December 6, 2012

06.12.2012 "vastunna meekosam" padayatra photos (eenadu)

06.12.2012 "vastunna meekosam" padayatra photos (andhrajhothi)

చదువుల తల్లికి నిలయం ఈ బాసర. కాశ్మీర్ తరువాత దేశంలోనే సరస్వతి దేవాలయం ఉన్నది ఇక్కడే. గోదావరి ఒడ్డున ఉండటం కూడా ఒక విశిష్టత. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని అప్పట్లో దేవాలయాన్ని బాగా అభివృద్ధి చేశాను. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నా. ఈ పవిత్ర ప్రదేశాన్ని ఒక విద్యాకేంద్రంగా మలచాలని అప్పట్లోనే ఆలోచన చేశాను. అన్ని రకాల విద్యా సంస్థలను ఈ ప్రాంతానికి తీసుకురావాలని భావించాను. దానికి కొనసాగింపుగా గ్రామాన్నీ అభివృద్ధి చేయాలని అనుకున్నాను. కానీ, ఈరోజున అక్కడ పర్యటించినప్పుడు ఆ అభివృద్ధి గురుతులేవీ కనిపించలేదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టున్న బాసర దుస్థితి బాధనిపించింది. ఇంత బాధలోనూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ముచ్చటించడం ఊరట కలిగించింది.

అవినీతి విషయంలో వాళ్ల అవగాహన ముచ్చటేసింది. అవినీతికి తామూ బాధితులమేనంటూ వారు సొంత అనుభవాలను చెప్పుకొచ్చారు. " లంచం ఇవ్వడం తప్పని తెలిసినా తప్పడం లేదు సార్. చిన్న సర్టిఫికెట్ కావాలన్నా డబ్బు పెట్టాల్సి వస్తోంది. ఎమ్మార్వో నుంచి పంచాయతీ సర్పంచ్ దాకా.. లంచాలు ఆశించేవారే సార్. చాలాసార్లు ఎదురు తిరిగినా, గట్టిగా వాదించినా కొన్నిసార్లు మాకూ తప్పడం లేదు'' అంటూ ఓ విద్యార్థిని తల దించేసుకోవడం చూసినప్పుడు, లక్షల కోట్లు తిన్న బడాబాబులు, చోటాబాబులు తల ఎగరేసి తిరగడం, జైళ్ల దగ్గర, కోర్టుల దగ్గర చేతులు ఊపుతూ సిగ్గులేకుండా నవ్వులు చిందించడం గుర్తుకొచ్చింది.

వాళ్ల మాటలు విన్నప్పుడు అవినీతిపై పోరాటానికి అర్థమంతమైన ముగింపు ఇవ్వడం సాధ్యమేనన్న నమ్మకం నాకు కలిగింది. బాసరలో అడుగుపెట్టినప్పటి నుంచీ కనిపించిన దృశ్యాలే ఈ అత్యాధునిక సాంకేతిక విద్యా సంస్థలోనూ కనిపించడం విస్మయపరిచింది. ఐటీ ప్రాంగణంలో కొన్ని నీళ్ల ట్యాంకర్లు కనిపించాయి. వాటి గురించి ఆరా తీయగా, పంపులు, కుళాయిలు, పైపులైన్లు సరిగ్గా లేవని తెలిసింది. గోదావరి ఒడ్డున ఉన్నా విద్యార్థులకు ఇదేమి దుస్థితి!

బాసరకు ఇవేం బాధలు!

జగన్ సామాన్య ఖైదీయే కదా?
ఒక కోర్టు తీర్పుపై ఇంకో కోర్టులో అప్పీలా?
ఇలాగయితే అవినీతిపరులకు శిక్షలెలా పడతాయి
వైసీపీ నేత అవినీతిని కడేగేసిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
చంద్రబాబు సమక్షంలో ప్రశ్నల పరంపర
రాజకీయాల్లో అవకాశమిస్తే అవినీతి పనిపడతామని అభ్యర్థన
అంగీకరించిన టీడీపీ నేత.. 30% కోటా ఇస్తామని హామీ
ట్రిపుల్ ఐటీలో సమస్యలపై ఆవేదన
ఆదిలాబాద్‌లో పాదయాత్రకు శ్రీకారం
బాసర ఆలయంలో పూజలు

