December 20, 2012

గ్రామ గ్రామానా అందమైన గ్రామ సచివాలయాలు వెలిసిన రోజులవి! అప్పట్లో సమస్యల పరిష్కారానికి అవే వేదికలు! మూడు నెలలకోసారి జన్మభూమి పేరిట సభలు అక్కడే జరిగేవి! రైతు మిత్ర, డ్వాక్రా సంఘాలు, విద్యా కమిటీలు, సాగునీటి సంఘాలు అన్నిటికీ అవే వేదికలు! చివరికి, ఫలితాలూ ఆశాజనకంగానే వచ్చాయి! రోగాలకు దూరంగా గ్రామాలు పరిశుభ్రంగా ఉండేవి! బ్లీచింగ్ కలిపిన 'మంచి' నీళ్లు ప్రజలకు అందేవి! మరి ఇప్పుడో!? గ్రామీణ ప్రాంతాలన్నీ కళా విహీనం! గ్రామ సచివాలయాలు జన విహీనం! ఎప్పుడు చూసినా గ్రామ సచివాలయాలకు తాళాలే! గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేది సచివాలయ సిబ్బందే! వీధిలైట్లు వేసేదీ వారే. మంచినీళ్లు సరఫరా చేసేదీ వారే! మురుగు కాల్వలు, రోడ్లు శుభ్రం చేసేదీ వారే! గ్రామాన్ని అద్దంలా తీర్చిదిద్దే బాధ్యత వారిదే. కానీ, వారి సమస్యల పరిష్కారం విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

టీడీపీ హయాంలో ఇటు నిధులు.. అటు విధులు అప్పగించి అభివృద్ధికి బాటలు పరిస్తే.. నిధులను.. వాటితోపాటు విధులను తీసేసి గ్రామ సచివాలయాలను, వాటిలోని సిబ్బందిని నామమాత్రం చేసిందీ సర్కారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన స్థానిక సంస్థలను పతనావస్థకు తీసుకెళ్లింది. అందుకే, లింగంపల్లిలో గ్రామ పంచాయతీ వర్కర్లు నా పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రం సమర్పించారు. వారిలో నెలకు రూ.300 జీతగాళ్లు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో నెలకు రూ.300 జీతం ఏపాటి!?

తాను తీసుకొచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణలకు కాంగ్రెస్ ప్రభుత్వమే గండి కొట్టింది. పంచాయతీలను నిర్లక్ష్యం చేయడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన రూ.3000 కోట్లకు గండి పడింది. గ్రామాల్లోని ప్రజల ఆరోగ్యానికీ పూచీ లేదు. గ్రామాన్ని శుభ్రం చేసే సిబ్బంది ఆరోగ్యానికీ భరోసా లేదు. వారి డిమాండ్లలో కొన్నిటిలో నిజాయతీ ఉంది. వాటి పరిష్కారకానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా!

నిధులూ లేవు.. విధులూ లేవు!

వైఎస్ పాలనలో వ్యవస్థలు పతనం విద్యుత్, వ్యవసాయం, నీటిపారుదల అన్నీ అంతే
నేను మిగులు బడ్జెట్ ఇస్తే.. వాళ్లు లోటు చేశారు
తెలంగాణపై నిర్ణయించాల్సింది కాంగ్రెస్సే
రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాలి
ఇచ్చేది, తెచ్చేది అంటున్న కాంగ్రెస్‌ను ప్రశ్నించండి
కేసీఆర్‌వి చిల్లర రాజకీయాలు: చంద్రబాబు

వైఎస్, కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం, విద్యుత్, భూగర్భ గనులు, వైద్యం.. ఇలా వ్యవస్థలన్నీ పతన దశకు చేరుకున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. కరీంనగర్ జిల్లాలో గురువారం ఆయన లింగంపల్లి, బూరుగుపల్లి, తిరుమలపూర్, మర్రిగడ్డ, సర్వారెడ్డిపల్లి, పెండలోనిపల్లి, గోపాలరావుపేట, గుండి, రామచంద్రాపూర్ వరకు 14.9 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సభలలో మాట్లాడారు.

