January 22, 2013

నల్లగొండ జిల్లాలో పాదయాత్ర ముగించుకొని కృష్ణాజిల్లాలో ప్రవేశించిన నాకు అదే ఆ దరణ..అదే అభిమానం. ఇసుక వేస్తే రాలనంతగా పోటెత్తిన జనాభిమానం ఉక్కిరిబిక్కిరి చేసింది. గరికపాడు వద్ద జిల్లా ప్రజలు చూపిన ఆదరణ అపూర్వం. జాతీయ రహదారి మొత్తం నన్ను చూసేందుకు తరలివచ్చే జనసందోహంతో నిండిపోయింది. యాత్ర సాగుతున్నంతసేపు నాలోనూ వాళ్లలోనూ ఒకే ఊపు, ఒకే ఉత్సాహం పరవళ్లు తొక్కింది. ఈ రోజంతా పశ్చిమ కృష్ణాలోనే నడిచాను. ఈ ప్రాంతం నాగార్జునసాగర్ ఎడమ కాలువ జోన్ 3 పరిధిలోకి వస్తుంది. కానీ, సాగునీరే రావడం లేదు. కృష్ణానది పక్కనే ఉన్నా కనీసం ఎత్తిపోతల ద్వారా అయినా పంటకు నీరందే పరిస్థితి లేదు.

ఉన్న ఒకటో రెండో పథకాలూ ఎత్తిపోయాయి. ఇక వరుణదేవుడే దిక్కు. ఆ దేవుడు కరుణిస్తే రైతు గట్టెక్కినట్టు.. లేదంటే గరళం మింగి ప్రాణాలు తీసుకోవాల్సిందే. ఇవన్నీ వర్షాధార భూములు. ఈ నేలలో పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు వేస్తున్నారు. వేసి..ఆకాశం వంక ఆశగా చూస్తున్నారు. ఒకవేళ బాగా వానలు పడినా, రేటు లేక ఆ ఆనందమూ నిలవడం లేదు. పైగా, కొద్దినెలల క్రితం వచ్చిన నీలం తుఫాను.. ఈ ప్రాంత రైతులను పూర్తిగా ముంచేసింది. పత్తి, మిర్చి పంట చేతికి వస్తున్నదనుకున్న సమయంలో తుఫాను రావడంతో సర్వనాశనం అయిపోయింది. ఇంతగా కుదేలయిన అన్నదాతకు సరైన పరిహారం ఇవ్వాలన్న జ్ఞానం కూడా ఈ పాలకులకు లేదా!

గరికపాడు రహదారిపై కొందరు రైతులు ఎదురుపడ్డారు. వానలు లేక, సాగునీరు అందే దారి లేక తడారిన తమ వ్యవసాయ క్షేత్రాన్ని నాకు చూపించి కన్నీళ్లు పెట్టారు. అదిమొత్తం నూటయాభై ఎకరాల్లో విస్తరించి ఉన్న క్షేత్రం. సాగునీటి వసతి లేక పరిశోధనలే జరగడం లే దట. కొన్నిచోట్ల చేలోనే పంటను తగలబెట్టుకున్నారని చెప్పారు. జగ్గయ్యపేట పట్టణానిదీ ఇదే పరిస్థితి. పట్టణానికి కృష్ణా నీళ్లు ఇస్తానని 2009కి ముందు హామీ ఇచ్చాను. నా తరువాత వాళ్లు ఆ విషయమే పట్టించుకోలేదు. అప్పటి 'మీ కోసం..'లో ఇచ్చిన ఆ హామీని ఇప్పటి 'మీకోసం..'లో మరోసారి స్థానికులు గుర్తుచేస్తుంటే బాధనిపించింది. ఏమిటీ దౌర్భాగ్యం!

