January 21, 2013

 వస్తున్నా మీకోసం అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర నల్లగొండ జిల్లా నుంచి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు జిల్లాలో ప్రవేశించింది. జిల్లా సరిహద్దు గరికపాడు పాలేటి వంతెన వద్ద చంద్రబాబుకు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ కార్యకర్తలు, మహిళలు భారీగా వచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మైలవరం శాసన సభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎంఎల్ఏలు శ్రీరాం తాతయ్య, తంగిరాల ప్రభాకరరావు, దాసరి బాలవర్ధనరావు, జయమంగళ వెంకట రమణ, ధూళిపాళ్ల నరేంద్ర, మాజీ మంత్రులు నెట్టెం రఘురామ్, కోడెల శివప్రసాదరావు, ఎంఎల్‌సీలు వైబీ రాజేంద్ర ప్రసాద్, చిగురుపాటి వరప్రసాద్, నన్నపనేని రాజకుమారి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభాహైమావతి, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ, వర్ల రామయ్య, విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్, గద్దె రామ్మోహన్, కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, కొల్లు రవీంద్ర, బచ్చుల అర్జునుడు, కోమటి సుధాకర్, నల్లగట్ల స్వామిదాస్, నల్లగట్ల సుధారాణి, రావి వెంకటేశ్వరరావు, చలసాని ఆంజనేయులు, కొల్లు రవీంద్ర, ఆచంట సునీత తదితరులు స్వాగతం పలికారు.

జగ్గయ్యపేట ఏఎంసీ మాజీ చైర్మన్ గింజుపల్లి రమేష్, చంద్రబాబుకు నాగలి బహుకరించారు. నల్లగొండ జిల్లాలో పాదయాత్ర ముగించి, జిల్లాలో ప్రవేశించిన చంద్రబాబుకు తెలంగాణా టీడీపీ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. పార్టీ తెలంగాణా ఎంఎల్ఏల ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు, ఎంఎల్ఏలు మోత్కుపల్లి నరసింహులు, ఉమా మాధవరెడ్డి, ఇనుగాల పెద్దిరెడ్డి, వేనేపల్లి చందర్‌రావు తదితరులు చంద్రబాబుకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ, తెలంగాణాలో పాదయాత్రను విజయవంతం చేశామని, ఏలాంటి మచ్చ పడకుండ చంద్రుడిలా తెలంగాణా నుంచి బాబును ఆంధ్రాకు పంపించామన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు.

గరికపాడులో ఘన స్వాగతం

 జిల్లాలో అడుగుపెడుతున్న చంద్రబాబుకు సమైక్యాంధ్రపై కనువిప్పు కలిగిస్తామని కాంగ్రెస్ నాయకులు చేసిన సవాళ్ళు గాలికి కొట్టుకు పోయాయి. బాటసారి చంద్రబాబుకు తెలంగాణ జిల్లాల కంటే మిన్నగా.. అశేష ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. దిక్కులు పిక్కటిల్లేలా ప్రజల జయజయధ్వానాలు, కేరింతల నడుమ చంద్రబాబు పాదయాత్ర తొలి రోజు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగింది. చంద్రబాబు పార్టీకి ఏ విధంగా పూర్వవైభవం కల్పించాలని కలలు కన్నారో.. ఆ సన్నివేశం సోమవారం పాదయాత్రలో కనిపించింది. జిల్లాలోని దారులన్నీ.. జగ్గయ్యపేటవైపుకే దారి తీశాయి. జన సంద్రంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. స్వచ్ఛందంగా పాదయాత్రకు వచ్చిన జనాన్ని చూసి, టీడీపీ అధినాయకుడే మహదానందపడిపోయారు. జాతీయ రహదారిపై పసుపు సైన్యం కవాతు చేసింది. పాదయాత్ర ఆద్యంతం నిండైన జనాభిమానం మధ్య సాగింది.

జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున పాదయాత్రకు స్పందన వస్తుందని ఊహించని బాబు ఈ పరిణామంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. షేర్‌మహ్మద్‌పేటలో గడపగడప నుంచి తరలి వచ్చిన ప్రజానీకానికి బాబు ముగ్ధుడైపోయారు. జగ్గయ్యపేట క్రాస్ రోడ్డు దగ్గర అశేష జనవాహిని తరలి రావటంతో బహిరంగ సభలో దాదాపు గంటపాటు ఆవేశంగా ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. రాష్ట్రంలో ప్రజలు చవిచూస్తున్న విద్యుత్తు, నిత్యావసరాల ధరలు, బెల్టు షాపులపై ప్రభుత్వ దమన నీతిపై విరుచుకు పడ్డారు. కాం గ్రెస్ (ఐ), కాంగ్రెస్ (వై)లు ఏనాటికైనా కలిసిపోయేవని, వారి మాయమాటలకు, ప్రలోభాలకు లొంగకుండా ఎన్నికల ఒక్కరోజు సమయం తనకు కేటాయిస్తే.. ఐదేళ్లు సేవకుడిలా పనిచేస్తానని, ప్రతి కుటుంబానికి ఓ పెద్ద కొడుకులా తాను నిలబడతానని వాగ్దానం చేశారు.

ప్రియనేతకు జన దీవెన

జిల్లాలో జగ్గయ్యపేట ప్రాంతంలో ఒక విధమైన ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. తెలంగాణా సెగ నేపథ్యంలో ఆదివారం జిల్లాలో ప్రవేశించనున్న చంద్రబాబు పాదయాత్రకు భారీ స్వాగత ఏర్పాట్లలో తలమునకలై ఉన్న టీడీపీ శ్రేణులు... నిరసన తెలియజేస్తామంటున్న కాంగ్రెస్ నాయకులు... గరికపాడు రావాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు ఫోన్లు... పోలీసుల మోహరింపు... మొత్తంగా అన్ని వర్గాలలో కూడా ఒకటే ఉత్కంఠ... ఏం జరుగుతుందన్న విషయమై తర్జన భర్జనలు...వస్తున్నా... మీకోసం అంటూ పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం జిల్లాలో ప్రవేశించనున్నారు. .

నల్లగొండ జిల్లా రామాపురం మీదుగా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద మధ్యాహ్న సమయంలో ఆయన జిల్లాలో అడుగుపెడతారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీకి చెందిన జిల్లా నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. లక్ష మందితో అపూర్వ స్వాగతం పలుకుతామని నాయకులు ప్రకటించారు. గ్రామాల్లో ప్రచారం చేయటమే కాకుండా కార్యకర్తల తరలింపు బాధ్యతలను గ్రామ స్థాయి నాయకులకు అప్పగించారు. బ్యానర్లు, ప్లెక్సీలతో పాటుగా గరికపాడు వద్ద స్వాగతం ద్వారం ఏర్పాటు చేశారు. జగ్గయ్యపేట అడ్డరోడ్డు వద్ద జరగనున్న బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు

తెలంగాణాకు అనుకూలంగా చంద్రబాబు లెటరు ఇచ్చినందున పాదయాత్రకు నిరసన తెలియజేస్తామని ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యే జోగి రమేష్ పేర్కొంటున్నారు. ఇందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను సమీకరిస్తున్నారు. నిరసనకు భారీగా తరలిరావల్సిందిగా కోరుతూ, విజయవాడ నుంచి స్థానిక నాయకులకు ఫోన్లు వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు తొలుత గరికపాడు వద్ద ప్రత్యేకంగా టెంట్ వేశారు. తర్వాత దానిని తొలగించి అనుమంచిపల్లి వద్ద రోడ్డు పక్కన వేశారు. ఒకవైపు కాంగ్రెస్ నాయకుల హెచ్చరికలు, మరోవైపు తెలంగాణా సెగ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడకుండ చూసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు.