భైంసా, ఆదిలాబాద్, డిసెంబర్ 6 : "అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లిన ఎంపీ జగన్‌కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం ఎంతవరకు సమంజసం? ఆయనను సామాన్యఖైదీగా చూడాలి కదా''.. ఓ విద్యార్థి ప్రశ్న

"మనదేశంలో ఒక కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇంకో కోర్టుకు వెళుతున్నారు. ఇలాగయితే అవినీతిపరులకు శిక్షలు ఎలా పడతాయి?''మరో విద్యార్థి ఆవేదన

" అవినీతిని కడిగిపారేసేందుకు యువతకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇవ్వా లి'' ఇంకో విద్యార్థిని ఆకాంక్ష.. అవినీతిపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు బాసటగా నిలిచిన తీరిది. ఆదిలాబాద్ జిల్లాలో గురువారం పాదయాత్రకు శ్రీకారం చుట్టి బాసరకు వెళ్లిన చంద్రబాబు సమక్షంలో అవినీతి నేతలను ఉతికి ఆరేసిన వైనమిది..

అవినీతిపై పోరాటం కేంద్రంగా జరిగిన సంభాషణలో విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. సూటిగా ప్రశ్నలు దూశారు. అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు సలహాలు, సూచనలు అడుగుతూ వారిని చంద్రబాబు ఉత్సాహపరిచారు. జగన్ ప్రస్తావనను పలువురు విద్యార్థులు ఈ సందర్భంగా తీసుకొచ్చి ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది. అందరిలా జగన్‌ను కూడా సామాన్య ఖైదీలా చూడాలి కదా అన్న విద్యార్థి వాదనతో చంద్రబాబు ఏకీభవించారు.

కోహినూరు వజ్రంలాంటి తమకు సానపెట్టేవారే కరువయ్యారని రాఘవేంద్ర అనే విద్యార్థి వాపోయారు. కసబ్ కోసం ప్రభుత్వం 60 కోట్లు ఖర్చు చేయడాన్ని దుర్గాప్రసాద్ అనే విద్యార్థి ప్రశ్నించగా, "చట్టాలు సరిగ్గా లేకపోవడమే సమస్య'' అని చంద్రబాబు సమాధానమిచ్చారు. అవినీతిపై పోరాటంలో భాగంగా యువతకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇవ్వాలని ప్రియాంక అనే విద్యార్థిని ఆకాంక్షను చంద్రబాబు స్వాగతించారు.

ఈసారి ఎన్నికల్లో యువతకు 30 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తెలంగాణపై అభిప్రాయం చెప్పాలని ఓ విద్యార్థి అడగ్గా, 2009కి ముందే కేంద్రానికి లేఖ ఇచ్చామని గుర్తుచేశారు. అంతకుముందు..చంద్రబాబుకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. " చంద్రబాబు జిందాబాద్'', "కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు'', "ఐటీ సీఎం చంద్రబాబు''అంటూ నినాదాలు చేశారు. ఆయనతో కరచాలనం చేసేందుకు విద్యార్థులు ముందుకు రావడంతో వారిని ఆపడం ఒక దశలో సెక్యూరిటీ సిబ్బందికి కష్టసాధ్యమైంది. అంతకుముందు..

బాసర నుంచి ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మార్గంలో ఉన్న పత్తి, కంది చేన్లలో పని చేస్తున్న రైతులను, కూలీలను పలకరించి, వారి సాధక, బాధలను వింటూ నేనున్నానంటూ వారికి ధైర్యం కల్పిస్తూ ట్రిపుల్ ఐటీ ప్రాంగణం వరకు పాదయాత్ర నిర్వహించారు. తన హయాంలో బాసరలో విద్య కోసం చేసిన దోహదాన్ని గుర్తు చేసుకున్నారు.

"బాసర అభివృద్ధికి నేను ఎనలేని కృషి చేశాను. ఇక్కడ ఐఐటీ ఏర్పాటు చేయాలని ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య కోరగా, తన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు అక్షరభ్యాసం కూడ ఇక్కడే జరిగింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని బాసరలో ఐఐటీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాను. కానీ, తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్.. ఐఐటీని రంగారెడ్డి జిల్లాకు తరలించి, బాసరలో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయించారు'' అని వివరించారు. తానొచ్చిన తరువాతే రాష్ట్రంలో విద్యారంగం ముఖచిత్రం మారిపోయిందని గుర్తు చేశారు.