అదే ఊపు.. అదే ఉత్సాహం

అక్రమ అరెస్టులతో భయపెట్టలేవు
మీతో ఉండగా అసద్‌ను అరెస్టు చేయలేదే?
నీ వేధింపులకు మేం లొంగం
కృష్ణాజిల్లా పాదయాత్రలో చంద్రబాబు నిప్పులు

అవినీతి మంత్రుల్ని కాపాడటానికి సిగ్గులేకుండా ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అక్రమ అరెస్టుల ద్వారా భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని కాంగ్రెస్ పార్టీతో ఉండగా ఎందుకు అరెస్టు చేయలేదని గట్టిగా నిలదీశారు. "ఖబడ్దార్ ! మీ బెదిరింపులకు మేం భయపడం'' అని సీఎంను హెచ్చరించారు. నల్లగొండ జిల్లాలో ముగించుకొని కృష్ణాజిల్లాలోకి సోమవారం ఆయన పాదయాత్ర ప్రవేశించింది.

జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని పాలేరు నుంచి ప్రారంభించి.. అనుమంచిపల్లి, షేర్ మహ్మద్ పేట, జగ్గయ్యపేట క్రాస్ రోడ్డు, జగ్గయ్యపేట, చిల్లకల్లుల మీదుగా 17.4 కిలోమీటర్లు నడిచారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్లు గా కాంగ్రెస్ రాక్షస పాలన సాగిస్తోందని జగ్గయ్యపేటలో జరిగిన సభలో దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలెవ్వరూ ఆనందంగా లేరన్నారు. ఈ కిరికిరి సీఎం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారని, అవినీతి మంత్రులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. పైగా.. ఆ విషయం అడిగితే ప్రతిపక్షాలపై కత్తులు దూస్తున్నారని ఆ గ్రహం వ్యక్తం చేశారు.

"మా పార్టీ ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌ని తప్పుడు కేసులో ఇరికించారు. గుంటూరు జిల్లాలో కోడెల శివ ప్రసాదరావును జైల్‌లో పెట్టించారు. కరీంనగర్ జిల్లాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు విద్యుత్ సమస్యలపై స్పందించి కార్యక్రమాలు చేస్తున్నారంటూ పీడీ యాక్టు కింద కేసులు పెట్టారు. అసదుద్దీన్ ఒవైసీని కూడా అక్రమ అరెస్టు చేశారు. వారితో కలిసి ఉన్నప్పుడు ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదు?''అని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రజలపై 32 వేల కోట్ల విద్యుత్ భారాలను ప్రభుత్వం.. ప్రజలపై మోపిందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం చిన్న బాంబులే వేసిందని, దీనికే బిల్లులు భారీగా వస్తున్నాయని, రానున్న రోజుల్లో పెద్ద బాంబులు వేయబోతున్నారని, అప్పుడు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సీఎం కరెంట్ విషయంలో ఎలాంటి విధానాన్ని చేపట్టలేకపోయారని, ఆ శాఖకు మంత్రి కూడా లేరని దుయ్యబట్టారు. మిగులు విద్యుత్ సాధించిన ఘనత ఒక్క టీడీపీదేనని చెప్పారు.

రాష్ట్రంలో విద్యుత్ రంగం ఎందుకు పతనావస్థకు వెళ్ళిందన్న దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నా స్పందన లేదని చెప్పారు. దేశాన్ని మలుపు తిప్పిందీ, సాంకేతిక విప్లవం తెచ్చింది తమ కుటుంబమేనన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. "దేశంలో ఐటీని విస్తృతం చేయించి ప్రతి వ్యక్తి చేతిలోను సెల్‌ఫోన్ ఉండేవిధంగా సాంకేతిక విప్లవాన్ని తీసుకు వచ్చిన ఘనత మా పార్టీది. అయితే, అది తమ ఘనతగా రాహుల్ గాంధీ చెప్పుకుంటున్నారు'' అని దుయ్యబట్టారు. తమ హయాంలో హిందూ ముస్లింలు భాయి - భాయి గా ఉండేవారని, ఇప్పుడు భయం - భయంగా జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇప్పటికింతే..మళ్లీ వస్తా
సాంకేతిక కారణాలతో నల్లగొండలో ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నానని, రానున్న కాలంలో 'మీ కోసం..' వస్తానని చంద్రబాబు వెల్లడించారు. "నా పాదయాత్రను రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తా. అది ఎలా అనేది త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తా. ఇప్పటికి కోదాడ మండలంలోనే తిరగగలిగాను. మీ జిల్లాకు మళ్లీ వస్తా' అని భరోసా ఇచ్చారు.

కిరణ్.. ఖబడ్దార్!