October 14, 2012

102 గ్రామాలు.. 245 కిలోమీటర్లు
టీడీపీ శ్రేణుల్లో ఉరకలెత్తుతున్న ఉత్సాహం 

  'వస్తున్నా.. మీకోసం' పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర ఆదివారం అనంతపురం జిల్లా సరిహద్దులు దాటింది. కరువుకు నిలయమైన జిల్లాలో సమస్యలు వెల్లువెత్తాయి. ఈ ప్రభుత్వం తమను వేధిస్తోందంటూ సామాన్యులు చంద్రబాబు వద్ద మొర పెట్టుకున్నారు. తాగునీరు, సాగునీరు, కరెంటు, గ్యాస్, ఇన్‌పుట్ సబ్సిడీ, పాఠశాలల్లో సదుపాయాల కొరత వంటి సమస్యలతోపాటు పలువురు తమ వ్యక్తిగత సమస్యలనూ ఏకరువు పెట్టారు. జిల్లాలో 13 రోజులపాటు కొనసాగిన పాదయాత్రలో చంద్రబాబు 7 నియోజకవర్గాలు, 14 మండలాలు, 102 గ్రామాల్లో 245 కిలోమీటర్ల మేర పర్యటించారు. దాదాపు 57 ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించారు.


వే లాది మంది ఆయనకు నీరాజనాలు పలికారు. పూల వర్షం కురిపించారు. తమ కష్టాలను చెప్పుకున్నారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు కూడా అన్ని వర్గాలనూ కలుపుకొని పోతూనే 'అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం చేస్తా. పేదరికం లేని సమాజమే లక్ష్యం' అంటూ భరోసా ఇచ్చారు. 'నా తొమ్మిదేళ్ల పాలనలో తప్పులుంటే చెప్పండి. సరిదిద్దుకుంటాను' అంటూ ప్రజలతో మమేకమయ్యారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతోపాటు, రైతులు, చేతి వృత్తిదారులు, మధ్య తరగతి వర్గాలను దగ్గర చేర్చుకునే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు అనేక హామీలు ఇవ్వడం ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.

కాళ్లు బొబ్బలెక్కినా.. కళ్లు మంట పుడుతున్నా.. మధ్యలో కొంత అస్వస్థతకు గురైనా.. సూరీడు భగభగమండుతున్నా.. నడుము కండరాలు పట్టేసినా ఏమాత్రం లెక్క చేయకుండా.. వైద్యుల సలహాలు తీసుకుంటూ 63 ఏళ్ల వయసులో కూడా అలుపెరుగకుండా చంద్రబాబు పాదయాత్ర సాగించారు. పొలాల వెంబడి, రాళ్లు రప్పలు, గుంటలు దాటుకుంటూ జనం వద్దకు చేరుకుని వారి సమస్యలు ఆలకించి తానున్నానంటూ భరోసా ఇచ్చారు.

పాదయాత్రలో భాగం గా, ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తానని, వాల్మీకులు, వడ్డెర్లు, సంచార జాతులను ఎస్టీ జాబితాలోకి, రజకులను ఎస్సీ జాబితాలోకి చేరుస్తామని, లక్ష రూపాయలతో పక్కా ఇళ్లు నిర్మిస్తామని, వృద్ధాప్య, వితంతు పింఛన్లు రూ.500లకు పెంచడమే కాకుండా, వికలాంగులకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు పెంచే దిశగా చర్యలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఒక్కో కుటుంబానికి ఏడాదికి పది గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, రైతులను రుణ విముక్తులను చేస్తామని, అగ్రవర్ణ పేదలకు ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామని, చేనేతలకు బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు.