నందిగామ డీఎస్పీ చిన్నహుస్సేన్ జగ్గయ్యపేటలో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదనపు బలగాలను రప్పించారు. ఇప్పటికే గరికపాడు చెక్‌పోస్టు ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ విషయమై డీఎస్పీ మాట్లాడుతూ, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామన్నారు. జాతీయ రహదారిపై పెట్రోలింగ్ చేస్తున్నామని, అనుమానితులు,వాహనాలను అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

ఉత్కంథభరిత వాతావరణం

జనం చింతల్లో.. వాళ్లు సంబరాల్లో!
రాహుల్ కోసం ఇంత ప్రయాసా?
కాంగ్రెస్ 'చింతన్ శిబిర్'పై చంద్రబాబు ధ్వజం
ఉల్లిని కోయకుండానే కన్నీళ్లు

  పెరిగిన ధరలతో, విద్యుత్ కోతలతో, రైతు ఆత్మహత్యలతో ప్రజలంతా చింతల్లో ఉండగా, కాంగ్రెస్ మాత్రం 'చింతన్ శిబిర్' పేరిట సంబరాలు జరుపుకుంటోందని తె లుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. కాంగ్రెస్ జైపూర్ సమావేశాల తీరు.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. రాహుల్‌కు ఉపాధ్యక్ష పద వి కట్టబెట్టడానికి అంత ప్రయాస, ఆడంబరం దేనికని, ఢిల్లీలో కూర్చుని ప్రకటిస్తే సరిపోదా అని ప్రశ్నించారు.

నల్లగొండ జిల్లా కోదాడ మండలం గుడిబండ వద్ద చంద్రబాబు ఆదివారం పాదయాత్ర ప్రారంభించారు. కాపుగల్లు, రెడ్లకుంట మీదుగా 14.8 కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా పలు సభల్లో ఆయన మాట్లాడారు. "అప్పులపాలైన వేలాది మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. విద్యుత్ కోతతో పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఉపాధి కోల్పోయి లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇలా ప్రజలంతా చింతల్లో ఉంటే కాంగ్రెస్.. సంబరాల్లో మునిగి తేలుతోంది'' అని దుయ్యబట్టారు.

సాధారణంగా ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్లొస్తాయని, కానీ పెరిగిన ధరలతో ఆడబిడ్డలకు ఉల్లిని కోయకముందే కన్నీళ్లొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి ధరలను నియంత్రించేందుకు తమ హయాంలో మహారాష్ట్ర నుంచి నిపుణులను పిలిపించి ప్రత్యేకంగా గోదాములు నిర్మించామని గుర్తుచేశారు. ఆ గోదాములను ఇప్పుడు కాంగ్రెస్ దొంగలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు.

కాగా, కోదాడ మండలం గుడిబండలో బహిరంగసభ జరుగుతుండగా ఓ విద్యార్థి 'జై తెలంగాణ' అని ఒక్కపెట్టున నినదించాడు. దీనిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. "నోరు తెరిస్తే పేగులు లెక్కవేసే మనిషిని. మా మీటింగ్ బాగా జరుగుతుంటే చూసి భయపడుతున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్లు చిన్నచిన్న గొడవలు చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్లు గొడవ చేస్తే ఎలా నోరు మూయించాలో మా వాళ్లకు తెలుసు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్.. ఇలా అన్ని జిల్లాలూ తిరిగా'' అని తీవ్రస్వరంతో అన్నారు.

తెలంగాణ విషయంలో తమ వైఖరి అఖిలపక్ష సమావేశంలో స్పష్టంగా చెప్పామని, అయినా అల్లరి చేస్తే ఏం చెప్పాలి తమ్ముళ్లూ...! అంటూ సభలోని యువకులను ఉద్దేశించి ప్రశ్నించారు. "వాళ్లు రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తారు. నేను ప్రజల జీవితాలకు ప్రాధాన్యం ఇస్తా''నని చంద్రబాబు తెలిపారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను కాలం చెల్లిన నాణేలుగా అభివర్ణించారు.

"కాంగ్రెస్ నావకు చిల్లులు పడ్డాయి. మునిగేందుకు సిద్ధంగా ఉంది. వాళ్లు మునిగినా ఫరవాలేదు. కానీ దేశాన్ని ముంచే పరిస్థితి ఉంది. అంతా మేల్కొనాలి' అని పిలుపునిచ్చారు. సీఎం కిరికిరి రెడ్డి అని, అన్నీ తెలిసిన వాడిలా ఫోజుకొడుతుంటాడని మండిపడ్డారు. కరెంట్ డిపార్ట్‌మెంట్‌కు మంత్రే లేడంటే రాష్ట్రంలో ఏ తరహా పాలన సాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. సీఎం కిరణ్ అర్థం చేసుకునేలోపు ఆయన సీటు పోయే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.