2004లో మిగులు బడ్జెట్‌తో తాము అధికారాన్ని అప్పగిస్తే ప్రస్తుతం లోటు బడ్జెట్‌కు వచ్చిందని, టీడీపీ ప్రభుత్వం చేసిన సంస్కరణలతో రాష్ట్రబడ్జెట్ లక్షా 53 వేల కోట్లకు పెరిగితే... అవినీతితో కాంగ్రెస్ నేతలు దాన్నంతా తినేశారని విమర్శించారు. కాంగ్రెస్‌లో గతంలో ఎందరో ముఖ్యమంత్రులు ఉన్నా వైఎస్, కిరణ్‌ల పాలన అత్యంత దారుణంగా ఉందన్నారు. టీడీపీ హయాంలో ప్రతి మండల కేంద్రంలో పీహెచ్‌సీలు, రెఫరల్ ఆస్పత్రులు ఏర్పాటుచేస్తే ఇప్పుడు వాటిని నిర్వీర్యం చేసి ఆరోగ్యశ్రీ అంటున్నారని, జ్వరం వచ్చినా సాధారణ పౌరుడు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి పదివేలు చెల్లించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.

టీడీపీ పాలనలో కోటి రూపాయలు వెచ్చించి కిలోమీటరు కాల్వ తవ్విస్తే అదే కాలువకు కాంగ్రెస్ హయాంలో తొమ్మిది కోట్లు వెచ్చిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంస్కరణలు తెచ్చి రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ను సాధించడంతో పాటు 9 గంటల పాటు వ్యవసాయానికి కరెంట్ ఇచ్చామని.. ఇప్పుడు నాలుగు గంటలు కూడా కరెంట్ సరఫరా కావట్లేదని అన్నారు. తమ హయాంలో వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయాధికారులు ఉంటే వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను, బెల్ట్‌షాప్ నిర్వాహకులను ఆదర్శ రైతులుగా నియమించారని విమర్శించారు. అంత్యోదయ కార్డులు, ఐఏవై, ఉపాధి పథకాల్లో అవినీతి పేరుకు పోయిందన్నారు.

తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేయబోనని చంద్రబాబు స్పష్టం చేశారు. బూరుగుపల్లి గ్రామంలో కొందరు యువకులు తెలంగాణపై తేల్చిచెప్పాలని, అఖిలపక్ష సమావేశానికి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌నే పంపాలని.. అప్పుడు తెలంగాణలో టీడీపీ గెలుపు ఖాయమని అనగా ఆయన వారికి వివరంగా సమాధానం చెప్పారు. "మీ మనోభావాలను గౌరవిస్తాను.. వాటికి వ్యతిరేకంగా పని చేయను.. టీడీపీని కాపాడుకుంటూ ముందుకు పోవల్సిన అవసరం ఉన్నది... తెలంగాణపై స్పష్టత ఇవ్వడం నాకు ఒక్క నిమిషంలో పని.

అయితే రెండు ప్రాంతాలలో పార్టీ నష్టపోకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. టీడీపీ లేకపోతే మళ్లీ పెత్తందార్లు, భూస్వాములు వస్తారు. అందరం కలిసి సమస్యను పరిష్కరిద్దామంటే కాంగ్రెస్ ముందుకు రావడం లేదు. నేను ఎన్నడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు.. భవిష్యత్‌లో కూడా మాట్లాడను. నా పరిధిలో ఉన్న అన్ని విషయాల్లో చాలా స్పష్టంగా ఉన్నాను.. తెలంగాణ కేంద్ర పరిధిలోని అంశం. మాకు ఆరుగురు ఎంపీలే ఉన్నారు. రాష్ట్రం ఇవ్వగలిగిన శక్తి కాంగ్రెస్‌కే ఉంది.

