November 29, 2012

శ్రమ + ప్రతిభ = విజయం! కానీ, కష్టపడే ప్రతిభావంతులందరూ విజయం సాధించ లేకపోతున్నారు! ఇందుకు కారణం.. వారికి అవకాశాలు కల్పించకపోవడమే! సరైన దారిలో వారిని నడిపించకపోవడమే! కాయ తొడిమను గురి చూసి కొట్టగల విలుకాళ్లు మన తండాల్లో ఎందరో!? సరైన శిక్షణ ఇస్తే వారంతా ఒలింపిక్స్ హీరోలే! కానీ, ఆ చొరవ ఏదీ!? ఈ రోజంతా నా పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలోని లంబాడా తండాల్లోనే సాగింది. వారంతా కష్టజీవులు! నిజాయతీపరులు! వారిలో చాలామందికి సెంటు భూమి కూడా లేదు! సొంత ఇల్లు లేదు! ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు! ప్రతి తండాలోనూ సంప్రదాయ ఆలయాలున్నాయి. భక్తి కూడా ఎక్కువే. నన్ను తీసుకెళ్లి పూజలు జరిపించారు కూడా!

తండాలోనే లక్కీబాయి అనే 65 ఏళ్ల మహిళను పలకరించాను. సొంతంగా పశువులు లేకపోవడంతో ఆమె వేరేవాళ్ల పశువులను కాస్తోంది. వృద్ధాశ్రమంలో చేర్పిస్తా. చక్కగా అక్కడికి వెళ్లి ఉంటావా!? అని అడిగితే ఆమె ససేమిరా వెళ్లనని చెప్పింది. నేను 'ఎందుకు?' అని అడిగినప్పుడు ఆమె ఇచ్చిన జవాబు నన్ను ముగ్ధుడిని చేసింది. "ఊరికే తిని కూర్చుంటే అందరూ ఎగతాళి చేస్తారు. అందుకే కష్టపడి పని చేసుకుంటాను'' అని ఆమె జవాబు ఇచ్చింది. గిరిజనులు ఎంత కష్టజీవులో చెప్పేందుకు ఇదే నిదర్శనం. కేవలం వారు కష్టజీవులు మాత్రమే కాదు. గిరిజనుల్లో ప్రతిభావంతులు కూడా ఉన్నారు. అవకాశాలు కల్పిస్తే అద్భుతంగా రాణిస్తారు కూడా!

అందుకే గిరిజనులకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. వారి అభివృద్ధికి, సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రకటించాం. గిరిజన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తామని స్పష్టం చేశాం. కొంత చేయూత అందిస్తే వారు త్వరగా పైకి వస్తారు. మా ఎస్టీ డిక్లరేషన్ వారికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా!!

అడవుల్లో ఆణిముత్యాలు:చంద్రబాబు

హైదరాబాద్, నవంబర్ 29 : ఆరోగ్య సమస్యలెలా ఉన్నా పాదయాత్ర ఆపే ప్రసక్తి లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. బాబు ఆరోగ్యంపై 'ఆంధ్రజ్యోతి'లో ప్రచురితమైన వార్త పార్టీ వర్గాల్లో కలకలం కలిగించింది. గురువారం కొందరు నేతలు ఆయన వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. పాదయాత్రకు విరామం ఇవ్వాలన్నారు. కానీ వారి సూచనను ఆయన కొట్టిపారేశారు. 'ఆరు నూరైనా పాదయాత్ర ఆపేది లేదు. ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్న తర్వాత వెనకడుగు ఉండకూడదు. బయట తిరిగేటప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. తట్టుకోవాలి. పాదయాత్రను జనవరి 26తో ముగించాలనుకొన్నాం.

కానీ అప్పటికి అనుకున్న చోటుకు (ఇచ్ఛాపురం) చేరడం సాధ్యమయ్యేలా లేదు. అవసరాన్ని బట్టి ఆ తర్వాత కూడా పాదయాత్ర కొనసాగుతుంది. దానికి సిద్ధంగా ఉన్నాను' అని ఆయన వారితో చెప్పారు. ఇప్పుడు చేస్తోంది మొదటి విడత పాదయాత్ర మాత్రమేనని, దీని కొనసాగింపూ ఉండవచ్చని సూచనప్రాయంగా చెప్పారు. మరోపక్క వైద్యులు ఆయన ఆరోగ్య స్ధితిని పరిశీలిస్తున్నారు. గురువారం షుగర్ సాధారణ స్థితికి వచ్చినట్లు తెలిసింది. కాళ్లనొప్పులు తగ్గినా కాలి చిటికిన వేలు సమస్య మాత్రం చంద్రబాబును బాధిస్తూనే ఉంది. ప్రత్యేకసాక్సు వేసుకోవాలని వైద్యులు సూచించారు

యాత్ర ఆగదు అవసరమైతే.. జనవరి 26 తరువాతా నడుస్తా

తండాలకు ఎన్టీఆర్ సుజల జలం
గిరిజన విద్యార్థులకు ప్రత్యేక డీఎస్సీ
నిజామాబాద్‌లో రెండో రోజు చంద్రబాబు పాదయాత్ర
బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బధ్యానాయక్

నిజామాబాద్, నవంబర్ 29 : అధికారంలోకి వచ్చాక అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దేశంలో మరికొంత కాలం రిజర్వేషన్లు అవసరమని అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో గురువారం పిట్లం మండలం బ్రహ్మంగారి దేవాలయం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. కాలికి గాయం కావడంతో రోజు మీద గంటన్నర ఆలస్యంగా మధ్యాహ్నం 12:30కు నడక ప్రారంభించారు.