నీలం తుపాను సహాయానికి రూ. 50 కోట్లు అడిగితే మూడు కోట్లు ఇచ్చారని, 30 మంది కాంగ్రెస్ దద్దమ్మ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అదే తెలుగుదేశం హయాంలో వాజపేయిపై ఒత్తిడి చేసి కరువు సహాయం కింద 54 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పనికి ఆహారం పథకంలో రాష్ట్ర ప్రజలకు పంచామన్నారు. "కాంగ్రెస్ హయాంలో ఆస్తిపన్ను, నీటి పన్ను..అన్నీ పెంచారు. గాలి పీలుస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి పన్నులు వేసే అవకాశం రాబోయే రోజుల్లో లేకపోలేదు. మేం ఇన్ని కష్టాలు పెట్టినా మీ జుట్టు రాలిపోలేదు కాబట్టి జుట్టు పన్ను వేస్తున్నాం'' అని ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.

ఆడబిడ్డలకు బంగారం దొరికే పరిస్థితి లేదని, బంగారం అంతా గాలి జనార్దనరెడ్డి ఇంట్లోనే ఉందన్నారు. "గాలి తన పెద్దకొడుకు అని వైఎస్ చెప్పారు. ఆయనకు బంగారు సింహాసనాలు, మంచాలు దోచిపెట్టారు. చిన్న కొడుకు జగన్‌కు లక్ష కోట్లు అక్రమంగా సంపాదించి పెట్టాడు'' అని విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రాష్ట్రంలో పరిపాలనను గాడిలో పెడతానని ప్రకటించారు. అనంతరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోదాడ మండలం కాపుగల్లులో నిర్మించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి తాగునీటి పథకాన్ని ఆయన ప్రారంభించారు.

గాలికీ, జుట్టుకూ పన్ను వేస్తారేమో

కృష్ణా జిల్లాలో నేటి నుంచి పాదయాత్ర..
బాబు యాత్రకి 'సమైక్య' సెగ!

హైదరాబాద్ మిన హా తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లోనూ యాత్రను పూర్తి చేసుకున్న ఆయన, నల్గొండ జిల్లా కోదాడ మండలం పరిధిలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి సమీపంలో కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆయనకు పెద్దఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

అదే సమయంలో రాష్ట్ర విభజన అంశంపై తారస్థాయిలో చర్చ జరుగుతున్న తరుణంలో చంద్రబాబు తెలంగాణ నుంచి ఆంధ్రా ప్రాంతంలో ప్రవేశించనుండడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అక్కడ తెలంగాణకు జై కొట్టి.. ఇక్కడకు వస్తున్న ఆయనను అడ్డుకుంటామని ఇప్పటికే కొన్ని సంస్థలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిని.. అప్పట్లో తెలంగాణలోకి అడుగుపెట్టిన వాతావరణంతో పోల్చి రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణలో పాదయాత్రకు అడ్డంకులు తప్పవని, గొడవలు జరుగుతాయని నాడు పలువురు భావించారు. అయితే..తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఆధ్వర్యంలో తెలంగాణ వాదులు ఆయనను అడ్డుకునేందుకు యత్నించినప్పటికీ పెద్దగా సమస్యలు ఎదురు కాలేదు. కాగా.. కృష్ణా జిల్లాలో తొమ్మిది రోజులు పాదయాత్ర జరిపి న అనంతరం బాబు గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తారు. 15 రోజుల పాదయాత్ర అనంతరం మళ్లీ కృష్ణా జిల్లాలోకి ప్రవేశించి మరో 8 రోజుల పాటు పాదయాత్ర జరుపుతారు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తారు.