కాంగ్రెస్‌పై పోరాడితే న్యాయం జరుగుతుంది'' అన్నారు. తానిక్కడ ఏదో ఒకటి చెబితే అక్కడ పార్టీ దెబ్బతింటుందని, టీడీపీని కాపాడుకుంటూ తెలంగాణ కోసం ఏదైనా చేయాలన్నదే తన ఆలోచన అని చంద్రబాబు అన్నారు. ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెస్సే కనుక దానిని ప్రశ్నించాలని ఆయన సూచించారు.

అఖిలపక్షంలో ఇతర పార్టీలను అభిప్రాయం చెప్పమంటోందే తప్ప కాంగ్రెస్ తన అభిప్రాయం చెప్పట్లేదని, మనం ఏదో ఒకటి చెబితే మరో పక్క పార్టీ దెబ్బతింటుంది కాబట్టి అప్పుడు తాను లాభపడవచ్చన్నదే కాంగ్రెస్ ఆలోచన అని చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలోనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు.

తన పాదయాత్రకు ప్రజాస్పందన చూసిన తర్వాత టీఆర్ఎస్, బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చంద్రబాబు అన్నారు. బీజేపీ నీతిబాహ్యమైన పార్టీ అని, దానికి గతంలో ఒక సీటు ఉంటే ఇప్పుడు అరసీటు కూడా దక్కే పరిస్థితి లేదని ఎద్దేవాచేశారు. సభలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు గొడవ చేయడానికి ప్రయత్నించగా.. చంద్రబాబు వారిపై మండిపడ్డారు. వరంగల్‌లో టీఆర్ఎస్-వైసీపీల ఘర్షణను ప్రస్తావించి.. రౌడీలు, రౌడీలు గొడవపడి ఒకరి ఆఫీసులు ఒకరు తగలబెట్టుకునే స్థితికి వచ్చారని విమర్శించారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

గ్రామీణ యువత కోసం పాలసీ...
గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు ఒక విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. వీరిని సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తామన్నారు. బాగా చదువుకున్న విద్యార్థులకు లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆడపిల్లలతో పాటు మగపిల్లలకూ ఉచితంగా సైకిళ్లు అందజేస్తామని చంద్రబాబు తెలిపారు. చేనేత రంగానికి విద్యుత్ బిల్లుల్లో రాయితీ కల్పిస్తామని, యువతకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉద్యోగావకాశాలు పెంచుతామని చెప్పారు. ఆయన వెంట మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు సుద్దాల దేవయ్య, గంగుల కమలాకర్ తదితరులున్నారు.

అడ్డుకోడానికి టీఆర్ఎస్వీ, బీజేపీ యత్నం
చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకునేందుకు టీఆర్ఎస్వీ, బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించగా వారిని పోలీసులు చెదరగొట్టారు. టీఆర్ఎస్వీ, బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసరడంతో టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు వారిపై ప్రతిగా రాళ్లు రువ్వారు. గురువారం బూరుగుపల్లి సభలో బాబు మాట్లాడుతుండగా టీఆర్ఎస్‌వీ కార్యకర్తలు చంద్రబాబు జై తెలంగాణ అనాలని.. తెలంగాణపై స్పష్టత ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించి ప్రసంగాన్ని అడ్డుకోబోయారు.

వెంటనే పోలీసులు వారిని చెదరగొట్టారు. తర్వాత బీజేపీ నేతలు కూడా అక్కడ కు వచ్చారు. వారిని కూడా పోలీసులు చెదరగొట్టారు. కాగా, చంద్రబాబుని హెచ్ఎంటీవీ, ది హన్స్ ఇండియా ఎడిటర్ ఇన్ చీఫ్ రాంచంద్రమూర్తి గురువారం కలిశారు. గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామ శివారులో బాబుతో ఆయన అరగంటకుపైగా సంభాషించారు. అనంతరం బాబుతో కలిసి కొద్ది దూరం వరకు మాట్లాడుకుంటూ వెళ్లారు.

ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేయను