November 28, 2012

నిజామాబాద్ చేరిన పాదయాత్ర

సంగారెడ్డి, నిజామాబాద్, నవంబర్ 28 : అదిగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ అంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటలు నమ్మితే మోసపోతారని టీడీపీ అ«ధినేత చంద్రబాబు హెచ్చరించారు. తెలంగాణను అభివృద్ధి చేసింది తెలుగుదేశమే అని... ఈ విషయంలో చర్చకు రావాలని టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు సవాల్ విసిరారు. చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా మీకోసం పాదయాత్ర' బుధవారం మెదక్ జిల్లాలో ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో అడుగుపెట్టింది. మెదక్ జిల్లా కల్హేర్ మండలంలోని కృష్ణాపూర్ గ్రామంలో బాబు ప్రసంగిస్తుండగా... టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.

దీంతో టీడీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తర్వాత చంద్రబాబు తన ప్రసంగంలో కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "కేసీఆర్‌ను తామేమీ ఢిల్లీకి పిలవలేదని కేంద్ర మంత్రి వయలార్ రవి చెబుతున్నారు. తెలంగాణను అడ్డం పెట్టుకొని సొంత పనులు చేసుకోవడానికే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారా? ఢిల్లీలో రహస్యంగా ఎవరిని కలిశారు?' అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ ఏమీ చెప్పకుండా మన పరువును ఢిల్లీలో తాకట్టుపెట్టారని విమర్శించారు.

పాదయాత్రలో తన మెదడు దెబ్బతిందన్న విమర్శలపై "నాతో కలిసి కేసీఆర్ వారం రోజులు నడిస్తే... అలా నడిచాక ఆయన బయటకు వస్తే చూస్తాను! అప్పుడు ఆయన కాళ్లు, తల, శరీరం ఏవీ పనిచేయవు. కేసీఆర్ కుంభకర్ణుడిలా ఆరు నెలలు పడుకుంటారు. ఆ తర్వాత ఒకరోజు నిద్రలేచి మాటల గారడీ చేస్తారు'' అంటూ మండిపడ్డారు.

అందరికీ ఉద్యోగాలు వస్తాయని, కాలు అడ్డం పెడితే నీళ్లు వస్తాయన్న కేసీఆర్... ఎన్ని వేల మంది తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. తమ హయాంలో సైబరాబాద్, హైటెక్ సిటీని ఏర్పాటు చేసి రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించామని... 12సార్లు డీఎస్సీలు పెట్టి వేల సంఖ్యలో టీచర్ పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. ఈ విషయంలో చర్చకు తాను సిద్ధమని ఆయన గుర్తు చేశారు.

అన్నీ కలిసిపోయేవే!
సామాజిక న్యాయం నినాదంతో ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి ఒక్క మంత్రి పదవి ఇవ్వగానే తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కేసులు మాఫీ చేస్తే కాంగ్రెస్‌లో కలిపేందుకు పిల్ల కాంగ్రెస్ కూడా సిద్ధంగా ఉందన్నారు. అలాగే ఏదో ఒక రోజు కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేసేందుకు కేసీఆర్ కూడా సిద్ధమని తెలిపారు. ఇలాంటి వారి మాటలు నమ్మితే అథోగతే అని ప్రజలను హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు చట్టబద్ధత కల్పించే బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందని చంద్రబాబు ప్రకటించారు.

అయితే, ఇందులో కొన్ని సవరణలు ప్రతిపాదించాలనుకుంటున్నామన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆదర్శ రైతులను తొలగిస్తామని అలీఖాన్‌పల్లి సభలో చంద్రబాబు తెలిపారు. తాము 7500ల మంది సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని రైతులకు సహాయకారులుగా నియమించగా... బెల్టు షాపులలో మందు విక్రయించే 50వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలను ఆదర్శ రైతులుగా వైఎస్ నియమించారన్నారు.

నిజామాబాద్ జిల్లా తిమ్మానగర్‌లో చంద్రబాబుకు జిల్లా టీడీపీ నేతలు, వేలాది మంది కార్యకర్తలు, రైతులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. టీడీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, చదువుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలు ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, రైతులకు 9 గంటల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ అమరవీరులకు నివాళి
తెలంగాణ అమరవీరులకు చంద్రబాబు బుధవారం నివాళులర్పించారు. కల్హేర్ మండలం ఫత్తేపూర్ చౌరస్తాలో టీడీపీ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబును పక్కనే ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తీసుకెళ్లారు. అక్కడ చంద్రబాబు పూలు చల్లి నివాళులు అర్పించారు. తెలంగాణ అమరుల స్థూపం వద్ద చంద్రబాబు నివాళులు అర్పించడం ఇదే మొదటిసారి.

కేసీఆర్‌ను నమ్మితే అథోగతే! మన పరువును ఢిల్లీలో తాకట్టు పెట్టారు

58వ రోజు బుదవారం పాదయాత్ర పోటోలు.. 28.11.2012

58వ రోజు బుదవారం పాదయాత్ర పోటోలు..(eenadu) 28.11.2012