగంలో మీరు అందించిన ప్రోత్సాహంవల్ల మాకు మంచి ఉద్యోగాలు దొరికాయ''ని చెప్పినప్పుడు ఆనందం కలిగిన మాట నిజమే.

కానీ, విద్యాలయాలనే కార్ఖానాల నుంచి పుట్టలు పగులుతున్న నిరుద్యోగ సైన్యాలను చూస్తున్నవాడిగా, ఈ సంతోషాన్ని నేనుగా గానీ, పది మందితోగానీ పంచుకోలేకపోయాను. ఆ సింగపూర్ కుర్రాళ్లకు తీసిపోరు ఈ యువకులు. కానీ, విదేశీ కొలువుల సంగతి దేవుడెరుగు, చిన్నపాటి ఉద్యోగం దొరికితే అదే పదివేలని అనుకునే పరిస్థితుల్లో వాళ్లు ఉండటం ఎంత దారుణం? ఈ పాపం తొమ్మిదేళ్లు పరిపాలిస్తున్న ఈ పాలకులది కాదా?

ఆ పాపం ఈ పాలకులదే!

"ఏమ్మా... బావున్నారా.? ఎలా చదువుతున్నారు..? ఫీజులెలా కడుతున్నారు..? విద్యా వ్యవస్థ ఎలా ఉంది..? మీరు అభివృద్ధి చెందాలంటే మీ భవిష్యత్తును గురించి ఆలోచించే తెలుగుదేశం పార్టీకే ఓటు వేయాల్సిందిగా మీ తల్లిదండ్రులకు చెప్పండి''.. మితభాషిగా పేరున్న చంద్రబాబు కుమారుడు లోకేశ్ ప్రజలను పలకరించిన తీరిది.

అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు అత్తార్ చాంద్ బాషా నూతనంగా నిర్మించిన అత్తార్ రెసిడెన్సీని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతర ం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఏర్పాటు చేసిన మేలుకొలుపు సదస్సులో విద్యార్థినులతో కొద్దిసేపు మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ విద్యా వ్యవస్థ పనితీరు ఎలా ఉందో బేరీజు వేసుకోవాలని సూచించారు.

"మీ నాన్న పాదయాత్ర చేస్తున్నారు... ఎలా ఉంది సార్! ఆరోగ్యంగా ఉన్నారా... మేం బాగా చదువుకుని ఉన్న త స్థాయికి ఎదగాలంటే మీ నాన్నే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామ''ని పలువురు విద్యార్థినులు అభిప్రాయ పడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఈ సమయంలో లోకేశ్ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో యువతదే కీలక పాత్ర అని, దిశానిర్దేశం చేసేది యువతే కాబట్టి అభివృద్ధి దిశగా పయనించాలంటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీడీపీతోనే విద్యార్థుల భవిష్యత్తు: లోకేష్