"నేను ముఖ్యమంత్రి కాక ముందు విద్యలో మన రాష్ట్రం వెనకబడి ఉంది. అప్పట్లో 30 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. నేను వచ్చాక కొత్తగా ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేయించాను'' అని చెప్పుకొచ్చారు. సీఎంగా ఉన్న కాలంలో సంవత్సరంలో ఆరు నెలలు ఇతర దేశాల్లో పర్యటించి అక్కడి టెక్నాలజీ అధ్యయనం చేసి, అక్కడి సాఫ్ట్‌వేర్ కంపెనీలతో మాట్లాడి రాష్ట్రంలో వాటి ఏర్పాటుకు కృషి చేశానని చెప్పుకొచ్చారు. దేశానికి ఢిల్లీ రాజధాని అయినా అభివృద్ధి మాత్రం హైదరాబాద్‌లో జరిగేలా కృషి చేశానని గుర్తుచేశారు.

మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల కోసం పని చేస్తాననీ, వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీది దుర్మార్గ ప్రభుత్వమనీ, కిరణ్‌కుమార్‌రెడ్డి కిరికిరి ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. తాను ప్రభుత్వ భూములను కాపాడితే వైఎస్.. వాటిని పలు కంపెనీలకు అక్రమంగా అప్పగించారని ఆరోపించారు. ఆ భూములు తీసుకున్న వారిలో సగం మంది జైలు కెళ్లారని విమర్శించారు. వైఎస్.. తన కుమారుడికి లక్ష కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉండగా తాను నీతి, నిజాయతీ గీటురాయిగా వంద శాతం ఉద్యోగాలు అర్హులకే ఇచ్చానన్నారు.

గతంలో బీహార్ రాష్ట్రాన్ని బీమారి రాష్ట్రంగా వర్ణించేవారనీ, ప్రస్తుతం మన రాష్ట్రం ఆ స్థితికి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా,బాసర, మైలాపూర్, బిద్రెల్లి, టాక్లీక్రాస్‌ల మీదుగా జిల్లాలో తొలిరోజు యాత్ర కొనసాగింది. బాసరలోపూజలు చేసి నడక ప్రారంభించిన ఆయన 16 కిలోమీటర్లు నడిచారు. షెడ్యూల్ ప్రకారం ముథోల్ ప్రభుత్వ పాఠశాల మైదానంలో రాత్రి బసచేయాల్సి ఉండగా, ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మాట్లాడుతూ ఆలస్యం కావడంతో అక్కడికి మూడు కిలోమీటర్ల ఇతవలే ఆయన యాత్రను ఆపివేయాల్చి వచ్చింది.

జైల్లో ప్రత్యేక సౌకర్యాలెందుకు?

05.12.2012 "vastunna meekosam" padayatra photos (eenadu)

05.12.2012 "vastunnameekosam" padayatra photos (andhrajhothi)

సంస్కరణలు అవసరమే! అవి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఉండాలి. కానీ, దిగజార్చేలా ఉండకూడదు! సంస్కరణలు కొత్తగా ఉద్యోగాలు సృష్టించాలి. కానీ, ఉన్న ఉద్యోగుల పొట్టమీద కొట్టకూడదు! సంస్కరణలతో రైతులు పచ్చగా కళకళలాడాలి. కానీ, వారు ఆత్మహత్యలు చేసుకునేలా పురికొల్పకూడదు! సంస్కరణలతో వినియోగదారులకు తక్కువ ధరకే సరకులు దొరకాలి. కానీ, వారి జేబుకు మరింత చిల్లు పడేలా ఉండరాదు! వెరసి.. సంస్కరణలతో పేదలు లక్షాధికారులు కాకపోయినా.. కనీసం మధ్యతరగతికైనా ఎదగాలి! కానీ, నిరుపేదలు కారాదు! ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులు, చిన్న వ్యాపారులు, వినియోగదారుల పాలిట శాపమే!

ఈరోజు నిజామాబాద్ జిల్లా పిట్లం, బాన్స్‌వాడ తదితర పట్టణాల్లో పాదయాత్ర చేశా. పాదయాత్రలో రోడ్డుకు ఇరువైపులా వందల సంఖ్యలో చిల్లర దుకాణాలు కనిపించాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇలాంటి కొన్ని కోట్ల చిల్లర దుకాణాలకు శాపమే. కేవలం తన స్వార్థం కోసం 4 కోట్ల దుకాణాలు కనుమరుగయ్యే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోంది. 15-20 కోట్లమంది జీవనోపాధి పోయే పరిస్థితి కనిపిస్తోంది. రైతులకు మేలు జరుగుతుందని, వినియోగదారులకు తక్కువ ధరకే సరకులు దొరుకుతాయని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు.

