December 23, 2012

అప్పుడే గుజరాత్‌ను తలపించాం! నారుమళ్లు సాంతం పడనే లేదు. కానీ, రైతు సగం చచ్చిపోయాడు. రబీ ప్రారంభంలోనే అప్పుల ఊబీలో కూరుకుపోయాడు. సీజన్ మొదట్లోనే అన్నివిధాల చితికిపోయాడు. పంట పొలంలోనే తెల్లారిపోతున్నాడు. పొలంకు వెళ్లిన మనిషి ఎలా వస్తాడోనన్నట్టు పాపం ఆ ఇంటి ఇల్లాళ్లు బిక్కు బిక్కుమంటూ కనిపించారు. ఉత్తినే వాళ్లేమీ భయపడటం లేదని నడిచే దారిలో కనిపిస్తున్న పల్లెలను చూసినప్పుడు నాకు అనిపించింది.

నా యాత్ర సాగుతుండగానే జిల్లాలోని వీణవంక మండలం కొత్తపల్లెలో ఒక రైతు తెల్లవారుజామున కరెంటు మోటారు వేయడానికి ప్రయత్నించి బావిలో పడి చనిపోయాడు. "ఏమి చేయమంటారు సార్. పగలు కరెంటు రాదు. ఏ అర్ధరాత్రో ఇస్తారు. ఇంత మంచులోనూ పొలంలోనే పడిగాపులు పడాలి. ఆ చీకట్లో ఎక్కడ ఏముందో తెలియదు. పాము కరుస్తుందో, తేలు కుడుతోందో ఆ నిద్రమబ్బులో తెలుసుకోలేం. ఒక్కోసారి మోటారు వేయడానికి ఆ మబ్బులోనే పోయి షాక్‌కు గురవడమో, మోట బావిలో పడిపోవడమో జరుగుతోంది'' అని చామనపల్లిలో కలిసిన రైతు చెప్పిన మాటలు వ్యవస్థ దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ పాపం పాలకులదే!

అంతా గుజరాత్ అంటున్నారు. ఆ రాష్ట్రంలాగే ఆంధ్రాను తీర్చిదిద్దాలంటున్నారు. మంచిదే. కానీ, ఇప్పుడు గుజరాత్ సాధిస్తున్న ప్రగతిని మన రాష్ట్రం తొమ్మిదేళ్ల క్రితమే అందుకుంది. ఈ విషయం చాలామంది పట్టించుకోవడం లేదు. నా హయాంలో పారిశ్రామిక, ఐటీ రంగాలకు హైదరాబాద్‌ను హబ్‌గా మార్చాను. విదేశీ కంపెనీలకు దీటుగా మన పరిశ్రమలను ప్రోత్సహించి.. పోటీలో ముందు నిలిపాను.

"మీరు ముఖ్యమంత్రి కావాలి. గుజరాత్‌లా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి'' అన్న ఆ రైతు ఆశాభావం అభినందనీయమే. కాకపోతే నా హయాంలో విద్యుత్ వ్యవస్థను సమర్థంగా నిర్వహించాను. గుజరాత్ లాంటి రాష్ట్రాలు ఆంధ్రా నుంచి పాఠాలు నేర్చుకునేవి. సమర్థుల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టడం ఎంత అవసరమనేది దీన్ని బట్టే తెలుస్తోంది. అందుకే..రోజుకు 14 గంటలు నాణ్యమైన కరెంటును ఇచ్చిన నా పాలనను తొమ్మిదేళ్ల తరువాత కూడా రైతులు గుర్తు చేస్తున్నారు.
Post a Comment