November 4, 2012


నీలం తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు పర్యటించ నున్నారు. ఇందుకోసం సోమవారం ఒక రోజు పాదయాత్రను రద్దు చేసుకున్నారు. ఆదివారం ఉదయం వరద ప్రాంత జిల్లాల నాయకులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులోకి ఉండి పార్టీ తరపున తగిన సహాయ సహకారాలు అందించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. మహబూబ్‌నగర్‌లో పాదయాత్ర చేస్తున్న ఆయన సోమవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకొని, అక్కడి నుంచి విమానంలో విజయవాడకు వెళ్తారు. రోడ్డు మార్గం ద్వారా వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. అదే రోజు రాత్రికి మహబూబ్‌నగర్‌ చేరుకుని అక్కడే బస చేస్తారు. మంగళవారం నుంచి 'వస్తున్నా...మీ కోసం' పాదయాత్ర యధావిధిగా కొనసాగుతుందని టిడిపి నాయకులు తెలిపారు.
సహాయక బృందాల ఏర్పాటు
ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి పార్టీ తరపున సీనియర్‌ నేతలతో ఐదు సహకార బృందాలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాకు టిడిఎల్‌పి ఉప నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఎమ్మెల్యే బీద మాస్తాన్‌రావు, పశ్చిమగోదావరి జిల్లాకు ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి కొడెల శివప్రసాదరావు, గుంటూరుకు పార్టీ అధికార ప్రతినిధి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రైతు విభాగం అధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి, తూర్పు గోదావరి జిల్లాకు ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు, ఎంపి సిఎం రమేష్‌, బండారు సత్యనారాయణ మూర్తి, ఖమ్మం జిల్లాకు పార్టీ ఉపాధ్యక్షులు ఇనుగాల పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులుతో ఈ సహకార బృందాలను ఏర్పాటు చేశారు.
ఎకరాకు రూ.10 వేలు చొప్పున పరిహారమివ్వాలి : హరికృష్ణ
నీలం తుపాను కారణంగా జనజీవనం స్థంభించిందని, లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగి వేల కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయని టిడిపి ఎంపి నందమూరి హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరా పంట నష్టానికి రూ.10 వేలు చొప్పున పరిహారం చెల్లించాలని సర్కారును డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన స్పందించి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఉచితంగా విత్తనాలు, రాయితీపై ఎరువులు పంపిణీ చేసి రెండో పంట సాగుకు అన్ని విధాలా సాయం అందించాలని కోరారు. పదవులను రాజకీయాల కోసమో, అధికార దుర్వినియోగానికి పాల్పడడానికో కాకుండా ప్రజాసంక్షేమానికి ఉపయోగించాలని కాంగ్రెస్‌ మంత్రులకూ, నాయకులకూ చురకలు అంటించారు.
మంత్రులు గాడిదలు కాస్తున్నారా? : టిడిపి విమర్శ
ప్రభుత్వం తీసుకుంటున్న వరద సహాయ చర్యలపై టిడిపి అసంతృప్తి వ్యక్తం చేసింది. జిల్లా మంత్రుల్లో కూడా కదలిక లేదని, సంబంధిత మంత్రులేమైనా గాడిదలు కాస్తున్నారా? అని తీవ్రంగా స్పందించింది. వరద ప్రాంతాల ప్రజా సమస్యలపై ఏం చర్యలు తీసుకోన్నారో చెప్పాలని టిడిపి నేతలు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, మండవ వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఇక్కడ జనం తిండిలేక అల్లాడుతుంటే ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

వరద బాధిత ప్రాంతాల్లో... నేడు చంద్రబాబు పర్యటన,సహాయక బృందాల ఏర్పాటు


నారయణపేట సెగ్మెంట్ లో నేటి పాదయాత్ర పోటోలు...34వ రోజునీలం తుఫాను నేపధ్యంలో రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా పాదయాత్రలో ఉన్న చంద్రబాబు ఆదివారం ఉదయం పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విపత్కర పరిస్థితులు నెలకొన్న జిల్లాల్లోని పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా ఇన్‌ఛార్జీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, మండలస్థాయి నేతలు వరద బాధితులను ఆదుకోవాలని కోరారు.

అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలోనూ, వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంలోనూ సహకరించాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. వరద బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. బాధితులు తమ నివాసాలకు చేరేంతవరకు ఆహారం, వసతి, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసేలా అధికార యంత్రాంగాన్ని కదిలించడంతోపాటు తమ వంతు కృషి చేయాలని కోరారు.

వరద బాధితులకు అండగా నిలవాలి...