October 31, 2012

... జనం నమ్మితే ఏమి జరుగుతుందనేది రోజూ చూస్తున్నాను. ఇంట్లో ఆలుమగల గొడవ నుంచి ఆముదం పంట గిట్టుబాటు కాకపోవడం దాకా ఎన్ని సమస్యలు ముందుకొస్తాయి! ఆత్మకూరు దారిలో ఆముదం పొలంలో కనిపించిన మహిళా రైతు చెప్పుకున్న పంట కష్టం గానీ, ఊళ్లోకి వచ్చాక ఆ పేద మహిళ వెళ్లబోసుకున్న ఇంటి కష్టం గానీ ప్రభుత్వాన్నే బోనులో నిలబెట్టాయనిపించింది.

పొలానికి నీళ్లు పారించలేని పెద్దమనుషులు పల్లెలపైకి, పచ్చటి కాపురాలపైకి మాయదారి సారాను వరదలా పారిస్తున్నారు. సారాకే కాదు..సర్కారుకూ 'బెల్టు' తీస్తామని చెప్పినప్పుడు మణెమ్మ కళ్లల్లో కాంతిని చూడగలిగాను. మరి ఆ కాంతిని శాశ్వతంగా నిలపడం ఎలా? పల్లె పంచన ఉండే చేతివృత్తులవారిని కలిసినప్పుడు రైతుతో ఎంత అల్లుకుపోయారనిపించింది.

రైతుతో బతుకుతారు. ఆయన కుమిలితే రగులుతారు. నవ్వితే సంబరపడతారు. దున్నుతుంటే నా గళ్లు ఇస్తారు. చెల్లెళ్లు కొంగు నడుంకు చుట్టి కోతలకు దిగితే కొడవళ్లకు కక్కులు కొడతారు. గింజపై పక్షిని వాలనీయరు. ఎలుకనూ విడిచిపెట్టరు. గట్లపై మేకలు మేపుతూ రైతుకు ఆ కబురు ఈ కబురు చెబుతారు. గట్ల మీద గడ్డినో, వాములో కొన్ని పనలనో అడిగి తెచ్చుకుంటారు. కల్లంలో పంట తూర్పారబడుతుంటే చేటలిస్తారు.

పంటనంతా ఎత్తి ఎడ్ల బండ్లపైకి వేసినప్పుడు..మోకు కర్రలు అడ్డంగా నిలేస్తారు. కమ్మీల నుంచి కాడి దాకా సరిచేసి పంపుతారు. రైతు బిడ్డల సరదా కోసం ఆట వస్తువులు, బ్యాటు కర్రలు ఇస్తారు. వారి ఇల్లాళ్ల కోసం చెవి కమ్మలు, ముక్కుపుడకలు తయారుచేస్తారు. పల్లెతోనూ, పల్లె కాపుతోనూ ఇంతలా అల్లుకుపోయిన కులవృత్తుల వారంతా నాకు మద్దతుగా మాట్లాడుతుంటే, అది రైతుకు వారిచ్చే భరోసాలాగే అనిపించింది.

తమ తమ వాడలకు, గల్లీలకు పిలుచుకుపోయారు. కురుమలు గొర్రె పిల్లలను వళ్లోకి అందిస్తే, వేటప్పుడు పెట్టుకొనే బుట్టలను ఎరుకలు తలకు పెట్టారు. రైతుకు ఇచ్చే గౌరవమే నాకూ చూపించారనిపించింది. మగ్గం నేసి, చేటలు అల్లి, ఇస్త్రీ చేసి.. నేనూ వారి వృత్తులమీద నా గౌరవం చాటుకున్నాను. అయితే, ఇది గౌరవాల సంగతి కాదని వాళ్లకూ నాకూ తెలుసు. అందుకే 'బీసీ డిక్లరేషన్'పై వాళ్లదీ నాదీ ఒకే నమ్మకమనిపించింది. ఎస్సీ వర్గీకరణ కోసమూ నాలాగే వాళ్లూ పట్టుదలతో ఉన్నారనిపించింది.

పొలానికి నీళ్లు పారించలేని పెద్దమనుషులు పల్లెలపైకి, పచ్చటి కాపురాలపైకి మాయదారి సారాను వరదలా పారిస్తున్నారు..