ఆంధ్రాలోకి అడుగు

తెలంగాణ జిల్లాల్లో అపూర్వ ఆదరణ లభించింది. పుట్టెడు కష్టాల్లో ఉండి కూడా జనం నీరాజనం పలికారు. చింతల్లో ఉన్న వాళ్ల చెంతకు పాదయాత్రగా వెళ్లినందుకు, భవిష్యత్తుపై కొంతైనా భరోసా ఇవ్వగలిగానన్న సంతృప్తి మిగిలింది. రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విద్యార్థి, మహిళ, వృద్ధులు.. ఇలా ఎవరిని కదిలించినా అసంతృప్తి, ఆవేదనలే ముందుగా పలకరించాయి. తెలంగాణలో ఒక్కో జిల్లాది ఒక్కో వ్యథ. అలాగే.. ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన అనుభవాన్ని నేను చవిచూశాను. మహబూబ్‌నగర్‌లో వేదిక కూలి నడుంకు దెబ్బ తగిలినా సంకల్పం చెదరలేదు.

ఆత్మీయుడు, కుడిభుజంగా ఉన్న ఎర్రన్నాయుడు మృతి కుంగదీసింది. రంగారెడ్డి తండాల్లో కష్టాలను స్వయంగా చూసినవాడిగా గిరిజన డిక్లరేషన్ రూపొందించాను. నిజామాబాద్ జిల్లాలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయి దాటాను. జాడీజమాల్‌పూర్ గ్రామంలో అడుగుపెట్టినప్పుడు, 30ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ఎన్టీఆర్ గడిపిన స్మృతులు భావోద్వేగానికి గురిచేశాయి. ఖమ్మంలో యాత్రకు వందో రోజు పూర్తయిన ఘడియలు మరిచిపోలేను. నల్లగొండకు వచ్చేసరికి, ఒకవైపు ఫ్లోరైడ్ సమస్య మరోవైపు ఎండిపోయిన పంటలుచూసి ఆవేదన కలిగింది. కరీంనగర్‌లో చేనేతల కష్టాలూ, గల్ఫ్ బాధితుల గోడూ విన్నాను.

రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రధాన నదులన్నీ తెలంగాణను పలకరించాల్సిందే. కానీ, ఈ ప్రాంతానికి శిలాఫలకాలు తప్ప జలభాగ్యం లేదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఒకటి, ఆదిలాబాద్‌లో మరో శిలాఫలకం తప్ప మార్గమధ్యంలో ఎక్కడా 'ప్రాణహిత-చేవేళ్ల' ఆనవాలే కనిపించలేదు. ఆదిలాబాద్ జిల్లా బాసరలో అడుగుపెట్టగానే ఆ సరస్వతీ నిలయాన్ని ప్రముఖ విద్యాకేంద్రంగా మార్చాలన్న ఆలోచన మధ్యలోనే ఆగిపోవడంపై మనసు చివుక్కుమంది.

మండల కేంద్రాల్లో సాధ్యమైనంత మేర అవినీతిపై ప్రజల్లో చర్చ పెట్టాను. 'అవినీతిపై యుద్ధం చేయాల్సిన సైనికులు మీరే'నంటూ యువకులను ఉత్సాహపరిచాను. ఎమ్మార్పీఎస్, లంబాడా హక్కుల సమితి.. యాత్ర ఆసాంతం రక్షణగా నిలవడం, కుల సంఘాల తోడ్పాటు మరవలేను. ఇప్పటికి వీడ్కోలు పలుకుతున్నా.. తెలంగాణ నుంచి ఈ ఎడబాటు తాత్కాలికమే!

ఈ ఎడబాటు తాత్కాలికమే!


"వస్తున్నా....మీకోసం" పాదయాత్ర
పార్టీ నేతలు, కార్యకర్తల ఘన స్వాగతం

వస్తున్నా...మీకోసం కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర సోమవారంనాడు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. సోమవారం ఉదయం నల్గొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర రెండు కిలోమీటర్ల తర్వాత గరికపాడు చెక్‌పోస్టు వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. దీంతో చంద్రబాబుకు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

చంద్రబాబు "వస్తున్నా..మీకోసం" పాదయాత్ర 112 వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం నల్గొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. కృష్ణా జిల్లాలోకి ప్రవేశించడానికి ముందు అక్కడి ఆంజనేయస్వామి ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం బాబుతో జిల్లా టీడీపీ కార్యవర్గం భేటీ అయింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రకు రాష్ట్రం నలుమూలలా మంచి ఆదరణ లభిస్తోందని సంతోషం వ్యక్తం చేసారు. పాదయాత్రను కొనసాగించాలనుకుంటున్నట్లు బాబు ఈసందర్భంగా తెలిపారు. సహకార ఎన్నికల్లో సత్తా చూపాలని, ప్రజా సమస్యలపై ఉద్యమం చేపట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన చంద్రబాబు


వస్తున్నా...మీకోసం ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటుగా నలుగురు వ్యక్తులు పాదయాత్ర చేస్తున్నారు. వారిలో చందర్లపాడు మండలం చింతలపాడుకు చెందిన రైతు నాయకుడు వసంత సత్యనారాయణ ఒకరు. గత ఏడాది అక్టోబర్ రెండున అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం తుక్కూరు ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభమైన సంగతి విదితమే. ఆ రోజు నుంచి చంద్రబాబుతో పాటు వసంత సత్యనారాయణ పాదయాత్ర చేస్తున్నారు. 52 సంవత్సరాల వయస్సు గల సత్యనారాయణ గ్రామ సర్పంచ్‌గా, ఎన్ఎస్‌పీ డీసీ చైర్మన్‌గా పనిచేశారు. పార్టీ పరంగా జిల్లా కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శిగా, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యునిగా పని చేశారు.

రైతాంగ సమస్యలపై ఎంతో పట్టున్న ఆయన ఇంతకు ముందు మూడు మహానాడు కార్యక్రమాల్లో వ్యవసాయంపై మాట్లాడారు. పాదయాత్ర విశేషాలు గురించి ఆయన మాటల్లో... ? పాదయాత్ర ఎందుకు చేయాలనిపించింది జవాబు: దేశంలోనే చంద్రబాబు కీలకమైన నేత. రాష్ట్రంలో సమర్ధవంతమైన పాలన కోసం చంద్రబాబు అవసరం ఎంతో ఉంది. అవినీతిని తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఆయన పాదయాత్ర చేస్తున్నారు.

ఆరు పదుల వయస్సులో సాహోసపేతమైన నిర్ణయం తీసుకుని అలుపెరగకుండ రేయింబవళ్లు కష్టపడుతున్న ఆయనకు ఉడుతా భక్తిగా చేతనైన సాయం చేయాలనుకుని పాదయాత్ర చేస్తున్నాను? పాదయాత్రకు స్పందన ఎలా ఉంది జవాబు: ఇప్పటి వరకు అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో ఎనిమిది వందలకు పైగా గ్రామాల్లో పాదయాత్ర జరిగింది. అన్ని వర్గాల ప్రజల నుంచి బాబు యాత్రకు అపూర్వ స్పందన వస్తున్నది. రాత్రి సమయాల్లో కూడా గంటల తరబడి ఆయన కోసం నిరీక్షిస్తున్నారు. ఆడ, మగ, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ పాదయాత్రలో పాల్గొని బాబుకు సమస్యలు వివరిస్తున్నారు.

బాబుకు వస్తున్న స్పందన చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి ? ప్రజలు ఎక్కువగా ఏయే సమస్యలు ప్రస్తావిస్తున్నారు జవాబు: ప్రధానంగా సాగునీరు, తాగునీరు, గిట్టుబాటు ధరలు, విద్యుత్, ధరలు తదితర సమస్యలతో పాటు స్థానిక సమస్యలను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు ? ఆరోగ్య సమస్యలేమైనా తలెత్తాయా జవాబు: ఆదివారం నాటికి పాదయాత్ర చేపట్టి 111 రోజులైంది. ఇప్పటి వరకు ఆరోగ్యపరంగా సమస్యలు రాలేదు. ముఖ్యంగా రోజూ తేలికపాటి ఆహారం తీసుకుంటున్నాను. ఘన పదార్థం తక్కువ. ప్రజల స్పందన చూస్తుంటే ఆరోగ్యం తర్వాత ఇంకా ఎంతో హుషారు వస్తున్నది

