December 10, 2012

పసుపు శుభకరం! పసుపు కొమ్ము మంగళకరం! కానీ, పసుపు పండించే రైతు జీవితం మాత్రం ఆందోళనకరం! మిగిలిన పంటలు పండించే రైతుల్లాగే పసుపు పండించే రైతుది కూడా కష్టాల దిగుబడే!

ఆదిలాబాద్ జిల్లా చర్లపల్లిలో నా పాదయాత్ర ప్రారంభమైన దగ్గర నుంచీ రోడ్డుకు ఇరు వైపులా ఎక్కడ చూసినా పచ్చగా పసుపు పంటే కనిపించింది! రైతులు కూడా పచ్చగా కళకళాలాడుతున్నారనుకుంటే పొరపాటే! ఆ రైతులంతా ఎక్కడికక్కడే నన్ను తమ పొలాల్లోకి తీసుకెళ్లి తమ కష్టాలను వివరించారు. సహజంగా అన్నీ బాగుంటే 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, కానీ, ఈసారి కరెంటు కోతల కారణంగా సమయానికి నీళ్లు పెట్టలేదని, దీంతో, దిగుబడి ఐదు నుంచి పది క్వింటాళ్లకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దిగుబడితోపాటు పంట నాణ్యత కూడా తగ్గిపోయిందని, దీంతో ధర 3500-4000కు పడిపోయిందని ఆందోళన చెందారు. పసుపునకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కూడా ప్రకటించలేదని వివరించారు. ఇక్కడే యువ రైతు కలిశాడు. బీఈడీ చదువుకున్నాడట. ఉద్యోగం రాకపోవడంతో ఐదెకరాలు కౌలుకు తీసుకున్నాడట. అక్కడా ఇక్కడా అప్పులు చేసి పత్తి వేశాడు. దిగుబడి సరిగా రాలేదు. ఆ రైతన్న పూర్తిగా నష్టపోయాడు. ఇక్కడ అందరి రైతుల ఆందోళనా ఇదే!

రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. రైతుకు దిశానిర్దేశం చేసేవాళ్లు లేరు. పత్తిలాగానే పసుపునకు కూడా ప్రత్యేక బోర్డు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి. లేకపోతే, మేం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఏర్పాటు చేస్తాం. పసుపునకు కనీస మద్దతు ధర ప్రకటిస్తే.. దానిని వేసుకోవాలా వద్దా అన్న విషయాన్ని రైతులే నిర్ణయించుకుంటారు. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి!!

పచ్చదనం కరువు!

అధికారంలోకి రాగానే వారిని ఆదుకుంటా
నా హయాంలో ఆర్థిక చేయూత
కాంగ్రెస్ ఏలుబడిలో అప్పుల మోత
డ్వాక్రా అమలు తీరుపై చంద్రబాబు ధ్వజం
ఆదిలాబాద్ పాదయాత్రలో ధ్వజం
బాబుకు సైనికుల్లా కాపలా కాస్తాం: మందకృష్ణ

ఆదిలాబాద్, డిసెంబర్ 10: అప్పులపాలవుతున్న డ్వాక్రా మహిళలను ఆదుకుంటానని, అధికారంలోకి వచ్చిన వెంటనే వారి రుణాలను మాఫీ చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని, టీడీపీని గెలిపిస్తే స్వామినాథన్ సిఫారసులను అమలుచేస్తానని, మద్దతు ధర పెంచుతానని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం చర్లపల్లి వద్ద చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. టెంబుర్ని, గుండంపల్లి, దిలావర్‌పూర్, లోలం, కాల్వతండా క్రాస్ రోడ్డు, సిర్జాపూర్ క్రాస్‌రోడ్ వరకు 15.5 కిలోమీటర్లు నడిచారు. పలు గ్రామాల్లో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది.