పాదయాత్రలో జనంతో మమేకం కావడం, నేరుగా వచ్చి సమస్యలు చెప్పుకునే వీలు కల్పించడం, వ్యక్తిగతంగా సమస్యలు విన్నవించుకున్న పలువురికి ఆర్థిక సాయం అందించడం చంద్రబాబును ప్రజలకు దగ్గర చేశాయి. జిల్లాలో 33 మందికి ఆయన రూ.2.17 లక్షల ఆర్థిక సాయం అందించారు. అనంతపురం సరిహద్దులో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో జరిగిన పాదయాత్రలోనూ చంద్రబాబుకు ఘన స్వాగతం లభించడం ఒక విశేషం అయితే.. కన్నడిగులు చంద్రబాబుకు రూ.1,00,116 విరాళంగా అందించడం మరో విశేషం.

అనంతలో ముగిసిన చంద్రబాబు పాదయాత్ర 14.10.2012


ప్రజాశక్తి-గుంతకల్లు టౌన్‌   Sun, 14 Oct 2012, IST  
  • కాంగ్రెస్‌, వైఎస్సార్సీపివి నీతిమాలిన రాజకీయాలు
  • పాదయాత్రలో చంద్రబాబు నాయుడు
కేంద్ర, రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ పాలనలో ఆ పార్టీ నాయకులు ప్రజల సొమ్మును అప్పనంగా దోచేస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా చిన్నహోతూరు బహిరంగసభలో బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. రాజీవ్‌యువకిరణాలని గొప్పలు చెప్పిన కిరణ్‌ సర్కారు ఆచరణలో నీరుగార్చిందన్నారు. వజ్రకరూరు మండలం చిన్నహోతూరు గ్రామం నుంచి శనివారం యాత్ర ప్రారంభించి, ఉదయం 11 గంటలకు వజ్రకరూరు రచ్చబండ వద్ద బాబు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మధ్యాహ్నం పెద్దహోతూరు, చిన్నహోతూరు, గడేహోతూరు గ్రామాల్లో పాదయాత్ర చేశారు. పొట్టిపాడు పొలాల్లో వేరుశనగ పంటను పరిశీలించి సాయంత్రం కొనకొండ్ల గ్రామానికి చేరుకున్నారు. 'వస్తున్నా..మీకోసం' యాత్ర 12వ రోజు 22 కిలోమీటర్లు సాగింది. ఫీజురీయింబర్స్‌మెంట్‌ అందక అనేక మంది పేద విద్యార్థులు చదవులను మధ్యలోనే ఆపేస్తున్నారని చెప్పారు. పావలా వడ్డీతో మహిళలను లక్షాధికారులను చేస్తామన్న కాంగ్రెస్‌ డ్వాక్రా మహిళలను అప్పుల పాలుజేసిందన్నారు. గ్యాస్‌పై నిబంధనలను పెట్టడం దారుణమన్నారు. ఎరువుల ధరలు పెరగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారన్నారు. అంత్యోదయ, పింఛన్లు, ఉపాధిహామీ, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాల్లో లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. వైఎస్‌ఆర్‌ పరిపాలనలో 43 వేల కోట్ల రూపాయల అవినీతికి ఆయన కుటుంబ సభ్యులు పాల్పడ్డారన్నారు. ప్రజా సమస్యలపై తాను పాదయాత్ర చేపడితే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టమని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు డిమాండ్‌ చేయడం హాస్యాస్పదమన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే సంతలో గొర్రెల్లా ఎంపీ, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తోందన్నారు. తాము అధికారంలోకొస్తే వృద్ధులు, వింతువులకు రూ.600 పింఛను, నిరుద్యోగులకు వెయ్యి రూపాయల భృతి కల్పిస్తామన్నారు. జిల్లాలో చికున్‌గున్యా, డెంగ్యూ విషజ్వరాలు అధికమ య్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత, అబ్ధుల్‌ఘనీ, పయ్యావుల కేశవ్‌, పార్థసారధి, పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు, నియోజకవర్గం ఇన్‌ఛార్జిలు శమంతకమణి, వరదాపురం సూరి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభాహైమావతి పాల్గొన్నారు.

ప్రజల సొమ్ము దోచేస్తున్నారు..!-ప్రజాశక్తి-

Padayatra Photos 13th Day

13వ రోజు పాదయాత్ర పోటో గ్యాలరీ 14.10.2012


ప్రెస్ నోట్ - 13.10.2012