కానీ, మా పార్టీ ఎఫ్‌డీఐలకు వ్యతిరేకం. వీటివల్ల మన వ్యాపారం విదేశీ హస్తగతమవుతుంది. తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. అన్ని పార్టీలూ వ్యతిరేకించినా కేంద్రం ఎందుకు ముందుకు వెళుతోందో అర్థం కాదు. దేశ ప్రయోజనాలనే పణంగా పెడుతోంది. దుకాణ యజమానుల్లో అర్థం కాని ఆందోళన. పెనుముప్పు ఏదో పిడుగుపాటులా తమను తాకనుందన్న భయం వ్యక్తమవుతోంది. వాళ్లలో ధైర్యం నింపడానికి నాలుగు మాటలు చెప్పడం తప్ప.. కేంద్రం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయానికి ఇంకెలా నిరసన తెలపగలం!?

సంక్కరణలు.. బాగు కోరాలి!

ప్రత్యర్థులపై ఎదురుదాడి.. హామీల జడి
అనారోగ్యాన్ని అధిగమించి 116 కి.మీ. యాత్ర

నిజామాబాద్, డిసెంబర్ 5 : తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా కూడా అదే వ్యవహారశైలితో ఉండేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. జనంతో మమేకమై కొత్త హావభావాలను పలికిస్తున్నారు. నవ్వుతూ వా రి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారడిగే ప్రశ్నలకు జవాబులు చెబుతూ.. సమస్యలు వింటూ తమ పార్టీ విధానాలను వారికి అర్థమయ్యే రీతిలో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అనారోగ్యంతో అష్టకష్టాలు పడినా.. పట్టువదలని విక్రమార్కుడిలా తన 'వస్తున్నా.. మీకోసం' యాత్రను విజయవంతంగా కొనసాగించారు.

నిజామాబాద్ జిల్లాలో 8రోజుల పాటు మొత్తం 116 కిలోమీటర్ల మేర నడిచారు. జిల్లాలోని సాలంపాడ్ వద్ద చంద్రబాబు యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఇక్కడ ఉత్సవాలను ఘనం గా నిర్వహించారు. పెంటాఖుర్దులో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లాతో కలిపి బాబు పాదయాత్ర 1038 కిలోమీటర్లు పూర్తయింది. విద్యార్థులు, యువకులు, వృద్ధులు, రైతులు, మైనారిటీలు, డ్వాక్రా మహిళలు, వివిధ వృత్తుల వారిని, కూలీలను ప్రత్యక్షంగా కలుసుకుని, వారి బాధలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.

పాదాలు బొబ్బలెక్కి.. మోకాళ్ల నొప్పులొచ్చి.. చక్కెర శాతం పెరిగి.. ఎన్నో అవస్థలు పడ్డారు. అయినా వెనకడుగు వేయక పార్టీ శ్రేణులకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు కదిలారు. ప్రత్యర్థులపై ఎదురుదాడి చేయడం ద్వారా పార్టీ శ్రేణులకు కొండంత ధైర్యాన్నిచ్చారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు వైసీపీ, కాంగ్రెస్‌లపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ డిక్లరేషన్‌లను ప్రజలకు వివరించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరితో పాటు తనయుడు లోకేష్ కూడా వెయ్యి కిలోమీటర్ల సంబరాల్లో పాల్గొన్నారు

మారిన బాబు.. ప్రజలకు జవాబు

సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకున్న టీఆర్ఎస్ అధినేత
జైల్లోంచి జగన్ రాడు.. వీళ్లు అవిశ్వాసం పెట్టరు
రైతులను అధోగతి పాలు చేసిన కాంగ్రెస్
యూరియా కావాలంటే లాఠీదెబ్బలు తినిపిస్తున్నారు
టీఆర్ఎస్, వైసీపీ, కాంగ్రెస్‌లపై చంద్రబాబు ధ్వజం
నిజామాబాద్‌లో ముగిసిన వస్తున్నా.. మీ కోసం