చంద్రబాబు యాత్రకు అపూర్వ ప్రజా స్పందన

కౌంట్ డౌన్ మొదలైంది. గరికపాడు చెక్‌పోస్టు దగ్గర బాబుకు ఘన స్వాగతం పలకటానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. లక్షమంది కార్యకర్తల గర్జన మధ్య బాబు జిల్లాలోకి అడుగు పెట్టే క్షణం కోసం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆశతో ఎదురుచూస్తున్నాడు. సంక్లిష్ట రాజకీయాల నడుమ.. ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు 63 ఏళ్ళ వయసులో చంద్రబాబు పాదయాత్రతో జిల్లాలోకి అడుగు పెడుతున్నారు. రాష్ట్రస్థాయి నాయకులెవ్వరూ ఇప్పటి వరకు జిల్లాలో పాదయాత్ర తలపెట్టలేదు. జిల్లాలోకి అడుగు పెడుతున్న ఈ బాటసారికి ఘన స్వాగతం పలికేందుకు నాయకులు సిద్ధమయ్యారు. బాబు తొమ్మిది రోజుల పర్యటనను దిగ్విజయం చేయటానికి సర్వం సిద్ధం చేశారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాలోని సమస్యలు ఒక్కటీ పరిష్కారం కాకపోవటాన్ని ప్రజల్లో చంద్రబాబు ఎత్తిచూపేలా చంద్రయాన్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగ్గయ్యపేట, మైలవరం, విజయవాడ పశ్చిమం, సెంట్రల్, తూర్పు నియోజకవర్గాలలో పాదయాత్ర జరిపే చంద్రబాబు మొత్తం 19 చోట్ల బహిరంగ సభల్లో మాట్లాడతారు.

రూరల్ నియోజకవర్గాలలో రైతాంగ సమస్యలపైన, ప్రభుత్వ వైఫల్యం వల్ల ఉత్పన్నమైన సమస్యలపైన బాబు ప్రధానంగా ప్రసంగించనున్నారు. రైతుల ఆత్మహత్యలు, విత్తనాల సబ్సిడీ కుదింపు, ఎరువుల ధరల స్థిరీకరణ లేకపోవటం, గిట్టుబాటు ధరలు, అసంపూర్తి సాగునీటి ప్రాజెక్టులు, సరైన విధానం లేని ప్రభుత్వ దమన నీతిని బాబు ఎండగట్టనున్నారు.

పోలవరం, పులిచింతల, ఆశల ఊగిసలాటలో ఉన్న బందరు పోర్టుల దీన స్థితిపై బాబు మాట్లాడతారు. ప్రణాళికలేని ప్రజా ప్రతినిధుల నిర్వాకాలను ఎండగట్టనున్నారు. కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లై ఓవర్ ఏర్పాటు, విజయవాడలో సూపర్ స్పెషాలిటీఏర్పాటు, గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధిపై పాలకులు ఇచ్చిన హామీలను ఎత్తి చూపుతారు. రచ్చబండలో ప్రజల అర్జీలపై దృష్టి సారించని ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు. మొత్తంగా అటు రాష్ట్ర పరిస్థితిని, స్థానిక పరిస్థితిని ప్రజల్లోకి తీసుకు వెళ్ళి, మళ్లీ రాష్ట్రాన్ని పాలించే అవకాశం తమకు కల్పించాలని విజ్ఞాపన చేయనున్నారు.

చంద్రబాబు పాదయాత్రకు భారీ స్వాగత ఏర్పాట్లు

'అటు నీటి వనరులు, ఇటు సహజ వనరులు... శ్రమించే ప్రజలు... ఇలా అన్ని వనరులూ, హంగులూ నల్లగొండ జిల్లా సొంతం. కానీ కాంగ్రెస్ నాయకులు ఈ జిల్లాను... వికలాంగ జిల్లాగా మార్చారు' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర నాలుగోరోజు, ఆదివారం కోదాడ మండలం కాపుగల్లు క్రాస్‌రోడ్, పాత,చిన్న గుడిబండ, కాపుగల్లు, రెడ్లకుంటతండాల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయన పలు సభల్లో ప్రసంగించారు. రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు కాపుగల్లుగ్రామానికి వచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