అనంతరం సమీపంలో ఉన్న విద్యార్థులతో ముచ్చటించారు. టీచర్ అవతారం ఎత్తి 40 నిమిషాల పాటు విద్యార్థులను ఉత్సాహపరిచారు. విద్యార్థుల ప్రశ్నలకు హుషారుగా సమాధానమిచ్చారు. అమెరికా విద్యార్థుల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోని మన విద్యార్థులే మిన్న అని ప్రశంసించారు. అనంతరం జనాలను కలుసుకుంటూ నడక సాగించారు. ఈ క్రమంలో వికలాంగులను కలుసుకున్నారు. వారిలో ఒకరికి రూ.2వేలు సాయం చేశారు.

నాగంపల్లి రోడ్డును పరిశీలించి, తర్వాత గిరిజనుల ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రతిచోటా సంప్రదాయ నృత్యాలతో ఆయనకు గిరిజనులు నీరాజనం పట్టారు. "రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గిరిజనులు అధికంగా ఉన్నారు. ఆయా జిల్లాల్లో 15-20శాతం వరకు రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. 'టెట్'తో సంబంధం లేకుండా గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేక డీఎస్సీ నిర్వహిస్తాం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం. గిరిజనుల ఆరాధ్య దైవాలు జగదాంబ, సేవాలాల్ ఆలయాల్లో పూజారులకు ఐదు వేల వరకు జీతాలు అందిస్తాం.

ఎన్టీఆర్ సుజల పథకం కింద తండాలకు శుద్ధ తాగునీటిని సరఫరా చేస్తాం'' అని హామీ ఇచ్చారు. తర్వాత వృద్ధులు, రైతులు, మహిళలు, కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతుల అప్పులను, బెల్టుషాపులనూ రద్దు చేస్తామని చెప్పారు. దారిలో పశువులు కాస్తున్న ఓ మహిళకు రూ.2వేల ఆర్థిక సహాయం అందించారు. ఆవులను ఇప్పిస్తే పని చేసుకుంటావా? అని చంద్రబాబు ప్రశ్నించగా, ఆమె సంతోషంగా ఆయనకు పాదాభివందనం చేశారు. అర్సిబాయి, కీరాబాయి అనే రైతు కూలీలను ఆయన పలకరించారు.

కేస్రీబాయి అనే వృద్ధురాలిని ఆరోగ్యపరిస్థితులు ఆరా తీశారు. మూడు కిలోమీటర్ల అనంతరం గుడితండా సమీపంలో బాబు కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. గంట తర్వాత మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. దేశంలో ఆర్థిక సమానత్వం, సమాన అవకాశాలు లేని పరిస్థితుల్లో రిజర్వేషన్లను మరికొంతకాలం కొనసాగించాల్సి ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు లేకపోతే పేదలు పేదలుగానే మిగిలిపోతారని వివరించారు. ఎఫ్‌డీఐల వల్ల 4కోట్ల ఉద్యోగులకు ఎసరు తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు.

బధ్యానాయక్‌కు బాన్సువాడ సీటు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థిగా బధ్యానాయక్ పేరును చంద్రబాబు ప్రకటించారు. పిట్లం మండలం గౌరారం తండాలో గురువారం రాత్రి ఆయన బధ్యానాయక్ పేరును ఖరారుచేశారు. బాన్సువాడ సెగ్మెంట్‌లో గిరిజనుల ఓటు బ్యాంకు కీలకం కావడంతో బధ్యానాయక్‌ను ఎంపిక చేశారు.

పట్టుబట్టి వచ్చిన మూగబాలుడు
బాన్సువాడ: 15 ఏళ్ల వయసు. ఇంట్లో గొడవ చేసి సినిమాలకు పోయే వయసు. సాయితేజ కూడా ఇంట్లో అలిగాడు. ముద్ద ముట్టకుండా భీష్మించాడు. కానీ, సినిమా కోసం కాదు.. చంద్రబాబును చూసేందుకు. పుట్టుమూగ అయిన ఈ బాలుడు పాదయాత్రలో పాల్గొనాలని, చంద్రబాబును దగ్గరనుంచి చూడాలని ఆశపడ్డాడు. ఇంట్లో చెబితే ఎవరూ పట్టించుకోలేదు. వారిని ఒప్పించేందుకు మూడు రోజులు పస్తు ఉన్నాడు. చేసేది లేక ఆయన మేనమామ సాయితేజను వెంటబెట్టుకొని వచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు.

అగ్రవర్ణ పేదలకూ కోటా! మరికొంత కాలం రిజర్వేషన్లు అవసరమే

59వ రోజు గురువారం పాదయాత్ర పోటోలు.. 29.11.2012

59వ రోజు గురువారం పాదయాత్ర పోటోలు..(eenadu) 29.11.2012

58వ రోజు బుదవారం పాదయాత్ర పోటోలు..(andhrajyothi) 28.11.2012