December 26, 2012అనాథలా ఆంధ్ర!

స్కాంల రాజధానిగా హైదరాబాద్

బయట నుంచి పెట్టుబడులు లేవు

బీహార్, గుజరాత్‌ల పైనే అందరి చూపు

ధరల పెంపు తప్ప కాంగ్రెస్ చేసిందేం లేదు

కరీంనగర్ పాదయాత్రలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అనాథగా మారిందని, హైదరాబాద్ కుంభకోణాల రాజధానిని తలపిస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అంతా గుజరాత్, బీహార్‌లకు పోతున్నారు తప్ప హైదరాబాద్ వైపు చూసే నాథుడే లేకుండా పోయారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగారాం వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఊషన్నపల్లి, లక్షీపురం, పందిళ్ల, కొమిరె, జీలకుంట, పోత్కపల్లి గ్రామాల వరకు 12.5 కిలోమీటర్లు నడిచారు. దారిపొడవునా ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ.. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తూ వెళ్ళారు.

గంగారంలో మత్స్యకారులు వలలు, బుట్టలు అందివ్వగా వాటిని ప్రదర్శిస్తూ.. తాము అధికారంలోకి వస్తే కులవృత్తులను చేతివృత్తులను ప్రొత్సహిస్తానని, బడుగు, బలహీనవర్గాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. గంగారం జడ్‌పీ హైస్కూల్‌లో టాయిలెట్లు లేవని విద్యార్థులు బాబు దృష్టికి తేగా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.2.5 లక్షలు మంజూరు చేస్తున్నానని ప్రకటించారు. ఊషన్నపల్లిలో కొత్తగా పెళ్లి చేసుకున్న రెండు జంటలను ఆశీర్వదించారు.

అక్కడే ఇద్దరు మహిళలు జై తెలంగాణ నినాదాలు చేస్తూ తమకు తెలంగాణ కావాలనగా.. కేంద్రం సహకరిస్తే తెలంగాణ వస్తుందని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని చెప్పారు. ఎరువుల ధరలు తగ్గించి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం హయాంలో మిగులు కరెంట్ సాధించి తొమ్మిది గంటల పాటు కరెంట్ ఇస్తే.. ఈ రోజు కాంగ్రెస్ హయాంలో ఏం జరుగుతున్నదో ఆలోచించాలని ప్రజలను కోరారు.

"టీడీపీ హయాంలో క్వింటాలు పత్తిని రూ.4 వేలకు అమ్మితే.. ఇప్పుడు రూ.3500 అన్నా పలికే నాథుడు లేడు. డిసెంబర్ వచ్చినా సాగునీరు వదలట్లేదు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత కరెంట్ ఇస్తుందని, సర్‌చార్జీలు తగ్గిస్తుందని హామీ ఇచ్చారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో ధరలు తగ్గిస్తానని చెప్పినా ఇప్పటికీ ధరలు తగ్గకపోగా ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు.

"వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. టీడీపీ హయాంలో చక్కెర కిలో రూ.12కు అమ్మితే ఇప్పుడు రూ.25కు చేరింది. రూ.4 ఉండే ఉల్లి రూ.18 అయింది. వంటనూనెలు అప్పుడు రూ.40 ఉంటే ఇప్పుడు రూ.120కి అమ్ముతున్నారు'' అని పోల్చారు. తమ హయాంలో ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసి నిత్యావసర వస్తువులు కొని మార్కెట్‌లో సరఫరా చేసేవారమని గుర్తుచేశారు. వైఎస్ ఏపీపీఎస్సీలో తనకు కావల్సినవారిని నియమించుకుని.. తాను చెప్పిన వారికి ఉద్యోగాలు ఇప్పించుకుని అర్హులకు అన్యాయం చేశాడని ఆరోపించారు.

రాష్ట్రాన్ని పట్టించుకునే నాథుడే లేడు
అడుగు వెనక్కి తీసుకోలేమ2008లో చేసిన తీర్మానం పునరుద్ఘాటన!
 సీమంధ్ర నేతలతో బాబు
 200 సీట్లలో ప్రజల మనోభావాలను
 గుర్తించాలని కోరిన నేతలు

 తెలంగాణ అంశంపై కేంద్రానికి మరోసారి లేఖ రాయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ నెల 28వ తేదీన ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో ఆ పార్టీ ఈ లేఖను కేంద్ర హోం మంత్రికి అందచేయనుంది. ఈ లేఖలోని సారాంశం నిర్దిష్టంగా ఖరారు కాకపోయినా తెలంగాణ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తూ ఈ లేఖ ఉంటుందన్నది ఆ పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ టీడీపీ 2008లో తీర్మానం చేసింది. దాని ప్రతిని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అందచేసింది. అదే విషయాన్ని పేర్కొంటూ తాజా లేఖను ఇవ్వనున్నారు.