నిజామాబాద్, డిసెంబర్ 5 : తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్ సొమ్ము చేసుకుని ఆస్తులు కూడబెట్టుకున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాటల గారడీ చేసి మభ్యపెట్టడం తప్ప, ప్రజల కోసం ఏనాడూ పోరాటం చేయలేదన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లాలో 8వ రోజు 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్రను నిర్వహించారు. సాటాపూర్ నుంచి ప్రారంభమైన బాబు యాత్ర తాడ్‌బిలోలి, బొర్గాం మీదుగా ఫకీరాబాద్ వరకు 12 కిలోమీటర్ల మేర కొనసాగింది.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలలో కాంగ్రెస్, టీఆర్ఎస్, వైసీపీలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందన్నారు. కేసీఆర్ వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. ఇక వైఎస్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుతిందన్నారు. వెయ్యిలారీల వంద రూపాయల నోట్ల కట్టలను వైఎస్ కుటుంబం దోచిందన్నారు. అయినా సీఎం పదవి కోసం జగన్ దేనికైనా సిద్ధపడుతున్నాడని, ఇది సిగ్గు పడాల్సిన విషయమన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కయిందని విమర్శిస్తున్న వైసీపీ.. అసెంబ్లీలో సబ్‌ప్లాన్ విషయంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చి ప్రభుత్వాన్ని ఎందుకు పడగొట్టలేదని చంద్రబాబు ప్రశ్నించారు.

జగన్ జైలు నుంచి వచ్చాక ప్రభుత్వాన్ని పడగొడతామని వైసీపీ నేతలు చెప్పడం వారి దివాలాకోరు తనాన్ని బయటపెడుతోందన్నారు. జగన్ జైలు నుంచి రాడని, వీళ్లు అవిశ్వాసం పెట్టరని బాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 30 ఏళ్లుగా కాంగ్రెస్‌పై రాజీలేని పోరాటం చేస్తున్నది ఒక్క టీడీపీయేనని, నిప్పులాంటి తనను తప్పుడు మనుషులు ఏమీ చేయలేరని ప్రకటించారు. తెలంగాణను అభివృద్ధి చేసింది తెలుగుదేశమేనని చెప్పారు. టీడీపీ ఎప్పుడూ పేదల పార్టీనేనని, రైతులు పుట్టెడు కష్టాల్లో ఉన్నారని, అందుకే వారి అప్పులన్నీ మాఫీ చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అవినీతిని తగ్గిస్తే రుణమాఫీ పెద్ద సమస్య కాదని, వైఎస్ దోచిన సొమ్మును రికవరీ చేస్తే మూడుసార్లు రుణమాఫీ చేయొచ్చని తెలిపారు.

భర్త మోటారు దగ్గర.. భార్య స్టార్టరు దగ్గర
రాష్ట్రప్రభుత్వం రైతులను అధోగతి పాలు చేసిందని.. వ్యవసాయం చేసే రైతు మోటారు దగ్గర ఉంటే, భార్య స్టార్టరు దగ్గర ఉండాల్సిన పరిస్థితి కల్పించిందని చంద్రబాబు ఎద్దేవాచేశారు. చివరకు విద్యుత్ సమస్య వల్ల రైతులు ఆత్మహత ్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువుల ధర నాలుగు రెట్లు పెంచారని, ఒక్క యూరియా బస్తా కోసం లాఠీ దెబ్బలు తినాల్సిన దుర్భర పరిస్థితి తలెత్తిందని చంద్రబాబు మండిపడ్డారు.

చివరకు విద్యావ్యవస్థనూ నాశనం చేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. మహిళలను పావలావడ్డీ పేరుతో మోసం చేసిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని, ఎర్రజొన్న బకాయిలు చెల్లిస్తామని, పొగాకు రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. మైనారిటీలకు 15 అసెంబ్లీ సీట్లు ఇస్తామని, ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తామని, ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని స్పష్టం చేశారు.

నేటి నుంచి ఆదిలాబాద్‌లో..
ఆదిలాబాద్: చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర గురువారం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ గ్రామం మీదుగా పాదయాత్ర బుధవారం రాత్రి బాసరకు చేరుకుంది. జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గురువారం నుంచి ఈనెల 13 వరకు 8 రోజుల్లో మూడు నియోజకవర్గాల మీదుగా 124 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. రోజూ 13-17 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. బాసర, నిర్మల్, ఖానాపూర్‌లో బహిరంగ సభల నిర్వహణకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగానంతో కేసీఆర్‌కు ఆస్తులు: చంద్రబాబు