స్థానిక నాయకుడు తొండపు భాస్కర్‌రావు సహకారంతో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా సురక్షితమైన నీటిని తెలుగుదేశం అందిస్తోందని తెలిపారు. అధికారంలోకి రాగానే ఈ తరహా ప్రాజెక్టులు రాష్ట్రవ్యాప్తంగా చేపడతామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో... సాగర్ ప్రాజెక్టులో 490 అడుగుల మేర నీళ్లు ఉన్నా కిందికి వదిలామని, ప్రస్తుతం 520 అడుగులు ఉన్నా ఆందోళనలు చేస్తే తప్ప నీళ్లు వదిలే పరిస్థితి లేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో 22 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, వైఎస్ కాలంలోనే 14.798 మంది అన్నదాతలు బలవన్మరణాల పాలయ్యారని ఆవేదన చెందారు. వీరేకాదు వృత్తికి ప్రోత్సాహం లేక చేనేతలు, అవమానాలు తాళలేక మహిళలు, ఉద్యోగ అవకాశాలు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ పాలన తీరును వివరించారు.

తాము అధికారంలోకి వస్తే రైతులకు మద్దతు ధర కాదు... గిట్టుబాటు ధర కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. 2014 వరకు కరెంట్ చార్జీలు పెంచనని చెప్పి ఓట్లు వేయించుకున్న పెద్ద మనిషి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత నమ్మకద్రోహం చేశారని ధ్వజమెత్తారు. 'తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా.రెండు మార్లు ప్రతిపక్షనేతగా ఉన్నా. నేను ముఖ్యమంత్రి పదవికోసం పాదయాత్ర చేపట్టలేదు. ఆ పదవి నాకు కొత్త కాదు. ప్రజలు కష్టాలు పడుతున్నారు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు. వారిని కలిసి సమస్యలు తెలుసుకుని అండగా ఉంటానని ధైర్యం చెప్పడానికే పాదయాత్ర చేపట్టా' అని వివరించారు.

విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు వస్తున్నా... మీకోసం పాదయాత్రకు జిల్లా ప్రజలు చక్కగా స్పందించారు. అందరికీ ధన్యవాదాలు. కొన్ని కారణాల వల్ల జిల్లా మొత్తం పర్యటించలేకపోయా. మళ్లీ ఒకసారి తప్పకుండా జిల్లాకు వస్తాను' అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

నేటితో ముగియనున్న పాదయాత్ర... 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా చంద్రబాబు ఈనెల 16న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మీదుగా కోదాడ మండలం శాంతినగర్‌లో అడుగుపెట్టారు. 16నుంచి 21 వరకు అయిదు రోజుల పాటు సుమారు 50.5 కి.మీల మేర కోదాడ, చిలుకూరు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పాదయాత్ర క్రమంలో వివిధ వర్గాల ప్రజలతో ఆయన నేరుగా సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారిస్తామని హామీలు ఇచ్చారు. పలుచోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు.

తాము అధికారంలోకివస్తే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేస్తామని చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇక ఇంజనీరింగ్ విద్యార్థులతో మమేకమై, అవినీతిపై పోరాడాల్సిన తక్షణావసరాన్ని వారికి నొక్కిచెప్పారు. పార్టీనేతలతో సమావేశాలు జరిపి వారికి దిశానిర్దేశం చేశారు. ఇక వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ బాబుకు విజ్ఞాపన పత్రాలు సమర్పించారు. సోమవారంతో తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర ముగుస్తుండడంతో ఈ ప్రాంతానికి చెందిన కీలక నేతలు అంతా కోదాడ చేరుకున్నారు.

నేడు జిల్లా కార్యవర్గ సమావేశం పాదయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో సోమవారం... రిక్విన్ పరిశ్రమ సమీపంలో జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. పాదయాత్రపై సమీక్ష, భవిష్యత్తులో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, నాయకులు వ్యవహరించాల్సిన తీరుపైన చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.

అన్ని వనరులు, హంగులు ఉన్నా వికలాంగ జిల్లాగా మార్చారు