'2008లో టీడీపీ చేసిన తీర్మానం తెలంగాణ ఏర్పాటు పట్ల చాలా స్పష్టమైన తీర్మానం. దాని గురించి తాజా లేఖలో పేర్కొనడమంటే తెలంగాణకు గట్టి మద్దతు ఇచ్చినట్లే. రెండు ప్రాంతాల్లో ఉన్న పార్టీ ఇలాంటి వైఖరితో అఖిలపక్షానికి వెళ్లడం పెద్ద సాహసం. గత కొంతకాలంగా తెలంగాణ పట్ల సానుకూలతతో మాట్లాడుతున్న చంద్రబాబు అదే వైఖరితో ఈ నిర్ణయం తీసుకొన్నారు' అని ఆ పార్టీ ముఖ్యుడు ఒకరు వివరించారు. తాను పాదయాత్ర చేస్తున్న కరీంనగర్ జిల్లాలో బుధవారం ఉదయం సీమాంధ్ర నేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ మేరకు తన మనోగతంపై వారికి సంకేతాలు ఇచ్చారు. 'తెలంగాణ విషయంలో ఒక అడుగు ముందుకు వేసేశాం.

అఖిలపక్షం పెడితే మన వైఖరి చెబుతామని అన్నాం. ఇప్పుడు వెనక్కు వెళ్లలేం. అర్ధం చేసుకోండి' అని ఆయన వారితో అన్నారు. కానీ పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ధూళిపాళ నరేంద్ర, దేవినేని ఉమా మహేశ్వరరావు తదితర నేతలు తమ వైపు వాదనను ఆయనకు గట్టిగా వినిపించారు. 'తెలంగాణ వాదం 60- 70 నియోజకవర్గాల్లో గట్టిగా ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో అది అంశం కాదు. 200 నియోజకవర్గాల్లో ప్రజల మనోభావాలు వేరుగా ఉన్నాయి.

మనం తెలంగాణకు అనుకూలంగా మాట్లాడితే దానిని అవకాశంగా తీసుకొని ఈ సీట్లలో మనను దెబ్బ కొట్టాలని వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు కాచుకొని కూర్చున్నాయి. అవి తమ వైఖరి చెప్పకుండా దాక్కొని కేవలం మనను సీమాంధ్రలో దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి' అని వారు వాదించారు. సమైక్యవాదంతో వెళ్లాలని తాము పార్టీపై ఒత్తిడి తేవడం లేదని, తెలంగాణ పట్ల సానుకూలంగా మాట్లాడుతూనే సీమాంధ్రలో కూడా పార్టీ నేతలు ఇతర పార్టీల దాడిని తట్టుకొనే విధంగా పార్టీ వైఖరిని రూపొందించాలని వారు ఆయనకు సూచించారు. అఖిలపక్ష సమావేశానికి రెండు ప్రాంతాల నుంచి ఇద్దరు ప్రతినిధులను పంపాలని, అవకాశం ఉంటే సీమాంధ్రలో వెనకబాటుతనం గురించి, నదీ జలాల సమస్యల గురించి మాట్లాడటానికి అనుమతి ఇవ్వాలని వారు కోరారు.

ప్రతినిధులపై తర్జనభర్జన

అఖిలపక్షానికి టీడీపీ తరపున రెండు ప్రాంతాల నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరు కావడం ఖరారైంది. పోయినసారి అఖిలపక్షానికి వెళ్ళిన యనమల రామకృష్ణుడు, రేవూరి ప్రకాశ్‌రెడ్డిలనే ఈసారి కూడా పంపుతారా లేక మార్పు ఉంటుందా అన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తెలంగాణ నుంచి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారిని పంపాలనుకుంటే మోత్కుపల్లి నర్సింహులు లేదా రమేష్ రా«థోడ్‌ల్లో ఒకరికి అవకాశం లభించవచ్చు. సీమాంధ్ర నుంచి కూడా మార్చాలని అనుకొంటే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పేరు పరిశీలనకు రావచ్చునని అంటున్నారు.

అఖిలపక్షంలో ఒకే అభిప్రాయం: యనమల

కరీంనగర్: తెలంగాణపై 28న జరిగే అఖిల పక్ష సమావేశంలో తెలుగుదేశం ఒకే నిర్ణయం చెబుతుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. పార్టీ నుంచి ఒక్కరు వెళ్లినా, ఇద్దరు వెళ్లినా ఒకే నిర్ణయం ఉంటుందని చెప్పారు. గురువారం అన్ని ప్రాంతాల పొలిట్‌బ్యూరో సభ్యులతో చంద్రబాబు సమావేశమవుతారని, అప్పుడే ఏం చెప్పాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని యనమల స్పష్టం చేశారు.

తెలంగాణపై కేంద్రానకి మరోసారి టీడీపీ లేఖ