మంగళహారతులు, డప్పుల వాయిద్యాలతో చర్లపల్లి ఊరి జనాలు ఎదురేగారు. అనంతరం చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నాడు తాను డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. కానీ, డ్వాక్రామహిళలు తీసుకున్న రుణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీకి వడ్డీ వేసి పిండుతోందని ఆరోపించారు. ఈ కారణంగానే వారి రుణాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నానని వివరించారు. అనంతరం గుండంపల్లిలో రైతులతో ఆయన భేటీ నిర్వహించారు. "పసుపు, పత్తి, వరి రైతుల పెట్టుబడి పెరిగింది. దిగుబడి తగ్గి పోయింది. మద్దతు ధర లభించక వారంతా అప్పుల ఊబిలో కూరుకుపోయారు.

అందుకే రుణమాఫీ ఫైలుపై సంతకం చేస్తానని చెబుతున్నా'' అని వివరించారు. బిందు, తుంపర్ల సేద్యానికి కావాల్సిన పరికరాలను ఉచితంగా అందిస్తానని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానని హామీ ఇచ్చారు. అదే ఊరిలోని రెండు పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. బీఈడీ చేసిన వారికి ఎస్‌జీటీ పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని, టెట్ రద్దు చేస్తానని చెప్పారు. అక్కడ నుంచి ముందుకు సాగారు.

దారిలో ఎదురుపడిన రైతులతో, పొలాల్లో పని చేస్తున్న కూలీలతో మాట్లాడారు. గొర్రెలు కాస్తున్న కాపరి భూమన్నను పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. అధికారం కట్టబెడితే ప్రాణహిత-చేవెళ్ల భూ నిర్వాసితులను ఆదుకుంటానని తనను కలిసిన బాధితులకు ధైర్యం చెప్పారు. "వెయ్యి బీడీలకు రూ. 150 చెల్లిస్తాం. బీడీ కార్మికులకు రూ.1500 పెన్షన్, ఉచిత నివాసం కల్పిస్తాం'' అని భరోసా ఇచ్చారు. కేసీఆర్ ఎప్పుడూ ప్రజాసమస్యలను పట్టించుకోలేదని, ఏదో ఒక ప్రకటనతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. బీడీకట్టలపై పుర్రెగుర్తు వేయించి కార్మికుల పొట్టకొట్టే ప్రయత్నం చేశారన్నారు.

జగన్ దోచుకున్న లక్ష కోట్లతో ఉచిత కరెంట్ ఇవ్వడంతోపాటు మూడు సార్లు రైతుల రుణాలను మాఫీ చేయవచ్చని వ్యాఖ్యానించారు. కాగా, దిలావర్‌పూర్ సమీపంలో బాబు పాదయాత్రలో ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగ పాల్గొన్నారు. పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు కలగకుండా సైనికుల్లా కాపలా కాస్తామని, ఆయనకు అండగా ఉంటామని దిలావర్‌పూర్ సభలో మందకృష్ణ పేర్కొన్నారు. కాగా, జిల్లాలో యాత్రను మరో రోజుకు పొడిగించారు. 14 వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇక వైఎస్ జగన్ దోచుకున్న వేలకోట్లను ఇడుపులపాయలో భద్రపరిచినట్లు టీడీపీనేత యనమల తిరుపతిలో అన్నారు.

అఖిలపక్షం పేరుతో వాయిదా యత్నం
తెలంగాణకు మేం వ్యతిరేకం కాదు.. కేంద్రంపై బాబు ధ్వజం

తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం అంటూ.. ఈ అంశాన్ని మరోసారి వాయిదా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రబాబు విమర్శించారు. తామెప్పుడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని పాదయాత్రలో పునరుద్ఘాటించారు. తెలంగాణ అంశంతో రాజకీయంగా లబ్ధి పొందేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనే టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

డ్వాక్రా అప్పులు మాఫీ చేస్తా...చంద్రబాబు

10.12.2012 "vastunna meekosam" padayatra photos ( part-2)

10.12.2012 "vastunna meekosam" padayatra photos ( part-1)

09.12.2012 "vastunna meekosam" padayatra photos ( part-2)